
‘‘ఏంటిరోయ్ రాంబాబు! తెల్లారకముందే మీయయ్య పల్లకీ భుజానేసుకొని ఊరేగుతున్నావ్?’’ కుక్కిన నులక మంచం భుజాన వేసుకొని వెళ్తున్న రాంబాబును అడిగేడు సుబ్బారావు. ఆ మాటతో రాంబాబు గుండె కలుక్కుమన్నట్టయ్యింది. ఏదో తప్పు చేస్తున్నానన్న అపరాధ భావం వెంటాడుతున్నా బయటకు గాంభీర్యం నటిస్తూ ముందుకు సాగేడు రాంబాబు. రాంబాబును అనుకరిస్తూ రెండు లాల్చీలు, లుంగీలు చేతపట్టుకొని వెళ్ల సాగేడు ఎనిమిది పదుల వయసున్న జగన్నా«థం. ‘‘ఒకప్పుడు ఆయన లేకపోతే ఈ ఊరే లేదు. ఎవులింటిలో ఏ కార్యం జరగాలన్నా ఆ పెద్ద మనిషి అండ లేకపోతే జరిగేది కాదు. ఎవలింటిలో కష్టమైనా తన ఇంటిలో కష్టంలాగ భావించేవాడు. అటువంటి మనిషి కాటికి కాలు చాచుకొని కూర్చొన్న వయస్సులో ఈ కట్టం’’ అని నిట్టూర్చేడు సుబ్బారావు. ‘‘ఆ ముసల్ది సచ్చినకాడి నుంచి ముసిలోడు పాట్లు పడుతున్నాడు’’ అంటూ సుబ్బారావు మాటలకు మాట కలిపేడు సీతంనాయుడు.
రాంబాబు వెంట వచ్చిన జగన్నాథాన్ని చూసి ‘‘ఏమేవ్! మా అయ్య వచ్చాడు ఏంకావాలో సూడు’’ అంటూ వంటింట్లో ఉన్న సాయిలక్ష్మిని కేకేశాడు జగన్నాథం పెద్ద కొడుకు నాగభూషణం. ‘‘వత్తే? నన్నేటి సెయ్యమంతవు. తెచ్చిన మంచం గన్నెని ఆ గడపలో ఏసుకొని తొంగోమను. వంట పూర్తయితే సద్దన్నమేస్తాను’’ అంటూ కాస్తంత చిరాకు, నిర్లక్ష్యం కలకలిపినట్లుగా చెప్పింది సాయిలక్ష్మి. సాయిలక్ష్మి స్వయానా రాంబాబు, నాగభూషణంలకు మేనమామ కూతురు. ఆమె మాట కొంచెం కటువుగా అన్పిస్తుంది, మనిషి మంచిదే. తండ్రిని దిగబెట్టేయడంతో తన పనైపోయిందన్నట్లు రాంబాబు అక్కడ నుంచి నెమ్మదిగా జారుకోసాగేడు. ‘‘కరెక్టుగా నెల అంటే నెల. అంతకు మించి ఒక్క పూట కూడా ఎక్కువ ముసలోడ్ని వాళ్లింటి దగ్గర ఉండనివ్వరు. తెల్లారకముందే తెచ్చి ఈ ఇంట్లో తోసేస్తాడు.’’ రుసరుసలాడింది సాయిలక్ష్మి. కోడలి కోపం గురించి తెలిసిన జగన్నాథం కిక్కురుమనకుండా నులక మంచాన్ని ఇంటి ముంజూరు వద్ద వేసుకొని చిల్లుల దుప్పటి గుడ్డ పరుచుకొని పక్క సర్దుకోసాగేడు. నెల రోజులు ఒకరింట్లో, మరో నెల మరొకరింట్లో ఉంచి ముసలోడిగి గంజి పొయ్యాలని చేసుకున్న ఒప్పందం ప్రకారమే రాంబాబు తన తండ్రిని పెద్దోడైన నాగభూషణం ఇంటివద్ద విడిచి పెట్టి వెళ్లేడు. మరో నెల రోజుల తరువాత రాంబాబు ఇంటివద్ద ఇదే మాదిరిగా వదిలి పెట్టి వస్తాడు నాగభూషణం. ఇది కొన్ని నెలల నుంచి సాగుతున్న ప్రహసనమే. అయినా ముసలివాడు ఇంటికొచ్చేసరికి సాయిలక్ష్మిలో ఎక్కడ లేని రుసరుసలు మొదలయ్యాయి.
ఒక రోజు సాయంత్రం కాయగూరలు తెచ్చేందుకు బజారుకెళ్లిన నాగభూషణం, వాటితో పాటు మేకమాంసాన్ని తీసుకొచ్చాడు. అది చూసిన జగన్నాథంకి ప్రాణం లేచొచ్చినట్టైంది. ఎన్నాళ్లయిందో నోటికి నీచు వాసన తగిలి. పోనీలే ఈ రోజు మళ్లీ కాస్తంత ఇగురైనా తగులుతుందని అనుకోసాగాడు. ఇంట్లోనుంచి మసాల వాసనలు గుభాళిస్తున్నాయి. జగన్నాథం నోట్లో నుంచి నీళ్లు ఊరుతున్నాయి. ఆకలి రెట్టింపవు తోంది. భోజన సమయం ఎప్పుడవుతుందా అంటూ ఎదురు చూడసాగేడు. ‘‘మావయ్యా! కాళ్లూ, చేతులు కడుక్కో.. అన్నం పెడతా’’ కోడలి నుంచి పిలుపు రాగానే ఎక్కడ లేనంత ఆనందం వచ్చింది జగన్నాథానికి. ‘‘కడుక్కున్నానమ్మా..’’ అంటూ సమాధానమిచ్చేడు. అన్నం, కాయగార పెట్టడంతో ఆశలన్నీ నీరుగారినంత పనైంది. ఒక్క ముక్కయినా తెచ్చి పెట్టకపోతుందా అని అన్నం తిన్నంతవరకూ ఎదురు చూసేడు. మాంసంతో భోజనం చెయ్యడానికి సిద్ధపడ్డ జగన్నాథానికి కాయగూరతో ముద్ద నోటికి పోవడం లేదు. ‘‘అమ్మా... బాబు సాయంత్రం మాంసం తీసుకొచ్చినట్టు ఉన్నాడు..?’’ అడగ్గానే సాయిలక్ష్మికి కరెంటు షాక్ కొట్టినంతపనైంది. కాసేపు ఏం చెప్పాలో పాలుపోలేదు. ‘‘మీ బాబు కేజీలు, కేజీలు మాంసం తేలేదు. తెచ్చిన పావుకేజిలో సగం వండి మనవడికి పెట్టాను. మిగిలినది తెల్లారి వండి పెట్టాలని ఆయించి వదిలేశాను. ఆడికి పూర్తిగా రత్తం నేదట. పండ్లు, గుడ్లు, మాంసం, పాలు ఇవ్వాలని డాట్రుగారు సెప్పినారట. నీకు పెట్టకుండా మేము తినేసినట్టు అడుగుతనవు’’ సమాధానం చెప్పింది. ‘‘నిజమే ఆడు బాగుండాల. మనం తినకపోయినా పరవానేదు. రేపో, మాపో పోయేవోళ్లం. ఏంటో ఇప్పుడి పిల్లలు ఎప్పుడు తింతన్రో, ఎప్పుడు పడుకొంతన్రో.., మరి ఆ పిల్లలకి ఆరోగ్యం ఎక్కడనుంచి వత్తది సెప్పు.. మా రోజుల్లో ఇలాంటి సదువుల్లేవమ్మా..! రాము, నాగభూషణయితే తిన్నంత తిని, అది జీర్ణమైనంత వరకూ ఆడుకునే వాళ్లు. ఇంటిపట్టున చేరకుండా తిరిగే వోళ్లు. బడికెళ్లినా అక్కడ కూడా ఆటలే. ఇప్పుడు పిల్లలకి తినడానికీ టైము నేదు. అది జీర్ణం చేసుకోడానికీ టైము నేదు’’ అంటూ పాత రోజుల్లోకెళ్లిపోయాడు జగన్నాథం.
మరుసటి రోజు తెల్లవారు జామయింది. ‘‘ఏమేవ్.. ఎంత పొద్దెక్కిందో సూడు.. ఎడ్లకు దానా పెట్టావా లేదా.. ఏరు తోలాలా వద్దా? ఆ దానా గోళంలో వెయ్యి...’’ అంటూ నిద్ర లేస్తూనే బయటకు వచ్చేడు నాగభూషణం. ఇంటి గడపలో ఓ మూలన ఉన్న కుక్కు మంచంపై ఒత్తికిల్లి పడుకొని మూలుగుతూ కన్పించేడు జగన్నాథం. ‘‘ఏటయ్యింది..?’’ అనుమానంగా వెళ్లి చూశాడు. ‘‘అయ్యా...! ఓరయ్యా...!’’ అంటూ అటూ ఇటూ కదుపుతూ పిలిచాడు. జగన్నాథం నుంచి ఉలుకూ, పలుకూ లేదు. దీంతో గుండె జారినంత పనైంది నాగభూషణానికి. ఒళ్లు కాలిపోతోంది. ముసలోడికి బాగోలేదట్రా అంటూ ఆ నోటా, ఈ నోటా ఊరంతా పాకింది. ఒక్కొక్కరుగా ఊళ్లోని వారంతా వచ్చి మంచం చుట్టూ చేరారు. ఇంతలో పరుగుపరుగున ఊరిలోని వైద్యుడు సూర్యారావును వెంట పెట్టుకొని వచ్చేడు నాగభూషణం. ‘‘ఏం ఫర్వాలేదు. మనిషి బాగా నీరసంగా ఉన్నాడు. సెలైన్ బాటిల్ పెట్టే్టను. మరో అరగంటలో తేరుకుంటాడు’’ అని భరోసా ఇచ్చాడు. దీంతో గ్రామస్తుల ఉత్కంఠకు కొంత తెరపడినట్లు అయింది. డాక్టరు చెప్పినట్లుగానే ఒక సెలైన్ ఎక్కేసరికే జగన్నాథానికి స్పృహ వచ్చింది. అనంతరం కొన్ని మందు బిళ్లలిచ్చి, ‘‘టైముకి మాత్రలు వేయించండి. మంచి తిండి పెట్టండి’’ అంటూ సాయిలక్ష్మి మొహాన ఓ సలహా పడేసిపోయాడు డాక్టరు సూర్యారావు. ‘‘ఆ.. చిన్న కొడుకు ఇంట పంచబక్ష పరమాన్నాల్లు తినొచ్చాడు. మేమే ఆయనగారికి భోజనం పెట్టలేదు’’ అంటూ గొణుక్కొంటూ ఒక్క ఉదుటున ఇంట్లోకి వెళ్లింది సాయిలక్ష్మి. ఇంతలో ఇంటి పక్క ఉన్న అప్పలనరసమ్మను పిలిచి ‘‘చూశావా వదినా! ఈ ముసలి గొరకడికి మేము తిండెట్టనేదట. నువ్వు సూత్తనవు కదా.. ముసలోడికి పెట్టకుండా మేమేమైనా తినెత్తనమా.. మా పరువు ఈదిన పడేయడానికే శనిలాగ దాపురించాడు. మొన్నటికి మొన్న పెసరట్టులు వేశాను. ముసలోడికి తిన్నంత పెట్టమని మీ అన్నయ్య నా పేనాలు తోడేసినాడు. పెట్టానో లేదో ఆ రాత్రంతా అరగకలేదని నానా ఇబ్బంది పడ్డాడు. మంచినీళ్లని, మాత్రలని మాకు నిద్ర లేకుండా చేశాడు. ఆ రోజంతా నిద్ర లేదు. తెల్లారి మరే పని చేతిల పడనే. నాకు ఆరోజంతా నీరసమైపోయింది. సాయి గాడికి కేరేజి వండనేక బడికి పంపించనేకపన్ను. అప్పటికే మీరంతా కూలి పనికి ఎవలి గెంజిబువ్వ పట్టుకొని ఆలు ఎలిపొన్రు. ఈ ఇబ్బందులు ఎవలకీ తెలీవు. పెడితే ఒక బాధ, పెట్టకపోతే మరొక బాధ. చూసినోల్లంతా జగన్నాథం పెద్ద కోడలు ముసలోడికి గెంజి పొయ్యడం నేదని చెవులు కొరుక్కొంటున్నారు. పళ్లు వచ్చినప్పుడు నుంచి తింటున్నాడు. ఇప్పుడు బతికి ఏటి ఉద్దరించేయాలి. బతికినన్నాళ్లూ పోసిన గెంజి తాగి గుట్టుగా బతకడాయె! మేమంట ముసిలోడి ఆస్తి అంతా పడేసుకొని సరిగా గెంజికూడా పొయ్యడం నేదట. ఎదురింటి సూరమ్మ, అచ్చియ్యమ్మ చెవులు కొరుక్కొంటున్నారు. కాదు...! మాకేటి ఇచ్చేసినాడు. ఉన్న ఆరెకరాల భూమిలో ఎకరన్నర భూమి అమ్మీసి చిన్న కూతురికి పెళ్లి చేసినాడు. ముసిల్దాని బంగారమంతా దాని పంచనే పడేసినాడు. మిగిలిన దానిని మాకు పంచి ఇచ్చినాడు. పదవులు దానికి బదవులు మాకు. అంత తగలెట్టినాడు ఒక రోజైనా అది గెంజిపోసిందా.. మమ్మల్ని సాధిస్తున్నాడు’’ అంటూ చెప్పిన మాటలన్నింటికీ అప్పలనరసమ్మ తలాడిస్తూ వచ్చింది.
రాత్రి 8 గంటలు కావస్తోంది. ‘‘అమ్మా మా లచ్చిమీ ఆకలి సంపేస్తుందమ్మా.. సచ్చి నీ కడుపున పుడతాను బుక్కెడు గంజి వెయ్యమ్మా...’’ కేకలేసేడు జగన్నాథం. రాత్రి ఏడు గంటల వరకూ కూలిపనిలో ఉండి ఇంటికొచ్చిన సాయిలక్ష్మి ఇంటిపని, వంటపనిలో బిజీ అయిపోయింది. అప్పుడే అన్నం ఎసరు పోసింది. పొయిలో కర్రలు కూడా తడిసి ఉన్నాయి. పొయిలోనుంచి పొగ తప్ప సరిగా మంట రావడం లేదు. ముసలోడి అరుపులు చూసి ఆమెలో గాబర పెరిగిపోయింది. ‘‘తెత్తానుండు మామయ్యా..’’ అంటూనే, చిరాగ్గా ‘‘ఇప్పుడు పుట్టింది చాలదా? ఇప్పుడు అనుభవించిన దరిద్రం చాలు నాయనా. మళ్లీ మళ్లీ ఇదే చాకిరీ చెయ్యాలా..’’ అంటూ గొణుక్కో సాగింది. ఒకరోజు ఉన్నట్టుండి సాయిలక్ష్మి కన్నవారింటికి వెళ్లాల్సి రావడంతో నాగభూషణం, సాయిలక్ష్మి కుటుంబ సమేతంగా బయల్దేరారు. చెరో నెల చొప్పున ఇద్దరి కొడుకుల వద్ద ఉంచాలనుకున్నారే తప్ప ఇలా ఊరెళ్లినప్పుడు ముసలోణ్ని ఎవరి దగ్గర ఉంచాలనే విషయం మాట్లాడుకోలేదు. ఒప్పందంలో లేకపోయినా మధ్యంతరంగా వండిపెట్టే బాధ్యతను చిన్నకోడలు కామేశ్వరి కాదనలేకపోయింది. జగన్నాథానికి టైముకి భోజనం తెచ్చి వడ్డించేది. దీంతో కామేశ్వరి జగన్నాథం దగ్గర నసగడం ప్రారంభించింది. ‘‘ఆలు ఊరెల్లి నేటికి పది రోజులైపోయింది. నాకు ఏమైనా పని లేదా..? ఈ పది రోజులూ పనికెళ్లలేదు. నేను కూలికి పోతే నీకు మధ్యాహ్నం గెంజిపోసినోలు ఉండరు. నిన్ను వదిలీలేను. పనినీ వదల్లేను. ఏటో మా బతుకులు’’ అంటూ నిట్టూర్చసాగింది.
ఆరోజు రాత్రి ఎప్పటిలాగానే అన్నం తీసుకొని వచ్చిన కామేశ్వరికి జగన్నాథం కన్పించలేదు. ఏమయ్యాడో అర్థం కాలేదు. ఊళ్లో ఆ చివరా, ఈ చివరా ఆరా తీసింది. అందరి ఇళ్లకూ వెళ్లి అడగసాగింది. జాడ కానరాలేదు.
సాయంత్రం ఏడు గంటలు అవుతోంది. పొరుగూరు నుంచి సాయిలక్ష్మి తండ్రి సన్యాసినాయుడు వచ్చేడు. ఆయన మొహంలో అంతకుముందెప్పుడూ అంత కోపాన్ని చూడలేదు. ‘‘అమ్మా, అన్నయ్య ఎలా ఉన్నారు నాన్నా?’’ సాయిలక్ష్మి పలకరింపునకు ఏం బదులివ్వలేదు. ‘‘రాంబాబుని ఒకసారి రమ్మని చెప్పమ్మా’’ ఆదేశించేడు సన్యాసినాయుడు. ఇంతలో రాంబాబు అక్కడకు చేరుకున్నాడు. ‘‘మీ తండ్రిని పెంచలేకపోతున్నారా..! బొబ్బిలి రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకొని బతుకుతున్నాడట. కన్పించిన వాళ్లంతా ‘మీ వీరకాడు అడుక్కొంటున్నాడు’ అంటుంటే తల తీసేసినట్లు అయిపోతోంది. కన్న తండ్రినే పెంచుకోలేని దద్దమ్మలేట్రా మీరు? ఒక పూట తినీ, తినకుండా మిమ్మల్ని ఇంతటోల్ని చేసిన మీయయ్యకు చివరి రోజుల్లో గొప్ప ఆనందాన్ని మిగుల్చుతున్నార్రా..! మీకూ మీ కొడుకులున్నారు గదరా.. మీరూ ముసలోలవుతారు. కొద్దిగా భూమీ ఆకాశం సూడండ్రా.. మరీ ఇంత మూర్ఖంగా ఉండకూడదురా..’’ మందలించేడు. ‘‘అవును మామ.. మేం మూర్ఖులమే. చదువుకోని మూర్ఖులం. నిండా ముంచినా యవసాయాన్నే నమ్ముకున్న మూర్ఖులం. ఆరుగాలం పండిన పంట వరదల్లో కొట్టుకుపోయింది. చేతికి చిల్లిగవ్వ కూడా రాలేదు. పైగా అంతవరకూ పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. పురుగుమందులు, ఎరువులు, విత్తనాల కొనుగోలుకు అప్పులిచ్చిన వారి అప్పు తీర్చేందుకు కూలినే నమ్ముకుంటున్న మూర్ఖులం. పిల్లల కాన్వెంటు ఫీజులు చెల్లించలేక అక్కడ మాన్పించేసి, ఇంటిదగ్గర కూడా సరైన తిండిపెట్టలేక గవర్మెంటు హాస్టళ్లో చేర్పించేసిన మూర్ఖులం. ఇంత జరిగినా ఊరుని, యవసాయాన్ని వదిలి వలస పోలేని మూర్ఖులం. అప్పులోళ్ల బాధలు భరించలేక చావకుండా బతుకుతున్న మూర్ఖులం..’’ అంటూ బోరున విలపించేడు రాంబాబు.
వారి బాధను విన్న సన్యాసినాయుడు వెంటనే అక్కడ నుంచి బయల్దేరి జగన్నాథం వద్దకెళ్లాడు. తనతో పాటు తమ ఇంటికి రావాలని బతిమలాడేడు. ‘‘నా కొడుకుల బతుకు తెరువుకోసం ఎకరో, రెండెకరాలో భూమి ఇస్తే చాలు వాళ్ల రెక్కల కష్టంతో బతికేస్తారనుకున్నాను. వారి రెక్కలనే విరిచేస్తున్నాననుకోనేదు. పంట చేతికి రానేదు. పీకల్లోతు అప్పుల్లో ములిగిపోనారు. ఆలు రైతు బిడ్డలు కదా...! చావనైనా సత్తారు.. గాని నమ్మినోళ్లకు మోసం సెయ్యరు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఇచ్చిన వారి అప్పులు తీర్సడానికి కూలిపనులకెల్తన్రు. ఆల పనులకు నేను అడ్డు కాకూడదు. అందుకే నేను వొచ్చీశాను. నాకు ఎవులూ ఇబ్బంది పెట్టనేదు. నేనే ఇబ్బందిగా మారగూడదనే వొచ్చీశాను. ఏం పర్వానేదు బావ. నాకు చేతకాక, బతకనేక మీ ఇంటికొచ్చీశానని నలుగురి దగ్గరా అపవాదు నాకొద్దు. ఇన్నాళ్లూ ఎలాగో బతికాను. ఈ చివరి రోజులు ఎలాగో ఒకనాగ గడిపేత్తను.’’ అంటూ ఇంతలో వచ్చిన పూరీ, తిరుపతి ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన ప్రయాణికుల వద్దకెళ్లి అడుక్కోవడం ప్రారంభించేడు జగన్నాథం. ఏం చెయ్యాలో తెలీక నిస్సహాయంగా వెనుదిరిగేడు సన్యాసినాయుడు.
- గుల్ల తిరుపతిరావు
Comments
Please login to add a commentAdd a comment