క్రిస్మస్‌ కానుక | Christmas gift | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ కానుక

Published Sun, Dec 24 2017 12:58 AM | Last Updated on Sun, Dec 24 2017 1:19 AM

Christmas gift - Sakshi

మనిషంటే ప్రకృతికి కోపమేమో, శీతాకాలం తన వెంట శిశిరాన్ని కూడా తీసుకొని మరీ వచ్చింది మమ్మల్ని వణికించడానికి. మంచు వర్షం, నల్లటి మబ్బులతో చీకటిగా మారిన పట్టపగలు. కిటికీకి ఎక్కడన్నా రంధ్రముంటే రివ్వుమంటూ లోపలికి దూసుకువచ్చే గాలి, ఇళ్ల కప్పులు ఎగిరిపోతాయేమోనన్నంతగా బలంగా వీచిన తుపాను.పైపు గొట్టాల్లో నిరంతరంగా వినిపించే రొద. ఎక్కడివాళ్లనక్కడ కట్టిపడేసే చెప్పలేని బాధ. ప్రళయం ఇంత కంటే భయంకరంగా ఉంటుందేమో తెలియదు.1882. తెల్లారితే క్రిస్మస్‌. అప్పటికి నాకింకా శిక్ష పడలేదు. వస్తువులు తాకట్టు పెట్టుకునే టుపాయెవ్‌ వద్ద నౌకరీ. వెలకట్టి దేనికెంత ఇవ్వాలో చెప్పటం నా పని.నడిరాత్రి కొట్టులో వస్తువులకు కాపలా ఉండమని పురమాయించాడు యజమాని. ఊదారంగు మంటతో వెలుగుతోంది కొవ్వొత్తి. విశాలమైన గది నిండా కుప్పలుతెప్పలుగా వస్తువులు. ట్రంకు పెట్టెల్లో షెల్ఫుల నిండా కుందేలు  వెంట్రుకలతో తయారుచేసిన కోట్లు, మగాళ్ల లాంగ్‌ కోట్లు, రైఫిళ్లు, చిత్రపటాలు, అలంకరణ వస్తువులు, పెచ్చులూడిన గోడకు వేలాడుతున్న గిటారు. వీటికి నేను నిఘా.నగల షోకేసును చూస్తూ ఎర్ర ట్రంకు మీద పడుకున్నాను. కొవ్వొత్తి మీదే ఉంది నా దృష్టి.

ఎందుకో భయమేసింది. ప్రేతాల్లాంటి తాకట్టు వస్తువులు. రాత్రివేళ వాటికి ప్రాణం వచ్చి మసక వెలుగులో స్వైరవిహారం చేస్తున్నట్లుగా, కిటికీ తలుపుల మీద చినుకుల చప్పుడు. రోదిస్తున్న గాలి.
సమోవార్‌ (రష్యన్‌ స్టవ్‌)లోంచి, చూరులోంచి దాడి చేస్తున్న చలి. వస్తువులు ఎలుగెత్తి ఏడుస్తున్నాయి. అన్నీ నేను విలువ గట్టినవే. ఒక్కొక్కదాని చరిత్ర నాకు తెలుసు. ఆ గిటారు డబ్బుల్తో రోగికి మందు కొన్నారు. ఈ రైఫిల్‌తో ఒక తాగుబోతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య పోలీసుల కంటపడకుండా దాన్ని దాచిపెట్టింది. తరువాత ఇక్కడ తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్తో శవపేటిక చేయించింది. ఈ బ్రేస్‌లెట్‌ ఎవరిదో, దొంగిలించినవాడు మాకమ్మాడు.‘178’ నంబరున్న రెండు డ్రెస్సులు ఓ పిల్ల అత్యవసరస్థితిలో ఇక్కడికి తెచ్చింది.ఒక్కొక్క వస్తువు వెనకా ఒక విషాద గా«థ. రోగాలు, రోష్టులు. పూటకు గతి లేని రోజులు. పోలీసులు నమోదు చేయని నేరాలు.క్రిస్మస్‌ వాతావరణంలో ఇవన్నీ తమ కథలు చెప్పుకుంటున్నాయి.‘‘పండుగ పూట కొట్టులో ఎందుకు, ఇళ్లకు పోదాం’’ అంటున్నాయి.అయితే నన్ను భయపెట్టింది ప్రాణం లేని వస్తువులు మాత్రమే కాదు. అట్టలు అట్టలుగా మంచు పేరుకు పోయిన గాజు కిటికీల గుండా ఆశగా లోపలికి చూస్తున్న మొహాలు కూడా.‘‘నాన్సెన్స్‌’’ అంటూ తల విదిలించాను. అంతా నా భ్రమ, అసలు విషయమేమిటంటే, వస్తువుల వెల కట్టే నాలాంటి వాడికి, క్రిస్మస్‌ వచ్చిందంటే  మనసు పీకుతుంటుంది. అంతరాత్మ ఘోషిస్తుంది.నిష్కృతి లేని పాపం, తాకట్టు కొట్టులో పనిచేయటం!

అంతరాత్మను తాకట్టుపెట్టుకునే చోటు కూడా ఇదే. బోర్డ్‌ రాసి పెట్టుకోవచ్చు...‘‘అంతరాత్మలు అమ్మబడును, కొనబడును’’. అది నిరాకారమైంది కాదిక్కడ. ఒక వస్తువు రూపంలో ఉంటుంది. దానికున్న మిగతా లక్షణాలతో మాకు సంబంధం లేదు.ఇంతకూ నాకు అంతరాత్మ ఉందనే భ్రమ ఎందుకు కలిగింది? ఇలాంటి ఆలోచనల చిక్కుముడి నా గొంతుకెందుకు బిగుసుకుంటోంది? విదిలించుకోవటానికి ప్రయత్నించాను.బహుశా ఇది రోజంతా పనిచేసి అలసి నిద్రపోవడం వల్ల కలిగిన మనో విభ్రమం. క్రిస్మస్‌ వచ్చిందంటే చాలు పేదవాళ్లు మా కొట్టు ముందర బారులు తీరి నిలబడతారు. ఇలాంటి చలిలో పేదరికం కేవలం దురదృష్టం మాత్రమే కాదు. ప్రత్యక్షనరకాన్ని అనుభవంలోకి  తెస్తుంది.కనీసం పండుగనాడన్నా కాస్త సంతోషంగా గడపాలంటే, మునుగుతున్న వాడికి గడ్డిపోచలా కనిపిస్తుంది తాకట్టుకొట్టు. కానీ నిజానికది బండరాయిలా మెడకు తగులుకుంటుంది.గుంపులు గుంపులుగా వచ్చారు జనం.వస్తువులతో గదంతా నిండిపోయింది.కొన్ని  వెనకాల వరండాలో పెట్టాం.తెల్లారి నుండి అర్ధరాత్రి దాకా క్షణం విరామం లేదు.ఏదుంటే అది  ఇవ్వడం, ఎంతిస్తే అంత పట్టుకుపోవడం. వాళ్లను పీల్చి పిప్పి చెయ్యటానికి ఇంతకన్నా మంచిరోజు మరొకటుండదు. తాకట్టు పెట్టటానికి వచ్చారు. కానీ, వాళ్ల పరిస్థితి ముష్టివాళ్లకన్నా ఆధ్వానం. పనితో ఎంత అలసిపోయానంటే నిద్ర కూడా రావడం లేదు.ఎవరో తలుపు తట్టారు.యజమాని గొంతు వినిపించింది.‘‘నిద్రపోతున్నావా?’’‘‘లేదు...ఏం కావాలి?’’‘‘రేపు కాస్త పెందలాడే తెరవాలికొట్టు. తేనె మీద ఈగల్లా వచ్చి వాలతారు జనం. చర్చికి తరువాత వెళ్లొచ్చు. కౌంటర్‌ దగ్గర కూర్చో. గుడ్‌నైట్‌’’కొవ్వొత్తి మంట వణుకుతుంది.భయంగా ఉంది. ఆర్పేసి పడుకోవాలి.దీపం దగ్గరకు వెళ్లాను. మసక వెలుగు.

గాజు తలుపుల్లో నుంచి రెండు మొహాలు నా వైపే చూస్తున్నాయి. ‘‘ఎవరూ లేరు. అంతా నా ఊహ’’ అని ధైర్యం చెప్పుకున్నాను. దీపం ఆర్పి తిరిగి వస్తుంటే అనుకోనిదొకటి జరిగింది. నా గొంతుతో మరెవరో అరుస్తున్నారు. ఎక్కడో ఏదో విరిగిన, పగిలిన శబ్దం. గిటారు తీగ తెగింది. భరించలేని బాధ. బిగ్గరగా అరిచాను.  ఒళ్లంతా చెమట పట్టింది. కళ్లు మూసుకొని పరిగెత్తాను. ఎదురుగా ఫర్నిచర్‌ డబ్బాలు. ఊపిరి బిగపట్టి, బిక్కచచ్చి వింత గొంతుకలనాలకించాను. ‘పద’ అంటూ తొందర పెట్టింది ఈదురు గాలి.  ‘‘ఇది క్రిస్మస్‌ పర్వదినం. నువ్వూ పేదవాడివే. గడ్డకట్టే చలిలో, ఆకలితో నకనకలాడే పేదవాళ్ల కష్టాలేమిటో నాకు తెలుసు. ఈ వస్తువులన్నీ వాళ్లవే గదా’’ అవును. నేను కూడా నిరుపేదనే. ఇక్కట్లు నాకు కొత్తకాదు. చలికి గజగజ వణికిన రోజులింకా జ్ఞాపకమే. దుర్భర దారిద్య్రమే నేనీ వడ్డీ వ్యాపారి వద్ద పనిచెయ్యక తప్పని పరిస్థితి కల్పించింది. రోజూ నాలాంటి ఇతర్లను పీల్చి పిప్పి చేస్తే తప్ప నా కడుపు నిండదు మరి. ఆకలికి తట్టుకోగలిగిన సత్తా నాకుంటే ఎదుటి మనుషుల జీవితాల్ని, ఆప్యాయతల్ని, అవసరాలను  అణా పైసల్లో లెక్కగట్టగలిగే వాడినా? మరి, ఈ గాలికి నా మీదెందుకు కోపం? అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తోందా? ఒకవైపు బాధ, పశ్చాత్తాపం, నా మీద నాకు కోపం. మరోవైపు అలసట.నిద్రముంచుకొచ్చింది. మళ్లీ యజమాని తలుపు తట్టిన చప్పుడు. అర్ధరాత్రి చర్చి గంటలతో క్రిస్మస్‌కు స్వాగతం.  ఇంటి కప్పు మీద వాన చప్పుడు. సుడిగాలి రొద. గదినిండా షోకేసుల్లో వస్తువులు. కిటికీ తలుపుకు ఏసు ప్రభువు బొమ్మ. తాకట్టుకు వచ్చిన వస్తువులన్నీ తమతమ ఇళ్లకు  వెళ్లనివ్వమని అర్థిస్తున్నాయి. గిటారు తీగలు క్రమం తప్పక తెగిపోతున్నాయి. ముష్టివాళ్లు, వృద్ధ స్త్రీలు ముడతలు పడిన మొహాలతో కిటికీలో నుంచి నన్నే చూస్తున్నారు. తలుపులు తీసి తమ వస్తువులు వాపసు చెయ్యమంటున్నారు.

కలలో ఎలుక కిచకిచమంటున్నట్టుగా వినిపించింది. తలుపును కొరుకుతున్నది. చలికి బ్లాంకెట్‌ కప్పుకొని లేచాను. అర్థం కావడం లేదుగానీ, ఏవో మాటలు వినిపిస్తున్నాయి. పీడ కలలాగా ఉంది. మెలకువ వచ్చినా బాగుండును. గాజు పగిలింది. షోకేసు మీద లైట్‌ పడింది. ‘‘మాట్లాడొద్దు. నిశ్శబ్దం. యముడు లేస్తాడు. బూట్లు కూడా విప్పి నడువు’’ షోకేసు వద్దకు వచ్చి తాళం లాగి చూశాడు. మొహం పాలిపోయి ఉంది. గడ్డం పెరిగింది. చిరిగిన కోటూ, రంధ్రాలు పడ్డ బూట్లూ, పొడుగ్గా ఉన్న మరొకడు వాడి వెనకే వచ్చాడు. ఇద్దరూ గుసగుసలాడుకుంటున్నారు. ‘‘దొంగలు’’ అనుకున్నాను. నిద్రలో ఉన్నాను. అయినా జ్ఞాపకం వచ్చింది. నా దిండు కింద ఎప్పుడూ ఒక పిస్తోలుంటుంది. ‘‘వాడు లేస్తాడు జాగ్రత్త’’ అనుకుంటున్నారు వాళ్లు. ‘‘హాండ్సప్‌’’ అంటూ అరిచాను. భయంతో గోడకంటుకు పోయారిద్దరూ. కన్నీళ్ళ పర్యంతమై, వదిలెయ్యమని ప్రాధేయపడ్డారు. పగిలిన కిటికీ అద్దం గుండా వచ్చిన శీతగాలికి చేతులు వణుకుతున్నాయి. దొంగలు వెలిగించిన కొవ్వొత్తి దీనంగా వెలుగుతోంది. ‘‘నువ్వే దిక్కు, రక్షించు’’ అంటూ కాళ్ల మీద పడ్డారు. కిటికీలో, వర్షంలో తడిసిన ముసల్దాని మొహం. ‘‘వాళ్లనేం చెయ్యక వదిలెయ్‌. దరిద్రం మమ్మల్ని శాసిస్తుంది’’ అని అంది. ‘‘అవును...దరిద్రం’’ అన్నాడు ముసలాడు. ‘‘దరిద్రమే...దరిద్రమే’’ వంత పాడింది ఈదురుగాలి, గుండెలో బాకులు దించే దరిద్రం. నిద్రా? నిద్రలో కలా? లేచి, షోకేస్‌లోంచి నగలు తీసి దొంగల జేబుల్లో కుక్కాను. ‘‘తీసుకెళ్లండి. రేపు క్రిస్మస్‌. సరదాగా గడపండి’’మిగతా నగలు మూటగట్టి ముసల్దానికిచ్చాను.

ఫర్‌ కోట్, మరో బ్లాక్‌సూట్, లేసులల్లిన డ్రెస్సులు, గిటారు. అన్నీ అందరికీ. ఇలాంటి వింత కలలు కూడా వస్తాయి మరి. ఆ తరువాత తలుపు తెరుచుకుంది. పోలీసు వాళ్లను వెంట పెట్టుకుని యజమాని ప్రవేశించాడు. ఇంత అకస్మాత్తుగా వీళ్లు ఎక్కణ్ణుంచి ఊడిపడ్డారు? యజమాని చూస్తుండగానే వస్తువులు అందరికీ పంచిపెట్టారు.‘‘దుర్మార్గుడు. ఏం చేస్తున్నావురా?’’‘‘రేపు క్రిస్మస్‌. అందరూ  ఆనందంగా గడపాలి’’ ఈ అంకానికి ఇక్కడితో ముగింపు. కొత్త అంకం ప్రారంభం. ఇప్పుడు నేను కొట్టులో లేను. సంకెళ్లతో నడుస్తున్నాను. వెంట పోలీసులు.‘‘ఎందుకిలా చేశావు?’’మెలకువ  వచ్చేసరికి తెల్లవారింది. వర్షం ఆగింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. వెచ్చగా నీరెండ. పోలీసులే క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు.నెల తర్వాత విచారణ ప్రారంభమైంది.‘‘జరిగినదంతా కల’’ అని చెప్పాను జడ్జిగారికి. కలలో చేసిన పనులకు శిక్షలు వేయడం అన్యాయం. వాళ్లకు చెందని వస్తువులు దొంగలకెందుకిస్తానసలు? పైగా, డబ్బులు తీసుకోక, ఎందుకు దానం చేస్తాను? కానీ నాకు వచ్చిన కల వాస్తవమని ధ్రువీకరించింది న్యాయస్థానం. శిక్ష కూడా వేసింది. నా తరఫున వాదిస్తారా మీరు?అయాం నాట్‌ గిల్టీ.

ఆంటన్‌ చెహోవ్‌ ప్రఖ్యాత రష్యన్‌ రచయిత. 17–01–1860లో రష్యాలోని టాగన్‌రోడ్‌ అనే ఊర్లో జన్మించాడు. కటిక పేదరికం. తండ్రి కిరాతకంగా కొడుతుండేవాడు. సమాజంలోని పరిస్థితులు చూసినప్పుడల్లా చెహోవ్‌కు కోపం వచ్చేది. ఆ కోపాన్ని తన రచనల్లో చూపించేవాడు. అయితే అక్కడ వ్యంగ్యం, హాస్యం కనిపించేలా చేయడం ఆ రచనల్లో ప్రత్యేకం. అదే ఆయనను ప్రఖ్యాత రచయితను చేసింది. చెహోవ్‌ కేవలం ఇల్లు గడవడానికే కథలు రాసిన రోజులూ ఉన్నాయి. కథలతో పాటు, నాటకాలు రాయడంలోనూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న చెహోవ్‌ రచనలు ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement