ఆ ఇంట్లో హత్య ఇవాళ జరగలేదు....
‘‘హత్య ఇవాళ జరగలేదు. రెండు రోజుల క్రితమే జరిగింది’’... తడుముకోకుండా అన్నాడు ఇన్‌స్పెక్టర్ విహారి. ‘‘అలా ఎలా చెప్పగలరు సర్?’’... అయోమయంగా అడిగాడు కానిస్టేబుల్ గోవింద్.‘‘ఓసారి అటు చూడు’’ అన్నాడు విహారి.అటువైపు చూశాడు గోవింద్. మెయిన్ డోరు ముందు రెండు పాల ప్యాకెట్లు పడివున్నాయి. ‘‘ఒక ప్యాకెట్ ఇవాళ్టిది. రెండో ప్యాకెట్ నిన్నటిది. అంటే మర్డర్ మొన్న సాయంత్రమో, రాత్రో జరిగివుంటుంది.’’తన బాస్ షార్ప్‌నెస్‌కి ముచ్చట పడిపో యాడు గోవింద్.
‘‘మీరు గ్రేట్ సార్’’ అన్నాడు హుషారుగా. గంట క్రితం న్యూయార్క్ నుంచి మణికొండ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ వచ్చింది. ఎవరో అమ్మాయి చేసింది. తన తండ్రి సదాశివం మణికొండ శివార్లలో ఉన్న గెస్ట్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడని, ఎంత చేసినా ఫోన్ తీయడం లేదని, దయచేసి ఓసారి వెళ్లి చూడమని అర్థించిందామె. తమకి ఇండియాలో బంధువులెవరూ లేనందున నేరుగా పోలీసుల సాయమే కోరుతున్నానంటూ చాలా దిగులుగా మాట్లాడింది.
దాంతో వెంటనే గోవింద్‌ని తీసుకుని ఆమె చెప్పిన అడ్రస్‌కి వచ్చాడు విహారి. విశాలమైన స్థలంలో బోలెడన్ని పూలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. వాటి మధ్య అందమైన కుటీరంలా ఉంది గెస్ట్ హౌస్. చిన్నగానే ఉన్నా ఎంతో ప్రత్యేకంగా ఉంది. రిచ్‌గానూ ఉంది. వెళ్లి బెల్ కొట్టారు. ఎవ్వరూ తీయలేదు. తలుపు కొట్టారు. తీయలేదు. కాస్త గట్టిగా కొట్టబోతే తలుపు తెరచుకుంది.
‘‘తెరిచే ఉందే’’ అంటూ లోపల అడుగుపెట్టాడు విహారి. కానిస్టేబుల్ అనుసరించాడు. ఇద్దరూ ఇల్లంతా కలియ దిరిగారు. బెడ్‌రూమ్‌కి అటాచ్డ్‌గా ఉన్న బాత్రూమ్‌లో నేలమీద పడివుంది సదాశివం మృతదేహం. పాడవడం మొదలయ్యిందేమో దుర్వాసన వేస్తోంది. ఖర్చీఫులు తీసి ముక్కుకి కట్టుకుని శవాన్ని పరిశీలించసాగారు ఇద్దరూ. ఎవరో తలమీద కొట్టడంతో తల చిట్లిపోయింది. రక్తం బయటకు వచ్చి, నీటితో కలిసి పాకిపోయింది. శరీరం మీద మరెక్కడా ఏ గాయమూ లేదు. అంటే ఎవరో వెనుక నుంచి వచ్చి కొట్టారన్నమాట. వయసు మీద పడినవాడు కావడం, దెబ్బ గట్టిగా తగలడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు.
ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఇల్లంతా పరిశీలించారిద్దరూ. ఏమీ కనిపించలేదు. ఇంట్లో ఎక్కడ ఉండాల్సింది అక్కడ లేదు. వస్తువులు, న్యూస్ పేపర్లు అన్నీ గత్తర గత్తరగా పడివున్నాయి. వాటన్నిటినీ పరిశీలిస్తూ ఇంటి బయటకు వచ్చారు. అప్పుడే ద్వారానికి ఓ పక్కగా పడివున్న పాల ప్యాకెట్లు విహారి దృష్టిలో పడ్డాయి. ‘‘ఇప్పుడేం చేయాలి సర్’’ అడిగాడు గోవింద్.
ఓ క్షణం ఆలోచించాడు విహారి. ‘‘వెంటనే ఆయన కూతురికి ఫోన్ చేసి విషయం చెప్పు. అలాగే ఈ ఇంట్లో పని చేసేవాళ్లు, ఈ వీధిలో పాల ప్యాకెట్లు వేసేవాడు, పేపర్ బాయ్... అందరూ ఒకట్రెండు గంటల్లో ఇక్కడ ఉండాలి’’... ఆదేశించాడు. సరేనంటూ కదిలాడు గోవింద్.
‘‘చెప్పండి... ఎవరు చేశారీ పని?’’
విహారి స్వరం గర్జించినట్టు ఉండటంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వణికిపోసాగారు. ‘‘నాకు తెలీదు సర్’’ అన్నాడొకడు. ‘‘నే ను చేయలేదు సర్’’ అన్నాడింకొకడు. ‘‘నేనసలు ఇటు పక్కకే రాలేదు సర్’’ అన్నాడు మరొకడు. ‘‘ఎవరూ చేయకపోతే ఇదెలా జరిగింది? ఆయన ఇంట్లో పనిచేసే ఒకే ఒక్క పనిమనిషీ ఊళ్లో లేదు. తను మూడు రోజులుగా వేరే ఊళ్లోనే ఉందని మా ఎంక్వయిరీలో తేలింది.
ఇక ఈ ఇంటికి వచ్చే అవకాశం మీ ముగ్గురికే ఉంది. నిజం చెప్పండి.’’ఎవ్వరూ నోరు మెదపలేదు. బిత్తరపోయి చూస్తున్నారు. క్షణం ఆగి విహారి అన్నాడు... ‘‘గోవింద్... ఆ పేపర్ బాయ్‌ని అరెస్ట్ చెయ్యి.’’హడలిపోయాడు వాడు. ‘‘నన్నా? అరెస్టా? నేనేం చేశాను సార్? నాకేం తెలీదు’’ అని అరవసాగాడు.
‘‘ఈ రెండు రోజులూ నువ్వు ఊళ్లోనే ఉన్నావా?’’ అడిగాడు విహారి. ‘‘ఉన్నాను సర్. రోజూ పేపర్ వేస్తున్నాను. కావాలంటే ఎవరినైనా అడగండి. కానీ ఈ హత్యకీ నాకూ సంబంధం లేదు సర్.’’‘‘నోర్ముయ్. ఇది నీ పనేనని నాకు తెలుసు. నడు స్టేషన్‌కి’’ అంటూ ఒక్క తోపు తోశాడు ఇన్‌స్పెక్టర్. వాడే ఈ పని చేశాడని బాస్ ఎలా కనిపెట్టాడో గోవింద్‌కి అంతు పట్టలేదు. పోనీ మీకు తెలిసిందా... విహారి ఎలా కనిపెట్టాడో???
జవాబు: ఇంటినిండా పేపర్లు పడివున్నాయి. అంటే పెద్దాయన పేపర్ తీసుకుంటాడు. అలాంటప్పుడు గుమ్మం దగ్గర పాల ప్యాకెట్లతో పాటు న్యూస్ పేపర్లు కూడా ఉండాలి కదా! లేవు అంటే వేయలేదు. అందరికీ పేపర్ వేసినవాడు సదాశివానికి వేయలేదు అంటే ఆయన చనిపోయాడన్న విషయం పేపర్ బాయ్‌కి తెలుసన్నమాట.