
ఆ అద్భుత సౌందర్యానికి కళ్లు తిప్పుకోలేకపోయాను. సన్నగా పొడుగ్గా ఉంది. బ్రెడ్డు రంగులో నున్నటి చర్మం. ఆకుపచ్చ బాదంకాయల్లాంటి కళ్లు, భుజాల మీదికి జుట్టు. కాలంతో కొలవలేని అందం అది. ఇండోనీషియన్ లేదా ఆండియన్ (దక్షణ మధ్య అమెరికా ప్రాంతం) కావచ్చు. ఆమె డ్రెస్ సెన్సు గొప్పది. లింక్స్ (అడవి పిల్లి) జాకెట్, ముతక ఖద్దరు బ్లౌజు, కాటన్ ప్యాంటు, బోగెన్‌విల్లా రంగుల్లో బూట్లు. ‘ఇంతటి లావణ్యరాశిని ఒక్కసారైనా చూసినందుకు జీవితం ధన్యమైంది’ అనుకున్నాను. పారిస్‌లోని చార్ల్స్ డిగాల్ ఎయిర్‌పోర్టులో చెక్–ఇన్ లైన్‌లో నిల్చున్న నా పక్కనుంచి ఆడసింహంలా నడిచివెళ్లిందా సుందరి. నేను న్యూయార్క్ వెళ్లాలి. ఆమె నిజంగా నాకు కనిపించిందా? లేక భ్రమా? ఒక లిప్తపాటు దర్శనమిచ్చి టెర్మినస్‌లోని ఒక సందోహంలో అదృశ్యమైంది. ఉదయం, రాత్రంతా మంచు కురిసింది. వీధుల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. హైవేల మీద కూడా ట్రాఫిక్ వేగంగా కదలడం లేదు. రోడ్ల పక్కన కార్లు, ట్రక్కులు వరుసగా పార్క్ చేసి ఉన్నాయి. బైట వాతావరణం ఎలా ఉంటేనేం, ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో సుఖంగానే ఉంది.
లైన్లో ఒక డచ్ స్త్రీ వెనకాల నిల్చున్నాను. ఆమె తన పదకొండు సూటుకేసుల బరువు గురించి కౌంటర్లో ఉన్న వాళ్లతో ఎడతెగని వాదన చేస్తున్నది. విసుగ్గా ఉంది. ఆ అలౌకిక సుందరి దర్శనంతో ముగ్ధుణ్ణయిన నేను వాదులాట ఎలా ముగిసిందో గమనించలేదు. నా పరధ్యానానికి కౌంటర్ క్లర్కు నావైపు కోపంగా చూసింది. ఏదోరకంగా మాటలు కలపాలని ‘‘లవ్ ఎట్ ఫస్ట్ నమ్ముతావా?’’ అని అడిగాను. ‘‘అఫ్‌కోర్స్, మరే పద్ధతిలోనూ ప్రేమలో పడటం అసాధ్యం’’ అంటూ ‘‘సీటు స్మోకింగ్ సెక్షన్‌లో కావాలా? నాన్ స్మోకింగ్ సెక్షన్‌లో కావాలా?’’ అని అడిగింది.‘‘ఎక్కడైనా ఫర్వాలేదు. డచ్ లగేజి పక్కన మాత్రం వద్దు’’ అన్నాను వ్యంగ్యంగా.‘‘ఏ నంబర్ కావాలి? 3, 4, 7?’’‘‘నాలుగు’’‘‘పదిహేనేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను. ఏడో నంబర్ ఎంచుకోని మొదటి పాసెంజర్ మీరే’’ అంటూ బోర్డింగ్ పాస్ మీద నంబర్ రాసిచ్చింది. వెనక్కి తిరిగానో లేదో నా దేవత మళ్లీ కనిపించింది. ఎయిర్‌పోర్టును మూసేశారని, అన్ని ఫ్లైట్స్ ఆలస్యంగా బయల్దేరతాయని ప్రకటించింది క్లర్కు.
‘‘ఆలస్యమంటే ఎన్ని గంటలు?’’‘‘తెలియదు. ఈ సంవత్సరం వచ్చిన అతి పెద్ద మంచు తుఫాను’’ అని ప్రకటించారు రేడియోలో. అది శుద్ధ తప్పు. ఈ సంవత్సరం కాదు. ఈ శతాబ్దంలోనే ఇంత పెద్ద తుఫాను రాలేదు. అయినా ఫస్ట్‌క్లాస్ వెయిటింగ్ రూంలో సదుపాయాలకేం కొదవ. మనోహరమైన సంగీతం వినిపిస్తుంది. నగరంలో తుఫాను వచ్చినా మాకు మాత్రం వసంతమే. అప్పుడు తట్టింది. నా వూర్వశి ఇక్కడ ఉండే అవకాశం లేకపోలేదు. వెయిటింగ్ హాలంతా గాలించాను. నా తెగువకు నాకే ఆశ్చర్యం వేసింది. ప్రయాణికులందరూ అక్కడికే చేరుకుంటున్నారు. సీట్లు దొరికిన పురుషులు ఇంగ్లిష్ వార్తపత్రికలు చదువుతున్నారు. వాళ్ల భార్యలు తమ తమ కలల రాకుమారుల కోసం కిటికీల్లోంచి కనిపించే మంచులో వెదుకుతున్నారు. మధ్యాహ్నం వరకు సీట్లన్నీ నిండిపోయాయి. అందరూ పోగవడంతో వేడి ఎంత పెరిగిందంటే ఆ ఉక్కను భరించలేక హాలు దాటి రాక తప్పలేదు.
అక్కడా అదే దృశ్యం. ఇతర వెయిటింగ్ రూములు, కారిడార్స్ జనంతో కిక్కిరిసిపోయాయి. పెంపుడు జంతువులు, పిల్లలు, లగేజీతో ప్రయాణీకులు.. నగరంతో సంబంధాలు తెగిపోయాయి. నా నమ్మకం బలపడింది. ‘ఆవిడ’ ఇక్కడే ఎక్కడో ఉండక తప్పదు. మంచు తుఫానులో చిక్కుకున్న ప్లాస్టిక్ కాప్సూల్‌లాగుంది ఎయిర్‌పోర్టు.లంచ్‌టైం వరకు అర్థమైంది. మేం చిక్కుకుపోయాం. రెస్టారెంట్లు, కెఫెటేరియాలు, బార్ల వద్ద పొడుగాటి క్యూలు. తినడానికీ, తాగడానికీ ఏమీ మిగలకపోవడంతో మూడు గంటల తర్వాత అన్నీ మూసేశారు. చంటిపిల్లలు ఏడుపు లంకించుకున్నారు. జనమంతా ఎడం లేకుండా నిలబడటంతో ఓ రకమైన వాసన వ్యాపించింది. తినడానికేమీ లేదనుకుంటున్నప్పుడు పిల్లల దుకాణంలో రెండు కప్పుల వెనిల్లా ఐస్‌క్రీం దొరికింది. హోటళ్లు ఖాళీ కావడంతో టేబుళ్ల మీద కుర్చీలు పేర్చుతున్నారు. దూరంగా నిల్చుని ఐస్‌క్రీం తింటున్నాను గానీ నా కళ్లు ఆమె కోసమే వెదికాయి. ఉదయం పడకొండు గంటలకు న్యూయార్క్‌కు బయల్దేరాల్సిన విమానం.. రాత్రి ఎనిమిదింటికి బయల్దేరింది. నేను లోపలికి వెళ్లేసరికే సీట్లలో జనం కూర్చున్నారు. ఫ్లైట్ అటెండెంట్ నన్ను నా సీటు వద్దకు తీసుకెళ్లింది. అంతే, ఒక్కసారి గుండాగినంత పనైంది. నా పక్కన విండో సీటు ఆమెదే. ‘ఇలా జరిగింది’ అని రాస్తే ఎవరూ నమ్మరు కదా అనిపించింది. తడబడుతూ విష్ చేశాను కానీ ఆమె వినిపించుకున్నట్లు లేదు.
జీవితమంతా అక్కడే గడపబోతున్నట్లుగా సుఖంగా సీట్లో సెటిలయ్యాను. ఇంట్లో సర్దుకున్నట్లుగానే తన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్దుకుంది. న్యూయార్క్ దాకా అదే ఆమె స్థిరనివాసం. ‘వెల్కం షాంపేన్’ తీసుకొచ్చాడు స్టువార్డ్. నేను గ్లాస్ అందుకుని ఆమెకు ఆఫర్ చేయబోయాను. కానీ, అర్థంకాని ఫ్రెంచ్‌లో వచ్చీరాని ఇంగ్లిష్‌లో నీళ్లు మాత్రమే కావాలంది స్టువార్డుతో. అంతేకాదు ఫ్లైట్‌లో తనను లేపకూడదని కూడా సూచించింది. గొంతు గంభీరంగా ఉంది. ఆ స్వర్ణంలో తూర్పు దేశాల విషాదం దాగి ఉందనిపించింది. స్టువార్డు నీళ్లు తేగానే ఆమె తన కాస్మెటిక్స్ బాక్స్ తెరిచి, అందులో ఉన్న రంగురంగుల బిళ్లలోంచి రెండు బంగారు బిళ్లలు చేతిలోకి తీసుకుంది. ఆమె ప్రతి కదలికా, ఎంతో నెమ్మదిగా, జాగ్రత్తగా ఉంది. జీవితంలో ఎప్పుడూ ఏ అనుకోని సంఘటనా జరగలేదేమోనన్నంత ధీమాగా ఉందామె ప్రవర్తన. చివరికి, విండోషేడ్ కిందికి దించి, సీట్ బ్యాక్ వీలైనంత వెనక్కి వంచి, నడుం దాకా బ్లాంకెట్ కప్పుకుని, కళ్లమీద స్లీపింగ్ మాస్క్ పెట్టుకుని, అటు తిరిగి పడుకుంది. అంతే, న్యూయార్క్ చేరిన ఎనిమిది (ఎంతకూ గడవని) గంటల, అదనపు పన్నెండు నిమిషాలు ఆమె మరి కదలలేదు.
ప్రయాణికుల సహనాన్ని పరీక్షించిన ఫ్లైట్ అది. ఈ సృష్టిలో అందమైన పడతి కన్నా అందమైనదేమీ లేదని నా గట్టి నమ్మకం. కాని నా పక్కనున్న సుందరి నిద్రాలోకంలో విహరించింది. టేకాఫ్ తర్వాత, స్టువార్డుకు బదులు మరో అటెండెంట్ వచ్చి ఆమెకు టాయ్‌లెట్రీ కేస్, సంగీతం వినడానికి ఇయర్ ఫోన్స్ ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ, ఆమె డిస్టర్బ్ చెయ్యవద్దని కోరిందని చెప్పాను. కాని ఆ మాట ఆమె స్వయంగా చెప్పాలన్నాడు. భోజనం కూడా వద్దా, ఆమె తన సీట్లో ‘డునాట్ డిస్టర్బ్’ ట్యాగ్ పెట్టుకోనందుకు నావైపు అసహనంగా చూశాడు.కంపెనీలేక ఒంటరిగా భోజనం ముగించాను. మెలకువగా ఉంటే ఆమెతో చెప్పాల్సిన కబుర్లన్నీ నాలో నేనే చెప్పుకున్నాను. ఆమె ఎంత గాఢ నిద్రలోకి జారుకుందంటే ఆమె తీసుకున్నవి నిద్రమాత్రలా లేక విషం గుళికలా అన్న సందేహం వచ్చింది. డ్రింక్ తీసుకున్న ప్రతిసారీ, ‘టు యువర్ హెల్త్, బ్యూటీ’ అంటూ టోస్ట్ చేశాను.భోజనం తర్వాత లైటాఫ్ చేశారు. ఆ చీకట్లో ఏదో సినిమా చూపించారు కానీ, ప్రపంచమంతా నిండిన అంధకారంలో మేమిద్దరమే ఒంటరిగా మిగిలాం. ఈ శతాబ్దపు అతి పెద్ద తుఫాను తీవ్రత తగ్గింది. అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రశాంతంగా అంధకారం పరుచుకుంది. నక్షత్రాల కింద విమానం నిశ్చలంగా ఉన్నట్లనిపించింది. గంటల తరబడి, అంగుళం అంగుళం ఆమె గురించి ఆలోచించాను. ధ్యానించాను. చలనం లేదు కలల నీడలు కదలాడుతున్నట్లుగా నుదిటిమీద ఏర్పడిన సన్నని రేఖలు తప్ప. ప్రశాంతమైన నీటి మీద తేలియాడుతున్న మేఘాల్లా ఉన్నాయవి. మెళ్లో సన్నని గొలుసుంది కానీ, ఆమె బంగారు రంగు చర్మం మీద అది కనిపించడమే లేదు. చెవులకు రంధ్రాలు లేవు. గోళ్లు గులాబీ రంగులో ఉన్నాయి. ఎడమ చేతికో ఉంగరముంది. ఆమెకు ఇంకా ఇరవై ఏళ్లు కూడా దాటినట్లు లేవు కనుక ఇది పెళ్లి ఉంగరం కాదు. ఎంగేజ్‌మెంట్ రింగ్ అయివుంటుందని సమాధానం చెప్పుకున్నాను. షాంపేన్ నురగను చూస్తుంటే ‘రెండు చేతులకూ సంకెళ్లున్న నాకు నువ్వు సర్వసంగ పరిత్యాగిలా కనిపిస్తున్నావు’ అన్న జెరార్డో డియేగో కవిత స్ఫురించింది. నేను కూడా సీటు పుష్ చేసి వెనక్కు వాలాను – పక్కపక్కనే. పందిరి మంచంలో నవ దంపతులు కూడా అంత దగ్గరగా పడుకుని ఉండరు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆమె గొంతులాగే గంభీరంగా ఉన్నాయి. చర్మం కూడా ఊపిరి పీల్చుకుంటున్నట్లే పరిమళం విరజిమ్ముతోంది. ఇదో వింత అనుభవం.
షాంపేను, మ్యూట్‌లో పెట్టిన సినిమా దృశ్యాలూ నిద్రకు సహకరించాయి. చాలా సేపు నిద్రపోయాను. తలనొప్పి పెరిగి మెలకువ వచ్చింది. బాత్‌రూంకి వెళ్లి వచ్చాను. రెండు సీట్ల వెనకాల పదకొండు సూటుకేసులావిడ. యుద్ధరంగంలో వదిలేసిన మృతదేవతలా వికృతంగా కాళ్లు చాపుకుని పడుకుంది. గొలుసుకు కట్టిన కళ్లద్దాలు సీట్ల మధ్య పడి ఉన్నాయి. ఎవరైనా తొక్కితే విరిగిపోక తప్పదు. అయినా వాటిని తీసి ఆమెకు అందించాలనే కోరికను అణచుకుని చిలిపి ఆనందం అనుభవించాను.షాంపేను మత్తు దిగింతర్వాత అద్దంలో మొహం చూసుకున్నాను. అసహ్యంగా ఉంది. ప్రేమ పర్యవసానం ఇంత దారణంగా ఉంటుందా? విమానం ఆల్టిట్యూడ్ తగ్గి, మళ్లీ పైకి లేచి ముందుకు దూసుకెళ్లింది.‘రిటర్న్ టు యువర్ సీట్’ సైన్ వెలిగింది. విమానం కుదుపుకైనా ఆమె కళ్లు తెరిచి భయంతో నా చేతుల్లో వాలకపోతుందా అనుకున్నాను. ఆ తొందరలో డచ్ ఆవిడ కళ్లద్దాల మీద కాలు పడేదే కానీ తమాయించుకున్నాను (తొక్కనందుకు నన్ను నేను తిట్టుకున్నాను. అయినా సీటు నంబరు నాలుగు ఆమె ఎంచుకోనందుకు కృతజ్ఞతగా కళ్లద్దాలు తీసి ఆమె ఒళ్లో వేశాను.)నా సుందరికి నిద్రాభంగం చేయడం అసాధ్యం. ఆమె భుజాలు విదిలించి లేపాలనే కోరికను అతి ప్రయత్నం మీద అణచుకున్నాను. తనకు కోపమొచ్చినా సరే. ప్రయాణంలోని ఈ చివరి గంటలోనైనా ఆమె కళ్లు తెరిస్తే బాగుండును. ఆమె లేస్తే తప్ప నాకు విముక్తి దొరకదు. ఆమె లేస్తేనే నా యవ్వనానికి సార్థకత. చివరికి నిస్సహాయంగా వృషభరాశిలో పుట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను.ల్యాండింగ్ లైట్స్ వెలగగానే ఆమె తనకుతానే దిగ్గున లేచింది. గులాబీ తోటలో పడుకుని లేచినట్టు ఇనుమడించిన అందంతో ఫ్రెష్‌గా కనిపించింది. అప్పుడు తెలిసింది. రాత్రంతా పక్కపక్కనే పడుకున్న దంపతులు తెల్లవారి గుడ్‌మార్నింగ్ చెప్పుకున్నట్లుగా, పక్క సీట్లలో ఉన్న విమాన ప్రయాణికులు ఏ అభివాదమూ చేసుకోరని. నాకేసైనా చూడలేదామె. స్లీపింగ్ మాస్క్ తొలగించగానే ఆమె కళ్లు మిలమిలా మెరిశాయి. సీటు ముందుకు లాక్కుంది. బ్లాంకెట్ తొలగించింది. జుత్తు వదులు చేసుకోగానే మళ్లీ భుజాల మీదకి జారింది. కాస్మెటిక్స్ బాక్స్ ఒళ్లో పెట్టుకుని అవసరం లేని మేకప్ చేసుకుంది. విమానం డోర్ తెరిచిందాకా ఒక్కసారంటే ఒక్కసారైనా నా వైపు చూడలేదు. మళ్లీ లింక్స్ జాకెట్ వేసుకుని, నా కాళ్లు తొక్కుకుంటూ మొక్కుబడిగా లాటిన్ అమెరికన్ స్పానిష్‌లో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అంటూ ముందుకెళ్లింది. ఆమె సుఖ ప్రయాణానికి, సుఖనిద్రకు నేను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పలేదు. గుడ్‌బై కూడా చెప్పలేదు. అంతే మరి కాసేపటికి న్యూయార్క్ అనబడే అమెజాన్ మహారణ్యంలో అదృశ్యమైపోయింది.
స్పానిష్ మూలం : గేబ్రియల్ గార్సియా మార్కెజ్
అనువాదం: ముక్తవరం పార్థసారథి
Comments
Please login to add a commentAdd a comment