చరిత్రను రాజకీయం చేయవద్దు | Devulapalli Amar write article on Redemption day in Telangana | Sakshi
Sakshi News home page

చరిత్రను రాజకీయం చేయవద్దు

Published Wed, Sep 13 2017 12:25 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

చరిత్రను రాజకీయం చేయవద్దు - Sakshi

చరిత్రను రాజకీయం చేయవద్దు

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను అధికార ఉత్సవంగా జరపకపోవడానికి గల కారణాలను గురించి తలలు బద్దలు కొట్టుకోనక్కరలేదు. అవి చాలా సుస్పష్టం. మజ్లిస్‌తో స్నేహం చెడగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే, ముస్లింలను సంతోషపరుస్తున్నాననుకుంటూ పొద్దున్న లేస్తే నిజాం నవాబును, ఆయన పరిపాలనను వేనోళ్ల స్తుతిస్తూ విమోచన దినం అధికారికంగా ఎట్లా నిర్వహించడం అనేది మరో కారణం. ఒకవైపు కాళోజీని, దాశ రథిని కొనియాడుతూ, మరో వైపు నిజాం రాజును స్తుతించడం కేసీఆర్‌కే చెల్లింది.

పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విలీనమైన ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు ఏటా విమోచన దినోత్సవం జరుపుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో కలసిన తెలంగాణ ప్రాంతంలో కూడా అదే రీతిలో సెప్టెంబర్‌ 17వ తేదీని అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలన్న డిమాండ్‌ ఉంది. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా దీని గురించి వింటూనే ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు ఏనాడూ ఆ పని చెయ్యడానికి అంగీకరించలేదు. ఎక్కువకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ గాంధీభవన్‌లోనో మరెక్కడో పార్టీ పరంగా మొక్కుబడిగా ఉత్సవాలు జరిపిందే తప్ప ఆరోజు ప్రాముఖ్యాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఆ రెండు పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఉత్సవాలు అధికారికంగా జరిగాయి.

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నాయకత్వాన్నీ, ఆయన ప్రతిష్టనూ తన సొంతం చేసుకోవడానికి తపిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని ఏటా కోరుతోంది. సర్దార్‌ పటేల్‌ నామస్మరణ తప్ప, నెహ్రూ, గాంధీ వంటి నాయకుల పేర్లను ఉచ్చరించడమే పాపం అన్నట్టుగా బీజేపీ వ్యవహరించడం ఈ మూడున్నర ఏళ్లుగా చూస్తున్నాం. మహాత్ముడిని ‘చతుర్‌ బనియా’(తెలివిగల వ్యాపారి) అని హేళనగా మాట్లాడే నాయకత్వం కలిగిన పార్టీ బీజేపీ. ఉక్కు మనిషిగా ఖ్యాతి చెందిన సర్దార్‌ పటేల్‌ జ్ఞాపకాన్ని మహాత్ముడి జన్మస్థానం గుజరాత్‌లో చిరస్మరణీయం చెయ్యాలన్న ఆలోచన బీజేపీది.

పాత ప్రభుత్వాల బాటనే టీఆర్‌ఎస్‌
సెప్టెంబర్‌ 17 విషయానికి వద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అసలు ఈ విషయంలో ఒక అవగాహన కానీ, అధ్యయనం కానీ లేవు. ఏ రాజకీయ పార్టీకైనా చరిత్ర పట్ల అవగాహన అవసరం. ఆ చరిత్ర పట్ల తనకంటూ ఒక రాజకీయ వైఖరి కూడా ఉండటమూ తప్పనిసరి. కానీ తెలుగుదేశం పార్టీకీ, దాని అధినాయకత్వానికీ ముఖ్యంగా ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చరిత్ర అంటే అస్సలు గిట్టదు. చరిత్రను అధ్యయనం చెయ్యడం శుద్ధ దండగ అని ఆయన అభిప్రాయం. కాబట్టి వారి కాలంలో కూడా అధికారికంగా ఉత్సవాలు జరగలేదు. ఇప్పుడిక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచించడం కూడా అనవసరం. ఆ పార్టీ ఇక్కడి నుంచి జెండా ఎత్తెయ్యడం స్వయంకృతమే.

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సెప్టెంబర్‌ 17ను అధికారిక ఉత్సవంగా నిర్వహించడానికిఅంగీకరించడం లేదు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన చివరి దశ ఉద్యమానికి నాయకత్వం వహించిన 13 సంవత్సరాల కాలంలో ఉద్యమ సంస్థగా టీఆర్‌ఎస్, దాని అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలుమార్లు సెప్టెంబర్‌ 17న రెండు పొరుగు రాష్ట్రాల మాదిరిగానే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని అప్పటి తెలుగుదేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆ రోజును అధికారికంగా జరుపుతామని పలుమార్లు ప్రకటించారు.

ఒపీనియన్స్‌ మార్చుకోని వాడు పొలిటీషియన్‌ కాడు అంటాడు గిరీశం, ‘కన్యాశుల్కం’లో. చాలా విషయాల్లో మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు గిరీశమే ఆదర్శమనిపిస్తుంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ ఇచ్చిన హామీ విషయంలో కానీ, ఇంటికో ఉద్యోగం, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య కానీ చివరికి సెప్టెంబర్‌ 17 న ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం విషయంలో కూడా ఆయనది గిరీశం బాటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మూడేళ్లలో మళ్లీ ఈ డిమాండ్‌ ముందుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ డిమాండ్‌ విషయంలో అనుసరించిన వైఖరే ఇప్పుడు చంద్రశేఖరరావు ప్రభుత్వ వైఖరి కూడా.

ఎందుకీ చర్చ?
ఇంతకూ సెప్టెంబర్‌ 17 ప్రాముఖ్యం  ఏమిటి, ఇంత చర్చ ఎందుకు? 1948 సంవత్సరం అదే రోజున భారత ప్రభుత్వ సైన్యాలు జనరల్‌ చౌదురి నాయకత్వంలో నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ పటేల్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ సంస్థానాన్ని లోబరుచుకున్నాయి. భారత సైన్యంతో యుద్ధం చేసే శక్తి లేని నిజాం రాజు ఉస్మాన్‌ అలీ ఖాన్‌ సర్దార్‌ పటేల్‌కు లొంగిపోయి రాజప్రముఖ్‌గా గౌరవం, సుఖసౌఖ్యాలూ అనుభవించాడు. అప్పుడు జరిగింది విలీనమా, విమోచనా లేక విద్రోహమా అన్న చర్చ ఈ రోజుకూ జరుగుతూనే ఉంది. సర్దార్‌ పటేల్‌ నాయకత్వంలో ఆనాడు జరిగింది విమోచనే అయితే నిజాం రాజుకు అన్ని మర్యాదలెందుకు జరిగాయి? ఆనాటి హైదరాబాద్‌ సంస్థాన ప్రజలను నానా హింసలకు గురిచేసి వేలాది మంది వీరుల మరణానికి కారకులయిన నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్లలో ఒక్కడికైనా శిక్ష పడిందా?

పరమ కిరాతకుడైన  రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ దేశం విడిచి సురక్షితంగా పాకిస్తాన్‌కో, మరెక్కడికో ఎట్లా పారిపోగలిగాడు? ఆనాడు జరిగింది విమోచన కాదు అని వాదిస్తున్న వారి నుంచి వస్తున్న ప్రశ్నలివి. అందుకే ఇది విలీనం మాత్రమే అంటున్న వాళ్లూ ఉన్నారు. అసలు ఆ రెండూ కాదు, ఆనాడు జరిగింది నిజాం పాలనను ఎదిరించి ధైర్యంగా సాయుధ పోరాటం చేసిన తెలంగాణ రైతాంగం జరిపిన అలుపెరుగని పోరాటానికి, అసువులు బాసిన అమర వీరులకు జరిగిన విద్రోహం అన్న వాదన కూడా బలంగా ఉన్నది. ఈ చర్చ అట్లా ఉంచితే సెప్టెంబర్‌ 17ను ప్రభుత్వం ఘనంగా అధికార ఉత్సవంగా నిర్వహించాలని బీజేపీ తదితర ప్రతిపక్షాలూ, ససేమిరా అని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడెందుకు పట్టుబట్టి కూర్చున్నాయన్న విషయం మాట్లాడుకుందాం.

బీజేపీ పట్టు
సెప్టెంబర్‌ 17 తేదీని విమోచన దినంగా ప్రభుత్వమే నిర్వహించాలని బీజేపీ చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్న మాట నిజం. ప్రజలను కదిలించే ప్రాంతీయ అంశాలను తీసుకుని 2019 ఎన్నికల్లో దక్షిణాదిన కూడా పాగా వెయ్యాలన్న అధిష్టానం ఆలోచనలో భాగంగా ఈసారి తెలంగాణలో విమోచన దినం డిమాండ్‌ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకుపోయేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వారం రోజుల యాత్ర నిర్వహించారు. అదే క్రమంలో తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలను కూడా బీజేపీ నాయకులు పోయిన చోటల్లా ఎండగట్టారు. పాపం స్థానిక నాయకత్వం ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీ నుంచి ఒక కేంద్రమంత్రి వచ్చి ‘కేసీఆర్‌ ప్రభుత్వం భేష్‌!’అని కితాబిస్తాడు. మహారాష్ట్ర గవర్నర్‌గారు వచ్చి తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తున్నదని పొగుడుతారు.

ఇంకో వైపు నుంచి బిహార్‌ ఉప ముఖ్యమంత్రి, సీనియర్‌ బీజేపీ నాయకుడు హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా ఇక్కడి సుపరిపాలన గురించి నాలుగు మంచి మాటలు చెబుతారు. ఇదేమిటి అని అడిగితే ప్రభుత్వాల మధ్య సంబంధాలు వేరు, పార్టీల ఎజెండాలు వేరు అని ఒక బలహీన వాదన వినిపిస్తారు. దక్షిణాదిన పట్టు సాధిస్తాం, తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం అన్న ఆలోచనకు ప్రస్తుతం మోదీ, అమిత్‌ షా ద్వయం స్వస్తి చెప్పిందనడానికి నిదర్శనం– ఉన్నఒకే ఒక్క కేంద్రమంత్రి, తెలంగాణ వాది, వెనుకబడిన తరగతుల సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయను క్యాబినెట్‌ నుంచి తొలగించడం. 2019లో కలసి నడవడానికి కేసీఆర్‌లో ఒక మంచి మిత్రుడిని వారు వెతుకుతున్నట్టు వార్తలొస్తున్నాయి. సర్వేల పేరుతో మళ్లీ అధికారం తమదే అని బయటికి చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగా తెలిసిన ముఖ్యమంత్రి కూడా బీజేపీకి స్నేహహస్తం చాచక తప్పని పరిస్థితే.

మజ్లిస్‌తో మైత్రి వదలలేకే!
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను అధికార ఉత్సవంగా జరపకపోవడానికి గల కారణాలను గురించి తలలు బద్దలు కొట్టుకోనక్కర లేదు. అవి చాలా సుస్పష్టం. మజ్లిస్‌తో స్నేహం చెడగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే, ముస్లింలను సంతోషపరుస్తున్నాననుకుంటూ పొద్దున్న లేస్తే నిజాం నవాబును, ఆయన పరిపాలనను వేనోళ్ల స్తుతిస్తూ విమోచన దినం అధికారికంగా ఎట్లా నిర్వహించడం అనేది మరో కారణం. ఒకవైపు కాళోజీని, దాశరథిని కొనియాడుతూ, మరో వైపు నిజాం రాజును స్తుతించడం కేసీఆర్‌కే చెల్లింది. అయినా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఒక మతానికి వ్యతిరేకంగా కాదు, రాజరిక వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం.

ఆనాడు సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిస్తూ కమ్యూనిస్టుపార్టీ చేసిన ప్రకటన మీద సంతకాలు చేసిన ముగ్గురిలో కమ్యూనిస్ట్‌ నాయకుడు, ప్రజాకవి మక్దూం మొహియుద్దీన్‌ ముఖ్యుడు. ఆయన స్వయంగా అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటంలో పాల్గొన్నాడు. నిజాంను వ్యతిరేకిస్తూ రజాకార్లకు వ్యతిరేకంగా, భూస్వాముల గూండాలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అనేక మందిలో షోయేబుల్లా ఖాన్, బందగి వంటి వారు కూడా ఉన్నారు. ఈ చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియకే సెప్టెంబర్‌ 17 పట్ల విముఖంగా ఉన్నారని అనలేం. అన్నిటిని మించిన అసలు కారణం 2001 కంటే ముందు తెలంగాణ చరిత్రకు సంబంధించి దేనినీ గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేకపోవడమే. 2001లో తాను తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తరువాత 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా జరిగిందే చరిత్రలో నిలిచిపోవాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తున్నది.

1969లో కానీ, అంతకు ముందు కానీ తెలంగాణలో సమరశీలపోరాటాలు జరిగాయని, వాటి పునాదుల మీదనే తమ నేతృత్వంలో జరిగిన మలి దశ టీఆర్‌ఎస్‌ ఉద్యమ విజయం సాధ్యం అయిందని ఆయన అంగీకరించరు. చరిత్ర అడగొద్దు, మేం చెప్పింది వినాలి అంటే కుదరదు. ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిపిన సుదీర్ఘ పోరాటాల ఫలితమే 69 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైందన్న మాట వాస్తవం. సెప్టెంబర్‌ 17ను దాని చారిత్రిక నేప«థ్యాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు అందరూ మానేస్తే మంచిది. చరిత్రను పాలకులు విస్మరిస్తారేమో కానీ, ప్రజలు మాత్రం మరవరు.



- దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement