వివరం: ఆకాశ రహస్యం శివస్వరూపం | a story about lord shiva | Sakshi
Sakshi News home page

వివరం: ఆకాశ రహస్యం శివస్వరూపం

Published Sun, Feb 23 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

వివరం: ఆకాశ రహస్యం శివస్వరూపం

వివరం: ఆకాశ రహస్యం శివస్వరూపం

ఎంతో శ్రద్ధతో పూజ చేసుకోవాలనుకుంటూ ఏవేవో పనుల కారణంగా ఆలస్యాన్ని చేసుకుని, పూజ దగ్గరకొచ్చేసరికి మరింత వేగంగానూ, ఇక అష్టోత్తర శతనామాల దగ్గరకొచ్చేసరికి మరికాస్త వేగవంతంగానూ కార్యక్రమం జరుగుతూండటం అనుభవంలో కనిపిస్తూండే సత్యం.

ఇదెవరినో తక్కువ చేయటానికీ, పరిహసించటానికీ చెప్పబడుతూన్న విషయం కాదు గాని, ‘నామాల్లో దాగిన అర్థాన్ని గాని గ్రహించినట్టయితే, అలాగే నిదానంగా ఆ దైవరూపాన్ని గాని పరిశీలించినట్లయితే ఎన్ని రహస్యాలు తెలుస్తాయో వాటిని దాదాపు తరువాతి తరానికి అందించకుండా పోతున్నా’మని చెప్పటానికి మాత్రమే.
 ఈ నేపథ్యంలో శివ రూపాన్నీ కొన్ని నామాలనీ పరిశీలిద్దాం!
 
 వ్యోమకేశుడు
 ‘వ్యోమ కేశాయ నమః’ అనేది ఓ నామం. వ్యోమ అంటే ఆకాశమని అర్థం. ఆ ఆకాశమే తనకి శిరోజాలుగా కలిగినవాడనేది ఈ నామానికర్థం. దీనికి ఇంత మాత్రమే అర్థమని చెప్తే ఏమీ తెలియదు. లో అర్థం తెలియాల్సిందే.
 
 పంచభూతాల్లోనూ కొన్ని కొన్ని రహస్యాలు దాగున్నాయి. అయితే మొత్తం రహస్యాలన్నింటికీ ఓ నిధీ పుట్టా వంటిది ఆకాశం. ఆ కారణంగానే ఆకాశం నుండి వాయువూ, వాయువు నుండి అగ్నీ, అగ్ని నుండి నీరూ, నీటి నుండి నేలా, నేల నుండి ఆహారానికి సంబంధించిన మొక్కలూ... వాటిని తినడం ద్వారా సకల ప్రాణులూ కలుగుతున్నారు, జీవిస్తున్నారు (ఆకాశా ద్వాయుః... అన్నాత్ ప్రజాః) అంది ఉపనిషత్తు.
 ఇలా మిగిలిన నాలుగు భూతాలకీ మూలమైన ఆకాశమనేది ఎన్నెన్నో రహస్యాలని తెలియజేయగల శక్తివంతమైనది. అందుకే విజ్ఞాన శాస్త్ర పరిశోధకులెప్పుడూ తమ పరిశోధనలని అంతరిక్షాన్ని కేంద్రంగా చేసుకునే సాగిస్తుంటారు. ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్త కూడా ‘ఆకాశాన్ని అంతులేని ఇంత అని ఊహించ వీలులేని రహస్యాల నిధి’ అన్నాడు.
 
 అలాంటి ఆకాశం తనకి శిరోజాలుగా కలవాడు శంకరుడట. శిరోజాన్ని పెకలించితే ఎలా కన్పించీ కన్పించకుండా ఉంటుందో, అలాంటి శిరోజాల సమూహాలతో శిరసు కళకళలాడుతూ ఉంటుందో, అలా ఆకాశం కూడా అనేక సూక్ష్మ రహస్యాలని తనలో ఇముడ్చుకుని ఉన్నదన్నమాట. అందుకే ఇప్పటికీ నాకు వాడి గురించి ఇన్ని రహస్యాలు తెలుసంటూ తల జుట్టుని పట్టుకు చెప్తుంటాం. అలాంటి ఆకాశ రహస్యాలన్నింటినీ తనదిగా చేసుకున్న శిరసు కలవాడు శంకరుడని ఈ నామానికర్థం.
 
 శంకరుని శిరసు ఆకాశం కాబట్టే ఆకాశంలో ఉండే చంద్రుడాయనకి ఆభరణంగా ఉంటాడు. (హిమాంశు శేఖరః - చల్లని కిరణాలు కల చంద్రుడే తన ఆభరణంగా కలవాడు అనేది శివుని పేర్లలో ఒకటి). నక్షత్రాలు కూడా ఆయన శిరోజాలకి అలంకారాలుగా ఉంటాయి (ఆహార్యం చంద్ర తారాది తం వందే...)
 తనకి ఆ శిరసే ఆకాశం కాబట్టి అక్కడ ప్రవహించే గంగ ఆయన శిరసు మీద కన్పిస్తూంటుంది. గంగని ధరించిన దైవం కాబట్టే ఆయన్ని ‘గంగాధరు’డని పిలుస్తారు. ఇంతటి శాస్త్ర రహస్యం ఇక్కడ గోచరిస్తుంటే కవులు తమదైన ధోరణిలో శంకరుని భార్య పార్వతి అనీ, కాలక్రమంలో ఆయన గంగమ్మ మీద మనసు పడ్డాడనీ, ఆమె ఆయన తలనెక్కి కూర్చున్నదనీ, దాంతో గంగా పార్వతులకి సవతి పోరు ఉందనీ... ఇలా చెప్తూ శాస్త్ర విశేషాన్ని మరో తోవకి తీసుకెళ్లిపోయారు.
 
 గంగాధరుడు
 గంగ అంటే ఓ స్త్రీ కాదు. గంగ అనేది జ్ఞానానికి సంకేతం. అందుకే అలా ప్రవాహంలా ఉపన్యాసం సాగిపోతుంటే, దాన్ని గంగా ప్రవాహంతో పోల్చి చెప్తారు. జ్ఞానమనేది శిరసులో కదా నిక్షిప్తమై ఉంటుంది! అలా జ్ఞాన గంగని తన శిరసులో గల శంకరుడు దాన్ని తలా కొంత పంచిపెడితే, మరెందరో కూడా తనని మించిపోతారనే దృష్టితో ఉండనే ఉండడు. తనకున్న జ్ఞానాన్ని పదిమందికీ పంచడమే సరైనదని భావిస్తూ, మనకి సూచిస్తూ తన తలమీద ఉన్న గంగమ్మ నోటి నుండి ఓ జలధార కిందికి పడుతున్నట్టుగా చిత్రంలో కన్పిస్తాడు. అంటే ఏమన్నమాట? జ్ఞానవంతుడైన ఎవరైనా తనకున్న జ్ఞానాన్ని తన కిందివారికి పంచి తీరాలని చెప్తున్నాడన్నమాట శంకరుడు. (అధీతి బోధా చరణ ప్రచారణైః...) చదువుకోవడం (అధీతి), దాన్ని ఇతరులకి అర్థమయ్యేలా చెప్పడం (బోధ), దాన్ని తాను ఆచరించడం (ఆచరణ), అందరికీ వ్యాప్తమైందా? లేదా అని పరిశీలిస్తూ ఆ చదివినదాన్ని ప్రచారం చేస్తూ ఉండటం (ప్రచారణం) అనేవి విద్యకున్న నాల్గు దశలు. అలా చేసిన వ్యక్తినీ చేసే వ్యక్తినీ మాత్రమే పండితుడనాలి. అందుకే గంగమ్మ నోటి నుండి జలధార నాలుగుగా విడివడుతూ నేలకి చేరుతూ కన్పిస్తుంది గంగాధరుని చిత్రంలో. నీలగ్రీవుడూ హితుడూ ‘అసౌ యో వసర్వతి నీలగ్రీవో విలోహితః...’ అని నమక మంత్రం చెప్తుంది. శంకరుడు సాక్షాత్తూ సూర్యుడే అని ఈ మంత్రం నిరూపిస్తుంది. సూర్యుడు ఆకాశంలో ఉంటాడు. శంకరుడు నేలమీద ఉంటాడు. సూర్యుడు మనకి ప్రసాదించేది వర్షాన్ని (ఘన వృష్టిః అపాం మిత్రః...). అలాంటి వర్షం మాకు కావాలంటూ మనం మన దరఖాస్తుని ఇయ్యాలంటే మనమంతా ఆ సూర్యుని వద్దకెళ్లాలి. అది దుస్సాధ్యం. మరేం చెయ్యాలి?
 
 రాజధాని ఉండే ప్రదేశంలో ప్రభుత్వ సచివాలయం ఉన్నా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుని మనం గాని చెల్లించవలసి వస్తే, రాజధానికి వెళ్లనక్కరలేకుండా, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగా మనం నివసించే ప్రదేశంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో (దేనికి సంబంధించిన ద్రవ్యమైతే, దానికి సంబంధించిన కార్యాలయంలో) చెల్లిస్తున్నాం కదా!
 
 అదే తీరుగా వర్షాన్నిచ్చే సూర్యునికి చేసుకోవలసిన విన్నపాన్ని నేలమీది సూర్య ప్రతినిధి అయిన శంకరునికి నివేదించుకుంటూ ఈయనకి సహస్ర ఘటాభిషేకాన్ని చేస్తున్నాం. ఇలా ఆ అభిషేకం ముగిసిందో లేదో అలా వర్షం కురవడాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నాం.
 
 ఇదే తీరుగా ఏ సూర్యుడు బుద్ధికి అధిష్ఠాతగా ఉంటూ బుద్ధి వికాసాన్ని కలిగిస్తున్నాడో, ఆ బుద్ధి శక్తి పెరగడం కోసం కూడా ఆ సూర్యుని ప్రతినిధి అయిన శంకరుణ్నే మనం పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇది నిజం కాబట్టే మూడేళ్ల బుజ్జిగాడి పిడికిలిని తన పిడికిలిలో సున్నితంగా బిగించి దానిలో బలపాన్ని పెట్టి అక్షరాభ్యాసమనే పేరిట, చదువుల తల్లి అయిన సరస్వతి పేరునీ, అలాగే విద్యలకెల్ల ఒజ్జ అయిన వినాయకుని పేరునీ రాయించకుండా నమశ్శివాయ సిద్ధం నమః అనే రాయిస్తూ దిద్దిస్తున్నారు గురువులు తొలి రాత వేళ.


 రూపంలో కూడా శివ సూర్యులొక్కరే

నీల - నీలి రంగు కల, గ్రీవః - మెడ కలిగినవాడు; వి - విశేషంగా అంటే మరింత, లోహితః - ఎర్రని శరీరచ్ఛాయ కలవారూ ఇటు సూర్యుడూ అటు శివుడూ అని తీర్మానిస్తోంది ఇంతకు వెనుక అనుకున్న ‘నీలగ్రీవో విలోహితః’ అనే మంత్ర భాగం. దీన్ని కొద్దిగా సమన్వయించుకు చూసుకోవాలి. సూర్యుణ్ని గాని తేలిపార చూస్తే సూర్యబింబం ముందుగా మరింత ఎర్రగా కన్పిస్తుంది (వి-లోహితః) . అలా చూస్తూన్న దశలో ఎర్రని రంగులో నీలిరంగు గుండ్రని బిళ్ల కూడా కనిపిస్తుంది (నీల - గ్రీవః). నీలిరంగు అనేది జలానికి సంకేతం. అందుకే సముద్రాలని గుర్తించే సందర్భంలో దేశ పటాల్లో సముద్రానికి నీలి రంగుని పులుముతారు.
 
 మరో విశేషం కూడా ఉంది. నీల-గ్రీవః అంటే నీలిరంగుతో ఉన్నవాడనేది మాత్రమే అర్థం కాకుండా నీలిరంగు కిరణాల ప్రసారం కూడా చేయగల శక్తి ఉన్నవాడని మరో అర్థం కూడా కనిపిస్తుంది. నీలిరంగు అనేది జలానికి సంకేతం కాబట్టే సూర్యుని నుండి పడే కిరణాలు నీటిని పీల్చి మేఘాలని ఏర్పాటు చేస్తాయి. ఆ నీరుపడే ఎండనే నీరెండ అని, అలాంటి నీరెండ పడే కాలంలో నీళ్లని తెచ్చుకునే స్త్రీల గమ్యం (వెళ్లే చోటు) ‘నీలాటి రేవు’ అనీ (నీరు+ఆడు+ రేవు - నీటితో నిండిన కిరణాలు ప్రసరిస్తున్న చెరువు ఒడ్డు) వ్యాఖ్యాన కర్తలు చెప్పారు. ఈ రెండు నామాలనే ఇటు శంకరునిక్కూడా సమన్వయించుకు చూడాల్సి ఉంది. ‘నీల - నీలి రంగు కల, గ్రీవః - మెడ కలవాడు శివు’డని దీనర్థం. శంకరుడు విషాన్ని స్వీకరించినప్పుడు గుటక వేయకుండా పార్వతి ఆయన కంఠాన్ని పట్టుకుంటే, అక్కడే పేరుకున్న విషం కాస్తా ‘నీలి రంగు’ మచ్చగా మెడమీద నిలిచిపోయింది. శంకరుడు నల్లని కంఠం కలవాడు కాడు. నీలకంఠుడు మాత్రమే.
 
 ఇక అదే శంకరుడు విశేషమైన ఎర్రని రంగు శరీరచ్ఛాయతో ఉంటాడు కూడా (వి-లోహితః). మరి తెల్లనివాడుగా ఎందుకు కన్పిస్తాడంటే తన ఎర్రని రంగు ఏమాత్రమూ కనిపించనంత దట్టంగా విభూతిని ఒంటికి పూసుకుని కన్పిస్తాడు కాబట్టి. ఇలా శివునికీ సూర్యునికీ సంపూర్ణ సంబంధం ఉంది. ఆ కారణంగానే సంధ్యావందనానికి అతి ముఖ్యమైన గాయత్రి మంత్రం శివపరంగా కూడా చెప్పబడింది. (భర్గో దేవస్య ధీమహి. భర్గః అంటే శివుడని కదా అర్థం!).
 
 శివుడూ సూర్యుడూ ఒక్కరు కాబట్టే సూర్యుని వేడి కిరణాల ప్రసారం కారణంగా ఏ చంద్రుడు కరిగి అమృతాన్ని లోకానికి అందిస్తున్నాడో, సరిగా అదే విధంగా శంకరుడు కూడా తన తలమీది చంద్రుని నుండి అమృతాన్ని (చావులేని తనాన్ని; అ-మృతాన్ని) లోకానికి అందిస్తూ ఉంటాడు. వ్యక్తులకి మరణం లేనితనాన్ని ఇవ్వగల  శక్తిమంతుడు శంకరుడు కాబట్టే నమక మంత్రం ఆయన్ని ‘మొదటి భిషక్కు’ (ప్రథమో దైవ్యో భిషక్) అంది.
 
 భిషక్కు అనే మాటకి వైద్యుడని భావమంటారు సాధారణంగా. భిషక్కుకీ వైద్యుడికీ భేదం ఉంది. వైద్యుడంటే ఫలాని వ్యాధికి ఫలానిది ఔషధమని చెప్పే వైద్య శాస్త్ర నిపుణుడని అర్థం. అదే మరి భిషక్కంటే ఆ వ్యాధి నివారణానికి ఏది ఔషధమో తెలిసి, దాన్ని స్వయంగా తయారుచేసి ఇచ్చేవాడని అర్థం. కాలంలో కొద్ది వెనక్కి జరిగి చూస్తే, ఆనాటి వాళ్లంతా భిషక్కులేగాని వైద్యులుగా ఉండేవారు కాదు. వ్యాధితో వెళ్లడమే మన కర్తవ్యం - పరిశీలించడం ఔషధాన్నీయడం వాళ్ల బాధ్యతగా ఉండేది ఆ రోజుల్లో. ఎదుటి రోగికి వ్యాధిని నయం చేయడమనేదాన్ని ఈశ్వరారాధన అనే భావించేవారు నాటివారు.
 
 రుద్రుడు
 మరి ఇంతటి గొప్పవాడైన శంకరుడు ఎందుకు ఎర్రని నేత్రాలతో కోపంతో రుద్రునిగా ఉంటాడనేది మన అనుమానం. శివాభిషేకం చేయాలనుకోవడం తడవుగా మొదటగా వచ్చే మంత్రం ‘నమస్తే రుద్ర! మన్యవే ఉత’... అని. మహా కోపం కల రుద్రా! నీకు నమస్కారమని దీని భావం. ఆ కోపంతో మామీద బాణాన్ని ఎక్కుపెట్టవద్దని కూడా దానిలోని ప్రార్థన. ఏమిటి దీనిలో విశేషం?
 
 84 లక్షల ప్రాణులనీ వాటికి సంబంధించిన వివిధ వివిధ ఆహారాలనీ, అవి నిత్యం తినబడుతూంటే తరిగిపోకుండా ఉండేలా ఎప్పటికప్పుడు చిగురించే మొక్కల్నీ (హరికేశేభ్యః...), ఇక ఒకే ఆహారపదార్థం కాకుండా ఒక్కో ప్రాణికీ అనేక ఆహార పదార్థాలనీ మనుష్యులకి యవలు మినుగులు నువ్వులు గోధుమలు - యవాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే గోధూమాశ్చమే.. ఇలా అడక్కుండా నేనిస్తూంటే, ఈ ద్రవ్యాలని సద్వినియోగపరుచుకోకుండా ఎందుకు వ్యర్థపరుచుకుంటున్నారనీ ద్వేషం, అసూయ, పగ... మొదలైన వాటితో ఎందుకు ఐకమత్యంతో ఉండటం లేదనీ ఆయన తన కన్నులని ఎర్రజేస్తే, ఆ ఎర్రని కన్నులు ‘రుద్రు’డనే పేరుని తనకి రప్పించాయి. ఆ పేరుని మన ప్రవర్తన ద్వారా మనం ఆయనకి తెప్పించాం తప్ప ఆయన ఎప్పుడూ (స్మేరాననః) చిరునవ్వుతో కనిపించే బేల శంకరుడు. (బోళా శంకరుడని లోకానికొచ్చింది. అమాయకుడని సరైన అర్థం). అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శంకరుణ్ని (లౌకిక సుఖాన్ని కలిగించేవాణ్ని) మయ-స్కరునిగా (అలౌకికమైన మోక్ష సుఖాన్ని ఇచ్చేవానిగా) చేయవలసిందిగా ప్రార్థిస్తూ అభిషేకాన్నీ జాగారాన్నీ ఉపవాస విధినీ పాటించాల్సి ఉంది మనం!
 తత్పురుషాయ విద్మహే
 మహాదేవాయ ధీమహి! త న్నో రుద్రః ప్రచోదయాత్!
 - డా॥మైలవరపు శ్రీనివాసరావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement