సంఘటనా స్థలం వద్ద మృతదేహాలు
రాంచీ : విచక్షణ మరిచిపోయి కుటుంబసభుల్ని సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడో పోలీస్ కానిస్టేబుల్. ఈ సంఘటన జార్ఖండ్‌లోని రాంచీలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాంచీకి చెందిన బ్రిజేశ్ తివారీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాంచీలోని ఓ అద్దె ఇంట్లో భార్య, కొడుకు, కూతరుతో కలిసి నివాసముంటున్నాడు. శనివారం ఫుల్లుగా మద్యం సేవించిన అతడు ముగ్గురు కుటుంబసభ్యుల్ని సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పండారాలో నివాసం ఉంటున్న తన సోదరికి ఫోన్ చేసి ‘ నేను ఆ ముగ్గుర్ని చంపేశాను’ అంటూ కుటుంబసభ్యుల్ని హతమార్చిన సంగతి వివరించాడు. ఆ తర్వాత అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
అతడి మాటలు విని ఖంగారు పడ్డ సోదరి హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లింది. అప్పటికే తివారీ చేతిలో తీవ్రంగా గాయపడ్డ ఆ ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఇంటి యాజమాని సహాయంతో ఆపస్మారక స్థితిలో ఉన్న తివారీని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, తివారీ కూతరు వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉందని, ఇది కచ్చితంగా పరువు హత్యే అయ్యుంటుందని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలం వద్ద మద్యం బాటిల్, ఎలుకల మందు, ఇతర ఔషదాలను పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment