చిత్ర పరిశ్రమ
మహిళా విజయం
అందమైన చిత్రాలు గీయడం ఓ చక్కటి కళ.వాటిని కొని ఇంట్లో అలంకరించుకోవడం అభిరుచి.కళకు, అభిరుచి కలిగిన వారికి మధ్య వారధిగా మారారు అనిత.చిత్ర ప్రదర్శనకు ఓ పరిశ్రమ రూపం ఇచ్చిన ఆమె అనుభవాలు...
‘‘మా వారు హరిశ్రీనివాస్ మంచి చిత్రకారులు. ఆయన బొమ్మలను ఇష్టపడే వారు చాలామంది ఉన్నారు. ఆయనలో చక్కటి కళాభిరుచి, దానిని ప్రతిబింబించే నేర్పు ఉన్నాయి కానీ వాటిని మార్కెట్ చేసే నైపుణ్యం లేదు. నిజానికి కళాకారుడి దృష్టి మార్కెట్ మీదకు మళ్లడం కష్టం. అలా మళ్లితే కళ కళ తప్పుతుందని నా నమ్మకం. నేరుగా మార్కెట్‌లోకి దిగకుండా బొమ్మలను ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్శించడం వల్ల పెద్దగా లాభించదని కూడా అర్థమైంది. ఈ మథనంలోంచి ఆ పనేదో నేనే చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ‘వెర్మిలియన్ ఆర్ట్ హౌస్’.
హరిశ్రీనివాస్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి. వాటర్ కలర్, ఆయిల్ కలర్, చార్‌కోల్, పెన్సిల్ స్కెచ్‌లు... చాలా రకాల బొమ్మలు వేయగలరు. ఆయన చిత్రాలతో మొదట 2009లో కార్ఖానాలో ఆర్ట్ హౌస్‌ని స్థాపించాను. దానిని ఇటీవల బంజారాహిల్స్‌కు మార్చాను. మా వారి చిత్రాలకు ఓ వేదిక అని స్థాపించిన ఆర్ట్ హౌస్‌ను కొత్త చిత్రకారుల చిత్రాల ప్రదర్శనకు విస్తరించాను. కార్పొరేట్ స్థాయి ఆర్ట్ గ్యాలరీలలో అడుగు పెట్టలేని గ్రామీణ చిత్రకారులకు నేను కల్పించిన వేదిక పెద్ద ఆసరా అవుతోంది. ఈ గ్యాలరీని పాతిక వేలతో ప్రారంభించాను.
ఆ తర్వాత ఒక చిత్ర ప్రదర్శనలో మా చిత్రాలను పెట్టే అవకాశం వచ్చింది. కానీ ఉన్నఫళంగా అన్నింటికీ ఫ్రేమ్ కట్టించడం కూడా బరువనిపించింది అప్పట్లో. ఫ్రేమ్ తయారీకి చాలా డబ్బు ఖర్చవుతుందని నేను ఆందోళనగా ఉన్నప్పుడు... ‘ఫ్రేమ్ కట్టిస్తాను, ఎగ్జిబిషన్‌లో అమ్ముడైన తర్వాత డబ్బివ్వండి’ అని ఫ్రేములు కట్టే లక్ష్మణ్ ధైర్యం చెప్పాడు. క్రమంగా నా మార్కెట్‌ను కార్పొరేట్ రంగానికి కూడా పరిచయం చేశాను.
కొండ మన దగ్గరకు రాకపోతే...
మార్కెట్ పరంగా నేనుప్రధానంగా తాజ్ వంటి పెద్ద హోటళ్లు, అపోలో వంటి హాస్పిటళ్లకు చిత్రాలను అందిస్తున్నాను. అలాగే నా చిత్రాల ధరలు మధ్య తరగతికి కూడా అందుబాటులో ఉంటాయి. అదే నా విజయ రహస్యం. ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ప్రదర్శిస్తున్నాను. కొనుగోలుదారులు నా గ్యాలరీకి రావాలని కూర్చోలేదు. ఆసక్తి ఉన్న వారిని వెతుక్కుంటూ నేనే వెళ్లాను. అలా ప్రారంభించిన తరవాత వేగంగా చొచ్చుకుపోగలిగాను. శని, ఆదివారాల్లో క్లబ్ హౌస్‌లు, విల్లాలలో ప్రదర్శిస్తున్నాను. అక్కడ చాలామంది ఉత్సాహం చూపించేవారు.
పిల్లల కోసం వారాంతాలలో, మహిళల కోసం మిగిలిన రోజుల్లో చిత్రలేఖనం నేర్పించమని అడిగారు. గతంలో సమ్మర్ క్యాంపుల్లో కోచింగ్ ఇచ్చాం, కానీ ప్రస్తుతం టైమ్ బాలన్స్ అవడం లేదు. గ్యాలరీ నిర్వహణలో నిలదొక్కుకున్న తర్వాత ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలని మా ఇద్దరి కోరిక.
నా వంతు సామాజిక బాధ్యతగా...
మాది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చట్టం పరిధిలోకి వచ్చేటంత పెద్ద పరిశ్రమ కాదు. కానీ మా వంతు బాధ్యతగా క్యాన్సర్ పేషెంట్ల సహాయార్థం ప్రదర్శనలు పెట్టి, అమ్ముడైన చిత్రాల మీద వచ్చిన ఆదాయాన్ని విరాళంగా ఇస్తుంటాం. అలా మా చిత్రాలను ఉపాసన, రామ్‌చరణ్, జయసుధ, సోనూసూద్ వంటి సెలబ్రిటీలు చాలామంది క్యాన్సర్ పేషెంట్ల కోసం తమ వంతు సహాయంగా కలెక్ట్ చేశారు. మొదటి ప్రదర్శన రవీంద్రభారతిలో. ఇప్పటికి 53 ప్రదర్శనలు పెట్టాను.
విజిటర్స్ ఫీడ్ బ్యాక్ చాలా బాగా వస్తోంది. ఫలక్‌నుమాలో పెట్టిన ప్రదర్శనలో ఖతర్ రాజు పది చిత్రాలను తీసుకున్నారు. సమాజంలో మధ్యతరగతి, దిగువ స్థాయిలో నివసిస్తున్న వారిలో చక్కటి చిత్రకారులున్నారు. తమ కళను ప్రదర్శించే అవకాశం లేక అలాంటి ఎందరో కళాకారులు తెరముందుకు రాలేకపోతున్నారు. నా గ్యాలరీ అలాంటి వారికి వేదిక కావాలనేదే నా ఆశయం.
మా నాన్నది ఆదిలాబాద్, అమ్మది మహారాష్ట్ర. మా మేనమామ బొమ్మలు వేసేవారు. బహుశా నాకూ ఆ కళ అలా వారసత్వంగా అబ్బిందనుకుంటాను. చిన్నప్పుడు బొమ్మలు వేసి మిత్రులకు బహుమతిగా ఇచ్చేవాడిని. అది గమనించిన మా డ్రాయింగ్ టీచర్ ప్రోత్సహించారు. ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఉంటుందని కూడా ఆయన చెప్తేనే తెలిసింది. కోర్సు పూర్తయిన తర్వాత యాడ్ ఏజెన్సీ స్థాపించాను. బహుశా నాలోని చిత్రకారుడు... తాను బతికి ఉండడం కోసమే నా యాడ్ ఏజెన్సీని సరిగ్గా నడవనివ్వలేదేమో అనుకుంటాను.
- హరిశ్రీనివాస్, చిత్రకారుడు