
బనానాతో భలే కేక్స్!
ఫుడ్ n బ్యూటీ
అరటి పండు కేవలం మధురఫలమే కాదు.. శరీరానికి అవసరమైన పీచు పదార్థానికి మంచి వనరు కూడా. అరటిపండు తినడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే మంచిబ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను శుద్ధి చేస్తుంది. అలాగే అరటిపండులో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియమ్‌లు అధికంగా ఉండి శరీరానికి మేలు చేస్తాయి. అలాంటి అరటిపండును ఉపయోగించి వండగల వంటకం బనానా పాన్ కేక్స్. తక్షణం శక్తిని అందించగల, ఎదిగే పిల్లల శారీరక అవసరానికి చాలా ఉపయుక్తమైన ఆహారం ఇది.
అవసరమైనవి: అరటి పండ్లు- రెండు, మైదా ఒక కప్పు, ఎగ్ - ఒకటి, మిశ్రమం చేయడానికి తగినంత మజ్జిగ, ఒక టేబుల్ స్పూన్ చక్కెర, తేనె, ఫ్రై కోసం నూనె లేదా వెన్న.
విధానం: మైదా, కోడి గుడ్డు, చక్కెర, మజ్జిగలను కలిపి ఉంచుకోవాలి. పాన్ ను హీట్ చేసి ఆ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు వేయించాలి. నూనెను ఉపయోగించుకొని పాన్ కేక్‌లను తయారు చేసుకోవాలి. నాలుగు నుంచి ఆరు పాన్‌కేక్‌లను తయారు చేసుకొని ఒకదానిపై మరోటి ఉంచుతూ వాటి మధ్యలో చిన్న స్లైస్‌లుగా కోసి ఉంచిన అరటిపండును ఉంచాలి. అలా అమర్చి ఉంచిన కేక్‌లపైన వేయించిన మిశ్రమాన్ని పోసి సర్వ్ చేసుకోవడమే.
పోషకవిలువలు: ఈ పరిమాణంలోని బనానా పాన్‌కేక్స్‌తో 510 కిలో క్యాలరీల శక్తి, 14 గ్రాముల ప్రొటీన్లు, 3 గ్రాముల ఫైబర్, 10 గ్రాముల కొవ్వు, 143 గ్రాముల కొలెస్ట్రాల్ శరీరానికి అందుతాయి.