అమ్మవు నీవే... అఖిల జగాలకు!
దుష్టశిక్షణకు శిష్టరక్షణకు ప్రతీక దసరా. స్త్రీశక్తి విజయానికి నిలువెత్తు నిదర్శనం దసరా. దేశవ్యాప్తంగా ఊరూవాడా ఏకమై ఉమ్మడిగా జరుపుకొనే వేడుక దసరా. ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగజ్జననిని జనమంతా భక్తితో ఆరాధించే పండుగ దసరా. దుర్గతులను దూరం చేసే దుర్గమ్మను నవరాత్రులలో పూజించే వేడుక దసరా. మన దేశంలో నలుమూలలా దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయి. కోల్‌కతా, మైసూరు వంటి నగరాలలో దసరా నవరాత్రి వేడుకలు అమిత వైభవంగా జరుగుతాయి.
దేశంలోని చాలా నగరాలు, పట్టణాల్లో తాత్కాలికంగా వెలిసే దుర్గామాత మంటపాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతాయి. శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు ప్రత్యేకపూజలతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. దసరా వేడుకలు భారత్‌కు మాత్రమే కాదు, పొరుగునే ఉన్న నేపాల్, శ్రీలంకలలో కూడా దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతాయి.
తొలిసారిగా చైనా సందడి
కోల్‌కతా దసరా వేడుకలపై ఈసారి చైనా ఆసక్తి ప్రదర్శిస్తోంది. కోల్‌కతాలోని చైనా కాన్సులేట్ అధికారులు, సిబ్బంది ‘ఇంపాక్ట్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలసి ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. చైనా ప్రతినిధులు అధికారికంగా దసరా వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కానుంది. ‘ఇంపాక్ట్’ ప్రతినిధులతో కలసి చైనా కాన్సులేట్ అధికారులు కోల్‌కతా నగరంలో వెలసిన దుర్గామాత మంటపాలను నవరాత్రులలో పంచమి నాటి నుంచి... అంటే అక్టోబర్ 6 నుంచి సందర్శించనున్నారు. భద్రత, అలంకరణ వంటి వివిధ అంశాల్లో మేటిగా నిలిచిన పది ఉత్తమ మంటపాల ఫలితాలను దసరా ముందు రోజు ప్రకటించనున్నారు. ఉత్తమ మంటపాల నిర్వాహకులకు ఎలాంటి నగదు బహుమతులు చెల్లించరు గాని, వారికి ఉచితంగా చైనాను సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు కోల్‌కతాలోని చైనా కాన్సుల్ జనరల్ మా ఝాన్వు ప్రకటించారు.
మైసూరులో మహారాజ వైభోగంగా...
మైసూరులో దసరా వేడుకలు మహారాజ వైభోగంగా జరుగుతాయి. ఏనుగుల ఊరేగింపు, ఊరేగింపులో జానపద కళాకారుల ప్రదర్శనల సందడిని చూసి తీరాల్సిందే. మైసూరులో దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించే సంప్రదాయం పదిహేనో శతాబ్దిలో విజయనగర రాజుల కాలం నుంచే మొదలైంది. విజయనగర సామ్రాజ్యం పతనమయ్యాక వడయార్ రాజ వంశీకులు దసరా వేడుకలకు పునర్వైభవం తీసుకొచ్చారు. వడయార్ రాజులు పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో ఈ వేడుకలను శ్రీరంగపట్నంలో నిర్వహించేవారు.
మూడవ కృష్ణరాజ వడయార్ హయాంలో 1805 సంవత్సరం నుంచి మైసూరులో దసరా వేడుకల నిర్వహణ ప్రారంభమైంది. నవరాత్రుల సందర్భంగా చాముండీ హిల్స్ ప్రాంతంలోని మైసూరు ప్యాలెస్‌లో వడయార్ రాజులు దర్బార్ నిర్వహించే ఆనవాయితీ కూడా అప్పటి నుంచే మొదలైంది. ఆ ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది. నవరాత్రులలో మైసూరు ప్యాలెస్ విద్యుద్దీపకాంతులతో ధగధగలాడుతూ దేదీప్యమానంగా మెరిసిపోతుంది. నవరాత్రుల సందర్భంగా వడయార్ రాజవంశీకుల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరీ దేవిని 750 కిలోల బంగారంతో నిర్మించిన స్వర్ణమంటపంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దసరా రోజున మైసూరు ప్యాలెస్ నుంచి ఏనుగులతో సకల రాజ లాంఛనాలతో జరిగే దసరా ఊరేగింపులో లక్షలాది మంది జనం ఉత్సాహంగా పాల్గొంటారు.
ఊరేగింపును తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలి వస్తారు. ఈ ఊరేగింపు మైసూరు వీధుల గుండా సాగి, పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని జమ్మిచెట్టు వద్ద ఏర్పాటు చేసే ‘బన్నిమంటపం’ వరకు సాగుతుంది. జమ్మిని కన్నడంలో ‘బన్ని’ అంటారు అందుకే ఈ మంటపాన్ని ‘బన్నిమంటపం’ అంటారు. ఏనుగులతో భారీ స్థాయిలో సాగే ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని అప్పట్లో బ్రిటిషర్లు ‘జంబో సవారీ’అనేవారు. ఇప్పటికీ ఆ పేరే వాడుకలో ఉంది. పదవ చామరాజ వడయార్ హయాంలో 1880 నుంచి నవరాత్రుల సందర్భంగా దసరా ప్రదర్శన ఏర్పాటు చేసే ఆనవాయితీ మొదలైంది.
ప్రస్తుతం దసరా వేడుకలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాజవంశీకులు నిర్వహిస్తూ వస్తున్నా, 1981 నుంచి ప్రదర్శన బాధ్యతలను మాత్రం కర్ణాటక ఎగ్జిబిషన్ అథారిటీ నిర్వహిస్తూ వస్తోంది. దసరా నవరాత్రి వేడుకల్లో మైసూరులోని ఆడిటోరియమ్స్ అన్నీ సంగీత కచేరీలు, నృత్యప్రదర్శనలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక నవరాత్రుల సందర్భంగా జరిగే కుస్తీపోటీలు మైసూరు వేడుకలకే ప్రత్యేక ఆకర్షణ. మైసూరుతో పాటు కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరి, గోకర్ణలోని భద్రకర్ణిక, బప్పనాడులో దుర్గాపరమేశ్వరి, కడియాలిలోని మహిష మర్దిని వంటి శక్తి ఆలయాల్లోనూ దసరా వేడుకలు సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. శివమొగ్గలోనైతే దసరా వేడుకలు దాదాపు మైసూరు వేడుకలనే తలపిస్తాయి. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ చలనచిత్రోత్సవాలను కూడా నిర్వహించడం విశేషం.
నలుదిశలా నవరాత్రులు
దసరా వేడుకలు అనగానే చప్పున స్ఫురించే పేర్లు కోల్‌కతా, మైసూరే అయినా మన దేశంలో నలుదిశలా దసరా నవరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. ముఖ్యంగా శక్తి ఆరాధన ఎక్కువగా ఉండే తూర్పు, ఉత్తర భారత ప్రాంతాల్లో దసరా నవరాత్రి వేడుకలు అత్యంత సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల గురించి చెప్పుకోవాలంటే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. దసరా రోజున కృష్ణానదిలో అమ్మవారికి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవికి, ఆలంపురంలోని జోగులాంబా దేవికి కూడా ఘనంగా నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు.
తెలంగాణలో జరిగే నవరాత్రి వేడుకలకు బతుకమ్మ సంబరాలు మరింత వన్నె తెస్తాయి. రకరకాల పూలతో బతుకమ్మలను అలంకరించి, కొలువుదీర్చి మహిళలంతా పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తెలంగాణలో వయసులో చిన్నవారు పెద్దల చేతికి జమ్మి ఆకులను ఇచ్చి, వారి ఆశీస్సులు అందుకుంటారు. ఒడిశాలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా దసరా వేడుకల కోలాహలం కనిపిస్తుంది. నగరాల్లోను, పట్టణాల్లోను అడుగడుగునా దేవీ మంటపాలు దర్శనమిస్తాయి.
కటక్‌లో చండీ, జాజ్‌పూర్‌లో బిరజా, పూరీలో బిమలా, గంజాం జిల్లాలోని తరాతరిణి తదితర శక్తి ఆలయాల్లో నవరాత్రి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతాయి. తమిళనాడు, కేరళలలో దసరా నవరాత్రులలోని తొమ్మిదోరోజు సరస్వతీ పూజ చేస్తారు. విజయ దశమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చదువుల్లో రాణిస్తారనే నమ్మకం ఆ రాష్ట్రాల్లో ఉంది. కొట్టాయంలోని సరస్వతీ ఆలయంలో విజయదశమి నాడు వేలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌కు చేరువలో ఉండే జార్ఖండ్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో కూడా దసరా వేడుకలు దాదాపు ఇదే తీరులో జరుగుతాయి.
అసోంలోని కామాక్షీ శక్తిపీఠంలో జరిగే నవరాత్రి వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలో తునికాకు చెట్లను పూజిస్తారు. తెలంగాణలో పెద్దలకు జమ్మి ఆకులిచ్చి ఆశీస్సులు పొందే ఆచారం ఉన్నట్లే, మహారాష్ట్రలో పెద్దలకు తునికాకులు ఇచ్చి, ఆశీస్సులు పొందే ఆచారం ఉంది.
ఉత్తరాదిలో రైతుల పండుగ
దసరా నవరాత్రులను ఉత్తరాదిలో వ్యవసాయదారుల పండుగగా జరుపుకొంటారు. నవరాత్రుల తొలిరోజున స్థానికంగా పండే గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల విత్తులను మట్టికుండీలో నాటుతారు. దసరా నాటికి విత్తనాలు మొలకలెత్తుతాయి. మొలకలతో ఉన్న కుండీలను దసరా రోజున నదుల్లో లేదా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బీహార్ ప్రాంతాల్లో చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కుమావ్ ప్రాంతంలో రంగస్థల సంప్రదాయాల ప్రకారం ‘రామ్‌లీలా’ వేడుకను ప్రదర్శిస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో దసరా వేడుకలు కొంత విలక్షణంగా జరుగుతాయి.
మిగిలిన ప్రాంతాల్లో విజయదశమి నాటితో నవరాత్రి వేడుకలకు ముగింపు పలికితే, కులు ప్రాంతంలో మాత్రం విజయదశమి నాటి నుంచే ఈ వేడుకలు మొదలై వారం రోజుల పాటు జరుగుతాయి. రావణుడిని రాముడు విజయదశమి రోజున సంహరించడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో విజయదశమి రోజున రావణ దహనాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. ఊరూరా కూడళ్లలో భారీ పరిమాణంలో తయారు చేసే రావణ, కుంభకర్ణ, మేఘనాదుల దిష్టిబొమ్మలను తగులబెడతారు. బీహార్‌లోని మైథిలీ ప్రజలు నవదుర్గా పూజలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో మహాలయ అమావాస్యకు ముందు నుంచే పండుగ వాతావరణం కనిపిస్తుంది.
ఊరూరా దుర్గాదేవి మంటపాలతో పాటు రకరకాల ప్రదర్శనలు ఏర్పాటవుతాయి. గుజరాత్‌లో దసరా నవరాత్రి వేడుకల్లో దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే దసరా నవరాత్రి వేడుకల్లో భిన్నసంస్కృతులు ప్రతిఫలిస్తాయి. వివిధ రాష్ట్రాల్లో దసరా వేడుకల నిర్వహణలో కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ, ప్రతిచోటా ఈ సందర్భంగా ఆయుధపూజలు నిర్వహిస్తారు. ఇళ్లలో, కార్యాలయాల్లో, కర్మాగారాల్లో వాడుకునే పనిముట్లను, యంత్రాలను, వాహనాలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేస్తారు.
విదేశాల్లో విజయదశమి
భారత్‌లోనే కాకుండా చాలా ఇతర దేశాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు జరుగుతాయి. పొరుగునే ఉన్న నేపాల్‌లోని శక్తి క్షేత్రాల్లో అత్యంత సంప్రదాయబద్ధంగా దసరా వేడుకలను నిర్వహిస్తారు. దసరాను నేపాలీలు ‘దసైన్’గా పిలుచుకుంటారు. ఇండోనేసియాలో స్థిరపడ్డ భారతీయులు జకార్తా, టాంగెరాంగ్‌లలో నిర్మించిన దుర్గాదేవి ఆలయాల్లో నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మలేసియా, సింగపూర్‌లలో బెంగాలీ సంఘాలు ఈ సందర్భంగా దుర్గాదేవి పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంతో పాటు పలుచోట్ల నవరాత్రి వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా పద్మానదిలో పడవ పందేలను కూడా నిర్వహిస్తారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ బెంగాలీలు, అస్సామీలు దాదాపు యాభయ్యేళ్లుగా అక్కడ దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లోనూ అక్కడ స్థిరపడ్డ భారతీయులు ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకొంటారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ అక్కడ స్థిరపడ్డ భారతీయులు కొన్ని దశాబ్దాలుగా దసరా నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చైనాలోని భారతీయులు 2004 నుంచి షాంఘై నగరంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించారు.
శరన్నవరాత్రుల పుట్టుపూర్వోత్తరాలు
దసరా నవరాత్రులను శరదృతువు ప్రారంభంలో వచ్చే ఆశ్వియుజమాసంలో జరుపుకోవడం వల్ల వీటిని శరన్నవరాత్రులని కూడా అంటారు. నిజానికి దుర్గాదేవిని చైత్రమాసం ప్రారంభంలో వచ్చే వసంత నవరాత్రుల్లో ఆరాధించడమే సరైన పద్ధతి అని, ఆశ్వియుజంలో ఈ దుర్గాదేవిని పూజించడమంటే, అకాలంలో అమ్మవారిని మేల్కొల్పడమేనని బెంగాలీల్లో కొందరు నమ్ముతారు. దీనినే వారు ‘అకాల్ బోధొన్’ అంటారు. రామాయణ కాలానికి ముందు వసంత నవరాత్రులలోనే అమ్మవారిని ఆరాధించేవారట.
రావణుడితో యుద్ధం జరిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీరాముడు ఆశ్వియుజ మాసంలో చండీహోమాన్ని నిర్వహించి, దుర్గాదేవి అనుగ్రహాన్ని పొంది రావణుడిని సంహరించాడని ప్రతీతి. అప్పటి నుంచే శరన్నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడం మొదలైందని చెబుతారు.
ఇక చరిత్రను పరిశీలిస్తే, దుర్గాదేవి ఆరాధన మధ్యయుగాల నాటికే దేశం నలుమూలలా జరుపుకొనేవారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని పరశురామేశ్వర ఆలయంలో లభించిన క్రీస్తుశకం ఆరోశతాబ్ది నాటి శిల్పం ద్వారా అప్పట్లోనే దుర్గాదేవి నవరాత్రులు వైభవోపేతంగా జరిగేవని తెలుస్తోంది. అప్పట్లో పలు శివాలయాల్లో దేవీ నవరాత్రులు జరిగేవి. తొలినాళ్లలో ఈ వేడుకలు ఆలయాలకు, రాజప్రాసాదాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. కాలక్రమంలో సామాన్యులు సామూహికంగా ఊరూరా దసరా నవరాత్రులను జరుపుకోవడం మొదలైంది.
కవర్స్టోరీ: పన్యాల జగన్నాథదాసు