శంకర్ వశీకరణం | behind the story of director shankar robo | Sakshi
Sakshi News home page

శంకర్ వశీకరణం

Published Sun, Nov 22 2015 2:48 PM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

శంకర్ వశీకరణం

శంకర్ వశీకరణం

 ‘నాయక్’ డిజాస్టర్. అనిల్‌కపూర్‌తో తీసిన హిందీ సినిమా అది. ‘ఒకే ఒక్కడు’కి రీమేక్. శంకర్ బాలీవుడ్ కలలన్నీ చెల్లా చెదురైపోయాయి. కెరీర్‌లో ఫస్ట్ ఫ్లాప్. ఒక్క దెబ్బతో కుదేల్ అయిపోయాడు. అర్జంటుగా తన స్టామినాని నిరూపించే సినిమా చేయాలి. వెంటనే మనసులో మెదిలింది ‘రోబో’. కొన్నేళ్లుగా వెంటాడు తున్న కథ. చేస్తే గీస్తే ఇలాంటి టైమ్‌లో అలాంటి సినిమానే చేయాలి. కానీ బాగా కాస్ట్లీ ప్రాజెక్ట్. ఎవరో ఒకరు దొరక్క పోతారా? శంకర్‌లో ఓ మొండి ధైర్యం. కమల్‌హాసన్, ప్రీతీ జింటాను పెట్టి ఫొటో సెషన్ చేశాడు. అంతా ఓకే. మీడియా డ్రీమ్స్ సంస్థ సినిమా చేయడానికి రెడీ. కానీ, కథ అడ్డం తిరిగింది. కథ విషయంలో కమల్‌కీ శంకర్‌కీ డిఫరెన్సెస్.
 
 స్టాప్ ద రోబో! పాపం శంకర్... ‘బాయ్స్’ సినిమా మొదలెట్టుకున్నాడు.
       
 ముంబైలో రెడ్ చిల్లీస్ ఆఫీస్. షారుఖ్ ఖాన్ సొంత అడ్డా. శంకర్ కాన్సెప్ట్‌కి షారుఖ్ ఫ్లాట్. ‘‘నేనే ప్రొడ్యూస్ చేస్తా. బ్రహ్మాండంగా చేద్దాం’’... షారుఖ్ ఎగ్జయిట్‌మెంట్. కరీనాను హీరోయిన్‌గా పెడదామా అని డిస్కషన్స్. రెండోసారీ కథ అడ్డం తిరిగింది. కథ విషయంలోనే షారుఖ్‌కీ శంకర్‌కీ డిఫరెన్సెస్.
       
 శంకర్ మొండిఘటం. ఎవ్వరికీ పూర్తిగా కథ చెప్పడు. ఒకవేళ చెప్పినా మార్పులు చేయడు. శంకర్‌కి ఓ క్లారిటీ ఉంది. సక్సెస్ రేటూ అలానే ఉంది కాబట్టి హీరోలు కూడా కుయ్ కయ్‌మనరు. ఒకవేళ అంటే కనుక అదెంత పెద్ద ప్రాజెక్ట్ అయినా శంకర్ బయటికొచ్చేస్తాడు. కమల్ దగ్గర్నుంచి షారుఖ్... షారుఖ్ నుంచి ఆమిర్ ఖాన్... అక్కడ్నుంచి అజిత్... అలా తిరిగి తిరిగి రజనీకాంత్ ముందు ఆగింది.
 
 రజనీకి శంకర్ అంటే పిచ్చి నమ్మకం. ‘శివాజీ’ ఎలా తీశాడో, తననెలా చూపిం చాడో ప్రాక్టికల్‌గా తెలుసు. ఏదో లెక్క తప్పింది కానీ, ‘శివాజీ’ (2007) ఇంకా పెద్ద హిట్టయ్యేది. ఈసారి మాత్రం గురి తప్పదు. ‘రోబో’ కాన్సెప్టే రజనీకి కొత్తగా అనిపించింది. అటు సైంటిస్ట్ వశీకర్‌గా, ఇటు రోబో చిట్టిగా డ్యూయల్ రోల్. ఇలాంటి సినిమాలు తనకైతే పూర్తిగా కొత్త. అసలు తమిళంలోనే ఇంతవరకూ సైన్స్ ఫిక్షన్ సినిమా రాలేదు. పైగా హీరోగానూ చేయాలి. విలన్‌గానూ చేయాలి.
 రజనీకి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ‘శివాజీ’ షూటింగ్‌లో రజనీతో శంకర్ చెబుతుండే వాడు. ‘‘సార్... మీరు హీరోగానే కాదు, విలన్‌గా కూడా నాకు చాలా ఇష్టం. మీరు చేసిన అన్ని విలన్ పాత్రలూ బావుం టాయి. ఈ జనరేషన్‌కి మీ విలనీ ఓసారి చూపించాలి’’ అని. మొత్తానికి శంకర్ కోరిక ‘రోబో’తో నెరవేరనుందన్నమాట.
 బడ్జెట్ లెక్కవేస్తే వంద కోట్లు తేలింది. సామాన్యులు ప్రొడ్యూస్ చేయలేరు. ఈరోస్ ఇంటర్నేషనల్, లండన్‌కు చెందిన అయ్యంగరన్ ఇంటర్నేషనల్‌వాళ్లు రెడీ అన్నారు. ‘రోబో’ పట్టాలెక్కడానికి రెడీ.
 
 హీరోయిన్ టాప్ రేంజ్‌లోనే ఉండాలి. దీపికా పదుకొనె... శ్రీయా శరణ్... నయనతార... ఇలా రకరకాల ఆప్షన్లు. శంకర్‌కు మాత్రం ఐశ్వర్యారాయ్‌తోనే చేయాలనుంది. ‘జీన్స్’ దగ్గర్నుంచీ తన ప్రతి సినిమాకూ ఐశ్వర్యనే అడుగు తున్నాడు. ఆమె బాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయి, సౌత్‌కు రాలేని పరిస్థితి. కానీ ‘రోబో’లక్... ఐశ్వర్య డేట్లు ఇచ్చింది.
 
 ఇంకో విలన్ క్యారెక్టర్ ఉంది. అమితాబ్ చేస్తే అదిరిపోతుంది. ‘బిగ్ బీ’ని కలిశాడు శంకర్. ఆయన చేయడానికి రెడీ. మళ్లీ శంకర్‌కు డౌటొచ్చింది. అటు రజనీ నెగటివ్ రోల్‌లో కనబడి, ఇటు అమితాబ్ విలన్‌గా ఉంటే... ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో? ఇక్కడ మాత్రం రిస్కు తీసుకోదలుచుకోలేదు. సత్యరాజ్, జేడీ చక్రవర్తి... ఇలా లిస్ట్ అనుకుని ఫైనల్‌గా బాలీవుడ్ విలన్ డ్యానీ డెన్‌జాంగ్‌పాకు బెర్త్ ఖరారు చేశారు.
 
 మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రెహమాన్... కెమెరామ్యాన్ రత్నవేలు... కాస్ట్యూమ్ డిజైనర్స్ మనీష్ మల్హోత్రా, మేరీ వాగ్ట్ (‘మెన్ ఇన్ బ్లాక్’ ఫేమ్)... ఆర్ట్ డెరైక్టర్ సాబూ శిరిల్... ఇలా హేమా హేమీ లందర్నీ టీమ్‌లోకి తీసుకున్నాడు. అందరికీ ఒకటే కండిషన్. ఈ సినిమా అయ్యేవరకూ ఇంకో సినిమా చేయకూడదు. ఐశ్వర్యా రాయ్‌కి మాత్రమే ఎగ్జెంప్షన్. ఆమె అప్ప టికే మణిరత్నం ‘రావణ్’ కమిటయ్యారు.  
 
 ఇందులో సాబు శిరిల్‌కే ఎక్కువ పని. హాలీవుడ్‌కెళ్లి స్పెషల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్‌ని కాంటాక్ట్ చేశాడు. వాళ్ల దగ్గర బోలెడన్ని ఇన్‌పుట్స్ తీసుకున్నాడు. లాస్ ఏంజెలెస్ లోని ‘స్టాన్ విన్స్‌టన్ యానిమేషన్ స్టూడియో’ వరల్డ్ ఫేమస్. ‘టెర్మినేటర్’, ‘జురాసిక్ పార్క్’, ‘అవతార్’ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాల యానిమేషన్ వర్క్స్ అన్నీ అక్కడే పురుడు పోసుకున్నాయి.  ‘రోబో’ క్లైమాక్స్ వర్క్ ఇలాంటి చోటే చేయించాలి. రజనీ, వందలాది రోబోలతో తలపడే సీన్స్ అన్నీ అక్కడ చేయిస్తేనే కరెక్ట్. కానీ అక్కడి టెక్నీషియన్స్ 8 నెలలు టైమ్ అడిగారు. అందుకే ఫస్ట్ క్లైమాక్స్ షూట్ చేసి, తర్వాత మిగతా పనులు చేయాలి.
 
 రజనీ, శంకర్ కూడా లాస్ ఏంజెలెస్ వెళ్లారు. రెండు వారాలు అక్కడే ఉన్నారు. రజనీలా ఉండే రోబోను తయారుచేయా లంటే టోటల్ బాడీ స్కాన్ చేయాలి. ఈ మేకప్ ప్రాసెస్‌కే మూడు కోట్లు ఖర్చు.
       
 2008 ఫిబ్రవరి 15. చెన్నైలోని ఏవీయమ్ స్టూడియోలో ‘రోబో’ షూటింగ్ స్టార్ట్. రజనీలాంటి సూపర్‌స్టార్‌తో ఇన్ని వర్కింగ్ డేస్, ఇంత టెక్నాలజీ, ఇంతింత హంగామా... శంకర్ ఏం చేస్తాడో? సౌత్‌తో పాటు నార్త్ మొత్తం ‘రోబో’ వైపే అటెన్షన్.
 శంకర్‌కి స్పెషల్ సాంగ్‌తో షూటింగ్ స్టార్ట్ చేయడం అలవాటు. రజనీ, ఐశ్వర్యపై ‘మచుపిచ్చు’లో ‘కిలి మంజారో’ సాంగ్ ప్లాన్ చేశారు. ‘మచుపిచ్చు’ ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి. పెరూలో ఉంది. జేమ్స్‌బాండ్ సినిమా ‘క్వాంటమ్ ఆఫ్ సొలేస్’కే పర్మిషన్ ఇవ్వలే దక్కడ. ఈ పాటలో ఐశ్వర్యారాయ్ కోసం ఏకంగా 54 కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు.
       
 ఈరోస్ సంస్థ తీసిన హిందీ సినిమా లన్నీ ఫ్లాప్స్. దానికి తోడు ఆర్థిక మాంద్యం. దాంతో ‘రోబో’ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. అయ్యంగరన్‌వాళ్లు ఒంటరిగా మిగిలి పోయారు. అదే టైమ్‌లో సన్ పిక్చర్స్ వాళ్లు ఎంటరయ్యారు. టోటల్ ప్రాజెక్ట్ టేకోవర్. మళ్లీ లెక్కలేస్తే... బడ్జెట్ 130 కోట్ల వరకూ తేలింది. రిలీజ్ టైమ్‌కి ఇంకా పెరుగు తుంది కూడా. అయినా సన్‌వాళ్లు రెడీ. ఇక శంకర్‌కు టెన్షనే లేదు. చెన్నై శివారులో క్లైమాక్స్ కోసం 5 కోట్లు పెట్టి సెట్ వేశారు. ‘మ్యాట్రిక్స్’ లాంటి సినిమాలకు ఫైట్స్ డిజైన్ చేసిన యెన్ వూ పింగ్‌ను తీసుకొచ్చారు.
       
 బడ్జెట్‌లో 40 శాతం స్పెషల్ ఎఫెక్ట్స్‌దే. అంటే 60 కోట్లు. ఇందులో 60 శాతం వర్క్ చేసింది ఇండియన్ ఆర్టిస్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ సంస్థ. దీని సీఈవో శ్రీనివాస్ మురళీమోహన్ తెలుగువాడే. ట్రెయిన్ ఫైట్ ఎపిసోడ్ కోసం 40 విజువల్ ఎఫెక్ట్స్ యూజ్ చేశారు. దీనికోసం 2,000 టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఫైర్ ఫ్లై సంస్థ కూడా పనిచేసింది. సినిమా షూటింగ్‌కు ముందే త్రీడీలో ఫ్రీ విజువలైజేషన్ చేసి పెట్టింది ఈ సంస్థే.
 రజనీకాంత్ త్రీడీ ఇమేజ్‌ల చిత్రీకరణ కోసం ‘డోమ్స్‌లైట్ టెక్నాలజీ’ వాడారు. కీలకమైన బేబీ డెలివరీ సీక్వెన్స్‌ను మయన్ క్రియేటివ్స్ కంపెనీవాళ్లు డిజైన్ చేశారు. నాలుగు నెలల టైమ్ పట్టింది. హాలీవుడ్ నుంచి కూడా కొంత మంది సాంకేతిక నిపుణులు వచ్చి నాలుగు నెలలు చెన్నైలోనే ఉన్నారు. ఇక్కడివాళ్లు చేయలేని గ్రాఫిక్స్‌ను వాళ్లు చేశారు. యానిమేట్రోనిక్స్ టెక్నాలజీ వాడారు. నిజానికి రోబోలు యంత్రాల్లా కనిపిస్తాయి. ఈ యానిమేట్రోనిక్స్ వల్ల అచ్చం మనుషుల్లానే ఉంటాయి. ఇదంతా స్టాన్ విన్‌స్టన్ స్టూడియో వాళ్ల టెక్నాలజీ. రోబో కళ్లు, కనుబొమ్మలు, నోరు లాంటివి రిమోట్‌తోనే ఆపరేట్ చేసేయొచ్చు. 22 సీన్స్‌ను ఈ టెక్నాలజీతోనే తీశారు.
       
 పాటలకు కూడా బాగా ఖర్చుపెట్టారు. వియన్నా, అమెరికా, బ్రెజిల్, పెరూ... ఇలా చాలా ఫారిన్ కంట్రీస్‌కు వెళ్లారు. ‘రోబో’ టైటిల్ సాంగ్‌ను హిమాచల్ ప్రదేశ్, చెన్నైల్లో తీశారు. ‘హరిమా హరిమా’ పాటను ఆర్‌ఎఫ్‌సీలో సెట్ వేసి షూట్ చేశారు. ‘ఇనుములో హృదయం’ పాటను ఏవీయం స్టూడియోలో మూడు సెట్స్ వేసి, 8 రోజులు తీశారు.


 రత్నవేలు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. 435 ఎక్స్‌ట్రీమ్ కెమెరా వాడారు. చిట్టి పాత్రను షూట్ చేయడం కోసం 1600 పేజీల మాన్యువల్ రాసుకున్నాడు. సాబూ శిరిల్ 30కి పైగా భారీ సెట్లు వేశాడు. సినిమా మొత్తం 290 రోజులు షూటింగ్ చేశారు.
 2010 జూలై 8... లాస్ట్ వర్కింగ్ డే. ఎప్పుడూ పూజలూ పునస్కారాలూ చేయని శంకర్ ఆ రోజెందుకో గుమ్మడి కాయతో దిష్టి తీయించారు.
       
 ఆసియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది. ఖర్చుకు తగ్గట్టే క్రేజ్. క్రేజ్‌కు తగ్గట్టే బిజినెస్. ఆడియో హక్కుల కోసమే థింక్ మ్యూజిక్ ఏడు కోట్లకు పైగా చెల్లించింది. హిందీ వెర్షన్ హక్కులు సుమారు 30 కోట్లకు అమ్మకం. తెలుగు వెర్షన్ రైట్స్‌ను 27 కోట్లకు మొక్కజొన్న వ్యాపారి తోట కన్నారావు కొన్నారు. ఆడియో, శాటిలైట్, ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రాంతాల హక్కులు సెపరేట్. తెలుగు టాప్ స్టార్స్ కన్నా హయ్యెస్ట్ బిజినెస్ ఇది. ఇదంతా రజనీ- శంకర్‌ల కాంబినేషన్ మేజిక్.
 2010 అక్టోబర్ 1న రిలీజైన ‘రోబో’కు ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్. తెలుగు, తమిళ భాషల్లో ఒకటే ప్రభంజనం. ప్రపంచ వ్యాప్తంగా 2,200 థియేటర్లలో రిలీజైంది. టోటల్‌గా తొలివారం వసూళ్లే 117 కోట్లు. తెలుగునాట దాదాపు 270 ప్రింట్లతో 525 థియేటర్లలో రిలీజైంది. హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల్లోనే ఏకంగా 65 హాళ్లలో ‘రోబో’ విడుదల కావడం ఓ రికార్డ్.


 శంకర్ క్రేజ్ ఎవరెస్ట్ హైట్స్‌కెళ్లింది. శంకర్ తప్ప ఇలాంటివి ఎవ్వరూ డీల్ చేయలేరన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. రజనీ కొత్త స్టయిల్‌లో అలరించాడు. ‘రో...బో’ అంటూ విచిత్రమైన డైలాగ్ డెలివరీతో ఈ సైన్స్ ఫిక్షన్‌ని మాస్‌కి కూడా నచ్చేలా చేశాడు.
       
 ఓ సీన్‌లో రోబో... ఐశ్వర్యారాయ్‌తో అంటాడు... ‘‘ఈ ప్రపంచంలో అరుదైన సృష్టి రెండు, ఒకటి నువ్వు - మరొకటి నేను’’ అని. అవును. వెండితెరపై ‘రోబో’ సృష్టి కూడా అరుదైనదే. మరి ఇలాంటి అరుదైన సృష్టి చేసిన శంకర్‌ని ఏమనాలి?!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement