ఒకే ప్రయత్నం... అందరూ గెలిచారు!
విజయం
విజయం అందరూ కోరుకుంటారు. ప్రయత్నం చాలామంది చేస్తారు. కానీ ఆటంకాలు కొందరే దాటుతారు. ఆ దాటిన వారే విజయాలను శాసిస్తారు. అయితే, తాము విజయం సాధించడానికి కష్టాలు పడేవారు కొందరయితే, తమతో పాటు వ్యవస్థను విజయం వైపు నడిపించే వ్యవస్థ నిర్మాతలు కొందరు. చేతన కూడా అలాంటి వ్యక్తే.
మహారాష్ర్టలోని సతారా జిల్లాలో మష్వాద్ అని ఒక ప్రాంతం. 1970 తర్వాత విపరీతమైన కరవు వల్ల అది నివాసానికి ప్రతికూల ప్రాంతమైపోయింది. ఉపాధి లేదు. అందుకే వలసలు భారీగా పెరిగాయి. అప్పుడే అక్కడ ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యారు. ఆమె పేరు చేతన విజయ సిన్హా.
1980లో చేతన ఆ ప్రాంతంలో ఏదో చేయాలనుకున్నపుడు సహజంగానే అక్కడ నిరాశాపూరితమైన ప్రతిస్పందన ఎదురైంది. ప్రతి ప్రయత్నంలోనూ అదే ఫలితం. ముందు అక్కడి పరిస్థితులను బాగా అధ్యయనం చేశాక ఆమె అన్ని ప్రభుత్వ పథకాలను ఆ ప్రాంతానికి రప్పించారు. కానీ అవి చాలలేదు. అందుకే ‘మన్’ సోషల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. ఇది సేవా సంస్థ కాదు, లాభాలు తీసుకునే పొదుపు సంస్థ. కానీ సంస్థ కంటే వినియోగదారులకే ఎక్కువగా ప్రయోజనం కలిగించేలా రూపొందించబడినది. దాని ద్వారా అక్కడి వారిలో పొదుపు అలవాటు పెరిగింది. అందులో కాస్త జాగ్రత్త ఉన్నవారికి చేతన చిన్నచిన్న రుణాలను ఇచ్చారు. అయితే, దీనిని పూర్తి స్థాయి ఆర్థిక వ్యవస్థగా నడపడానికి నిబంధనలు ఒప్పుకోవు. అందుకే ఒక సహకార బ్యాంకుగా చేయాలని రిజర్వు బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడే అసలు కష్టం మొదలైంది.
సహకార బ్యాంకు నెలకొల్పడానికి రిజర్వు బ్యాంకు అనుమతి కావాలంటే మూలనిధి కావాలి. దాంతో పాటు సభ్యుల వివరాలు కూడా కొన్ని కావాలి... ఇంకా ఇలాంటివేవో ఉన్నాయి. దీనికి చేతన ఏ దొడ్డిదారులూ వెతకలేదు. రెండేళ్లు టైం తీసుకుని స్థానికులకు రాయడం, చదవడం, వడ్డీ లెక్కలు కట్టడం నేర్పించి మళ్లీ దరఖాస్తు పెట్టించారు. ఇందులో ఆమెకు సహకరించిన వారు కూడా అక్కడున్న ఇలాంటి వర్గంలోని చదువుకున్న పేద స్త్రీలే. వీరు పంపిన దరఖాస్తును చూసి రిజర్వు బ్యాంకు ముచ్చటపడి మరీ అనుమతి ఇచ్చింది. దేశంలో రిజర్వు బ్యాంకు అనుమతి పొందిన తొలి గ్రామీణ ఆర్థిక సంస్థ అదే. 1997లో ‘మన్’కు అనుమతి వచ్చింది.
ఇపుడు మన్ దేశి మహిళా బ్యాంకుకు 1,85,000 మంది కస్టమర్లు ఉన్నారు. గ్రామీణ బ్యాంకు కాబట్టి ఇదేదో ఎదుగూ బొదుగూ లేని పేదల బ్యాంకు అనుకునేరు. దేశంలో టాప్ బ్యాంకుల్లో ఉన్న అన్ని రకాల టెక్నాలజీ ఈ బ్యాంకు వినియోగించుకుంటోంది! బ్యాంకు సమాచారాన్ని బ్యాంకు అధికారులకు ఇచ్చిన ఓ వైర్‌లైస్ మిషన్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. అంటే ఇది ఒక నిరంతర మొబైల్ బ్యాంకు. అధికారులు ఇల్లు, మార్కెట్, ఆన్ జర్నీ... ఇలా ఎక్కడైనా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఫీల్డ్ ఆఫీసర్ల ప్రమేయం ఎక్కువ. ఆన్ ది స్పాట్ లోన్స్ ఇవ్వడం ఈ బ్యాంకు ప్రత్యేకత.
అంతేనా... ఈ బ్యాంకుకు అనుబంధంగా ఒక బిజినెస్ స్కూల్ ఉంది. కేవలం వారి డబ్బును దాచి వడ్డీలివ్వడం, రుణాలివ్వడమే కాదు... వ్యాపార నిర్వహణలో, వృత్తి కళల్లో మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి వారికి రుణాలు ఇచ్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది ఈ బ్యాంకు. ఈ వ్యహారాల్లో మన్ దేశీ గ్రూప్ వెంచర్స్ కూడా పాలుపంచుకుంటుంది. 2020 నాటికి పది లక్షల మంది మహిళా వ్యాపారవేత్తలను సృష్టించాలన్నది ఈ గ్రూపు సంస్థల లక్ష్యం. ఈ విజయాన్ని ఇక్కడి దాకా తీసుకురావడంలో ముఖ్యపాత్ర వహించిన వ్యక్తి చేతన విజయ సిన్హా. ఆమె విజయం అసామాన్యం. ఆమె ప్రయత్నం అరుదైన విశేషం. ఈ ప్రయత్నం ఏ స్థాయి అభినందనలు పొందిందంటే ప్రపంచ ఆర్థిక సంస్థ (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) విజయ సిన్హాకు ‘2013 ఇండియా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ అవార్డును ప్రకటించింది.
-ప్రకాష్ చిమ్మల