లోకంలో వర్ణాలన్నీ కలిసున్నాయి మనలో!
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఉత్సవం జరుపుకునే సందర్భానికి తగ్గట్టు ఈ పాట రాశాను. విజయం సాధించే సమయానికే హోలీ పండుగ కూడా వస్తుంది. అలా ఈ పాటను సందర్భోచితంగా హోలీ పండుగను అన్వయిస్తూ రాశాను. ఈ సినిమా పెద్దగా ఆడకపోవటం వలన ఈ పాట కూడా అందరికీ ఎక్కువగా తెలియదు. కాని నాకు చాలా బాగా నచ్చిన పాట, బాగా వచ్చిన పాట కూడా ఇది. హరివిల్లులో ఉండే రంగులను, హోలీ రంగులకు... మనుషుల్లో ఉండే భావాలకు అన్వయిస్తూ ఈ పాట రాశాను. ఆ ఊరి వారంతా వారి ఆనందాన్ని, సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ, ఉత్సాహంగా నాట్యం చేస్తూ పాడుకునే పాట. ఇది మంచి ఆలోచనతో సాగే పాట.
హరివిల్లే వరదల్లే ఇలపైకి దిగివచ్చే సింగారంగా రంగల్లే
విరిజల్లే వరమల్లే ఎదలోకి ఎదురొచ్చే వైభోగంగా గంగల్లే
రంగులన్నీ చల్లుకుందామా ఈ పండుగరోజు
చెంగుమంటూ చిందులేద్దామా
నింగి దాటి పొంగిపోదామా ఈ సందడిరోజు
ముంగిలంతా ముగ్గులేద్దామా
హరివిల్లు అంటే ఇంద్రధనస్సులోని రంగులన్నీ సింగారంగా రంగురంగులుగా వరదలా భూమి మీదకు వచ్చాయి. పూలజల్లులు వరాలు ఇస్తున్న చందంగా మనసుల్లోకి గంగా ప్రవాహంలా వైభోగంగా ఎందురొచ్చాయి. అటువంటి ఇంత అందమైన పండుగరోజున అందరం రంగులు చల్లుకుందాం. ఆడుతూ పాడుతూ చెంగుచెంగుమంటూ చిందులు వేద్దాం. మన ఆనందాలన్నీ నింగి హద్దులు దాటాలి. ముంగిళ్లన్నీ ముగ్గులతో నిండిపోవాలి... అంటూ పండుగ సంబరాలు జరుపుకోవడానికి ఒకరినొకరు ఆహ్వానించుకోవడం పల్లవిలో చూపాను.
నవ్వే తెలుపంట చూపే ఎరుపంటా
నీలో నాలో ఆశల రంగే ఆకుల పచ్చంటా
నీడే నలుపంటా ఈడే పసుపంటా
లోలో దాగే ఊహలపొంగే ఊదారంగంటా
లోకంలో వర్ణాలన్నీ కలిసున్నాయి మనలో
ఏకంగా కదలాలో
శోకాలే సంతోషాలే కొలువుంటవి మదిలో
రంగ్‌దే రంగ్‌దే రంగ్‌దే...
మొదటి చరణంలో రంగుల విశిష్టతను వివరించాను. మనలోని భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తాయి రంగులు. భౌతికమైన రూపం రంగు. భావోద్వేగాలు మానసికమైనవి. వన్నె కలిపితే అది రంగుగా మారుతుంది. తెలుపు రంగు నవ్వుకి చిహ్నం. ఎరుపురంగు చూపుకి చిహ్నం. ఆశ అనేది జీవచైతన్యానికి ప్రతీక. అది పచ్చరంగులో ఉంటుంది. ఒక కొత్త శక్తి వస్తుంది. అందుకు ప్రతీకగా పచ్చపచ్చగా చిగురించే ఆకుపచ్చ రంగును భౌతిక రూపంగా చూపాను.నీడ నల్ల రంగులో ఉంటుంది. నలుపు భయానికి ప్రతీక. చాలా మంది నీడను చూసి భయపడతారు.
పసుపు రంగు ఈడుకి ప్రతీక. పిల్లలకు ఈడొచ్చినప్పుడు పసుపు, గంధం పూస్తాం. అందుకే ఆ రంగుతో పోల్చాను. ఊహలపొంగు ఊదారంగు. మన మనసులో మెదడులో, బుద్ధిలో ఉంటాయి ఊహలు. వాటిని ఊదారంగుతో పోల్చాను. ఇది చాలా అరుదైన రంగు. ప్రతిమనిషిలోనూ ఊహలు బయటికి కనిపించవు. అవి లోలోపలే ఉంటాయి. అందుకే ఎక్కువగా కనిపించని ఈ రంగుతో పోల్చాను. ఊహలు బయటకు రావడం చాలా అరుదు. ఊహ బయటకు వస్తే వాస్తవం అవుతుంది.సృష్టిలోని రంగులన్నీ మనలోనే ఉన్నాయి. ఉద్వేగం, భావం అన్నీ మన మనసులో నుంచే పుడతాయి. పాంచభౌతికమైన మనిషి దేహమే అన్నిటికీ మూలం.
ప్రకృతికి ఒక సంక్షిప్త రూపం మానవుడు. ఐదడుగుల రూపంలో మలిస్తే మానవుడు. మానవుడి తాలూకు అన్ని చర్యల్లోను ఒక్కోరంగు ఉంటుంది.
మనలోని భావోద్వేగాలు, మనలోని స్పందనలు, మనలోని ఆలోచనలు ఈ రోజు రంగులుగా మారాయి అని చెప్పడం.
మోసం నిలవదుగా ద్రోహం మిగలదుగా
ఏనాడైనా అన్యాయానికి న్యాయం జరగదుగా
పంతం చెదరదుగా ఫలితం దొరికెనుగా
ఏ రోౖజ నా మంచికి చెడుపై విజయం తప్పదుగా
ఆలోచన బీజం వేసి చెమటే నీరుగ పోసి
ఆవేశం ఎరువే వేసి
పని చేస్తే పండేనంట ఆనందాలరాసి
రెండవ చరణంలో సినిమా కథకు సందర్భోచితంగా రచన సాగింది...
అలతి అలతి పదాలతో కవితాత్మకంగా సాగింది ఈ చరణం. ఆనందాల రాసులు కావాలంటే, ఎంత కష్టపడాలో చెప్పడానికి చేనుతో పోల్చాను. ధాన్యరాసులు చేతికి రావడానికి ఎంత కష్టపడాలో, అదేవిధంగా ఆనందాల రాసులను సంపాదించుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. పంతం పడితే అన్నీ లభిస్తాయి. సాధారణ కోణంలో చూస్తే... మంచి గెలుస్తుంది... చెడు ఓడిపోతుంది.... అనిపిస్తుంది. అన్యాయానికి న్యాయం జరగదు అని చెప్పడంలో ఎప్పుడూ న్యాయమే గెలుస్తుంది అని చెప్పడం. మనకు మనసు బాగుండకపోతే ప్రపంచంలో ఏవీ సానుకూలంగా కనిపించవు. మనసు హాయిగా ఉంటే, ప్రకృతి అంతా అందంగా కనిపిస్తుంది. ప్రకృతిలో అన్నీ ఉన్నాయి... మన భావోద్వేగాలకు ప్రకృతి దర్పణం.
– సంభాషణ: డా. వైజయంతి