వెండి చేపపిల్ల కథ  | Funday children story | Sakshi
Sakshi News home page

వెండి చేపపిల్ల కథ 

Published Sun, Sep 2 2018 1:53 AM | Last Updated on Sun, Sep 2 2018 1:53 AM

Funday children story - Sakshi

అనగనగా ఓ కొండ పక్కనున్న సరస్సులో ఓ వెండి చేపపిల్ల నివసించేది. అదే సరస్సులో ఎర్రటి ముక్కున్న, తెల్లటి రాజహంస కూడా నివసించేది. ఓ రోజు హంసకు, వెండి చేపపిల్ల తారసపడింది. హంస దాన్ని తినేద్దామనుకుంది. వెండి చేపపిల్ల ఇలా ప్రార్థించసాగింది – ‘‘రాజహంస గారూ! రాజహంస గారూ!! దయచేసి నన్ను చంపొద్దు. నా ప్రాణాలు కాపాడండి’’. రాజహంస ఇలా అంది – ‘‘సరే! నిన్ను నేను వదిలేస్తాను. ఈ సరస్సు పైనున్న మంచు వల్ల నా కాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నాయి. నాకో చక్కని బూట్ల జతని సంపాదించు. బూట్లు లేకుండా తిరిగి వచ్చావో, నీ పని అయిపోయినట్లే’’. వెండి చేపపిల్ల సరస్సు అంతా గాలించింది. చివరికి సరస్సు అడుగున కూడా వెతికింది. ఎంత వెతికినా బూట్ల జత మాత్రం కనిపించలేదు. నిరాశ చెందింది. చివరకు సరస్సు ఒడ్డు దగ్గరున్న రెల్లు గడ్డి పొదల వద్దకు చేరింది. బిగ్గరగా ఏడ్వసాగింది. 

చేపపిల్ల ఏడుపుని ఓ ఆకుపచ్చని కప్ప వినింది. ‘‘ఓ వెండి చేపపిల్లా! వెండి చేపపిల్లా! ఎందుకు ఏడుస్తున్నావ్‌? ఏం కష్టమొచ్చింది?’’ అని అడిగింది కప్ప. వెండి చేపపిల్ల తన కథంతా చెప్పి తన దురదృష్టానికి బాధపడింది.ఆకుపచ్చ కప్ప ఇలా అంది – ‘‘నేను నీకు సాయం చేస్తాను. కానీ నువ్వు ఇక్కడే ఉండు. నాకోసం ఎదురుచూడు’’. సరేనంది చేపపిల్ల. ఆకుపచ్చ కప్ప ఒడ్డుకు బాగా దగ్గరగా ఉన్న గడ్డి పొదల దగ్గరకు వెళ్లింది. ‘బెక్‌.. బెక్‌.. బెక్‌.. బెక్‌..’ అని అరవసాగింది. ఒడ్డు పక్కనున్న విల్లో చెట్టుపై కూర్చుని ఉన్న ఓ పిచ్చుక, కప్ప అరుపులు వినింది. ‘క్రిప్‌.. క్రిప్‌.. క్రిప్‌.. క్రిప్‌..’ అని పిచ్చుక అరవసాగింది. ‘‘ఆకుపచ్చ కప్పా! ఎందుకు అరుస్తున్నావు? నీకు ఏం సాయం కావాలి?’’ అని అడిగింది పిచ్చుక. కప్ప వెండి చేపపిల్ల కథంతా చెప్పింది. తనకు బూట్ల జత ఎంత అవసరమో వివరించింది. పిచ్చుక ఇలా అంది – ‘‘నేను నీకు సాయం చేస్తాను. కానీ నువ్వు ఇక్కడే ఉండు. నా కోసం ఎదురుచూడు’’. సరేనంది ఆకుపచ్చ కప్ప. పిచ్చుక ఎగురుకుంటూ సరస్సు పక్కనున్న ఓ గ్రామానికి వెళ్లింది. అక్కడ ఓ ఇంటి పెరడులో ఓ చిన్నపాప ఆడుకుంటోంది. ఆ పాప పేరు నటలోష్కా. ‘క్రిప్‌.. క్రిప్‌.. క్రిప్‌.. క్రిప్‌’ అని పిచ్చుక అరవసాగింది. 

‘‘ఓ బుజ్జి పిచ్చుకా! ఎందుకు అరుస్తున్నావు? నీకు ఏం సాయం కావాలి’’ అని అడిగింది పాప. పిచ్చుక వెండి చేపపిల్ల కథంతా చెప్పింది. చేపపిల్ల బూట్ల జత లేకుండా, రాజహంస వద్దకు వెళ్తే ప్రాణగండం ఉందని వివరించింది. సాయం కావాలని అర్థించింది. చిన్నపాప ఇలా అంది – ‘‘నేను నీకు సాయం చేస్తాను. కానీ నువ్వు ఇక్కడే ఉండు. నాకోసం ఎదురుచూడు’’. సరేనంది పిచ్చుక. పాప ఇంట్లోకి వెళ్లి, తన ఎర్రటి అందమైన బూట్ల జతను తీసుకొచ్చి వాటిని పిచ్చుకకు ఇచ్చింది. పాప పిచ్చుకతో ఇలా అంది – ‘‘నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా వెళ్లు. వెండి చేపపిల్ల ప్రాణాలు కాపాడు’’.పిచ్చుక కృతజ్ఞతలు తెలిపింది. వాయు వేగంతో ఎగురుతూ ఆకుపచ్చ కప్ప వద్దకు చేరింది. బూట్ల జతను ఇచ్చింది. కప్ప పిచ్చుకకు కృతజ్ఞతలు తెలిపింది. కప్ప ఆ బూట్ల జతను వెండి చేపపిల్లకు అప్పగించింది. వెండి చేపపిల్ల కప్పకు కృతజ్ఞతలు తెలిపింది. ఎర్రటి అందమైన బూట్ల జతను తీసుకెళ్లి, రాజహంసకు ఇచ్చింది. అవి హంస పాదాలకు చక్కగా సరిపోయాయి. చేపపిల్ల జోలికి తను జీవితంలో రానని మాట ఇచ్చింది రాజహంస. ఎంతో ఆనందించింది చేపపిల్ల. ఈ విషయాన్ని ఆకుపచ్చ కప్పతో చెప్పింది. ‘‘నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు నేస్తం’’ అంది వెండి చేపపిల్ల. కప్ప పిచ్చుక గురించి, చిన్నపాప గురించి చెప్పింది.వెండి చేపపిల్ల తన కృతజ్ఞతల్ని పిచ్చుకకు, చిన్నపాపకు కూడా చెప్పమని అభ్యర్థించింది. ఆకుపచ్చ కప్ప ఈ విషయాన్ని పిచ్చుకకు చెప్పింది. పిచ్చుక ఈ సంగతిని పాపకు చెప్పింది. పాప ఆనందంతో చిరునవ్వు నవ్వింది. ఇదండీ నా చిన్నారి నేస్తాలూ! వెండి చేపపిల్ల కథ. మీరు మీ స్నేహితులకు ఇలాంటి సాయం ఏదో చేసే ఉంటారు. ఆ కథ నాకూ చెప్తారు కదూ!! 
(‘అపూర్వ రష్యన్‌ జానపద కథలు’ పుస్తకం నుంచి...) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement