ప్రతీకాత్మక చిత్రం
రాంచీ : బకెట్ నీళ్ల కోసం ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ యువతి హత్యకు దారితీసింది. స్నానం చేయటానికి నీళ్లు తీసుకురాలేదన్న కోపంతో ప్రియురాలిని దారుణంగా హత్యచేసాడో యువకుడు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్‌లోని వెస్ట్ భూమ్‌సింగ్ జిల్లా మహిసబేదా గ్రామానికి చెందిన ఇద్దరు యువతీయువకులు గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. శనివారం ఇద్దరూ కలిసి షాపింగ్ చేయటానికి బయటకు వెళ్లారు. షాపింగ్ అనంతరం యువతి ఉంటున్న అద్దె ఇంటికి తిరిగి వచ్చారు. బయట ఎండకు తిరగటం మూలాన విసుగ్గా ఉందని, స్నానం చేయటానికి దగ్గరే ఉన్న కొళాయినుంచి బకెట్ నీళ్లు తెచ్చిపెట్టమని యువకుడు ప్రియురాలిని అడిగాడు. అయితే ఆమె నువ్వే వెళ్లి తెచ్చుకో అంటూ సమాధానం ఇచ్చింది.
దీంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రియురాలు.. మాటకు మాటా సమాధానం చెప్పటంతో ఆగ్రహించిన యువకుడు కత్తితో ప్రియురాలిపై, ఆమె స్నేహితురాలిపై దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరరాయ్యాడు. ప్రియుడి కత్తి దాడిలో ప్రియురాలు అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన ఆమె స్నేహితురాలిని చక్రధర్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment