అతడిది తిరుగులేని న్యాయ స్థానం!
ఇంటర్వ్యూ చేయడం ఓ కళ. ఆ కళలో ఆరితేరినవారు రజత్‌శర్మ. ‘ఆప్‌కీ అదాలత్’ పేరుతో ఇండియా టీవీలో రజత్‌శర్మ నిర్వహించే ఇంటర్వ్యూలు సంచలనాలు సృష్టించాయి. ఇరవయ్యేళ్లుగా ఈ షోని నడిపిస్తున్నారు రజత్. దాదాపు ఎనిమిది వందల మంది గొప్ప గొప్ప పర్సనాలిటీస్‌ని తన న్యాయస్థానంలో నిలబెట్టారు.
రజత్ వ్యక్తిత్వం గురించి చెప్పమంటే నిజాయతీపరుడు అంటారు ఎవరైనా. ఆయన పనితనం గురించి చెప్పమంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటారు. నిజమే, ఆ పట్టు వదలని గుణమే పేదరికంలో పుట్టి పెరిగిన రజత్‌ని ఈ స్థాయికి చేర్చింది. చిన్నప్పుడు టీవీ చూడ్డానికి పక్కింటికి వెళ్తే, వాళ్లు తలుపు వేసేశారట. బాధపడి ఏడుస్తున్న రజత్‌తో ఆయన తండ్రి... ‘‘ఈరోజు వాళ్లు నిన్ను టీవీ చూడనివ్వలేదని ఏడవొద్దు. ఏదో ఒకరోజు వాళ్లు నిన్ను టీవీలో చూసేటంత గొప్పవాడిగా ఎదుగు’’ అన్నారట. ఆ మాటే తననింతవాణ్ని చేసిందంటారు రజత్!
హుందాయైన స్ఫురద్రూపం, తొణకని స్వరం, సూటిగా మనసులోకి దూసుకెళ్లి లోపలి రహస్యాల్ని బయటకు లాగేంత తీక్షణంగా ఉండే చూపులతో ఉంటారు రజత్. ఆయన ఎప్పుడు ఏ ప్రశ్న అడుగుతారోనని ఇంటర్వ్యూ ఇచ్చే సెలెబ్రిటీ గుండెలు అదురుతూ ఉంటాయి. ఏ ప్రశ్న అడగడానికీ వెరవరు. ఎందుకంటే... ప్రజల మనసుల్లో సందేహాలనే ప్రశ్నలుగా చేసి అడుగుతారా యన.
తనకు కావలసిన సమాధానం వచ్చేవరకూ తృప్తి పడరు. చెప్పకుండా అవతలి వ్యక్తిని తప్పించుకోనివ్వరు. అందుకే ఆయన న్యాయస్థానంలో నిలబడిన ప్రతివ్యక్తీ తన అంతరంగాన్ని పూర్తిగా ఆవిష్కరించి తీరతాడు. రహస్యాలను సైతం బట్టబయలు చేస్తాడు. అందుకే మరి... రజత్‌శర్మలా ఎవరూ ఇంటర్వ్యూ చేయలేరని భారతీయ మీడియాలో చెప్పుకుంటారు. అది నిజమేనని ‘ఆప్‌కీ అదాలత్’ చూసినవాళ్లంతా ఒప్పుకుని తీరతారు!