Redemption day
-
విమోచనం అంటే ద్రోహం చేయడమే
ఖమ్మంమయూరిసెంటర్: 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా సైన్యాలతో ప్రజలను అణచివేసి, ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసుకోవడం విద్రోహం చేయడమేనని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్డీ ఆధ్వర్యంలో విద్రోహదినం సభను అవుల అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నైజాం రాజు ఖాసీమ్ రాజ్య నియంతృత్వ పరిపాలన సాగిస్తుంటే కమ్యూనిస్టు పార్టీ గెరిల్లా సైన్యాలు భూమి, భుక్తి, విముక్తి కోసం, వెట్టిచాకిరీ, అంటరాని తనాన్ని నిర్మూలించుటకు వీరోచిత త్యాగాలు చేసారన్నారు. ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య, పుల్లయ్య, కె.ఎస్.ప్రదీప్, నాగేశ్వరరావు, ఆజాద్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటం కామేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ పని చేస్తుందని, ఆ పార్టీ మండల నాయకులు కోలా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం తెలంగాణ విమోజన దినోత్సవం సందర్భంగా కామేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బానిసత్వానికి, నిజాం నిరుంకుశతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఈ పోరాటంలో ఎందరో తెలంగాణ ప్రజలు అమరులైనారన్నారు. పిచ్చయ్య, ఆంగోత్ లాలు, ఎస్.ఉపేందర్, కె.దర్గయ్య, రాకేష్, నాగరాజు, కొండా, కోలా అప్పారావు పాల్గొన్నారు. -
రాయ్‌బరేలీకి ‘వారసత్వం’ నుంచి విముక్తి
రాయ్‌బరేలీ: గాంధీ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గాన్ని కుటుంబపాలన రాజకీయాల నుంచి విముక్తి చేస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ గాంధీ కుటుంబానికే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నా అభివృద్ధి జాడలు కానరావటం లేదన్నారు. శనివారం రాయ్‌బరేలీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘వారసత్వ రాజకీయాల నుంచి రాయ్‌బరేలీకి విముక్తి కల్పించి, అభివృద్ది బాటన నడిపిస్తామని చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చా. కాంగ్రెస్, ఆపార్టీ అగ్రనేతలు ఏళ్లుగా ఇక్కడ పరిపాలన సాగించినప్పటికీ కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పలేక పోయారు. ఈ జిల్లాను, ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా మారుస్తాం. యోగి ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ‘గూండారాజ్యం’ ఉండగా ప్రస్తుతం శాంతి నెలకొంది. కాషాయ ఉగ్రవాదమంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలి’అని అమిత్ డిమాండ్ చేశారు. సభలో మీడియా ప్రతినిధులు కూర్చున్న చోట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగటంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. -
క్రిస్మస్ కానుక
మనిషంటే ప్రకృతికి కోపమేమో, శీతాకాలం తన వెంట శిశిరాన్ని కూడా తీసుకొని మరీ వచ్చింది మమ్మల్ని వణికించడానికి. మంచు వర్షం, నల్లటి మబ్బులతో చీకటిగా మారిన పట్టపగలు. కిటికీకి ఎక్కడన్నా రంధ్రముంటే రివ్వుమంటూ లోపలికి దూసుకువచ్చే గాలి, ఇళ్ల కప్పులు ఎగిరిపోతాయేమోనన్నంతగా బలంగా వీచిన తుపాను.పైపు గొట్టాల్లో నిరంతరంగా వినిపించే రొద. ఎక్కడివాళ్లనక్కడ కట్టిపడేసే చెప్పలేని బాధ. ప్రళయం ఇంత కంటే భయంకరంగా ఉంటుందేమో తెలియదు.1882. తెల్లారితే క్రిస్మస్. అప్పటికి నాకింకా శిక్ష పడలేదు. వస్తువులు తాకట్టు పెట్టుకునే టుపాయెవ్ వద్ద నౌకరీ. వెలకట్టి దేనికెంత ఇవ్వాలో చెప్పటం నా పని.నడిరాత్రి కొట్టులో వస్తువులకు కాపలా ఉండమని పురమాయించాడు యజమాని. ఊదారంగు మంటతో వెలుగుతోంది కొవ్వొత్తి. విశాలమైన గది నిండా కుప్పలుతెప్పలుగా వస్తువులు. ట్రంకు పెట్టెల్లో షెల్ఫుల నిండా కుందేలు వెంట్రుకలతో తయారుచేసిన కోట్లు, మగాళ్ల లాంగ్ కోట్లు, రైఫిళ్లు, చిత్రపటాలు, అలంకరణ వస్తువులు, పెచ్చులూడిన గోడకు వేలాడుతున్న గిటారు. వీటికి నేను నిఘా.నగల షోకేసును చూస్తూ ఎర్ర ట్రంకు మీద పడుకున్నాను. కొవ్వొత్తి మీదే ఉంది నా దృష్టి. ఎందుకో భయమేసింది. ప్రేతాల్లాంటి తాకట్టు వస్తువులు. రాత్రివేళ వాటికి ప్రాణం వచ్చి మసక వెలుగులో స్వైరవిహారం చేస్తున్నట్లుగా, కిటికీ తలుపుల మీద చినుకుల చప్పుడు. రోదిస్తున్న గాలి. సమోవార్ (రష్యన్ స్టవ్)లోంచి, చూరులోంచి దాడి చేస్తున్న చలి. వస్తువులు ఎలుగెత్తి ఏడుస్తున్నాయి. అన్నీ నేను విలువ గట్టినవే. ఒక్కొక్కదాని చరిత్ర నాకు తెలుసు. ఆ గిటారు డబ్బుల్తో రోగికి మందు కొన్నారు. ఈ రైఫిల్‌తో ఒక తాగుబోతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య పోలీసుల కంటపడకుండా దాన్ని దాచిపెట్టింది. తరువాత ఇక్కడ తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్తో శవపేటిక చేయించింది. ఈ బ్రేస్లెట్ ఎవరిదో, దొంగిలించినవాడు మాకమ్మాడు.‘178’ నంబరున్న రెండు డ్రెస్సులు ఓ పిల్ల అత్యవసరస్థితిలో ఇక్కడికి తెచ్చింది.ఒక్కొక్క వస్తువు వెనకా ఒక విషాద గా«థ. రోగాలు, రోష్టులు. పూటకు గతి లేని రోజులు. పోలీసులు నమోదు చేయని నేరాలు.క్రిస్మస్ వాతావరణంలో ఇవన్నీ తమ కథలు చెప్పుకుంటున్నాయి.‘‘పండుగ పూట కొట్టులో ఎందుకు, ఇళ్లకు పోదాం’’ అంటున్నాయి.అయితే నన్ను భయపెట్టింది ప్రాణం లేని వస్తువులు మాత్రమే కాదు. అట్టలు అట్టలుగా మంచు పేరుకు పోయిన గాజు కిటికీల గుండా ఆశగా లోపలికి చూస్తున్న మొహాలు కూడా.‘‘నాన్సెన్స్’’ అంటూ తల విదిలించాను. అంతా నా భ్రమ, అసలు విషయమేమిటంటే, వస్తువుల వెల కట్టే నాలాంటి వాడికి, క్రిస్మస్ వచ్చిందంటే మనసు పీకుతుంటుంది. అంతరాత్మ ఘోషిస్తుంది.నిష్కృతి లేని పాపం, తాకట్టు కొట్టులో పనిచేయటం! అంతరాత్మను తాకట్టుపెట్టుకునే చోటు కూడా ఇదే. బోర్డ్ రాసి పెట్టుకోవచ్చు...‘‘అంతరాత్మలు అమ్మబడును, కొనబడును’’. అది నిరాకారమైంది కాదిక్కడ. ఒక వస్తువు రూపంలో ఉంటుంది. దానికున్న మిగతా లక్షణాలతో మాకు సంబంధం లేదు.ఇంతకూ నాకు అంతరాత్మ ఉందనే భ్రమ ఎందుకు కలిగింది? ఇలాంటి ఆలోచనల చిక్కుముడి నా గొంతుకెందుకు బిగుసుకుంటోంది? విదిలించుకోవటానికి ప్రయత్నించాను.బహుశా ఇది రోజంతా పనిచేసి అలసి నిద్రపోవడం వల్ల కలిగిన మనో విభ్రమం. క్రిస్మస్ వచ్చిందంటే చాలు పేదవాళ్లు మా కొట్టు ముందర బారులు తీరి నిలబడతారు. ఇలాంటి చలిలో పేదరికం కేవలం దురదృష్టం మాత్రమే కాదు. ప్రత్యక్షనరకాన్ని అనుభవంలోకి తెస్తుంది.కనీసం పండుగనాడన్నా కాస్త సంతోషంగా గడపాలంటే, మునుగుతున్న వాడికి గడ్డిపోచలా కనిపిస్తుంది తాకట్టుకొట్టు. కానీ నిజానికది బండరాయిలా మెడకు తగులుకుంటుంది.గుంపులు గుంపులుగా వచ్చారు జనం.వస్తువులతో గదంతా నిండిపోయింది.కొన్ని వెనకాల వరండాలో పెట్టాం.తెల్లారి నుండి అర్ధరాత్రి దాకా క్షణం విరామం లేదు.ఏదుంటే అది ఇవ్వడం, ఎంతిస్తే అంత పట్టుకుపోవడం. వాళ్లను పీల్చి పిప్పి చెయ్యటానికి ఇంతకన్నా మంచిరోజు మరొకటుండదు. తాకట్టు పెట్టటానికి వచ్చారు. కానీ, వాళ్ల పరిస్థితి ముష్టివాళ్లకన్నా ఆధ్వానం. పనితో ఎంత అలసిపోయానంటే నిద్ర కూడా రావడం లేదు.ఎవరో తలుపు తట్టారు.యజమాని గొంతు వినిపించింది.‘‘నిద్రపోతున్నావా?’’‘‘లేదు...ఏం కావాలి?’’‘‘రేపు కాస్త పెందలాడే తెరవాలికొట్టు. తేనె మీద ఈగల్లా వచ్చి వాలతారు జనం. చర్చికి తరువాత వెళ్లొచ్చు. కౌంటర్ దగ్గర కూర్చో. గుడ్‌నైట్’’కొవ్వొత్తి మంట వణుకుతుంది.భయంగా ఉంది. ఆర్పేసి పడుకోవాలి.దీపం దగ్గరకు వెళ్లాను. మసక వెలుగు. గాజు తలుపుల్లో నుంచి రెండు మొహాలు నా వైపే చూస్తున్నాయి. ‘‘ఎవరూ లేరు. అంతా నా ఊహ’’ అని ధైర్యం చెప్పుకున్నాను. దీపం ఆర్పి తిరిగి వస్తుంటే అనుకోనిదొకటి జరిగింది. నా గొంతుతో మరెవరో అరుస్తున్నారు. ఎక్కడో ఏదో విరిగిన, పగిలిన శబ్దం. గిటారు తీగ తెగింది. భరించలేని బాధ. బిగ్గరగా అరిచాను. ఒళ్లంతా చెమట పట్టింది. కళ్లు మూసుకొని పరిగెత్తాను. ఎదురుగా ఫర్నిచర్ డబ్బాలు. ఊపిరి బిగపట్టి, బిక్కచచ్చి వింత గొంతుకలనాలకించాను. ‘పద’ అంటూ తొందర పెట్టింది ఈదురు గాలి. ‘‘ఇది క్రిస్మస్ పర్వదినం. నువ్వూ పేదవాడివే. గడ్డకట్టే చలిలో, ఆకలితో నకనకలాడే పేదవాళ్ల కష్టాలేమిటో నాకు తెలుసు. ఈ వస్తువులన్నీ వాళ్లవే గదా’’ అవును. నేను కూడా నిరుపేదనే. ఇక్కట్లు నాకు కొత్తకాదు. చలికి గజగజ వణికిన రోజులింకా జ్ఞాపకమే. దుర్భర దారిద్య్రమే నేనీ వడ్డీ వ్యాపారి వద్ద పనిచెయ్యక తప్పని పరిస్థితి కల్పించింది. రోజూ నాలాంటి ఇతర్లను పీల్చి పిప్పి చేస్తే తప్ప నా కడుపు నిండదు మరి. ఆకలికి తట్టుకోగలిగిన సత్తా నాకుంటే ఎదుటి మనుషుల జీవితాల్ని, ఆప్యాయతల్ని, అవసరాలను అణా పైసల్లో లెక్కగట్టగలిగే వాడినా? మరి, ఈ గాలికి నా మీదెందుకు కోపం? అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తోందా? ఒకవైపు బాధ, పశ్చాత్తాపం, నా మీద నాకు కోపం. మరోవైపు అలసట.నిద్రముంచుకొచ్చింది. మళ్లీ యజమాని తలుపు తట్టిన చప్పుడు. అర్ధరాత్రి చర్చి గంటలతో క్రిస్మస్కు స్వాగతం. ఇంటి కప్పు మీద వాన చప్పుడు. సుడిగాలి రొద. గదినిండా షోకేసుల్లో వస్తువులు. కిటికీ తలుపుకు ఏసు ప్రభువు బొమ్మ. తాకట్టుకు వచ్చిన వస్తువులన్నీ తమతమ ఇళ్లకు వెళ్లనివ్వమని అర్థిస్తున్నాయి. గిటారు తీగలు క్రమం తప్పక తెగిపోతున్నాయి. ముష్టివాళ్లు, వృద్ధ స్త్రీలు ముడతలు పడిన మొహాలతో కిటికీలో నుంచి నన్నే చూస్తున్నారు. తలుపులు తీసి తమ వస్తువులు వాపసు చెయ్యమంటున్నారు. కలలో ఎలుక కిచకిచమంటున్నట్టుగా వినిపించింది. తలుపును కొరుకుతున్నది. చలికి బ్లాంకెట్ కప్పుకొని లేచాను. అర్థం కావడం లేదుగానీ, ఏవో మాటలు వినిపిస్తున్నాయి. పీడ కలలాగా ఉంది. మెలకువ వచ్చినా బాగుండును. గాజు పగిలింది. షోకేసు మీద లైట్ పడింది. ‘‘మాట్లాడొద్దు. నిశ్శబ్దం. యముడు లేస్తాడు. బూట్లు కూడా విప్పి నడువు’’ షోకేసు వద్దకు వచ్చి తాళం లాగి చూశాడు. మొహం పాలిపోయి ఉంది. గడ్డం పెరిగింది. చిరిగిన కోటూ, రంధ్రాలు పడ్డ బూట్లూ, పొడుగ్గా ఉన్న మరొకడు వాడి వెనకే వచ్చాడు. ఇద్దరూ గుసగుసలాడుకుంటున్నారు. ‘‘దొంగలు’’ అనుకున్నాను. నిద్రలో ఉన్నాను. అయినా జ్ఞాపకం వచ్చింది. నా దిండు కింద ఎప్పుడూ ఒక పిస్తోలుంటుంది. ‘‘వాడు లేస్తాడు జాగ్రత్త’’ అనుకుంటున్నారు వాళ్లు. ‘‘హాండ్సప్’’ అంటూ అరిచాను. భయంతో గోడకంటుకు పోయారిద్దరూ. కన్నీళ్ళ పర్యంతమై, వదిలెయ్యమని ప్రాధేయపడ్డారు. పగిలిన కిటికీ అద్దం గుండా వచ్చిన శీతగాలికి చేతులు వణుకుతున్నాయి. దొంగలు వెలిగించిన కొవ్వొత్తి దీనంగా వెలుగుతోంది. ‘‘నువ్వే దిక్కు, రక్షించు’’ అంటూ కాళ్ల మీద పడ్డారు. కిటికీలో, వర్షంలో తడిసిన ముసల్దాని మొహం. ‘‘వాళ్లనేం చెయ్యక వదిలెయ్. దరిద్రం మమ్మల్ని శాసిస్తుంది’’ అని అంది. ‘‘అవును...దరిద్రం’’ అన్నాడు ముసలాడు. ‘‘దరిద్రమే...దరిద్రమే’’ వంత పాడింది ఈదురుగాలి, గుండెలో బాకులు దించే దరిద్రం. నిద్రా? నిద్రలో కలా? లేచి, షోకేస్లోంచి నగలు తీసి దొంగల జేబుల్లో కుక్కాను. ‘‘తీసుకెళ్లండి. రేపు క్రిస్మస్. సరదాగా గడపండి’’మిగతా నగలు మూటగట్టి ముసల్దానికిచ్చాను. ఫర్ కోట్, మరో బ్లాక్సూట్, లేసులల్లిన డ్రెస్సులు, గిటారు. అన్నీ అందరికీ. ఇలాంటి వింత కలలు కూడా వస్తాయి మరి. ఆ తరువాత తలుపు తెరుచుకుంది. పోలీసు వాళ్లను వెంట పెట్టుకుని యజమాని ప్రవేశించాడు. ఇంత అకస్మాత్తుగా వీళ్లు ఎక్కణ్ణుంచి ఊడిపడ్డారు? యజమాని చూస్తుండగానే వస్తువులు అందరికీ పంచిపెట్టారు.‘‘దుర్మార్గుడు. ఏం చేస్తున్నావురా?’’‘‘రేపు క్రిస్మస్. అందరూ ఆనందంగా గడపాలి’’ ఈ అంకానికి ఇక్కడితో ముగింపు. కొత్త అంకం ప్రారంభం. ఇప్పుడు నేను కొట్టులో లేను. సంకెళ్లతో నడుస్తున్నాను. వెంట పోలీసులు.‘‘ఎందుకిలా చేశావు?’’మెలకువ వచ్చేసరికి తెల్లవారింది. వర్షం ఆగింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. వెచ్చగా నీరెండ. పోలీసులే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.నెల తర్వాత విచారణ ప్రారంభమైంది.‘‘జరిగినదంతా కల’’ అని చెప్పాను జడ్జిగారికి. కలలో చేసిన పనులకు శిక్షలు వేయడం అన్యాయం. వాళ్లకు చెందని వస్తువులు దొంగలకెందుకిస్తానసలు? పైగా, డబ్బులు తీసుకోక, ఎందుకు దానం చేస్తాను? కానీ నాకు వచ్చిన కల వాస్తవమని ధ్రువీకరించింది న్యాయస్థానం. శిక్ష కూడా వేసింది. నా తరఫున వాదిస్తారా మీరు?అయాం నాట్ గిల్టీ. ఆంటన్ చెహోవ్ ప్రఖ్యాత రష్యన్ రచయిత. 17–01–1860లో రష్యాలోని టాగన్రోడ్ అనే ఊర్లో జన్మించాడు. కటిక పేదరికం. తండ్రి కిరాతకంగా కొడుతుండేవాడు. సమాజంలోని పరిస్థితులు చూసినప్పుడల్లా చెహోవ్కు కోపం వచ్చేది. ఆ కోపాన్ని తన రచనల్లో చూపించేవాడు. అయితే అక్కడ వ్యంగ్యం, హాస్యం కనిపించేలా చేయడం ఆ రచనల్లో ప్రత్యేకం. అదే ఆయనను ప్రఖ్యాత రచయితను చేసింది. చెహోవ్ కేవలం ఇల్లు గడవడానికే కథలు రాసిన రోజులూ ఉన్నాయి. కథలతో పాటు, నాటకాలు రాయడంలోనూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న చెహోవ్ రచనలు ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి. -
చరిత్రను రాజకీయం చేయవద్దు
డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికార ఉత్సవంగా జరపకపోవడానికి గల కారణాలను గురించి తలలు బద్దలు కొట్టుకోనక్కరలేదు. అవి చాలా సుస్పష్టం. మజ్లిస్‌తో స్నేహం చెడగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే, ముస్లింలను సంతోషపరుస్తున్నాననుకుంటూ పొద్దున్న లేస్తే నిజాం నవాబును, ఆయన పరిపాలనను వేనోళ్ల స్తుతిస్తూ విమోచన దినం అధికారికంగా ఎట్లా నిర్వహించడం అనేది మరో కారణం. ఒకవైపు కాళోజీని, దాశ రథిని కొనియాడుతూ, మరో వైపు నిజాం రాజును స్తుతించడం కేసీఆర్‌కే చెల్లింది. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విలీనమైన ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు ఏటా విమోచన దినోత్సవం జరుపుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో కలసిన తెలంగాణ ప్రాంతంలో కూడా అదే రీతిలో సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలన్న డిమాండ్ ఉంది. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా దీని గురించి వింటూనే ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు ఏనాడూ ఆ పని చెయ్యడానికి అంగీకరించలేదు. ఎక్కువకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్‌లోనో మరెక్కడో పార్టీ పరంగా మొక్కుబడిగా ఉత్సవాలు జరిపిందే తప్ప ఆరోజు ప్రాముఖ్యాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఆ రెండు పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఉత్సవాలు అధికారికంగా జరిగాయి. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వాన్నీ, ఆయన ప్రతిష్టనూ తన సొంతం చేసుకోవడానికి తపిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని ఏటా కోరుతోంది. సర్దార్ పటేల్ నామస్మరణ తప్ప, నెహ్రూ, గాంధీ వంటి నాయకుల పేర్లను ఉచ్చరించడమే పాపం అన్నట్టుగా బీజేపీ వ్యవహరించడం ఈ మూడున్నర ఏళ్లుగా చూస్తున్నాం. మహాత్ముడిని ‘చతుర్ బనియా’(తెలివిగల వ్యాపారి) అని హేళనగా మాట్లాడే నాయకత్వం కలిగిన పార్టీ బీజేపీ. ఉక్కు మనిషిగా ఖ్యాతి చెందిన సర్దార్ పటేల్ జ్ఞాపకాన్ని మహాత్ముడి జన్మస్థానం గుజరాత్లో చిరస్మరణీయం చెయ్యాలన్న ఆలోచన బీజేపీది. పాత ప్రభుత్వాల బాటనే టీఆర్ఎస్ సెప్టెంబర్ 17 విషయానికి వద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అసలు ఈ విషయంలో ఒక అవగాహన కానీ, అధ్యయనం కానీ లేవు. ఏ రాజకీయ పార్టీకైనా చరిత్ర పట్ల అవగాహన అవసరం. ఆ చరిత్ర పట్ల తనకంటూ ఒక రాజకీయ వైఖరి కూడా ఉండటమూ తప్పనిసరి. కానీ తెలుగుదేశం పార్టీకీ, దాని అధినాయకత్వానికీ ముఖ్యంగా ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చరిత్ర అంటే అస్సలు గిట్టదు. చరిత్రను అధ్యయనం చెయ్యడం శుద్ధ దండగ అని ఆయన అభిప్రాయం. కాబట్టి వారి కాలంలో కూడా అధికారికంగా ఉత్సవాలు జరగలేదు. ఇప్పుడిక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచించడం కూడా అనవసరం. ఆ పార్టీ ఇక్కడి నుంచి జెండా ఎత్తెయ్యడం స్వయంకృతమే. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సెప్టెంబర్ 17ను అధికారిక ఉత్సవంగా నిర్వహించడానికిఅంగీకరించడం లేదు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన చివరి దశ ఉద్యమానికి నాయకత్వం వహించిన 13 సంవత్సరాల కాలంలో ఉద్యమ సంస్థగా టీఆర్ఎస్, దాని అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలుమార్లు సెప్టెంబర్ 17న రెండు పొరుగు రాష్ట్రాల మాదిరిగానే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని అప్పటి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆ రోజును అధికారికంగా జరుపుతామని పలుమార్లు ప్రకటించారు. ఒపీనియన్స్ మార్చుకోని వాడు పొలిటీషియన్ కాడు అంటాడు గిరీశం, ‘కన్యాశుల్కం’లో. చాలా విషయాల్లో మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు గిరీశమే ఆదర్శమనిపిస్తుంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ ఇచ్చిన హామీ విషయంలో కానీ, ఇంటికో ఉద్యోగం, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య కానీ చివరికి సెప్టెంబర్ 17 న ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం విషయంలో కూడా ఆయనది గిరీశం బాటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మూడేళ్లలో మళ్లీ ఈ డిమాండ్ ముందుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ డిమాండ్ విషయంలో అనుసరించిన వైఖరే ఇప్పుడు చంద్రశేఖరరావు ప్రభుత్వ వైఖరి కూడా. ఎందుకీ చర్చ? ఇంతకూ సెప్టెంబర్ 17 ప్రాముఖ్యం ఏమిటి, ఇంత చర్చ ఎందుకు? 1948 సంవత్సరం అదే రోజున భారత ప్రభుత్వ సైన్యాలు జనరల్ చౌదురి నాయకత్వంలో నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ ఆదేశాల మేరకు హైదరాబాద్ సంస్థానాన్ని లోబరుచుకున్నాయి. భారత సైన్యంతో యుద్ధం చేసే శక్తి లేని నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ పటేల్‌కు లొంగిపోయి రాజప్రముఖ్‌గా గౌరవం, సుఖసౌఖ్యాలూ అనుభవించాడు. అప్పుడు జరిగింది విలీనమా, విమోచనా లేక విద్రోహమా అన్న చర్చ ఈ రోజుకూ జరుగుతూనే ఉంది. సర్దార్ పటేల్ నాయకత్వంలో ఆనాడు జరిగింది విమోచనే అయితే నిజాం రాజుకు అన్ని మర్యాదలెందుకు జరిగాయి? ఆనాటి హైదరాబాద్ సంస్థాన ప్రజలను నానా హింసలకు గురిచేసి వేలాది మంది వీరుల మరణానికి కారకులయిన నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్లలో ఒక్కడికైనా శిక్ష పడిందా? పరమ కిరాతకుడైన రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ దేశం విడిచి సురక్షితంగా పాకిస్తాన్‌కో, మరెక్కడికో ఎట్లా పారిపోగలిగాడు? ఆనాడు జరిగింది విమోచన కాదు అని వాదిస్తున్న వారి నుంచి వస్తున్న ప్రశ్నలివి. అందుకే ఇది విలీనం మాత్రమే అంటున్న వాళ్లూ ఉన్నారు. అసలు ఆ రెండూ కాదు, ఆనాడు జరిగింది నిజాం పాలనను ఎదిరించి ధైర్యంగా సాయుధ పోరాటం చేసిన తెలంగాణ రైతాంగం జరిపిన అలుపెరుగని పోరాటానికి, అసువులు బాసిన అమర వీరులకు జరిగిన విద్రోహం అన్న వాదన కూడా బలంగా ఉన్నది. ఈ చర్చ అట్లా ఉంచితే సెప్టెంబర్ 17ను ప్రభుత్వం ఘనంగా అధికార ఉత్సవంగా నిర్వహించాలని బీజేపీ తదితర ప్రతిపక్షాలూ, ససేమిరా అని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడెందుకు పట్టుబట్టి కూర్చున్నాయన్న విషయం మాట్లాడుకుందాం. బీజేపీ పట్టు సెప్టెంబర్ 17 తేదీని విమోచన దినంగా ప్రభుత్వమే నిర్వహించాలని బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న మాట నిజం. ప్రజలను కదిలించే ప్రాంతీయ అంశాలను తీసుకుని 2019 ఎన్నికల్లో దక్షిణాదిన కూడా పాగా వెయ్యాలన్న అధిష్టానం ఆలోచనలో భాగంగా ఈసారి తెలంగాణలో విమోచన దినం డిమాండ్‌ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకుపోయేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వారం రోజుల యాత్ర నిర్వహించారు. అదే క్రమంలో తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలను కూడా బీజేపీ నాయకులు పోయిన చోటల్లా ఎండగట్టారు. పాపం స్థానిక నాయకత్వం ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీ నుంచి ఒక కేంద్రమంత్రి వచ్చి ‘కేసీఆర్ ప్రభుత్వం భేష్!’అని కితాబిస్తాడు. మహారాష్ట్ర గవర్నర్‌గారు వచ్చి తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తున్నదని పొగుడుతారు. ఇంకో వైపు నుంచి బిహార్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇక్కడి సుపరిపాలన గురించి నాలుగు మంచి మాటలు చెబుతారు. ఇదేమిటి అని అడిగితే ప్రభుత్వాల మధ్య సంబంధాలు వేరు, పార్టీల ఎజెండాలు వేరు అని ఒక బలహీన వాదన వినిపిస్తారు. దక్షిణాదిన పట్టు సాధిస్తాం, తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం అన్న ఆలోచనకు ప్రస్తుతం మోదీ, అమిత్ షా ద్వయం స్వస్తి చెప్పిందనడానికి నిదర్శనం– ఉన్నఒకే ఒక్క కేంద్రమంత్రి, తెలంగాణ వాది, వెనుకబడిన తరగతుల సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయను క్యాబినెట్ నుంచి తొలగించడం. 2019లో కలసి నడవడానికి కేసీఆర్‌లో ఒక మంచి మిత్రుడిని వారు వెతుకుతున్నట్టు వార్తలొస్తున్నాయి. సర్వేల పేరుతో మళ్లీ అధికారం తమదే అని బయటికి చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగా తెలిసిన ముఖ్యమంత్రి కూడా బీజేపీకి స్నేహహస్తం చాచక తప్పని పరిస్థితే. మజ్లిస్‌తో మైత్రి వదలలేకే! తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికార ఉత్సవంగా జరపకపోవడానికి గల కారణాలను గురించి తలలు బద్దలు కొట్టుకోనక్కర లేదు. అవి చాలా సుస్పష్టం. మజ్లిస్‌తో స్నేహం చెడగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే, ముస్లింలను సంతోషపరుస్తున్నాననుకుంటూ పొద్దున్న లేస్తే నిజాం నవాబును, ఆయన పరిపాలనను వేనోళ్ల స్తుతిస్తూ విమోచన దినం అధికారికంగా ఎట్లా నిర్వహించడం అనేది మరో కారణం. ఒకవైపు కాళోజీని, దాశరథిని కొనియాడుతూ, మరో వైపు నిజాం రాజును స్తుతించడం కేసీఆర్‌కే చెల్లింది. అయినా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఒక మతానికి వ్యతిరేకంగా కాదు, రాజరిక వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిస్తూ కమ్యూనిస్టుపార్టీ చేసిన ప్రకటన మీద సంతకాలు చేసిన ముగ్గురిలో కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రజాకవి మక్దూం మొహియుద్దీన్ ముఖ్యుడు. ఆయన స్వయంగా అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటంలో పాల్గొన్నాడు. నిజాంను వ్యతిరేకిస్తూ రజాకార్లకు వ్యతిరేకంగా, భూస్వాముల గూండాలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అనేక మందిలో షోయేబుల్లా ఖాన్, బందగి వంటి వారు కూడా ఉన్నారు. ఈ చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియకే సెప్టెంబర్ 17 పట్ల విముఖంగా ఉన్నారని అనలేం. అన్నిటిని మించిన అసలు కారణం 2001 కంటే ముందు తెలంగాణ చరిత్రకు సంబంధించి దేనినీ గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేకపోవడమే. 2001లో తాను తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తరువాత 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా జరిగిందే చరిత్రలో నిలిచిపోవాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తున్నది. 1969లో కానీ, అంతకు ముందు కానీ తెలంగాణలో సమరశీలపోరాటాలు జరిగాయని, వాటి పునాదుల మీదనే తమ నేతృత్వంలో జరిగిన మలి దశ టీఆర్ఎస్ ఉద్యమ విజయం సాధ్యం అయిందని ఆయన అంగీకరించరు. చరిత్ర అడగొద్దు, మేం చెప్పింది వినాలి అంటే కుదరదు. ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిపిన సుదీర్ఘ పోరాటాల ఫలితమే 69 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఇండియన్ యూనియన్‌లో విలీనమైందన్న మాట వాస్తవం. సెప్టెంబర్ 17ను దాని చారిత్రిక నేప«థ్యాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు అందరూ మానేస్తే మంచిది. చరిత్రను పాలకులు విస్మరిస్తారేమో కానీ, ప్రజలు మాత్రం మరవరు. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
'కేబినెట్లో టీఆర్ఎస్కు నో ఛాన్స్'
సాక్షి, యాదాద్రి: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం భువనగిరిలో విమోచన దినోత్సవ యాత్రను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నయా నిజాం చేతిలో తెలంగాణ నయవంచనకు గురవుతోందన్నారు. రజాకార్ల వారసులైన మజ్లిస్‌ను ప్రభుత్వం అక్కున చేర్చుకుంటోందన్నారు. టీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదని, కేంద్ర మంత్రివర్గంలో టీఆర్ఎస్ అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈనెల17న నిజామాబాద్‌లో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి అయినా సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహింపజేస్తామన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకుంటే 2019లో తాము అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తామన్నారు. భువనగిరిలో ప్రారంభమైన యాత్ర పరకాలకు చేరుకుంటుందని లక్ష్మణ్ తెలిపారు.