
విశ్లేషణం: ఆడిటరీ డిజిటల్ పర్సన్
రాకెట్‌తో బంతిని బాదినా, అందంతో అభిమానులను ఆకట్టుకున్నా, అంతర్జాతీయ టెన్నిస్‌లో పతకాలు సాధించి భారతీయ మహిళా సామర్థ్యాన్ని సాటి చెప్పినా... అది సానియా మీర్జాకే సాధ్యం.
టెన్నిస్ కోర్టులో సానియా సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు... ఆమె సాధించిన పతకాలే మాట్లాడతాయి. కానీ సానియా మాట్లాడేటప్పుడు మీరెప్పుడైనా గమనించారా? తల కొంచె ఎడమవైపుకు వాలి ఉంటుంది. ఏం మాట్లాడాలన్నా ముందు ఎడమవైపు కిందకు చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా మాట్లాడి, ఆ తర్వాతే తలెత్తి ఎదుటి వ్యక్తిని చూస్తూ స్పాంటేనియస్‌గా, గలగలా మాట్లాడుతుంది. అడిగినా అడగకున్నా అనేక వివరాలు చెప్తుంది. అంతేకాదు తరచూ... యూ నో, యూ నో... అంటూ ఉంటుంది. ఇవన్నీ ఆమెను ‘ఆడిటరీ డిజిటల్’ పర్సన్ అని చెప్తాయి. ఈ వ్యక్తిత్వమున్న వారు ఏం మాట్లాడాలన్నా ముందు తమలో తాము మాట్లాడుకుంటారు. ఏ అంశాన్నైనా వివరంగా చెప్తారు. చాలా ఆర్గనైజ్‌డ్‌గా ఉంటారు. తార్కికంగా ఆలోచించాకే, తమకు ఓకే అనిపిస్తేనే నిర్ణయం తీసుకుంటారు. ప్రిపరేషన్, అనాలసిస్, ప్లానింగ్, ఆర్గనైజింగ్ వీరి బలాలు. ఈ బలాలన్నీ సానియాలో స్పష్టంగా కనిపిస్తాయి.
సానియా మాట్లాడేటప్పుడూ తరచూ చిరునవ్వులు చిందిస్తుంది... మనసారా నవ్వుతుంది... అందులో ఎలాంటి దాపరికం ఉండదు. ఎవరితో మాట్లాడుతున్నా తానెంత ఈజ్‌గా ఉంటుందో ఆ నవ్వే చెబుతుంది. అయితే ఇబ్బందికరమైన విషయాల గురించి అడిగినప్పుడుకూడా నవ్వేస్తూ తన ఇబ్బందిని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడేటప్పుడు చేతుల కదలికలు తక్కువగా ఉన్నా.. అవి మాట్లాడే మాటలకు అనుగుణంగానే ఉంటాయి. అంతేకాదు తన కష్టాలను, సమస్యలను ఎలాంటి భేషజాలు లేకుండా అంగీకరిస్తుంది. వాటినెలా ఎదుర్కుందో వివరిస్తుంది. తనకు సాయం చేసిన వారిని గుర్తుచేసుకుంటుంది. తానెంత ఎదిగినా ఒదిగే ఉంటుందనడానికి ఇదే నిదర్శనం.
సానియాకు కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఉంది. సాహసోపేతంగా ఆలోచిస్తుంది.
బురఖా వేసుకునే హైదరాబాదీ ముస్లిం సంప్రదాయ కుటుంబంనుంచి వచ్చి షార్ట్స్ ధరించి టెన్నిస్ ఆడినా, మోడరన్ దుస్తులతో ర్యాంప్‌పై అందాలు చిందించినా, భారతీయ మహిళ కలలో కూడా ఊహించని గ్రాండ్‌స్లామ్‌ను సాధించినా, ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా సంప్రదాయాలకు వెరవకుండా మ్యారేజ్‌ను రద్దుచేసుకున్నా, భారతదేశాన్ని శత్రువులా భావించే పాకిస్థాన్‌కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడినా... అందులో సానియా సాహసమే కనిపిస్తుంది. అలాంటి సాహసోపేతమైన ఆలోచనా ధోరణి తనకు ఉంది కాబట్టే ఎవరూ ఊహించని విజయాలను సాధించగలిగింది.
సానియా మానసికంగా కూడా చాలా శక్తివంతురాలు. పరాజయాన్ని తేలిగ్గా అంగీకరించదు. వాటిని ఛాలెంజ్‌గా తీసుకుంటుంది. తన సత్తా చాటుతుంది. తీవ్ర గాయాలపాలైనా కుంగిపోకుండా తిరిగి ఆరు నెలల్లో మళ్లీ ఆమె తన సామర్థ్యాన్ని చూపడం ఈ విషయాన్నే తెలుపుతుంది.
‘‘నంబర్ల గురించి నేను పట్టించుకోను. అలా ఆలోచిస్తే మనం పూర్తి సామర్థ్యంతో ఆడలేము. ప్రత్యర్థి ర్యాంకు ఆధారంగా ఆడాల్సివస్తుంది’’ అని చెప్పడం ఆమె క్రీడా స్ఫూర్తిని తెలుపుతుంది. విమర్శలకు రియాక్ట్ కాకుండా ప్రొయాక్టివ్‌గా ఆలోచించడం సానియా స్వభావం. విమర్శలు ఎందుకొస్తాయో, ఎలా వస్తాయో సానియాకు బాగా తెలుసు. వాటిని నవ్వుతూ ఎదుర్కోవడం ఇంకా బాగా తెలుసు. ‘‘మనకు తెలియని వారు, మనమేమిటో తెలియని వారు మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే మనకేదో ప్రాధాన్యత ఉందని అర్థమవుతుంది’’ అని చెప్పడం విమర్శలపట్ల ఆమె ఆలోచనా ధోరణిని తెలుపుతుంది.
‘‘మతం నా వ్యక్తిగతం’’, ‘‘నేనెక్కడున్నా, ఎవర్ని పెళ్లాడినా, ఏం జరిగినా... భారతదేశం నా మాతృభూమి’’, ‘‘పెళ్లి ఒక తీయని రాజీ’’, ‘‘నాకు దేశం చాలా ఇచ్చింది. నా అకాడమీ ద్వారా అందులో కొంతైనా తిరిగివ్వాలి’’.. అని చెప్పడంలో సానియా పరిణతి కనిపిస్తుంది. పదిహేనేళ్లకే వచ్చిన స్టార్‌డమ్ మత్తులో పడిపోకుండా నిలకడగా రాణిస్తూ, రాకెట్‌తోనే విమర్శకులకు సమాధానం చెపుతూ, ఎప్పుడు తగ్గాలో తెలుసుకుని సింగిల్స్‌ను విడిచి డబుల్స్‌కు పరిమితమవుతూ... సానియా ముందుకు సాగిపోతూనే ఉంది!