
సాక్షి, హైదరాబాద్: ‘దొంగ.. దొంగ వచ్చాడే.. అన్ని దోచుకు వెళతాడే..’అన్న స్టైల్‌లో కార్లలో వచ్చి, తాళం వేసిన ఇళ్లకు రెక్కీ నిర్వహించి మరీ బంగారు ఆభరణాలు ఎత్తుకెళుతున్న కరుడుగట్టిన దొంగ రాంబాబును సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు రెండు వేర్వేరు ముఠా సభ్యులైన మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి కిలో 54 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు ముఠాల కేసు వివరాలను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం మీడియాకు తెలిపారు.
సింగిల్‌గా వస్తాడు.. దోచేస్తాడు
ఏపీలోని కృష్ణా జిల్లా పెద్ద పరుపుడికి చెందిన గలెంకి రాంబాబు 2006 నుంచి నగరంలోని సినిమా కాంట్రాక్టర్లకు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన రాంబాబు 2014లో చోరీల బాట పట్టడంతో కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 2016 ఆగస్టులో మళ్లీ అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జైలు నుంచి బయటకు వచ్చిన రాంబాబు నార్సింగ్, సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ ఠాణా పరిధిల్లో తొమ్మిది ఇళ్లలో చోరీలు చేసి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు.
చోరీలు చేసిన కారులోనే వెళ్లి, దొంగతనానికి ఎంచుకున్న ఇంటి తాళాలను ఇనుప రాడ్లతో పగులగొట్టి చోరీలు చేశాడు. ఈ సందర్భంగా అడ్డొచ్చిన వారిపైనా దాడులు చేసేవాడు. ఇతనిపై నిఘా ఉంచిన మాదాపూర్ సీసీఎస్ పోలీసు ఇన్‌స్పెక్టర్ వి.సుధీర్, ఎస్‌ఐలు విజయ్ నాయక్, ధరమ్ సింగ్ నేతృత్వంలోని బృందం వలపన్ని కూకట్‌పల్లి ఠాణా పరిధిలో పట్టుకుంది.
అలాగే ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలేనికి చెందిన కర్ని మల్లికార్జున్, కట్టెల అనూప్ కుమార్ ముఠాగా ఏర్పడి రాయదుర్గం, సరూర్‌నగర్, చైతన్యపురి, ఎల్‌బీనగర్, మీర్‌పేటలలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలు చేస్తుండటంతో అప్రమత్తమైన మాదాపూర్ సీసీఎస్ పోలీసులు వీరిని గచ్చిబౌలిలో సోమవారం అరెస్టు చేశారు. రాంబాబుతో పాటు వీరి నుంచి కిలో 54 తులాల బంగారు ఆభరణాలతో పాటు మోటారు సైకిల్, సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్ర ముఠా.. చోరీల్లో దిట్ట..
మహారాష్ట్ర హింగోలి జిల్లాకు చెందిన బలిరాం విశ్వనాథ్ జాదవ్, పిట్ల అంకుశ్, పర్భణి జిల్లాకు చెందిన సుఖ్‌దేవ్ మారుతీ పవార్‌లు నాందేడ్‌లో కిన్వత్ తాలూకాలో కూలీలుగా పనిచేసేవారు. ఇదే సమయంలో ఏర్పడిన పరిచయంతో వీరు ముఠాగా ఏర్పడి చోరీల బాట పట్టారు. 2013 నుంచి తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేస్తున్నారు. అయితే హింగోలి జిల్లాలోని బస్మత్ మండలం బబుల్ గౌన్ గ్రామంలో కలసి చోరీలు చేసేందుకు తెలంగాణ రావాలని నిర్ణయించుకొని వీరంతా రైలులో వచ్చారు.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల వద్ద ఉండి రాత్రి సమయాల్లో చోరీలు చేస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో రోడ్డు పక్కన తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా శామీర్‌పేటలో బంగారు ఆభరణాలు చోరీ చేసిన వీరిని బాలానగర్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతి నేతృత్వంలోని బృందం పక్కా వ్యూహంతో పట్టుకుంది. చోరీ చేసే కొన్ని సమయాల్లో వీరు బాధితులపైన కూడా దాడులు చేసిన సందర్భాలున్నాయి. వీరందరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment