బతుకు చిత్రాన్ని మార్చాడు!
ఆదర్శం
చదువుకునే కుర్రాళ్లు రకరకాల కారణాలు చెప్పి, తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ పాకెట్ మనీ కొట్టేస్తుంటారు. స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటారు. రోహన్ పాటంకర్ కూడా ఒకప్పుడు అలా చేసినవాడే. కానీ ఇప్పుడు తను ఒక్క రూపాయి కూడా ఎంజాయ్‌మెంట్ కోసం ఖర్చు చేయట్లేదు. కొందరు అభాగ్యులకు నీడ కల్పించడానికి ఖర్చు పెడుతున్నాడు. చిన్న వయసులోనే పెద్ద మనసు చూపి ప్రశంసలు అందుకుంటున్నాడు!
రోహన్ పాటంకర్... ఢిల్లీలోనే పుట్టి పెరిగాడు. అతనికి ఆర్కిటెక్చర్ అంటే ఇష్టం. అందుకే ఆ కోర్సులో చేరాడు. చదువు పూర్తయిపోవచ్చింది. ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సొచ్చింది. దాని కోసం నేపాల్ వెళ్లాడు. ఆ దేశం తనకి చాలా నచ్చేసింది. అక్కడి ప్రకృతి అందాల్ని చూసి ముగ్ధుడయ్యాడు. ప్రాచీన నిర్మాణాల నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. ఎప్పుడూ అక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. కానీ అదెలా కుదురుతుంది! ప్రాజెక్టు ముగిసింది. తిరిగి ఢిల్లీ వచ్చేశాడు. తన పనిలో పడిపోయాడు. కానీ సంవత్సరం తర్వాత తాను మళ్లీ నేపాల్ వెళ్తానని అతనప్పుడు అనుకోలేదు.
2015, ఏప్రిల్. వార్తలు చూస్తోన్న రోహన్ ఉలిక్కిపడ్డాడు. టీవీలో భయంకర మైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘోర భూకంపం నేపాల్ దేశాన్ని కుదిపేసింది. తాను చూసి మురిసిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. చెట్లను కూల్చేసింది. ఆ దేశపు అందాన్నే తుడిచి పెట్టేసింది.
చాలా బాధేసింది రోహన్‌కి. ఆ దేశం అలా అయిపోవడాన్ని భరించలేక పోయాడు. అతనిని అన్నిటికంటే బాధిం చింది ఇంకోటింది... ఇళ్లు కూలిపోవడంతో వేలమంది ప్రజలు రోడ్ల మీద పడు కున్నారు. వాళ్లను చూసి రోహన్ మనసు అదోలా అయిపోయింది. తనకెంతో ఇష్టమైన దేశానికి, ఆ దేశ ప్రజలకి తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఏం చేయగలనా అని పరిపరి విధాల ఆలోచించాడు. చివరికి ఓ మార్గం కనిపెట్టాడు.
సాయపడాలి అనుకున్నదే తడవుగా ఫండ్స్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టాడు రోహన్. అయితే అది తేలిక కాదని అర్థమైంది తనకి. ఎవరూ అడిగిన వెంటనే ఇచ్చేయడం లేదు. కొందరు ఇచ్చినా ఏదో కాస్త ఇస్తున్నారు. దాంతో తాను ఏం చేయ గలడు! ఎంతని చేయగలడు! అందుకే ఓ ప్లాన్ వేశాడు. నేపాల్ అందాలను చక్కని స్కెచ్‌లుగా గీశాడు. వాటితో అందమైన పుస్తకాల్ని రూపొందించాడు. వాటిని తీసుకెళ్లి అందరికీ చూపించసాగాడు. అలా ఉండే దేశం ఇలా అయిపోయింది అంటూ భూకంపం తర్వాత పరిస్థితులను కళ్లకు కట్టే ఫొటోలను కూడా చూపించసాగాడు.
దాంతో చాలామంది మనసులు కది లాయి. విరాళాలు ఇవ్వడానికి ముందు కొచ్చారు. అలాగే తాను వేసిన స్కెచ్‌లను ఫ్రేములు కట్టించి, పుస్తకాలుగా ముద్రించి అమ్మడం ద్వారా కూడా చాలా సొమ్మును సేకరించాడు. డబ్బు చేతికొచ్చింది. కానీ దానితో ఏం చేయాలి? ఆహారం కొని పంచి పెట్టాలా? లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చే యాలా? ఆలోచించాడు రోహన్. ఆహారం పంచిపెడితే ఒక్కసారో, రెండుసార్లో చేయడంతో సరిపోతుంది. ప్రభుత్వానికి ఇస్తే అది సద్వినియోగం అవుతుందో లేదో తెలీదు.
కాబట్టి ఏదైనా శాశ్వత సహాయం నేపాలీయులకు అందేలా చేయాలి. అదే రోహన్ తపన. ఆ తపన అతనిలోని ఆర్కిటెక్ట్ బుర్రని తట్టి లేపింది. ఆ వెంటనే అతి తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించే విధానాన్ని కనిపెట్టాడు రోహన్. వెంటనే తన స్నేహితులు కొందర్ని తీసుకుని నేపాల్ బయలుదేరాడు.
లక్ష్యం ఉన్నతమైనదైనప్పుడు దాన్ని సాధించడంలో ఓటమి ఉండదంటారు. రోహన్ విషయంలో అది నిజమయ్యింది. తన ప్రణాళికలను నేపాల్ ప్రభుత్వం ముందు ఉంచాడు రోహన్.
స్థానికంగా దొరికే మెటీరియల్‌తో, అతి తక్కువ ఖర్చుతో ఇండ్లు ఎలా నిర్మించవచ్చో అతడు చెబుతుంటే అధికారులు ఆశ్చర్యంగా విన్నారు. ఆ ఆలోచనను అమలు పర్చడానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. దాంతో తాను తీసుకెళ్లిన సొమ్ముతో నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించడం మొదలు పెట్టాడు రోహన్. ఖాట్మండుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పనౌటీ గ్రామంలో చకచకా ఐదు ఇళ్లు కట్టేశాడు. మరో ఐదు ఇళ్లు కట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు.
అవి పూర్తవగానే అలాంటి ఇళ్లు మరికొన్ని కడతానని, ఆశ్రయం లేని పరిస్థితి ఎవరికీ లేకుండా చేస్తానని అంటున్నాడు రోహన్. నేను, నాది, నావాళ్లు అంటూ ఆలోచించేవాళ్లే ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో... ఓ యువకుడు తన సరదాలను, సంతోషాలను పక్కనబెట్టి, దేశం కాని దేశం వెళ్లి, కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయడం సామాన్యమైన విషయం కాదు. అతడి మంచి మనసుకి, సేవానిరతికి అభినందనలు చెప్పి తీరాలి.
నేపాల్‌లో రోహన్ కట్టించిన ఇల్లు ఇది. మన దేశంలో కూడా ఎంతోమంది ఆశ్రయం లేక అలమటిస్తున్నారు. వాళ్లందరికీ కూడా తన ప్రణాళికల ప్రకారం ఇళ్లు కట్టిస్తే బాగుంటుందని, ఖర్చు చాలా తక్కువ కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలనీ అంటున్నాడు తను.