స‌ర్వం శ‌క్తిమ‌యం | Durga,mma Navratri celebrations | Sakshi
Sakshi News home page

స‌ర్వం శ‌క్తిమ‌యం

Published Sun, Oct 14 2018 12:22 AM | Last Updated on Sat, Oct 20 2018 4:29 PM

Durga,mma Navratri celebrations - Sakshi

యా దేవీ సర్వభూతేషు
శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః...


యా దేవీ సర్వభూతేషు
మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః...

చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారనే సంగతి అందరికీ తెలిసినదే. లోక కంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి వధించిన సందర్భంగా దసరా పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని కూడా తెలిసినదే. విజయదశమికి సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. రాముడు రావణుడిని వధించినది ఆశ్వయుజ శుద్ధ దశమి రోజేనని కూడా పురాణగాథలు ఉన్నాయి. అందుకే విజయదశమి రోజున రావణాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. పన్నెండేళ్ల అరణ్యవాసం తర్వాత విరాటరాజు కొలువులో పాండవులు ఏడాది అజ్ఞాతవాసం గడిపారు. అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలోనే ద్రౌపదిని వేధించిన కీచకుడిని భీముడు హతమారుస్తాడు. కీచకుడి మరణవార్త విన్న దుర్యోధనుడు పాండవులు విరాటరాజు వద్ద తలదాచుకుని ఉంటారని తలచి, విరాట రాజ్యంపై దండెత్తాడు. అప్పటికి అజ్ఞాతవాసం గడువు తీరిపోతుంది. కౌరవులు ఉత్తర గోగ్రహణానికి పాల్పడినప్పుడు ఉత్తరకుమారుడి సారథిగా బృహన్నల వేషంలో వెళ్లిన అర్జునుడు, కౌరవసేనను చూసి భీతిల్లిన ఉత్తరకుమారుడికి ధైర్యం చెప్పి, జమ్మిచెట్టుపై దాచి ఉంచి ఆయుధాలను బయటకు తీస్తాడు. జమ్మిచెట్టు మీద నుంచి విజయుడనే పేరు గల అర్జునుడు ఆయుధాలను తీసిన రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి కావడంతో, ఈ రోజుకు విజయ దశమిగా పేరు వచ్చిందనే గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. విజయదశమి రోజున భారతదేశంలోనే కాకుండా కొన్ని ఇతర దేశాల్లోనూ ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. 

దసరా రోజున దుర్గాదేవిని ప్రధానంగా ఆరాధిస్తారు. దుర్గా ఆలయాలతో పాటు అన్ని శక్తి ఆలయాల్లోనూ శక్తి స్వరూపాలుగా తలచే గ్రామదేవతల ఆలయాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యే ఈ వేడుకలు దశమి నాటితో పూర్తవుతాయి. సనాతన సంప్రదాయంలో శాక్తేయం ప్రత్యేక మతంగా ఉండేది. కొన్నిచోట్ల జంతుబలుల వంటి పద్ధతులపై ఆంక్షలు ఉన్నా, దసరా వేడుకలు చాలావరకు శాక్తేయ పద్ధతుల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రులలో దుర్గాదేవిని నవరూపాలలో ఆరాధిస్తారు. దుర్గాదేవికి గల ఈ తొమ్మిది రూపాలనే నవదుర్గలని అంటారు. ఇదేకాకుండా, అమ్మవారిని దశమహావిద్య రూపాల్లోనూ ఆరాధిస్తారు. 

నవదుర్గలు
నవదుర్గల పేర్లు వరుసగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిదిరోజుల పాటు దుర్గా దేవిని ఈ రూపాలలో పూజిస్తారు.

ప్రథమం శైలపుత్రీతి
ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్రఘంటేతి
కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి
షష్ఠం కాత్యాయినీతి చ
సప్తమం కాలరాత్రీతి
మహాగౌరీతిచాష్టమం
నవమం సిద్ధిదాప్రోక్తా
నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా

దుర్గాదేవికి గల ఈ తొమ్మిది నామాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పినట్లు ప్రతీతి. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లోని కొందరు నవదుర్గలను కులదైవంగా ఆరాధిస్తారు. చండీ సప్తశతిలో అమ్మవారికి మరో తొమ్మిది పేర్లు ప్రస్తావించి ఉన్నాయి. అవి: మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరి. అయితే, ఈ నామాలను నవదుర్గలుగా వ్యవహరించలేదు. నవదుర్గల ప్రాచీన ఆలయం మొదట గోవాలోని రేడి ప్రాంతంలో ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన పోర్చుగీసువారు ఆలయ వ్యవహారాల్లో దాష్టీకం చలాయించడంతో పదిహేడో శతాబ్దిలో ఆ ఆలయంలోని దేవీ దేవతా మూర్తులన్నింటినీ మహారాష్ట్రలోని వెంగుర్లకు తరలించి, శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. 

శాక్తేయం చరిత్ర
వేదాలలో ఎక్కడా అమ్మవారి ప్రస్తావన ప్రత్యేకంగా లేదు. అయితే, సింధూలోయ నాగరికత కాలంలోనే ఆదిశక్తి ఆరాధన వాడుకలో ఉన్నట్లు పురావస్తు ఆధారాలు ఉన్నాయి. సింధూలోయ నాగరికతకు చెందిన ప్రజలు శివుడిని పశుపతిగా, లింగమూర్తిగా ఆరాధించేవారు. ఆదిశక్తిని జగజ్జననిగా, లోకమాతగా ఆరాధించేవారు. ఉపనిషత్తులలో ‘ఉమ’ పేరిట అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. మార్కండేయ పురాణంలో ఆదిశక్తిని ‘మహామాయ’గా ప్రస్తావించడం కనిపిస్తుంది. లలితా సహస్రనామం, చండీ సప్తశతి వంటి అమ్మవారి స్తోత్రాలు దాదాపు మహాభారత కాలం నాటివని చరిత్రకారుల అంచనా. లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలోనిది. క్రీస్తుశకం మూడో శతాబ్దం నాటికి భారత ఉపఖండంలో శాక్తేయ మతం బాగా వ్యాప్తిలో ఉండేది. త్రిపురా ఉపనిషత్తును శాక్తేయ సంప్రదాయంలోని తాంత్రిక విధి విధానాలకు మూలంగా భావిస్తారు. పదిహేడో శతాబ్దికి చెందిన పండితుడు భాస్కరరాయలు త్రిపురా ఉపనిషత్తుకు భాష్యాన్ని రాశాడు. దేవీభాగవతం, కాళికా పురాణం వంటి ఉపపురాణాల్లో అమ్మవారి గాథలు విపులంగా ఉంటాయి. దేవీభాగవతంలోని సప్తమ స్కందాన్ని ‘దేవీగీత’గా పరిగణిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తానేనని, సరస్వతి లక్ష్మి పార్వతులు తానేనని, సూర్యచంద్రులు, నక్షత్రాలు తానేనని... సమస్త చరాచర సృష్టి తానేనని అమ్మవారు స్వయంగా వెల్లడించినట్లుగా దేవీభాగవతం చెబుతోంది. దేవీ తత్వాన్ని శ్లాఘిస్తూ, ఆదిపరాశక్తిని స్తుతిస్తూ అద్వైత మత వ్యవస్థాపకుడు ఆదిశంకరాచార్యులు ‘సౌందర్య లహరి’ని రచించారు. ‘సౌందర్యలహరి’ని శ్రీవిద్యా రహస్యాలను బోధించే మంత్రంగా, తంత్రంగా, దేవీ సౌందర్యాన్ని కీర్తించే స్తోత్రంగా, అద్భుత ఛందోవిన్యాసంతో రచించిన కావ్యంగా పరిగణిస్తారు.

క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటికి కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో ఆదిశక్తిని ప్రధాన దైవంగా లలితా త్రిపురసుందరి రూపంలో ఆరాధించే ‘శ్రీకుల’ సంప్రదాయం ఉంది. శాక్తేయంలో ఇదొక ప్రధాన సంప్రదాయం. ఈ సంప్రదాయం పాటించేవారు శ్రీవిద్య ఆరాధన సాగిస్తుంటారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికి శాక్తేయం దక్షిణాదికి కూడా విస్తరించింది. దక్షిణాదిలో కూడా ఎక్కువగా శ్రీకుల సంప్రదాయమే పాటిస్తారు. శాక్తేయంలో మరో ప్రధాన సంప్రదాయమైన ‘కాళీకుల’ సంప్రదాయం నేపాల్‌తో పాటు ఉత్తర భారత, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో వాడుకలో ఉంది. కాళీకుల సంప్రదాయానికి చెందిన వారు ఎక్కువగా కాళి, చండి, దుర్గ రూపాల్లో ఆదిశక్తిని ఆరాధిస్తారు. ఆదిశక్తి రూపాలైన దశమహావిద్యల ఆరాధన, సాధన కొనసాగిస్తుంటారు. దసరా నవరాత్రుల వంటి ప్రత్యేకమైన పర్వదినాలలో అమ్మవారికి తాంత్రిక పద్ధతుల్లో కోళ్లు, మేకలు, దున్నపోతులు వంటి జంతువులను బలి ఇస్తారు. నేపాల్, అస్సాం, పశ్చిమబెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాల్లో నవరాత్రి వేడుకల్లో జంతుబలులు జరుగుతాయి. 

దశ మహావిద్యల ప్రశస్తి
ఆదిశక్తికి గల పదిరూపాలను దశ మహావిద్యలుగా భావిస్తారు. శాక్తేయ సంప్రదాయం పాటించేవారు ఈ విద్యలను సాధన చేస్తారు. గురుముఖత మంత్రోపదేశం పొంది, నియమబద్ధంగా వీటిని సాధన చేయడం వల్ల ఇహపరాలలో సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు. దశ మహావిద్యలలో మొదటిది కాళి. ఏళ్ల తరబడి యోగసాధనలో సాధించలేని ఫలితాలను కాళీ సాధనతో శీఘ్రంగానే సాధించవచ్చని ప్రతీతి. కవి కాళిదాసు కాళీ సాధనతోనే గొప్ప విద్యావంతుడయ్యాడంటారు. రెండో విద్య తార. తారా ఉపాసకులలో వశిష్ట మహర్షి ప్రసిద్ధుడు. మూడవది ఛిన్నమస్త. హిరణ్యకశిపుడు వంటివారు ఛిన్నమస్త సాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. నాలుగవది షోడశి. షోడశి ఆరాధన జ్ఞానసంపద, ఐశ్వర్య సంపద కలిగిస్తుందని ప్రతీతి. ఐదవది భువనేశ్వరి. భువనేశ్వరీ సాధన మానసిక స్థైర్యాన్ని, శాంతిని, ఐహిక ఆముష్మిక ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఆరవది త్రిపుర భైరవి. ఈ విద్య సాధన ద్వారా ఇహపర సౌఖ్యాలను పొందవచ్చని అంటారు. ఏడవది ధూమావతి. ధూమావతి సాధనతో దారిద్య్రబాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఎనిమిదవది బగళాముఖి. శత్రుబాధ తొలగడానికి బగళాముఖిని ఆరాధిస్తారు. పరశురాముడు బగళాముఖి సాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. తొమ్మిదవది మాతంగి. మాతంగి సాధనతో సమస్త మనోభీష్టాలూ నెరవేరుతాయని నమ్ముతారు. పదవది కమల. భృగు మహర్షి పూజించడం వల్ల ఈ దేవతను భార్గవి అని కూడా అంటారు. కమలా సాధన వల్ల సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు.

దశ మహావిద్యల ఆరాధన వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కాళీ ఆరాధన వల్ల శని గ్రహదోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. గురుగ్రహ దోషం ఉన్నవారు తారా ఆరాధన చేయడం వల్ల ఫలితం పొందవచ్చు. షోడశి ఆరాధనతో బుధగ్రహ దోషాలు సమసిపోతాయి. చంద్రగ్రహ దోషం నుంచి ఉపశమనానికి భువనేశ్వరిని ఆరాధించాలి. రాహు దోష విమోచన కోసం ఛిన్నమస్తను, కేతు దోష పరిష్కారం కోసం ధూమావతిని ఆరాధించాలి. బగళాముఖి ఆరాధన వల్ల కుజదోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. జాతకంలో రవిగ్రహం బలహీనంగా ఉంటే మాతంగిని ఆరాధించాలి. శుక్రగ్రహ దోషాల నుంచి ఉపశమనానికి కమలను ఆరాధించాలి. ఇక జన్మలగ్నమే దోషభూయిష్టంగా ఉంటే భైరవిని ఆరాధించడం ద్వారా ఫలితం ఉంటుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. గ్రహదోషాలకు ఇతరేతర ఉపశమన పద్ధతులు ఎన్ని ఉన్నా, వాటితో పోల్చుకుంటే దశ మహావిద్యల సాధన వల్ల శీఘ్ర ఫలితాలను పొందడం సాధ్యమవుతుందని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇతర మతాలపై ప్రభావం
దేవీ ఆరాధన ప్రధానమైన శాక్తేయం ఇతర మతాలను కూడా ప్రభావితం చేసింది. బౌద్ధ, జైన మతాలలో శాక్తేయ తాంత్రిక పద్ధతులు కనిపిస్తాయి. ముఖ్యంగా బౌద్ధంలోని వజ్రయాన శాఖకు చెందిన వారు తాంత్రిక పద్ధతుల్లో ఆరాధన చేసే సంప్రదాయం ఉంది. సనాతన మతాలైన శైవ, వైష్ణవాలపైన కూడా శాక్తేయం గణనీయమైన ప్రభావం చూపింది. శక్తి రూపాలైన మాతృకలను బౌద్ధులు పూజించేవారు. బౌద్ధ మాతృక కుడ్యశిల్పాలు ఎల్లోరా గుహలలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇవి క్రీస్తుశకం ఆరు–ఏడు శతాబ్దాల మధ్యకాలం నాటివని చరిత్రకారుల అంచనా. ఈ గుహలలోనే దుర్గాదేవి సహా ఇతర దేవతల శిల్పాలు కూడా కనిపిస్తాయి. జైనులు శక్తిరూపాలైన విద్యాదేవతలను, శాసనదేవతలను పూజించేవారు. ఇక సిక్కుల దశమగ్రంథంలో గురు గోవింద్‌సింగ్‌ చాలా శాక్తేయ దేవతలను ప్రస్తావించారు. వీటిలో చండీ ప్రస్తావన ప్రధానంగా కనిపిస్తుంది. 
– పన్యాల జగన్నాథదాసు

దశ మహావిద్యల ఆలయాలు
దశ మహావిద్యలకు దేశంలో ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రసిద్ధ ఆలయాల గురించి తెలుసుకుందాం...కోల్‌కతాలోని కాళీ ఆలయాలు ప్రసిద్ధమైనవి. వీటిలో ఒకటి కాళీఘాట్‌ ఆలయం, మరొకటి దక్షిణకాళి ఆలయం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయానికి చేరువలోనే కాళీ ఆలయం కూడా ఉంది. భువనేశ్వర్‌లో రక్షకాళీ ఆలయం, కటక్‌లో మహానది ఒడ్డున కాళీ ఆలయం, వరంగల్‌లోని భద్రకాళి ఆలయం ప్రసిద్ధి పొందినవే. పశ్చిమబెంగాల్‌లో బీర్‌భూమ్‌ జిల్లాలోని తారాపీuŠ‡ పట్టణంలో తారాదేవి ఆలయం ఉంది. హిమాచల్‌ రాజధాని సిమ్లాలోను, అదే రాష్ట్రంలోని నాలాగఢ్‌లోను, భవన్‌లోను, బహిదా బాఘ్‌లోను కూడా తారా ఆలయాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో అల్మోరా జిల్లా ఉడాల్‌కోట్‌లోను, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోనూ తారాదేవికి ఆలయాలు ఉన్నాయి.బెంగళూరులోని కెంపపుర ప్రాంతంలోను, చెన్నైలోని భారతీదాసన్‌ కాలనీలోను భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి. లక్నోలోని అదిల్‌నగర్‌ ప్రాంతంలోను, విశాఖపట్నం జిల్లా యాతపాలెం గ్రామంలోనూ భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి.మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోను, ఉజ్జయినిలో కాలభైరవ ఆలయానికి చేరువలో ఛత్తీస్‌గఢ్‌లోని రాజనంద్‌గాంవ్‌లో కూడా పాతాళభైరవి ఆలయాలు ఉన్నాయి.  ఒడిశాలోని బౌ«ద్‌ పట్టణంలో భైరవి ఆలయం ఉంది. తమిళనాడులోని సేలం పట్టణంలో లింగభైరవి ఆలయం ఉంది. అస్సాంలో గువాహటిలోని సుప్రసిద్ధ శక్తిపీఠం కామాఖ్య ఆలయానికి చేరువలోనే ఛిన్నమస్త ఆలయం ఉంది.పశ్చిమబెంగాల్‌లోని బిష్ణుపూర్, బంకురా పట్టణాలతో పాటు జార్ఖండ్‌లోని రాజ్‌రప్పలో ఛిన్నమస్తాదేవి ఆలయాలు ఉన్నాయి.

కర్ణాటకలోని మంగళూరులోను, ఉడిపిలోనూ ధూమావతి ఆలయాలు ఉన్నాయి. కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లా పాలడుక్క గ్రామంలో కూడా ధూమావతి ఆలయం ఉంది.తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా పాప్పకుళంలో బగళాముఖి ఆలయం ఉంది. మధ్యప్రదేశ్‌లోని షాజపూర్‌ జిల్లా నల్‌ఖేడా గ్రామంలోను, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా సమేలి గ్రామంలోను, ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లోను, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోను, పంజాబ్‌లోని లూధియానాలోను, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లోనూ బగళాముఖి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాంలోను, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోను, తమిళనాడులోని నాగపట్టణం జిల్లా నాంగూరులోను, మధ్యప్రదేశ్‌లోని ఝబువా పట్టణంలోను మాతంగీదేవి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాం జిల్లా చిక్కలదిన్ని గ్రామంలోను, మహారాష్ట్రలోని థానే జిల్లా దండిపడా గ్రామంలోను, తమిళనాడులోని తిరువారూరులో త్యాగరాజ ఆలయానికి చేరువలోను కమలాదేవి ఆలయాలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement