‘దోమ్‌బర్ కొండ నిండా మృతదేహాలు. కొన్ని శవాలను కొండలలోకి, లోయలలోకి విసిరేశారు. గాయాల బాధతో, కొన ఊపిరితో కొట్టుకుంటున్నవారి పరిస్థితి మరీ దారుణం. వారిని అలాగే ఖననం చేసేశారు పోలీసులు. నాలుగు వందల మంది ముండా జాతి గిరిజనులు కాల్పులలో చనిపోయారు.’ మార్చి 25, 1900 నాటి సంచికలో కలకత్తా నుంచి వెలువడే ‘ది స్టేట్స్‌మన్’ పత్రిక వెలువరించిన నివేదిక ఇది. ముండా తెగ పోరులో ఇది పతాక సన్నివేశం. ముండా తెగ పోరాటమే ఇతివృత్తంగా వినిపించే జానపద గీతాలలో ఆ కొండని ‘తుపెడ్ బురు’ అని పిలుచుకోవడం గమనిస్తాం. అంటే శవాల దిబ్బ. ఇక్కడి కొండాకోనలలో వలస పాలన కాలంలో జరిగిన అనేక గిరిజనోద్యమాలకు పట్టిన దుర్గతికి ఇదొక ఉదాహరణ మాత్రమే. నిజానికి నాడు జరిగిన ప్రతి గిరిజనోద్యమ పతాక సన్నివేశం దాదాపు ఇలాగే ఉంటుంది. ఒక శవాల దిబ్బ కనిపిస్తుంది.
ఒక్కొక్క ప్రాంతాన్ని కబళిస్తున్న శ్వేత జాతికి భారతదేశంలో ఎదురైన తొలి గట్టి ప్రతిఘటన ప్లాసీ యుద్ధం. అది 1757లో బెంగాల్‌లో జరిగింది. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పరిపాలన విస్తరించిన తరువాత జరిగిన మరో గొప్ప ప్రతిఘటన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం. ఈస్టిండియా కంపెనీ కింద పనిచేస్తున్న భారతీయ సైనికులని సిపాయీలు అనేవారు. అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా వారు చేసిన సాయుధ సమరమే 1857, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం. ఇవి మైదానాలలో జరిగాయి. నిజానికి ప్లాసీ యుద్ధం జరిగిన ఒక దశాబ్దానికి వంగభూమిలోనే అడవిబిడ్డలు కూడా ఉద్యమించారు. తరువాత భారతదేశ కొండలూ కోనలూ బ్రిటిష్ వలస పాలనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమరనాదంతో మారుమోగాయి. అడవిబిడ్డలు సంప్రదాయక ఆయుధాలతో శ్వేతజాతికి ఎదురు తిరిగారు. వంగభూమిలోనే చౌర్స్ అడవులలోను (1768), అస్సాం వనసీమలలో ఖాసీలు (1835), గుజరాత్, మరాఠా ప్రాంతాలలో కోలీలు (1824–48), కళింగంలో కొంధోలు, బిహార్‌లో సంతాలీలు, కొంచెం తరువాత అక్కడే ముండాలు (1895–1900), రాజస్థాన్‌లో భిల్లులు (1913), మణిపూర్‌లో కుకీలు (1919), నల్లమలలో చెంచులు (1921) అలజడులు రేపారు. అంటే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించడానికి ముందే గిరిజనుల ఆందోళనలు మొగ్గ తొడిగాయి.
ఆ గిరిజనోద్యమాలలో బిహార్‌లోని ఛోటానాగ్‌పూర్, రాంచీ పరిసరాలలో ముండా తెగ గిరిజనులు నిర్వహించిన పోరాటానికి నాయకత్వం వహించినవాడే ‘భగవాన్’ బీర్సా ముండా. బీర్సా ఉద్యమానికి మూలం, లక్ష్యం భూమి మీద తన తెగ ప్రజలు, ఇతర గిరిజన తెగల సోదరులు కోల్పోయిన హక్కు. అంతర్లీనంగా ఉన్న ఈ భావనే ఆయనను ఒక పెద్ద ఉద్యమానికి పురికొల్పింది. వలస పాలన, దాని చట్టాలు అడవులలో వ్యవసాయక విధానాన్ని భూస్వామిక వ్యవస్థలో భాగం చేసింది. దీనికి వ్యతిరేకంగానే అక్కడ ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమం నడిపిన తీరు, నిర్మించిన తీరు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలాగే బీర్సా (నవంబర్ 15, 1875–జూన్ 9,1900) జీవితం కూడా ఒక అద్భుతం. అడవి అందం, కొండగాలి గానం దాన్నిండా కనిపిస్తాయి, వినిపిస్తాయి. బీర్సా జన్మించడానికి ఒక్క సంవత్సరం ముందే ముండా, ఒరాన్ గిరిజన తెగలు తమ భూములను పూర్తిగా కోల్పోయి, థికాదారుల పొలాలలో కూలీలుగా పనిచేస్తూ బతికే స్థితికి చేరుకున్నారు. థికాదారులనే క్లుప్తంగా థికూలు అంటారు. అసలు పోరాటం ఉద్దేశం వలస పాలన మీదే అయినా, గిరిజనులు ప్రత్యక్షంగా పోరాడినది థికూల మీదనే. వీరు మొదట కొన్ని గ్రామాలలో కొంత భూమిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 1875 నాటికి 150 అటవీ గ్రామాల మీద పూర్తి ఆధిపత్యం సాధించారు. ఇలా వలసపాలకుల విధానం అడవులను అల్లకల్లోలం చేసింది. గిరిజనుల భుక్తితో పాటు, వారిదైన జీవితం, సంప్రదాయం కూడా చెదిరిపోయింది.
ముండా ఉద్యమం గురించి స్థానికులు పాడుకునే పాటలలో బీర్సా జన్మించిన ఊరుకు స్పష్టత కనిపించదు. ఉలిహేతు అని కొన్ని, చాల్కాడ్ అని కొన్ని పేర్కొంటున్నాయి. ఇంకో విశేషం– బీర్సా తొలినాళ్లలో అతడి మీద క్రైస్తవం ప్రభావం ఉంది. దానిని ప్రతిబింబిస్తూ అక్కడి జానపద గీతాలలో బీర్సా జనన ఘట్టం మీద కూడా బైబిల్ ప్రభావం కనిపిస్తుంది. అతడు పుట్టే సమయానికి ఉలిహేతు నుంచి చాల్కాడ్‌ను చూపిస్తూ ఒక తోకచుక్క పొడిచిందని ఆ పాటలలో ఉంటుంది. బీర్సా తండ్రి సుగానా. తల్లి కర్మీ. సుగానా వృత్తి ఉమ్మడి వ్యవసాయం. కొందరు కలసి భూమిని సాగు చేసుకునేవారు. ఇతడి కుటుంబమే క్రైస్తవంలోకి మారింది. జర్మనీ మిషనరీలు ముండా తెగ గిరిజనులను మార్చేవారు. కానీ వలస పాలనతో భూమి కోల్పోయిన తరువాత దారిద్య్రంతో వారంతా ఊళ్లు పట్టుకు తిరుగుతూ ఉండేవారు. సుగానా కూడా తన పిల్లలతో, కుటుంబంతో అలాగే తిరిగాడు. అయినా ఈ యాత్ర అంతా బొహందా అడవుల చుట్టూ, సింగ్‌భూమ్ పరిసరాలలోనే సాగేది. ఇవన్నీ ఛోటానాగ్‌పూర్, రాంచీ పరిసరాలలోనే ఉన్నాయి. బీర్సా చిన్నతనంలో థికూల దగ్గర గొర్రెలను మేపడానికి పనికి కుదిరాడు. అతడికి పిల్లనగ్రోవి వాయించడంలో విశేషమైన ప్రతిభ ఉండేది. అలాగే తులియా (గుమ్మడికాయతో చేసే తంత్రీవాద్యం) కూడా మోగించేవాడు. గిరిజన తెగల నృత్య వేదిక (అఖాడా) అంటే బీర్సాకు అపారమైన ఇష్టం. గొర్రెలను సరిగా చూడడం లేదని థికూ ఇతడిని పని నుంచి తొలగించాడు. దీనితో బీర్సా తన బంధువుల అబ్బాయితో కలసి జర్మన్ మిషనరీల పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు. అందుకోసం మతం మార్చుకున్నాడు. ఆ ప్రాంతంలో క్రైస్తవ ప్రచారానికి వచ్చిన ఒక జర్మన్ మిషనరీ ప్రబోధాలు బీర్సాకు బాగా నచ్చాయి కూడా. ఎందుకంటే, మతం మార్చుకుంటే కోల్పోయిన భూములు మళ్లీ మీకు వస్తాయని ఆ మిషనరీ చెప్పడమే ఇందుకు కారణం.
కానీ తరువాత ఆ ప్రచారకుడే సర్దార్లు (ముండాల పెద్దలు) మోసగాళ్లని చెప్పడంతోనే అతడిని బీర్సా ఎదిరించాడు. దీనితో పాఠశాల నుంచి కూడా ఉద్వాసన తప్పలేదు. అప్పుడు మళ్లీ ఆ ప్రాంతంలోనే వైష్ణవం ప్రబోధిస్తున్న ఒక గురువు దగ్గర చేరాడు. మళ్లీ మతం మార్చుకున్నాడు. అతడిని అనుసరించి అతని కుటుంబం కూడా మతం మార్చుకుంది. ఈ రెండు మతాల ప్రభావం కూడా బీర్సా చర్యలలో కనిపిస్తుంది. క్రైస్తవం నుంచి అతడు కొంత శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకున్నాడు. అడవిని ప్రేమించడం, అడవిని, ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్రకృతి ఆరాధన ఇవన్నీ వైష్టవం నుంచి అలవడినాయి. దీనితో అతడు ముండా తెగ వారికి భగవంతుడిలా కనిపించాడు. అందుకే భగవాన్ బీర్సా ముండా అయ్యాడు. బీర్సా భక్తుల తెగ ఒకటి తయారైంది. ‘ధర్తీ అబ’ అన్న అసాధారణమైన బిరుదు కూడా వలచి వచ్చింది. అంటే– నేలకు తండ్రి.
ప్రతి శీతాకాలంలోను గిరిజనులు జ్వరాల బారిన పడేవారు. అందుకు కారణం ఏమిటో బీర్సా సులభంగా గ్రహించాడు. వర్షం నీరును నిల్వ చేసుకునే సంప్రదాయం ఆ అడవులలో ఉండేది. గట్లు వేసి చిన్న చిన్న గుంటలు చేసి వర్షపు నీటిని నిల్వ చేసేవారు. అదే వారికి తాగునీరు. కానీ రోజులు, వారాలు గడిచే కొద్దీ ఆ నీరు కలుషితమయ్యేది. దీనితో జ్వరాలు దాడి చేసేవి. తండాలకు తండాలు కనుమరుగయ్యేవి. ఏటా ఇదొక పెను విషాదం. అందుకే ఇక గుంటలలో నిల్వ నీరు తాగవద్దని, ప్రవాహం నుంచే నీరు తెచ్చుకు తాగాలని, ఇది తనకు భగవంతుడు చెప్పాడని బీర్సా తన తెగ సోదరులకి చెప్పాడు. వారు అలాగే చేశారు. జ్వరాలు రాలేదు. దీనితో బీర్సా వారికి దేవుడయ్యాడు. పైన సూర్యుడు, కింద బీర్సా అనుకున్నారు. ఆ తరువాత అతడు తన తెగ భూములు, వాటిని అదుపులో ఉంచుకున్న థికూల మీద దృష్టి పెట్టాడు. 1882 అటవీ చట్టంతో అడవి బిడ్డలే నష్టపోయారు. థికూలకు మేలు జరిగింది. తన భక్తులనే తన ఉద్యమ అనుచరులుగా మార్చుకుని బీర్సా ఇదే ప్రచారం చేశాడు. థికూలను బహిష్కరించమని పిలుపునిచ్చాడు. ఇదే ఆయన తొలి దశ ఉద్యమం. పోలీసులు అరెస్టు చేసి హజారీబాగ్ జైలులో కొద్దికాలం ఉంచి వదిలిపెట్టారు. ఆ తరువాత 1895లో రెండో దశ ఉద్యమం జరిగింది. ఇది పూర్తిగా సాయుధ సమరం. ఉద్దేశం – ‘అబవ్ దిసున్’. అంటే స్వయం పాలన.
ఈ దఫా ఉద్యమంలో రెండు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని, ఆ తరువాత కొంత సైన్యాన్ని జిల్లా యంత్రాంగం మోహరించింది. అప్పటికే వందల మంది గిరిజనులు బాణాలు ఎక్కుపెట్టారు. థికూలను చంపడం, ఇళ్లు తగలబెట్టడం, పోలీసు స్టేషన్లు కొల్లగొట్టడం వంటి కార్యకలాపాలు చేపట్టారు. ఆ బాణాలకు విషం పూసేవారు. కానీ ప్రభుత్వ బలగాలు పెరిగే సరికి ముండా గిరిజనులు నిస్సహాయులయ్యారు. కొండలలో జల్లెడ పట్టి వారిని వేటాడారు. ఆ క్రమంలో జరిగినదే డోమ్‌బరి కొండ మీది ఘటన. తరువాత మార్చి 3, 1900న బీర్సా జామ్‌కోపాయ్ అడవిలో ఆదమరచి నిద్రపోతూ ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ సందర్భంలోనే మొత్తం 460 మందిని అరెస్టు చేశారు. రాంచీ డిప్యూటీ పోలీసు కమిషనర్ రాసిన లేఖ (నవంబర్ 12,1900) కూడా ఉంది. దాని ప్రకారం 460 మంది మీద తీవ్రమైన కేసులు నమోదు చేశారు. ఒకరికి మరణ దండన పడింది. 39 మందికి ప్రవాస కారాగారం. 23 మందికి జీవిత ఖైదు. విచారణలో ఉండగానే ఆరుగురు మరణించారు. ఇదంతా రాంచీ జైలులో జరిగింది. అక్కడే జూన్ 9, 1900న బీర్సా హఠాత్తుగా కన్నుమూశాడు. అధికారులు మాత్రం అతడు విష జ్వరంతో మరణించాడని చెప్పారు. కానీ విషప్రయోగం వల్లనే చనిపోయాడని సాటి ఖైదీల వాదన. ఈ ఉద్యమానికే చరిత్రలో ఉల్‌గులాన్ అని పేరు.
- డా. గోపరాజు నారాయణరావు
గిరిజన యోధుడు
Published Sun, Jul 29 2018 12:15 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment