మహాభక్త శిఖామణి  శ్రీశ్రీశ్రీ... | Fuday laughing story special | Sakshi
Sakshi News home page

మహాభక్త శిఖామణి  శ్రీశ్రీశ్రీ...

Published Sun, Oct 21 2018 1:28 AM | Last Updated on Sun, Oct 21 2018 1:28 AM

Fuday laughing story special - Sakshi

ముల్లోకములలో జరుగు ఘటనలను తన యోగబలంచేత దర్శించగల నారదుడు ఉన్నట్టుండి గట్టిగా కేకేశాడు. కునికిపాట్లు పడుతున్న నాస(నారదుడి సహాయకుడు) మేల్కొని ‘‘అయ్యా! తమరి  ఆజ్ఞా’’ అన్నాడు చేతులు కట్టుకుంటూ.‘‘మనం అర్జంటుగా భూలోకానికి వెళ్లి రావలెనోయ్‌’’ మహతి వీణను  మెడలో వేసుకుంటూ అన్నాడు నారదుడు.‘‘ఎందుకు స్వామి?’’ వినయంగా అడిగాడు నాస.‘‘భూలోకంలో ఎవరో మానవుడు ఘోర వీర శూర తపస్సు చేస్తున్నాడు. కనీవిని ఎరగని తపస్సు అది. దేవతలకు ఇన్‌ఫాం చేశాను. భూలోకం వెళ్లడానికి  ఎవరూ ఇంట్రెస్ట్‌ చూపడం లేదోయ్‌. త్రిలోకసంచారినైన నాకుతప్పుతుందా! పద వెళ్దాం’’ అని తన అసిస్టెంట్‌ను తొందరచేశాడు నారదుడు.‘యమహా భూలోకవేగవాహన్‌ 4003’లో వాళ్లు భూలోకానికి చేరుకున్నారు.అటుగా వెళుతున్న వ్యక్తిని పిలిచి...‘‘నీ పేరేమిటోయి?’’ అడిగాడు నారదుడు.‘‘దారినపోయే దానయ్య’’ అని చెప్పాడు  ఆ వ్యక్తి.‘‘గుడ్‌. ఇదేమిటి? ఈ అడవి ఇలా ఉంది. చెట్లతో అడవి ఏర్పడుతుందిగానీ, మీసంగెడ్డాలతో ఇంత పెద్ద అడవి ఏమిటి?’’ అని  ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.

‘‘దీన్ని గెడ్డమడవి అంటారండీ’’ అని చెప్పాడు దానయ్య.‘‘గెడ్డమడవా? ఇదేం అడవి?’’ ఆరాతీశాడు  నారదుడు.‘‘ముందు ఇక్కడ అడవి లేదండి. అసలు ఒక్క చెట్టు కూడా లేదండి. మహాభక్తుడొకరు ఇక్కడ తపస్సు  చేస్తుండడం వల్ల ఆయన మీసాలు గెడ్డాలు పెరిగి పెద్దవై, మర్రిచెట్టు ఊడల సైజులో పెరిగి ఇలా ఒక అరణ్యంగా ఏర్పడింది. మీసగెడ్డాలతో ఏర్పడిన ఈ అడవి గిన్నిస్‌ బుక్‌లోకి మరియు లిమ్కాబుక్‌లోకి కూడా ఎక్కింది. ఈ అడవి ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది....’’ ఇలా నాన్‌స్టాప్‌గా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు దానయ్య.దానయ్య చెప్పిన విషయాలు విన్న తరువాత...‘‘నేను అర్జంటుగా ఆ భక్తశిఖామణిని చూడాలి’’ అంటు కార్లు దూరని ఆ కారడవిలోకి ప్రవేశించి తపస్సు చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లాడు.ఆ వ్యక్తి నోటి నుంచి....‘రా....గో....పాల్‌...ఓం...వర్మ...’ అనే శబ్దాలు వినిపిస్తున్నాయి.‘‘నాయనా...కళ్లు తెరిచి ఒకసారి చూడు’’ భుజం తట్టాడు నారదుడు.ఆ వ్యక్తి ఒక కన్ను మాత్రమే తెరిచి...‘‘ఎవరు మీరు?’’ అని అడిగాడు.‘‘నన్ను నారదమహర్షి అందురు. అది సరే నీ పేరేమిటి’’ అడిగాడు నారదుడు.‘‘నన్ను రామ్‌గోపాల్‌వర్మ అందురు’’ అన్నాడు ఆ వ్యక్తి.

‘‘భక్తులందరూ తమ ఇష్ట దైవనామాన్ని జపిస్తూ తపస్సు చేస్తుంటారు. అదేమిటి...నువ్వు నీ నామాన్నే జపిస్తూ తపస్సు చేస్తున్నావు?’’ అని అడిగాడు నారదుడు. అప్పుడు ఆ వర్మ ఇలాచెప్పాడు:‘‘దేహమేరా దేవాలయం అన్నాడు శోభన్‌బాబు. మనలో ఒక దేవాలయం ఉన్నప్పుడు దేవుడు మాత్రం  ఎందుకు ఉండడనేది నా పాయింట్‌. నా దేహమే దేవాలయమైనప్పుడు...అందులో దేవుడిని నేనుమాత్రం ఎందుకు కాకూడదు? అందుకే నా పేరుతో నేను జపం చేసుకుంటున్నాను’’ కర్ణకఠోరంగా క్లారిటీ ఇచ్చాడు వర్మ.ఆకాశంలో రెండు మెరుపులు సిగ్గుతో మెరిసాయి. ఉరుము గర్జించబోయి భోరుమని ఏడ్చింది.‘‘నువ్వే దేవుడివైనప్పుడు వరం కోసం వేరే దేవుడి గురించి తపస్సు చేయడం ఎందుకు?’’ అడిగాడు నారదుడు.వర్మ గుడ్లు తేలేశాడు. ఆ తరువాత ఏదో చెప్పబోయాడు.మళ్లీ ఏదోచెప్పబోతుండగా...‘‘భక్తవర్మ! నువ్వు ఏదో ఒకటి చెప్పడం కంటే ఇలా మౌనంగా ఉండటమే చాలా బాగుంది. ఐ అప్రిషియేట్‌ యూ. సరే...ఏం వరం కావాలో కోరుకో నాయనా’’ అడిగాడు నారదుడు.అదేమిటి? వరాలు ఇచ్చేది శివుడు కదా...సరే ఎవరో ఒకరులే. నాకు అర్జంటుగా వందకోట్లు కావాలండీ.’’ అన్నాడు వర్మ.‘‘వందకోట్లతో ఏంచేస్తావు నాయనా?’’ అడిగాడు నారదుడు.‘వందకోట్లతో ఒక షార్ట్‌ఫిల్మ్‌ తీసి రికార్డ్‌ సృష్టించాలనుకుంటున్నాను. అంత పెద్ద బడ్జెట్‌తో షార్ట్‌ఫిల్మ్‌ తీసిన ఘనత చరిత్రలో నాకే దక్కుతుంది’’ చెప్పాడు వర్మ.‘అలాగే. నీ కోరిక నెరవేరుతుంది. ఇంటికి వెళ్లి చూడు’’  వరం అనుగ్రహించి అక్కడి నుంచి మాయమయ్యాడు నారదుడు.‘ఇవి పెట్టుడు మీసాలు, గెడ్డాలని....ముంబైనుంచి వచ్చిన వాళ్లు ఈ గెడ్డం అడవి సెట్టింగ్‌ వేశారని పాపం నారదుల వారికి తెలియదు’ అని తనలోతాను నవ్వుకున్నాడు వర్మ.మెరుపు వేగంతో హైదరాబాద్‌కి వెళ్లాడు.తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లాడు. ఎటు చూసినా కోట్లే!టేయిల్‌ కోట్, మార్నింగ్‌ కోట్, ఫ్రాక్‌ కోట్, డిన్నర్‌ కోట్, స్మోకింగ్‌ కోట్, డస్టర్‌ కోట్, ట్రెంచ్‌ కోట్, రెయిన్‌ కోటు...ఇలా ప్రపంచ నలుమూలలకు చెందిన వంద కోట్లు ఆ ఇంట్లో ఉన్నాయి.వర్మకు దిమ్మతిరిగింది. ఎన్నడూ లేనిది ‘ఓ మైగాడ్‌’ అని గట్టిగా అరిచాడు.
– యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement