ఒంటరి పిచ్చుక | Funday Story On Sparrow | Sakshi
Sakshi News home page

ఒంటరి పిచ్చుక

Published Sun, Mar 15 2020 11:24 AM | Last Updated on Sun, Mar 15 2020 11:24 AM

Funday Story On Sparrow - Sakshi

ఆర్ట్స్‌ కాలేజీ ప్లాట్‌ఫార్మ్‌ మీద నిలబడి ఉన్నాను, గంట ఆలస్యంగా రాబోయే నేనెక్కాల్సిన రైలుబండి కొరకు  నిరీక్షిస్తూ. చేతిసంచిలో ఎప్పుడూ పెట్టుకునే పుస్తకం కూడా పెట్టుకోవడం మరచిపోయానేమో సమయం గడవడం కొంచెం కష్టంగానే ఉంది. ఏం చెయ్యాలో తోచక టైంపాస్‌ కని ప్లాట్ఫార్మ్‌ మీద ఆ చివరనుండి ఈ చివరకు నడవడం ప్రారంభించాను. అటూ ఇటూ చూసుకుంటూ నెమ్మదిగా అదుగులువేస్తున్న నేను ఏదో అదృశ్యశక్తి నా నడుము పట్టుకొని ఆపేసినట్టు ఆగిపోయాను,  ఓ ఇరవై గజాలు నడిచాక....వీనులవిందుగా వినిపిస్తున్న పిచ్చికల కిచకిచలు చెవిన పడడంతో. ప్లాట్ఫార్మ్‌కి కొంచెం దిగువగా ఒక మాదిరి ఎత్తున్న ఒక తుమ్మచెట్టూ, దాని కొమ్మలనిండా కిచకిచలాడుతూ లెక్కలేనన్ని పిచ్చికలూ. అలా ఆ చెట్టుమీదే కాకుండా ప్లాట్ఫార్మ్‌ పక్కనకూడా ఏ మహానుభావుడో, మహానుభావురాలో ప్రేమతో తెచ్చి జల్లిన బియ్యంగింజలు ఏరుకు తింటూ అటూఇటూ హుషారుగా గెంతుతూ కిచకిచమంటున్న ఇంకొకన్ని పిచ్చికలు కూడా. ఆనందంతో అడుగు ముందుకు పడలేదు నాకు.  అబ్బ ఎంతకాలమైంది ఇన్ని పిచ్చికల్ని ఒకేదగ్గర చూసి!

మా చిన్నప్పుడు మేము నిద్రలేచేది ఈ పిచ్చికలు ఉదయాన్నే పాడే మేలుకొలుపు కిచకిచలకే. ఏదో పెద్ద పనున్నట్టు తూరుపు తెల్లారకముందే లేచిపోయి, మా ఇంటిచూరుకు వేలాడదీసిన ధాన్యపుకంకుల గుత్తులమీద వాలి, గోలగోలగా  గింజలు పొడుచుకు తినేవి కొన్నైతే, ఇంట్లో అద్దంముందు తీరికూర్చొని దానిలో కనిపించే వాటి ప్రతిబింబాల్నే వేరే పిచ్చికలనుకొని టకటకమని చప్పుడొచ్చేలా కోపంగా అద్దాన్ని పొడుస్తూ కసితీర్చుకొనేవి కడుపునిండిన మరికొన్ని. మాది పెద్ద పెంకుటిల్లేమో, చాలా పిచ్చికలు పెంకులకింద చూరుల్లో గూళ్ళుకట్టుకొని, సంసారంచేసి, గుడ్లుపెట్టి, వాటిని పిల్లల్ని కూడా చేసి తమ జన్మ సార్థకం చేసుకొనేవి.  అప్పుడప్పుడూ ప్రమాదవశాత్తూ ఏదైనా గూడు  క్రిందపడిపోతే, అలా పడిపోయిన గూట్లో దురదృష్టవశాత్తూ  గుడ్లుండి అవి చితికిపోతే, గూడూ గుడ్లూ కోల్పోయిన పిచ్చికల జంట చేసే హృయవిదారకమైన ఆర్తనాదాలు అంత చిన్నవయసులో కూడా మాకు కళ్ళమ్మట నీళ్ళు తెప్పించేవి.

మా ఇంటిపిచ్చికలు కడుపునిండా మేయడానికి ధాన్యంకంకులు  వేలాడదీయడమే కాకుండా, వేసవికాలంలో అవి మాత్రమేకాక ఇతర పక్షులు కూడా తాగడానికి వీలుగా ఇంటిముందున్న వేపచెట్టుకి రెండుమూడు మట్టి దాకలు వేలాడదీసి, అవి ఎప్పుడూ నీళ్ళతో నిండి ఉండే ఏర్పాటు, నాన్న చేసేవారేమో, వేసవికాలం మధ్యాహ్నం నీళ్ళు తాగడానికి వచ్చే రకరకాల పక్షులతో శోభాయమానంగా ఉండేది మా వేపచెట్టు. కొంచెం పెద్దవాళ్ళమయ్యాక పిచ్చికల్ని దూరం నుండి చూసి ఆనందించడం మాత్రమేకాక వాటిని పట్టుకొని ఆడుకుంటే బాగుంటుంది అనిపించేది. 
∙∙ 
ఇప్పుడు ప్రతీరోజూ సాధ్యమైనంత సమయం పిచ్చికలతో గడపడమే ముఖ్యమైనవ్యాపకం అయిపోయింది నాకు. రైలు ఎంత ఆలస్యంగా వచ్చినా  విసుగనిపించేది కాదు సరికదా,  కనీసం ఒక పావుగంటైనా ఆలశ్యంగా వస్తే బాగుండునని కూడా కోరుకునేవాడ్ని. శెలవురోజుల్లో కూడా వాకింగ్‌ వంక పెట్టుకొని వాటిని చూడ్డానికి వెళ్ళిపోయేవాడ్ని ఉదయాన్నే లేచి. నాలాగే పిచ్చికల్ని  ప్రేమించే  ఇద్దరు నిత్యప్రయాణికులతో (కమ్యూటర్స్‌)తో పరిచయం ఏర్పడింది నాకు. అతికొద్ది రోజుల్లోనే మేం ముగ్గురం మంచి స్నేహితులమైపోయాంకూడా. రోజుకొకరి వంతున అవి తినడానికి బియ్యం గాని వేరే చిరుధాన్యాలుగాని తీసుకెళ్ళి వాటిముందు జల్లి,  అవి కిచకిచలాడుతూ ఆ గింజలు తింటుంటే ఆనందంతో చూస్తూ నిలుచునేవాళ్ళం రైలు వచ్చేవరకూ. రెండుమూడు నెలల్లో అవి మాకెంత మాలిమి అయ్యాయంటే, మా ముగ్గురిలో ఎవరైనా చేతిలో కొన్ని బియ్యంగింజలు ఉంచుకొని చెయ్యి చాపి నిలబడితే, కనీసం మూడు నాలుగు పిచ్చికలు ఆ చేతిమీద వాలి  దానిలో గింజలు హాయిగా తినేవి

కొంచెమైనా భయంలేకుండా.  గడిచిన ఆరేడు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నాను నేను పిచ్చికలతో నా సాంగత్యం మొదలైన దగ్గరనుండీ. నా భార్య అయితే ‘‘ముంబాయిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుండే వాడివి. పచ్చని చెట్టు కనిపించినా, చిన్నపిట్ట కనిపించినా చిన్నపిల్లాడిలా ఆనందపడిపోయేవాడివి. ఈమధ్య అయితే ఎప్పుడూ అలానే ఉంటున్నావు హుషారుగా’’ అని ఎన్నిసార్లు అందో చెప్పలేను.   పిల్లలూ కూడా అదే మాట. హాయిగా శిక్షణకేంద్రంలో పాఠాలు చెప్పుకోవడం, రోజూ కొంచెం సమయం పిచ్చికలతో గడపడం...ఆరునెలల కాలం ఆరు క్షణాల్లా గడిచిపోయింది. వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం తోసుకు వచ్చింది. ట్రైన్‌ టైంలో వర్షం పడుతుంటే తప్ప పిచ్చికలతో గడిపే నా  టైం టేబుల్‌లో మాత్రం మార్పేమీ రాలేదు.

కాకపోతే వర్షాలు కాస్త గట్టిగా కురుస్తుండడంతో స్టేషన్లో రకరకాల పిచ్చిమొక్కలూ, పాదులూ విపరీతంగా పెరిగిపోయి, చుట్టుపక్కలంతా చిన్నపాటి చిట్టడివిలా తయారైంది. చీకటి పడ్డాక, ‘లేట్‌ నైట్‌ ట్రైన్‌’ దిగి అడ్డదారిలో వెళ్ళిన ఒకరిద్దరికి పాములుకూడా తారసపడడం వారు రైల్వే అధికారులకి ఫిర్యాదు చెయ్యడంకూడా జరిగిందట. అందుకేనేమో  ఒకరోజు ఉదయాన్నే మామూలుగా స్టేషన్కి వెళ్ళే సమయానికి  కొంతమంది గేంగ్‌ మెన్‌లు అక్కడ ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కల్ని కొట్టేస్తూ కనిపించారు. అలవాటుగా పిచ్చికలకి పెట్టాల్సిన మేత వాటికి పెట్టేసి, నాదారిన నేను వెళ్ళిపోయాను పెద్దగా పట్టించుకోకుండా.  సాయంత్రం శిక్షణకేంద్రంలో ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం ఉండడంతో తిరిగిరావడం బాగా ఆలశ్యం అయ్యి చీకటి పడిపోయింది. మరుసటిరోజు ఉదయంనుంచే  చిన్నగా తుప్పర పడడం మొదలైంది.

తడుస్తూనే స్టేషన్కి చేరుకున్న నాకు ఎక్కడా ఒక్క పిచ్చిమొక్కగాని పాదుగాని కనబడలేదు. స్టేషన్‌ ఆవరణ అంతా  శుభ్రంగా ఉంది. అది చూసి ఆనందించాల్సినది బదులు నా మనసు ఎందుకోగాని కీడుని శంకించింది. అదురుతున్న గుండెలతో మా పిచ్చికలచెట్టువేపు అడుగులు వేసాను. నాలుగు అంగల్లో  అక్కడికి చేరుకున్న నాకు, అక్కడ కనిపించిన దృశ్యానికి గుండె ఆగిపోయినంత పనయ్యింది. నిస్సహాయంగా కూలబడిపోయాను పక్కనే ఉన్న సిమెంట్‌ బెంచిమీద. 
ఎప్పుడూ పిచ్చికలతో కళకళలాడే మాపిచ్చికలచెట్టు మొదలంటా నరికివేయబడి ఉంది. రెండడుగుల కాండం మాత్రం మిగిలిఉంది వికృతంగా  కనిపిస్తూ. అలా మిగిలిఉన్న  మొండిమొదలు మీద  కూర్చొని ఉంది ఒకేఒక పిచ్చిక...చిన్నగా కురుస్తున్న వర్షంలో నిస్సహాయంగా తడుస్తూ....జాలిగా శూన్యంలోకి చూస్తూ... అంతే... ఆరోజు తరవాత మళ్ళీ ఎప్పుడూ ఆ స్టేషన్‌ లో అడుగుపెట్టిన పాపాన పోలేదు నేను.  
– కృపాకర్‌ పోతుల హైదరాబాద్‌ (మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement