రాయ్‌బరేలీ: గాంధీ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గాన్ని కుటుంబపాలన రాజకీయాల నుంచి విముక్తి చేస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ గాంధీ కుటుంబానికే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నా అభివృద్ధి జాడలు కానరావటం లేదన్నారు. శనివారం రాయ్‌బరేలీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘వారసత్వ రాజకీయాల నుంచి రాయ్‌బరేలీకి విముక్తి కల్పించి, అభివృద్ది బాటన నడిపిస్తామని చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చా.
కాంగ్రెస్, ఆపార్టీ అగ్రనేతలు ఏళ్లుగా ఇక్కడ పరిపాలన సాగించినప్పటికీ కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పలేక పోయారు. ఈ జిల్లాను, ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా మారుస్తాం. యోగి ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ‘గూండారాజ్యం’ ఉండగా ప్రస్తుతం శాంతి నెలకొంది. కాషాయ ఉగ్రవాదమంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలి’అని అమిత్ డిమాండ్ చేశారు. సభలో మీడియా ప్రతినిధులు కూర్చున్న చోట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగటంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment