రాత్రి పది దాటింది. కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీసింది ఊర్మిళ. మనోజ్ తలుపులు మూసి బోల్టు పెట్టి ఊర్మిళను గాఢంగా కౌగిలించుకుని ముద్దులు కురిపించాడు.‘‘మనోజ్! ఏంటి అంత తొందర? ఈ రాత్రి అంతా మనదే’’ గోముగా అతన్ని అల్లుకుని గుసగుసలాడింది ఊర్మిళ.‘‘తొందరే మరి! వారం దాటింది మనం కలిసి. నిన్ను తలచుకోని క్షణం లేదనుకో. కనులు మూసినా నీవాయె, కనులు తెరిచినా నీవాయె. నిద్ర పట్టడం లేదు...’’‘‘ఏం చేద్దాం? మా ఆయనకు డే డ్యూటీ. సాయంకాలం ఇంటికి వచ్చేస్తాడు. పగలు నువ్వు రావడం బాగుండదు. ఇంటికి ఎవరో ఒకరు వచ్చేస్తుంటారు. పట్టుబడితే అసలుకే మోసం మనోజ్. అర్థం చేసుకో..’’‘‘ఓకే.. ఓకే.. సుమన్‌గాడికి విడాకులిచ్చేయ్. తర్వాత మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా గడుపుదాం..’’ అన్నాడు మనోజ్ ఆమెను బెడ్‌రూమ్‌లోకి నడిపిస్తూ.‘‘అదంత ఈజీ కాదులే..! చూద్దాం! ఇప్పుడు సుమన్‌తో ఏం ప్రాబ్లమ్?’’‘‘ప్రాబ్లమా? వాడికి నైట్‌డ్యూటీలు ఉంటేనే మనకు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. లేకపోతే నరకమే కదా?’’‘‘నరకం అనుభవిస్తేనే స్వర్గసుఖాల విలువతెలుస్తుంది’’ అని పకపక నవ్వింది ఊర్మిళ.ఇద్దరూ బెడ్ మీద వాలిపోయారు. కాసేపటికి కాలింగ్‌బెల్ మోగింది. ఉలిక్కిపడ్డాడు మనోజ్. భయపడిపోయింది ఊర్మిళ. ఇద్దరూ హడావుడిగా మంచం మీద నుంచి లేచి డ్రెస్ చేసుకోసాగారు.‘‘ఎవరు ఈ టైమ్‌లో వచ్చింది?’’ అడిగాడు మనోజ్.
‘‘ఏమో! ఎవరైనా రిలేటివ్స్ వచ్చారేమో? నువ్వు ఇక్కడే ఉండు. నేను లైట్ ఆర్పి వెళతాను’’ అంటూ ఊర్మిళ లైట్ స్విచాఫ్ చేసి, బెడ్‌రూమ్ తలుపులు మూసి హడావుడిగా వెళ్లి బోల్టు తీసింది.తలుపు తెరవగానే ఎదురుగా భర్త కనిపించే సరికి భయంతో వణికిపోయింది ఊర్మిళ. రేగిన జుట్టు, అస్తవ్యస్తంగా చుట్టుకున్న చీర, ముఖంలో భయం చూసి ‘‘నిద్రపోయావా?’’ వ్యంగ్యంగా అడిగాడు సుమన్.‘‘ఆ.. ఔనండీ! నిద్రపోతున్నాను. ఏంటి అప్పుడే వచ్చారు?’’ వణుకుతున్న కంఠంతో అన్నది ఊర్మిళ.‘‘ఎందుకంటే..? నువ్వు గుర్తొచ్చావు. చాలా రోజులైంది కదా.. ఆ సుఖంలేక’’‘‘చాలారోజులెక్కడా?’’‘‘ఇరవైనాలుగు గంటలే నాకు చాలా రోజులైనట్టుగా అనిపిస్తోందోయ్!.. పద..’’ అంటూ ఊర్మిళను బెడ్‌రూమ్‌లోకి లాక్కెళ్లసాగాడు సుమన్.‘‘అయ్యో! అదేంటండీ! ఎక్కడెక్కడో తిరిగొచ్చారు. డ్రెస్ మార్చుకుని, స్నానంచేయండి..ఎందుకు తొందర..?’’ నవ్వుతూ అన్నది ఊర్మిళ.‘‘స్నానం చేద్దాంలే.. ఆ తర్వాత..’’ అంటూ బెడ్‌రూమ్‌లోకి లాక్కెళ్లాడు ఊర్మిళను.స్విచ్ వేశాడు. మంచం మీద ఉన్న మనోజ్ లేచి కూర్చున్నాడు.
తని ముఖం నెత్తురు చుక్కలేనట్టు తెల్లగా పాలిపోయింది. తేలు కుట్టిన దొంగలా కిక్కురుమనకుండా నిలబడ్డాడు. సుమన్ పెద్దపులిలా మనోజ్ మీద పడ్డాడు. బూతులు తిడుతూ అందినచోటల్లాతన్నసాగాడు. మనోజ్ దెబ్బలు కాచుకుంటూ ఉన్నాడు.‘‘నిన్ను చంపేస్తారా!...’’ అంటూ సుమన్ వంటగదిలోకి పోయి చాకు చేతిలోకి తీసుకున్నాడు.‘‘వద్దండీ.. ప్లీజ్..! తప్పయింది. వదిలేయండి. ఇక ముందు అతన్ని రానీయను..’’ అంటూ ఊర్మిళ సుమన్ రెండు కాళ్లూ పట్టుకుని నిలువరించింది.ఆ సమయంలో మనోజ్ పారిపోయాడు.‘‘తప్పుడు ముండా! ఏం లోటు జరిగిందే వాడిని తగులుకున్నావు? పరువు తీస్తున్నావే దరిద్రగొట్టుదానా’’ అంటూ కొట్టసాగాడు.‘‘తప్పయిందండీ.. ప్లీజ్ క్షమించండి..’’ అంటూ ఏడుస్తోంది ఊర్మిళ.‘‘ఈసారి వాడు వచ్చినట్టు తెలిసిందో? ఇద్దరినీ చంపేస్తా..’’ ఆయాసపడుతూ అన్నాడు సుమన్.∙∙
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో పోతోంది లాంచి. సుమన్ ఊర్మిళ పక్కపక్క సీట్లలో కూర్చుని ఉన్నారు. సుమన్ చల్లగాలి పీలుస్తూ దూరంగా కనిపిస్తున్న కొండలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.ఇంతలో ఊర్మిళ సెల్ మోగింది.‘‘హలో.. హలో..’’ అన్నది.‘‘సరిగా వినపడ్డం లేదు..’’ అంటూ లేచి డెక్ మీదకు వెళ్లింది. ‘‘హలో.. ఎక్కడున్నావు?’’ అటు నుంచి ప్రశ్నించాడు మనోజ్.‘‘లాంచీలో పోతున్నాం. ఇప్పుడు రిజర్వాయర్ మధ్యలో ఉన్నాం. ఎందుకు ఫోన్ చేశావు అనవసరంగా..?’’ విసుగ్గా అన్నది ఊర్మిళ.‘‘ఏం లేదు. గుర్తుచెయ్యడానికి చేశాలే. నాగార్జున కొండ పైకి వెళ్లిన తర్వాత మ్యూజియమ్ చూస్తారు. తర్వాత అక్కడి నుంచి రోడ్డు ఉంటుంది. రీ కన్‌స్ట్రక్షన్ చేసిన బౌద్ధ స్థూపాలు, అవీ ఉంటాయి. వాటిని చూస్తూ కొండ చివరకు తీసుకెళ్లు వాడిని. అటు పక్క కొండపై నిలబడితే కింద రిజర్వాయర్ కనిపిస్తూఉంటుంది. సమయం చూసి వాడిని బలంగా నెట్టెయ్. నీళ్లలో పడిపోతాడు. ఛస్తాడు బద్మాష్!... తర్వాత గట్టిగా అరుస్తూ మ్యూజియమ్ వైపు వెళ్లు..’’మనోజ్ చెబుతుంటే.. ‘‘సరేనే, మల్లికా.. ఉంటాను’’ అంటూ వచ్చేసింది సుమన్ దగ్గరకు.‘‘ఎవరు?’’ అనుమానంగా చూస్తూ అడిగాడు సుమన్.‘‘మా ఫ్రెండ్ మల్లిక..’’ అన్నది నవ్వుతూ.సుమన్ ఆమె చేతిలోని సెల్‌ఫోన్ లాక్కుని చూశాడు. స్క్రీన్ మీద అంతకు ముందు మాట్లాడిన నంబర్, మల్లిక అనే పేరు కనిపించాయి. మనోజ్ నంబర్‌ను మల్లిక అని సేవ్ చేసుకుంది ఊర్మిళ తెలివిగా.లాంచి నాగార్జున కొండకు ఆనుకుని ఆగింది. ఒక్కొక్కరే దిగారు. లాంచి కెప్టెన్ అనౌన్స్ చేశాడు వెళ్తున్న వారిని ఉద్దేశించి..‘‘ఇప్పుడు పదిన్నరైంది. ఒంటిగంటకు లాంచి రిటర్న్ అవుతుంది. అప్పటికి లాంచి దగ్గరకు మీరంతా చేరుకోవాలి. మిస్సయ్యారంటే మళ్లీ సాయంకాలం నాలుగింటి వరకు వేరే లాంచి వచ్చి రిటర్న్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.’’
టూరిస్టులంతా మ్యూజియంలోకి ప్రవేశించారు. రెండువేల సంవత్సరాల కిందటి శిల్పాలు, బౌద్ధ సంస్కృతి, నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందినవి చూస్తూ గడుపుతున్నారు.‘‘రెండువేల సంవత్సరాల కిందట ఇక్కడ ఇక్ష్వాకులు రాజ్యం ఏలారు. నాగార్జునుడు యూనివర్సిటీ నడిపాడు. చైనా, జపాన్, టిబెట్, శ్రీలంక వంటి పదమూడు ఆసియా దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి విద్య నేర్చుకుని వెళ్లేవారు.యుద్ధాల వల్లనో, కృష్ణానది వరదల వల్లనో విజయపురి నగరం కాలగర్భంలో కలిసిపోయింది. పురావస్తు శాఖ 1926 లో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించడంవల్లయూనివర్సిటీ ప్రాంతం మునిగిపోయింది. శిల్పాలు, బౌద్ధారామాలు వగరైనా ఈ కొండ మీద మ్యూజియమ్‌లో ఉంచారు.’’గైడ్ చెబుతున్నది శ్రద్ధగా వింటూ కదులుతున్నారు. గంట తర్వాత టూరిస్టులు మ్యూజియం బయటకు వచ్చారు. ‘‘ఏమండీ మనం బౌద్ధ స్థూపాలు చూద్దాం. కొండ మీద అన్నీ రీ కన్‌స్ట్రక్షన్ చేశారట..’’ అన్నది ఊర్మిళ ఉత్సాహంగా.‘‘సరే.. పద..’’ అన్నాడు సుమన్.ఇద్దరూ కలసి బౌద్ధ స్థూపాలు చూస్తూ కొండ చివర ఒడ్డుకు చేరుకున్నారు. కొండ కింద సముద్రంలా కనిపిస్తోంది రిజర్వాయర్. కనుచూపు మేర అంతా నీరే.‘‘ఎంత బాగుందో ఈ సీన్. సముద్రం ఒడ్డున నిల్చున్నట్టు ఉంది..’’ అన్నది ఊర్మిళ పరవశించిపోతూ.‘‘ఊ..’’ అంటున్నాడు సుమన్.ఊర్మిళ అటూ ఇటూ చూస్తోంది. కొన్ని క్షణాల్లో సమయం చూసి సుమన్‌ని కొండ పైనుంచి తోసెయ్యడమే తరువాయి. ఊర్మిళ కబుర్లు చెబుతూ సమయం కోసం చూస్తున్నది. రెండు చేతులూ ముందుకు చాచి సుమన్‌ని నెట్టబోయింది.ఇంతలో ఒక యువకుడు పొదలమాటు నుంచి హఠాత్తుగా వచ్చి ఊర్మిళను బలంగా నెట్టాడు. ఊర్మిళ బొమ్మలా గాలిలో ఊగుతూ రిజర్వాయర్‌లోకి పడిపోయింది.‘‘వెల్‌డన్ శేఖర్..’’ అన్నాడు సుమన్ తమ్ముడిని అభినందిస్తూ.‘‘అన్నయ్యా! నిన్ను మర్డర్ చేయాలనే నాగార్జునకొండ ట్రిప్‌వేసింది. మనం అలెర్ట్‌గా ఉండబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఈపాటికి నీళ్లలో కొట్టుకుపోతూ ఉండేవాడివి’’ అన్నాడు శేఖర్.తర్వాత సుమన్ పరుగెత్తుతూ అరవసాగాడు..‘‘నా వైఫ్ కొండపై నుంచి జారి నీళ్లలో పడిపోయింది.. ప్లీజ్ హెల్ప్..’’ కాసేపటికి జనం గుమిగూడారు అక్కడ. సుమన్ ఏం జరిగిందో చెబుతున్నాడు. గజ ఈతగాళ్లు నీళ్లలోకి దిగారు. ఊర్మిళను లాక్కువచ్చారు. అప్పటికే ఆమె ప్రాణం వదిలింది.
‘‘నాగార్జున కొండ చూడడానికి వెళ్లిన టూరిస్ట్ ఊర్మిళ ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారి రిజర్వాయర్‌లో పడిపోయింది. గజ ఈతగాళ్లు రక్షించడానికి ప్రయత్నించారు గాని, కాపాడలేకపోయారు. ఊర్మిళ మరణించింది. ఆమె భర్త భార్య మరణాన్ని తట్టుకోలేక విలపించడం టూరిస్టులందరినీ కలచివేసింది.’’వార్త అన్ని న్యూస్‌పేపర్లలోనూ వచ్చింది. సుమన్, శేఖర్ ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు.తాము ఎత్తుకు పైఎత్తు వేసి ఊర్మిళను మట్టుబెట్టారు. లేకపోతే ఊర్మిళ ప్రియుడి సాయంతో సుమన్‌ని హత్యచేసి ఉండేది అనుకుని సంతోషించారు. ఆ రోజు ఇంటికి వచ్చిన సుమన్, తమ్ముడికి కాల్ చేశాడు.‘‘నా ఫ్రెండ్ ఫారిన్ నుంచి జానీవాకర్ తెచ్చాడు. నా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటున్నాం. నువ్వూ వచ్చి జాయిన్ అవ్వు..’’సుమన్ ఇంట్లో పార్టీ మొదలైంది. కాసేపటికి కాలింగ్‌బెల్ మోగింది. శేఖర్ వెళ్లి తలుపు తీశాడు.ఎదురుగా పోలీసు ఇన్‌స్పెక్టర్, కొందరు కానిస్టేబుల్స్.‘‘మిస్టర్ సుమన్ నిన్ను, నీ తమ్ముడు శేఖర్‌ని అరెస్టు చేస్తున్నాం..’’ సుమన్ దగ్గరకు వచ్చి చెప్పాడు ఇన్‌స్పెక్టర్.‘‘సార్! నన్ను, నా తమ్ముడిని అరెస్టు చేస్తున్నారా? ఎందుకు?’’ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు సుమన్.‘‘ఎందుకా? నీ భార్యను కొండపై నుంచి నీళ్లలోకి తోసి చంపినందుకు..’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్.‘‘నో.. ఊర్మిళ కాలుజారి పడింది..’’ గట్టిగా అన్నాడు సుమన్.‘‘సరే! ఇది చూడు..’’ అంటూ సెల్‌ఫోన్‌లో వీడియో చూపించాడు.శేఖర్ వేగంగా వెళ్లి ఊర్మిళను నెట్టేయడం, అన్నదమ్ములిద్దరూ షేక్‌హేండ్ ఇచ్చుకుంటూ పగలబడి నవ్వడం కనిపించింది.సుమన్, శేఖర్ బిత్తరపోయారు. భయంతో గడగడ వణికిపోయారు. తాము చేసిన పని ఎవరు షూట్‌చేసి పోలీసులకు పంపారో అర్థంకాలేదు.‘‘మిస్టర్ సుమన్! నేరం చేసేవాడు తమను ఎవరూ చూడటం లేదనుకుంటారు. కాని ఎవరో చూస్తుంటారు. ఒక టూరిస్ట్ మీరు చేసిన ఘాతుకం వీడియో షూట్ చేసి మాకు పంపబట్టి మీరు దొరికిపోయారు. తెలుసుకోండి.. నేరందాగదు..’’ చెప్పాడు ఇన్‌స్పెక్టర్.పోలీసు కానిస్టేబుల్స్ అన్నదమ్ములిద్దరికీ బేడీలు వేసి వ్యాన్ ఎక్కించారు.
- వాణిశ్రీ
ఎవరో చూస్తుంటారు
Published Sun, Apr 21 2019 12:55 AM | Last Updated on Sun, Apr 21 2019 12:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment