సత్వం: దివ్య శిల్పి | Divine sculptor | Sakshi
Sakshi News home page

సత్వం: దివ్య శిల్పి

Published Sun, Mar 2 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

సత్వం: దివ్య శిల్పి

సత్వం: దివ్య శిల్పి

మనిషి సాధించిన ఒక మహాద్భుతంగా ‘డేవిడ్’ శిల్పం గురించి వ్యాఖ్యానిస్తారు కళాప్రేమికులు. ఆ శిల్పం చెక్కడం పూర్తయ్యాక మైకెలేంజిలోని ఒక పోప్ అడిగాడట, అంత గొప్పగా ఎలా చెక్కగలిగావూ అని. అంత విశేషం ఏమీలేదు, ఆ రాయిలో డేవిడ్ కానిదంతా తొలగించానూ, అని జవాబిచ్చాడట మైకెలేంజిలో.
 
 ఇది నిజంగా ఆ మహానుభావుడి నోటినుంచి వచ్చినట్టుగా చెప్పే ఆధారాలు లేకపోయినా, ఒక శిల్పి చూపును అర్థం చేసుకోవడానికి ఈ ఉదంతం బాగా ఉపకరిస్తుంది. స్వయంగా మైకెలేంజిలోనే, ‘ప్రతీ రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది, దాన్ని వెలికితీయడం శిల్పి పని’ అన్నాడు.
 
 అందం కూడా ఒక సుగుణం, ఒక దివ్యత్వం అన్న భావజాలం వ్యాపించివున్నప్పుడు జన్మించాడు మైకెలేంజిలో.  ఇటలీ పునరుజ్జీవన కాలం అది. కళాకారుల సృజన ఆకాశమే హద్దుగా రెక్కలు విప్పుకుంటున్న గొప్పయుగం. గోలియత్‌తో పోరాటానికి దిగబోయేముందరి భంగిమలో ఉన్న డేవిడ్ శిల్పంలోని డీటెయిల్స్ అబ్బురపరుస్తాయి. డేవిడ్ అందగాడు, శక్తిమంతుడు, దృఢకాయుడు, ఆజానుబాహువు. ఒక మగశరీరంలో ఉండగల మేలిమి అందాన్ని అందులో రాబట్టాడు మైకెలేంజిలో. ఆ పదిహేడు అడుగుల శిల్పం చెక్కడం కోసం మూడేళ్లు శ్రమించాడు.
 
  1504లో పూర్తిచేశాడు.
 1475-1564 మధ్యకాలంలో జీవించిన మైకెలేంజిలో పసితనంలోనే తల్లిని కోల్పోయాడు. అంత చదువుకున్నవాడు కాదు. అవివాహితుడు. జీవితాంతం స్త్రీ ప్రేమ కోసం తపించాడు. అక్కున చేర్చుకునే పురుషుడి ప్రేమ కోసం కూడా దుఃఖించాడు. తన బలహీనమైన చేతులగురించీ, తన రూపం గురించీ ఆయనకు ఎప్పుడూ చింతగానే ఉండేది. ‘బూట్ల కంటే కాలు గొప్పదనీ, కప్పివున్న వస్త్రాలకంటే చర్మం గొప్పదనీ గుర్తించని మనుషులంటే’ ఆయనకు నచ్చేదికాదు. అందం పట్ల అంశ శ్రద్ధకు ఇదీ ఒక కారణమేమో! శరీర నిర్మాణం అర్థం చేసుకోవడానికి ఆయన శవాల్ని పరిశీలించేవాడు.


 శిల్పిగానే కాదు, చిత్రకారుడిగా, ఆర్కిటెక్టుగా, కవిగా మైకెలేంజిలో బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించాడు. మతాన్నీ, పురాణాల్నీ, ప్రకృతినీ కలిపి థీమ్ ఎంచుకునేవాడు. సుమారు ఏడడుగుల శిల్పం బ్యాకజ్, మరణించిన కుమారుడిని ఒళ్లోకి తీసుకున్న మేరీమాత శిల్పం (పియెటా) ఆయనకు గొప్ప పేరు తెచ్చాయి. ఇవన్నీ ఒకెత్తు.
 
  వాటికన్ నగరంలోని సిస్టైన్ చాపెల్ సీలింగు మీద వేసిన చిత్రాలు మరో ఎత్తు. ఐదువేల చదరపు అడుగుల మేరా నొప్పితో నడుం వంగిపోతుండగా ‘ఆడమ్ అండ్ ఈవ్’, ‘గార్డెన్ ఆఫ్ ఈడెన్’, ‘గ్రేట్ ఫ్లడ్’ వంటి బైబిల్‌లోని మూడు వందల చిత్రాలు గీశాడు. గొప్పగా గీయడం ఒకటైతే సీలింగుకు గీయడం మరెంత గొప్పది! ‘ద లాస్ట్ జడ్జిమెంట్’ చిత్రం ఆయన మాస్టర్‌పీస్. ‘‘సిస్టైన్ చాపెల్ చిత్రాలు చూడకుండా ఒక మనిషి ఎంత సాధించగలిగే అవకాశం ఉందో ఒక అంచనాకు రావడం కష్టం’’ అన్నాడు జర్మన్ కవి గొథె.
 
 మార్చి 6న సుప్రసిద్ధ శిల్పి, చిత్రకారుడు
 మైకెలేంజిలో జయంతి

 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement