
బెస్ట్ అనిపించే బనానా కేక్... కరిగిపోయే ఖర్జూరా కేక్ ఆపిల్, కొబ్బరి కలిపి కొట్టి కిరాక్ అనిపిస్తూ... ఖర్జూరాలకి చాకొలేట్ మిక్స్ చేసి, ఆరంజ్‌కి ఆపిల్ జత చేసేద్దామా? అదెలా కుదురుతుంది.... అంటారా?
ఈ న్యూ ఇయర్‌కి మనమే ఇంటి దగ్గర ఓ బేకరీ పెట్టేస్తే సరి! షాకయ్యారా? బేకరీలో కూడా దొరకనన్ని కేకులు ఇంట్లోనే ఈజీగా చేసేయొచ్చు ఇలా...
ఆపిల్ కొబ్బరి కుకీస్
కావలసినవి: ఆపిల్స్ – 3 (తొక్క తీసి సన్నగా తురమాలి), బాదం పప్పుల పొడి – 2 కప్పులు (బాదం పప్పుల తొక్క తీయకుండా మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా చేయాలి), ఎండు కొబ్బరి తురుము – కప్పు, కోడి గుడ్లు – 3 (గిన్నెలో వేసి గిలకొట్టాలి), కొబ్బరి నూనె – 2 టీ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి – టీ స్పూను
తయారి: ∙కుకర్‌ను ముందుగా వేడి చేసి ఉంచుకోవాలి ∙ఆపిల్ తురుమును బ్లెండర్ లేదా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక పాత్రలో బాదంపప్పుల పొడి, దాల్చినచెక్క పొడి, కొబ్బరి నూనె, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి ∙ఆపిల్ గుజ్జు, ఎండు కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి ∙కోడి గుడ్డు సొన కూడా జత చేయాలి ∙మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో గుండ్రంగా అదమాలి అల్యూమినియం ప్లేట్ లేదా గిన్నెకు నెయ్యి లేదా బటర్ పూసి, తయారుచేసుకున్న కుకీలను దూరం దూరంగా సర్దాలి ముందుగా వేడి చేసి ఉంచుకున్న కుకర్‌లో ఉంచి సన్నని మంట మీద 20 నిమిషాలు ఉంచి దించేయాలి కొద్దిగా చల్లారాక రెండు బిస్కెట్ల మధ్య క్రీమ్ పూసి, ఆరనివ్వాలి ∙గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
ఆరంజ్ ఆపిల్ బకిల్
కావలసినవి: టాపింగ్ కోసం, మైదా పిండి – అర కప్పు, పంచదార – అర కప్పు కంటె కొద్దిగా తక్కువ, ఉప్పు – పావు టీ స్పూను, కమలాపండు – 1, బటర్ – 4 టేబుల్ స్పూన్లు
తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు, ఒక చెక్క కమలా పండు తొనలు వేయాలి ∙బటర్ జత చేస్తూ, మెత్తగా అయ్యేలా చేతితో జాగ్రత్తగా కలిపి ఫ్రీజర్‌లో గంటసేపు ఉంచాలి.
కేక్ కోసం కావలసినవి: గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు, కార్న్ మీల్ – 2 టేబుల్ స్పూన్లు (రెడీమేడ్‌గా సూపర్ మార్కెట్లో లేదా ఆ¯Œ లైన్‌లో దొరుకుతుంది), బేకింగ్ పౌడర్ – టీ స్పూను, బేకింగ్ సోడా – పావు టీ స్పూను, ఉప్పు – అర టీ స్పూను, కమలా పండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు, జాజికాయ పొడి – చిటికెడు, బటర్ – 6 టేబుల్ స్పూన్లు, మజ్జిగ – అర కప్పు, ఆపిల్ ముక్కలు – 2 కప్పులు (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) పైన అలంకరణ కోసం కావలసినవి: కమలారసం – పావు కప్పు, పంచదార – పావు కప్పు కంటె కొద్దిగా ఎక్కువ, రాళ్ల ఉప్పు – చిటికెడు
తయారి: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, కార్న్ మీల్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, కమలా పండు గుజ్జు, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి ∙మరొక పాత్రలో బటర్ వేసి కవ్వం సహాయంగా బాగా క్రీమీగా వచ్చేవరకు గిలకొట్టి, పంచదార వేసి మరోమారు బాగా కలపాలి ∙కోడి గుడ్లు జత చేసి ఒకసారి, మజ్జిగ జత చేసి మరోమారు గిలకొట్టి, పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙ఒక కప్పు ఆపిల్ ముక్కలు వేసి మరోమారు కలిపి, బటర్ రాసి ఉంచిన ప్లేట్ మీద ఈ మిశ్రమం సమానంగా పరవాలి ∙మిగిలిన ఆపిల్ ముక్కలు పైన చల్లాలి ముందుగా వేడి చేసి ఉంచుకున్న కుకర్‌లో ఈ ప్లేట్ ఉంచి, సన్నటి మంట మీద సుమారు 40 నిమిషాలు ఉంచి దించేయాలి.పైన అలంకరణ తయారి: ∙చిన్న బాణలిలో పంచదార, కమలాపండు రసం వేసి బాగా కలిపి, సన్నటి మంట మీద పంచదార కరిగేవరకు ఉడికించి, దించి చల్లారనివ్వాలి ∙ఉడికిన కేక్‌ను కుకర్‌లో నుంచి వెంటనే బయటకు తీయాలి ∙తయారుచేసి ఉంచుకున్న అలంకరణ మిశ్రమాన్ని పైన పోసి, వెంటనే ఉప్పు చల్లాలి ∙సుమారు అరగంటసేపు చల్లారిన తరవాత అందించాలి.
అరటిపండు కేక్
కావలసినవి: మైదా – కప్పు, కోడి గుడ్లు – 2, పంచదార – ముప్పావు కప్పు, బటర్ – కప్పు (కరిగించాలి), బేకింగ్ పౌడర్ – టీ స్పూను, బేకింగ్ సోడా – అర టీ స్పూను, వెనిలా – టీ స్పూను, జీడి పప్పులు – 20 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), అరటిపండ్లు – 2
తయారి: ∙ఒక పాత్రలో బటర్ వేసి బాగా గిలకొట్టాలి ∙పంచదార జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙కోడిగుడ్డు సొనలు వేసి మొత్తం అన్నీ కలిసేవరకు గిలకొట్టాలి ∙బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా పిండి జత చేసి పదార్థాలన్నీ కలిసి మెత్తటి మిశ్రమం తయారయ్యే వరకు కవ్వం లేదా బీటర్‌తో గిలకొట్టాలి ∙వెనిలా ఎసెన్స్ జత చేసి, మిశ్రమాన్ని పక్కన ఉంచాలి ∙మరో పాత్రలో తొక్క తీసిన అరటిపండ్లు వేసి, స్పూను లేదా ఫోర్క్‌తో మెత్తగా చేసి, ముందుగా తయారుచేసిన పదార్థానికి జత చేసి మరోమారు బాగా కలపాలి ∙అల్యూమినియం పాత్రకు నెయ్యి లేదా బటర్ పూసి తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరిచి, ముందుగా వేడి చేసిన కుకర్‌లో ఉంచి 40 నిమిషాల తరవాత దించేయాలి ∙చెర్రీలు, డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి అందించాలి.
ఖర్జూరాల కేక్
కావలసినవి: ఖర్జూరాలు – కప్పు (గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), బేకింగ్ సోడా – 2 టీ స్పూన్లు, బటర్ – కప్పు, పంచదార – ముప్పావు కప్పు, కోడి గుడ్లు – 4, వెనిలా ఎసెన్స్ – టీ స్పూను, మైదా – రెండున్నర కప్పులు, ఉప్పు – టీ స్పూను, బేకింగ్ పౌడర్ – 3 టీ స్పూన్లు
తయారి: ∙ఒక పాత్రలో మూడున్నర కప్పుల నీళ్లు, గింజలు తీసిన ఖర్జూరాలను వేసి సన్నని మంట మీద ఉడికించాలి ∙తగినంత ఉప్పు జత చేయాలి ఒక పాత్రలో బటర్ వేసి మెత్తగా అయ్యేవరకు గిలకొట్టాలి ∙కోడి గుడ్ల సొన జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙వెనిలా ఎసెన్స్, మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి అన్నీ కలిసే వరకు గిలకొట్టాలి ∙ఉడికించిన ఖర్జూరాలను జత చే సి బాగా కలియబెట్టాలి ∙మైదా జత చేసి మిశ్రమం దగ్గర పడేవరకు కలపాలి ∙అల్యూమినియం పాత్రకి నెయ్యి లేదా బటర్ రాసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పోసి, సమానంగా పరచాలి ముందుగా వేడి చేసి ఉంచుకున్న కుకర్‌లో సుమారు 45 నిమిషాలు ఉడికించి బయటకు తీయాలి ∙జీడిపప్పు, బాదం పప్పులతో గార్నిష్ చేసి, ముక్కలుగా కట్ చేసి అందించాలి.
డేట్స్ చాకొలేట్ మౌసీ
కావలసినవి: ఖర్జూరాలు – కప్పు, వేడి నీళ్లు – కప్పు, మైదా పిండి – ముప్పావు కప్పు, బేకింగ్ సోడా – పావు టీ స్పూను, తీపి లేని కోకో పొడి – టీ స్పూను, పంచదార – కప్పు, బటర్ – అర కప్పు, ఉప్పు – పావు టీ స్పూను, కోడి గుడ్లు – 2, బాదంపప్పుల తరుగు – పావు కప్పు, తీపి తక్కువగా ఉన్న చాకొలేట్ చిప్స్ – కప్పు.
తయారి: ∙గింజలు వేరు చేసిన ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్లలో వేసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, తీపి లేని కోకో పొడి వేసి కలిపి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో బటర్, పంచదార వేసి మెత్తగా క్రీమీగా అయ్యేవరకు కలపాలి ∙కోడి గుడ్ల సొన జత చేసి మరోమారు బాగా కలపాలి ∙కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమం ఇందులో వేసి కలియబెట్టాలి ∙వెడల్పుగా ఉండే అల్యూమినియం పాత్రకు నెయ్యి లేదా బటర్ రాసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం వేసి సమానంగా పరవాలి ∙చాకొలేట్ చిప్స్‌ను పైన... బిస్కెట్ల మిశ్రమానికి అతుక్కునేలా ఉంచాలి ∙ముందుగా వేడి చేసి ఉంచుకున్న కుకర్‌లో ఈ ప్లేట్‌ను ఉంచి సన్నటి సెగ మీద సుమారు 30 నిమిషాలు ఉంచి (విజిల్ పెట్టకూడదు) దింపేయాలి ∙బయటకు తీసి, కావలసిన ఆకారంలో చాకుతో కట్ చేసి అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment