గాయం పాడిన గేయం | Ambedkar Jayanti on April 14 | Sakshi
Sakshi News home page

గాయం పాడిన గేయం

Published Sat, Apr 8 2017 11:21 PM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM

గాయం పాడిన గేయం - Sakshi

గాయం పాడిన గేయం

ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి సందర్భంగా...
కవిత్వం, సమాజం వేరు వేరు కాదు. సమాజంలో మనుషుల మధ్య హెచ్చు తగ్గులు, దూరాలు పెరిగే కొద్దీ ప్రశ్నించే క్రమంలో కవిత్వం కూడా కొత్త రూపాలు తొడుక్కుంటుంది.మనం హాయిగా ఉన్నంత కాలం మన పాలీ మెత్తగా ఉంటుంది. మన అస్తిత్వానికి అవమానం జరిగినప్పుడు మనలో ఒకరు కవిత్వంతో తన పాలీ ద్వారా తన జాతి ఆలోచనలకి పదును పెడతారు. అలా వచ్చిన ఈ తరం కవులే ఈ పది మంది.    

ప్రస్తుత తెలుగు సాహిత్యంలో దళిత కవిత్వం అనగానే మనకు గుర్తుకొచ్చే పేర్లు కొలకలూరి, మద్దూరి, తెరేష్‌ బాబు, కలేకూరి, ఎండ్లూరి, శిఖామణి, సతీష్‌ చందర్, గుండె డప్పు కనకయ్య తదితరులు. ఈ పాత నీటిని ఆస్వాదిస్తూ, వారి సొంత బాట వేసుకుని తమ గొంతుకు ప్రాణం పోసుకుంటున్నారు కొత్త కవులు. దళిత సాహిత్యం అవమానాల్లోంచి, ఆర్థిక పీడనల్లోంచి, అవహేళనలలోంచి, అమానుషత్వంలోంచి పుట్టింది.

దళిత బహుజన ముస్లిం సమస్యలు సాహిత్య పరంగా ఎప్పుడూ తోడుగానే ఉంటాయి. ఇటు కులానికి అటు మతానికి దెబ్బ తిన్న వారు దళిత ముస్లింలు. ముఖ్యంగా క్రైస్తవ దళిత స్త్రీలు, ముస్లిం స్త్రీలు చాలా ప్రత్యేకమైన వివక్షలతో పోరాడుతుంటారు. ఈ స్త్రీలు తమ మతాల పేరుతో ఇళ్లలోంచే స్వాతంత్య్రాన్ని కోల్పోవడం ఎదుర్కొంటారు. మత పరంగా ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలి అనే సంకెళ్ళ నుంచి చదువుతో ఇప్పుడిప్పుడే బయట పడే ప్రయత్నం చేస్తున్నారు.

 ఈ స్త్రీలకు మొదటి శత్రువు తమ ఇంటి లోని పురుషులే అవుతారు. ఊరందరికీ దళితుడు బానిసగా ఉండి ఊడిగం చేసొచ్చి తన భార్యని తనకు బానిసను చేసుకుంటాడు. ఏ స్త్రీకయినా చదువే ఆయుధం. చదువుకుని, ఆర్ధిక స్వేచ్ఛ లభించడం తోనే ఆమె ప్రథమమైన పోరాటంలో గెలుస్తుంది. ఆమె ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడంలో నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటుంది. స్త్రీలందు దళిత స్త్రీలు వేరని దళిత రచయితలు నిరంతరం వారి వాదన వినిపిస్తూనే ఉంటారు. ఆ వాదాన్ని తమ కవితలతో మరింత బలంగా వినిపిస్తున్నారు అరుణ గోగులమండ, నస్రీన్‌ ఖాన్, రెహానా బేగం, మెర్సీ మార్గరెట్, షంషాద్‌ మొహమ్మద్‌.

అత్యాచారానికి గురైన దళిత ఆడపిల్లలు ఎందుకు ’ఇండియాస్‌ డాటర్స్‌’ కాదో బల్ల గుద్ది చెబుతారు అరుణ. జ్యోతి సింగ్‌ దళితురాలైతే నిర్భయ చట్టం వచ్చేదా అన్న ప్రశ్నను మనలో రేపుతోంది తన కవిత.  ముస్లింలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కావు. మధ్యయుగంలో కాస్త బాగానే బతికుండొచ్చు కానీ రాను రాను వారి పై దాడులు, హింస పెరుగుతూనే వస్తున్నాయి. వీరు పేరుకి దళితులు కాకపోయినా అంతే అవమానాలను చవి చూస్తుంటారు.

ముస్లిం రచయితలు రాసే రచనలు ముందుగా ముస్లింలే చదవాల్సిన అవసరం ఉంది. సాహిత్యం ఎక్కువగా చదవకపోయినా దళితులకు వారి సమస్యల పట్ల ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కానీ ముస్లింలకు వారి స్త్రీలు పడే చెప్పుకోలేని ఇబ్బందులు తెలియాలంటే ముస్లిం సాహిత్యం చదవాల్సిందే. తమని తాము లోపలి నుంచి తెలుసుకోవాలంటే ఈ సాహిత్యం అనే అద్దంలో చూస్కోవాల్సిందే. నస్రీన్‌ ఖాన్‌ రాసిన ’మూలవాసీ చెట్టు’ కవితలో ఇలా అంటారు //పుట్టినచోటే నిరంకుశంగా పరాయీకరణ పాలవుతున్న వైనం అతలాకుతలం చేస్తోంది ఒకే ఇంటిలో ఉంటున్నా తమను వేరు చేయడంపై ఆవేదనను వ్యక్తం చేశారు. రెహానా ’స్వప్న శిథిలాలు’ కవితలో ముస్లిం స్త్రీల పేదరికం, పైకి చెప్పుకోలేని బాధలను కళ్ళకు కట్టారు.  

నిజానికి, నిజాలు రాసే తెలుగు కవులు, కథకులు కరువవుతున్న ఈ నేపథ్యంలో వీరు అచ్చంగా తమ జీవితాల్లోంచి తాము పడ్డ వేదన, హింస, అసమానతలను అక్షరీకరించడం అభినందనీయం. దళిత సాహిత్యం అనగానే వెలివాడల వెతలు, అంటరాని అకృత్యాలు మాత్రమే ఉంటాయనే అపోహ, అభియోగం ఉన్నాయి. వాస్తవానికి పేదరికంలో కష్టాలతో పాటు హాస్యం, చతురులు కూడా ఉండకపోవు.దళిత హాస్యాన్ని ఏ మాత్రం వాస్తవం లోపించకుండా గుంటూరు మాండలికంలో విరివిగా రాస్తున్నారు ఇండస్‌ మార్టిన్‌. ’నిర్దేశం’ అనే కవితలో దళితవాడ లోని జీవననాన్ని వివరిస్తూ ఇలా అంటారు మార్టిన్‌.

కుక్కిమంచాల్లోని బక్కజీవుల్ని
నిదర్లు లేపుతూంటే
కదుల్తున్న కడుపుని వుగ్గబట్టుకుంటా
చాప రంగçస్థలం మీద నేనాడే
నిద్రానాటకం మాయమ్మకు తెలిసిపోద్ది
కుండలోని ఇగం లాంటి నీళ్ళు
మొకాన పడితే కుంభకర్ణుడూ
కుదేలైపోవాల్సిందేనని
ఆయమ్మకు నేర్పిందెవుడో


మనువాదాన్ని ధిక్కరించి మూలాలను ప్రశ్నించడం తోనే దళిత కవిత పురుడు పోసుకుంది. ఆ మనువాదాన్ని వివక్ష రూపంలో తాము స్వయంగా ఎదుర్కొన్న చేదు అనుభవాల్లోంచి నిగ్గదీసి అడుగుతున్నారు నవ కవులు వేణు ఉడుగుల,  దానక్క ఉదయ భాను వారి  ’ప్రాచీన శవాలు’ , ’మనువ్యాధి’ కవితలలో. భారత దేశంలో దళితులపై ఎన్నో దాడులు జరిగినా తెలుగు నాట జరిగిన చుండూరు, కారంచేడు, లక్షింపేట ఉదంతాలు ఇప్పటికీ వెన్నులో వణుకు, గుండెల్లో మంట పుట్టిస్తుంటాయి.

 పెద్దింటి అమ్మాయిని ప్రేమించినందుకు తెలంగాణాలో మంథని మధుకర్‌ ని చంపిన తీరు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ దాడులకు అంతు ఉండదేమో ఇక. ఈ ఘటనల పై పసునూరి రవీందర్‌ ’అన్‌టచబుల్‌ ఎమర్జెన్సీ’ అనే పదునైన కవిత రాశారు. ‘వెలివాడలు మీ వెంటపడక ముందే మీ మస్తిష్కాల్లో తిష్ట వేసిన మౌఢ్యాన్ని పొలిమేరల అవతలికి తరమండి, మనుషులారా సరికొత్తగా బతకండి’ అంటూ హెచ్చరికతో ముగిస్తాడు.

ప్రశ్నించే వాడే కవి, వెలివాడల కలల్ని గానం చేసినవాడే గాయకుడు అంటారు దళిత కవులు. నిప్పు కణికల్లాంటి  అక్షరాలని నువ్వు రాయాలంటే మా మాల మాదిగ గూడేలకి రమ్మని పిలిపునిస్తాడు తంగిరాల సోని.మరుగుతున్న కొత్త నెత్తురు సురేంద్ర దేవ్‌ చెల్లి. ’కారంచేడు’ ను తన గోడుని చేసుకుని అగ్రవర్ణ తలలు సిగ్గుపడే ప్రశ్నతో కవితకు ముగింపు పలుకుతాడు. ఆ గాయాల సలపరాన్ని వివరిస్తూ పెద్ద కులపోళ్ల గుండెల్లో నిదురిస్తాడు. దళిత బహుజన ముస్లింల సమస్యలు చర్చించేది, వినేది కూడా వారే. పాలనలో వీరికి పరిష్కరించే వారు తక్కువ. యుగాలుగా ఇవి సమస్యలుగానే మిగిలిపోతున్నాయి తప్ప సమాధానాలు, సంతోషాలు లేని జీవితాలు వీరివి. ఈ వివక్షను ఎదురుకొని కలసి పోరాడడానికి మరిన్ని గొంతులు కావాలి. ఎంతో సాహిత్యం రావాలి. యువత తమ పాళీని కదపాలి.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement