మావా! సుందరం మావా!!  | Funday story of the week | Sakshi
Sakshi News home page

మావా! సుందరం మావా!! 

Published Sun, Mar 3 2019 12:45 AM | Last Updated on Sun, Mar 3 2019 12:45 AM

Funday story of the week - Sakshi

‘‘ద్రౌపదమ్మ తిరునాళ్లకి పోవాలిరా పాండురంగా!  మరవమాకు. వచ్చే మూడో శనివారం రథంలాగుడు, ఆదివారం అగ్గి తొక్కేది’’.  పంచె ఎగగట్టుకుంటూ మీసాలు లాగుకుంటూ మేనల్లుడు పాండురంగంతో సుందరం మావ చెప్పినాడు. ‘‘పుత్తూరు తిరునాళ్లకి మావ తోడుగా పోయిరారా కొడకా!  ద్రౌపదమ్మని మొక్కితే సెడ్డాగిడ్డా కొట్టకపోతాది.  బాగుపడతావ్‌’’ అని అరస్తా సెప్పింది అమ్మ అనసూయమ్మ. నల్లంగా, జెండామానులగా వుంటాడు సుందరం మావ. అయిదారు ఊర్లల్లో అందరితోనూ అడ్డంగా మాట్లాడతాడు. అందరూ సమానమే! ‘అందరూ కుడిసేత్తో తిని ఎడంసేత్తో కడుక్కొనేటోళ్లేకదా’ అని ఎగిరెగిరి చెబుతాడు. ‘అందరూ ఎట్లా సమానమవుతారని?’ ఊర్లో నోర్లంతా మావని తిడతా వుంటాయి. అయినా అమ్మకి మావ భలే మంచోడు. ఎంతయినా తోడబుట్టినోడు కదా, సందు పోనిస్తదా ఏంటి? 
 
‘మేనమామ మాట మల్లెలమూట’ అంటంది అమ్మ.  ‘మేనమామ మాట సద్దిమూట’ అనికూడా అంటంది. ‘మావ సెప్పినట్టు వినరా కొడకా, సుఖపడతవ్‌’ అంటుంది. మావ ‘నీ మంచి కోరేటోడేగానీ నీకు సీమంత సెడ్డ సేయడురా కొడకా’ అంటుంది.  ‘ఇంట్లో దేముడి ఫోటోలు తీసేసి మావ ఫోటోలు పెడ్తాంరా కొడకా’ అని రెండు మూడు సార్లు చెప్పింది కూడా. అట్టాంటి మావతో మేనల్లుడు తిరునాళ్లకి బయలుదేరినాడు. చేంద బావి నీళ్లు తలపైన పోసుకొని ముఖంపైన మురుగడి  విభూది పెట్టి పాలమంగళం పంచె కట్టి రెడీ అయినాడు. జేబులో సిల్లరేసుకొని రంగురంగుల సొక్కా వేసుకొని  వచ్చీరాని మీసాలను దువ్వెనతో దువ్వి పూలరంగడి లెక్కన రాసపల్లి నుంచి బయలుదేరినాడు. 

దారిన పోతావుంటే నల్లరంగన్న, ఎర్రరంగన్న, పొడల పాలాయన, మెల్లకన్ను మునిలక్ష్మి, బొజ్జనత్తం బండారామన్నలు పలకరించినారు. నిలబడి అవీయివీ మాట్లాడినారు మావా అల్లుళ్లు.నరసింహన్న కూతురు భాగ్యలక్ష్మి సింగారంగా కొప్పునిండా కనకాంబరాలు పెట్టి ఎదురువచ్చినాది. ఆయమ్మి చీరకట్టేది కొత్తో ఏమో!  చీరని ఒంటికి కట్టుకోలా. ఒంటికి చుట్టుకున్నట్టుగా వుంది. గట్టిగా నవ్వితే నడుంనుంచి చీర బొడ్డు కిందికి జారిపోయేట్టు  గట్టిగా తుమ్మితే ఊడి పడిపోయేట్టుగా కట్టి వుండాది.  చీర కట్టడాలు అమ్మలక్కలు నేర్పిస్తే కదా పాపం. ఆయమ్మిని పలకరిద్దామని పాండురంగం నిలిచినాడు. ఆయమ్మి వాడిని చూసీచూడనట్టుగా దాటుకొని వెళ్లిపోయింది.‘ఎంతయినా పెండ్లి కావాల్సిన పిల్లకదా! ....కొంచెం బలుపు వుంటాదిలే’ అనుకొని గమ్మున నడిచినాడు.రెడ్డోళ్ల బావికాడికి పోయేసరికి మీసాలాయన కొడుకు జ్యోతిరాజు గాడు కానవచ్చినాడు.  చెరుకుగడలు ముందుర వేసుకొని కసాకసా నమలతా వుండాడు. పలకరిస్తే పలకలేనంతగా నోటితోనే గానుగ ఆడిస్తావుండాడు.పోతాపోతా బావి ప్రక్కన మునగసెట్టు కాడ నిలిచినాడు సుందరం మావ. జ్యోతిరాజుకి కానరాకుండా నాలుగు మునగకాయలు కోసినాడు.‘‘మునగ కాయలు మనకి దేనికి మావా!  మన కయ్యికాడ దండిగా వుండాయి కదా’’ అని పాండురంగం చెప్పినాడు. ‘మన తోటలో మునక్కాయ మనకి రుచిగా ఉండదురోయ్‌! ఊళ్లోళ్ల మునక్కాయలైతే భలే మంచి రుచగా వుంటుంది’ అని చిన్నగా చేతి సంచిలో మూటకట్టినాడు. నవ్వుకుంటూ ఊళ్లోవాళ్ల గురించి, సినిమావాళ్ల గురించి మాట్లాడతా ఇరవై నిమిషాల్లో రెండు మైళ్లు నడిచినారు. ఇద్దరూ జేబుల్లో పోసుకొచ్చిన బఠాణీలు, ఉప్పుశెనగలు తింటా శాంతి సినిమా టాకీసు కాడికి చేరుకున్నారు.  అక్కడ ధర్మరాజుల గుడి పెద్దలు చల్ల మజ్జిగ పంచతా వుండారు. ఇసుకలో నల్ల కుండలు పెట్టి కుండలకు తెల్లగుడ్డలు చుట్టి  గుడ్డ ఎండినప్పుడల్లా తడి చేస్తా వుండారు.  తెల్ల మజ్జిగ, చల్ల మజ్జిగ చూసి సుందరం మావ నిలబడలేక పోయినాడు.  రెండు సత్తు గ్లాసుల నిండా తాగినాడు.  కొత్తమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపలు  వేసి  తిరగమాత  వేసి  ఉప్పఉప్పగానీళ్లమజ్జిగ  చేసి వుండారు.  మీసాలకంటిన మజ్జిగని నాలికతో లాక్కొని ఉప్పంగా కమ్మగా వుండేసరికి మళ్లా రెండు గ్లాసులు తాగినాడు. మజ్జిగ పోసేటోళ్లు సినిమా చూసినట్లు చూస్తావుండారు. పాండురంగడికి మజ్జిగ తాగను మనసుకిరాలేదు. మజ్జిగ బాగలేక కాదు. మజ్జిగపోసే అమ్మి నల్లగా వుండాది.  నల్లపిల్ల మజ్జిగ ఇస్తే చల్లగా వుండదా ఏమిటి?  అట్లనికాదు.  ఆ పిల్ల ముక్కుపుడక బిరడాకి చీమిడి అంటి వుండాది. అది చూడను సగించలా. అందుకు తాగలేదు పాండురంగడు.  మావ ఏమో తాగింది తాగిందే ...

అట్టాయిట్టా నడుచుకుంటూ ద్రౌపదమ్మ గుడికాడికి చేరినారు.  రథం కదులుతోంది.  జనాలు దండిగా చేరి వున్నారు.  చిన్న తాగేలివాళ్లు తప్పట్లు, తాళాలతో భజనలు చేస్తున్నారు.  పచ్చికాపల్లం స్వామి పద్యాలు పాడుతున్నాడు.  రామగిరి కళాబృందం మేళతాళాలతో పాటలు పాడుతోంది. గెరామణి గ్రూపు డాన్సు వాళ్లు రంగులేసుకొని సినిమా పాటలు మైకులో  పాడతా వుండారు.కుర్రకారు ‘జజ్జనక జజ్జనక’ డ్యాన్సులు వేస్తున్నారు.  పతంగులు ఎగుర వేస్తున్నారు. కదిరిమంగళం వాళ్లు కోలాటం చేస్తావుండారు. బుగ్గ అగ్రహారం వాళ్లు బూరలు ఊదుతున్నారు. గూలూరు  వెంకటయ్య దాయాదులు రంగునీళ్లు చల్లుతున్నారు. తొరూరు నారాయణ స్వామి మనుషులు జనాలపైన, రథంపైన పూలు విసురుతున్నారు.  అత్తరు సాయిబు పన్నీరు చల్లతా వుండాడు. రథానికి కట్టిన చామంతి మాలలు గాలికి ఉయ్యాలలలాగా  ఊగుతున్నాయి.  రథం నాలుగు దిక్కులా వున్న బొమ్మగుర్రాలు దూకడానికి సిద్దంగా వున్నట్లుగా వున్నాయి. రథం చుట్టూ కట్టిన రంగురంగు చీరలు గాలికి రెపరెపలాడుతున్నాయి. 

గోవిందనామంతో హోరెత్తుతోంది. రథం ముందు తిక్కశంకరుడు పులి అడుగులు వేస్తున్నాడు.  కోటిగాడు కేరింతలు కొడుతున్నాడు. రథాన్ని జనాలంతా ‘‘హైలెస్సా హైలెస్సా’’ అంటూ లాగుతున్నారు.కదులుతున్న రథానికి పట్టు చీరలు కట్టినోళ్లు కర్పూర హారతులిస్తున్నారు.  భలే పసందుగా వుంది వాతావరణం. రథంపైన మిరియాలు విసిరితే చర్మవ్యాధులు రావని ఊరిజనం  నమ్మకం. తీట, గజ్జి, తామర, తెల్లపొడ, నల్లపొడ, చుండ్రు, మొటిమలు, చెమటకాయలు, పులిపురి కాయలు దగ్గరికి రావని అంటారు. ఉంటే పోతాయని కూడా చెబుతారు.ఇంటి నుంచి మూట కట్టుకొచ్చిన మిరియాలను మావా అల్లుల్లిద్దరూ చల్లినారు.  దూరం నుంచే రథానికి దండాలు పెట్టినారు. 

ఇంక ఇంటికి వెళ్దామని  పోతా పోతా తుంబూరాహోటల్‌ దగ్గర ఆగినారు. రవ్వ ఇడ్లీలు ఇక్కడ బాగుంటాయని, తిందామని చెప్పిన సుందరం మావ నేరుగా హోటల్‌లోకి దూరినాడు.  చక్కగా చేతులు కడుక్కొని కుర్చీలాక్కొని కూర్చొని టేబుల్‌పైన దరువేస్తూ ఒక ప్లేటు ఇడ్లీకి అర్డరిచ్చినాడు. ‘ఇద్దరికీ ఒక ప్లేటు ఇడ్లీ ఎట్టా సరిపోతుందో’ పాండురంగడికి అర్థంకాక అట్టాయిట్టా చూసినాడు. సినిమా పుస్తకం దొరికితే బొమ్మలు చూస్తా వుండిపోయినాడు. సుందరం మావ ఒక ఇడ్లీ పక్కన పెట్టి గిన్నెల గిన్నెల సాంబారు పోసుకొని పిసికి పిసికి తినినాడు. అట్లనే రెండో ఇడ్లీ కూడా సగం తినేసినాడు. మిగిలిన సగం ఇడ్లీని  రెండుగా చేసి అటూ ఇటూ చూసినాడు. సప్లయిరుగానీ, వంటవాళ్లుకానీ, గల్లా మనిషి కానీ చూడటం లేదని నిర్ధారణకు వచ్చినాడు. వెంటనే తలలోని ఒక నల్ల వెంట్రుకను గభీమని పెరికి ఇడ్లీ ముక్కల మధ్యలో దూర్చినాడు. అవేశంగా లేచి సప్లయిర్లనీ  హోటలోళ్లనీ అరవసాగినాడు. మావ రచ్చకి అందరూ పరుగెత్తుకొచ్చినారు.  ‘‘మీరు ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు, ఇడ్లీలు ఉడికించేటప్పుడు, ఇడ్లీలు జనాలకు పెట్టేటప్పుడు చూసుకోవద్దా?  చూడండి!  ఇడ్లీలో వెంట్రుక వచ్చింది.  మేము ఈ భూమిపైన వుండాల్నా పోవాల్నా’’ అని ఊగిఊగి అరిచినాడు. హోటలోళ్లంతా భయపడి గుంపు చేరినారు. మావని సముదాయిస్తూ మావా అల్లుళ్లిద్దరినీ ప్రక్క గదిలోకి తీసుకొనిపోయినారు. ఒక్కసారిగా మావ అక్కడ హీరో లెక్కన మారిపోయినాడు.  తప్పు జరిగిందని ప్రాధేయపడినారు.  నేతి ఇడ్లీలు తెప్పించి, అలసంద వడలు వేయించి, ఫిల్టర్‌ కాఫీ తాగించి డబ్బులేవీ తీసుకోకుండా సాగనంపినారు. గుట్టురట్టు చేయవద్దని చేతులు పట్టుకున్నారు.  తాంబూలం తీసుకొమ్మని పుత్తూరు వక్కపొడి  చేతినిండా పోసినారు.  మావా అల్లుళ్లిద్దరూ చంకలు గుద్దుకున్నారు.  వాళ్లు హోటల్‌ మెట్లు దిగతా వుంటే పాండిచ్చేరి పకోడి మాష్టార్‌ ‘ఒరే కోలాటం  రొంబ కొండాట్టం’ అనడం వారికి వినిపించింది. మావ డ్రామా చూడటానికి భలేముచ్చటేసింది మేనల్లుడికి.  ‘‘కనబడడు కానీ   మావలో ఎన్ని వయ్యారాలో ... పైసా సెలవకాకుండా ఇద్దరికీ కడుపునిండా టిఫినీలు తినిపించిన మావ రుణం ఎట్టా తీర్చేదబ్బా’’ ... ఆలోచించినాడు రాత్రంతా.

అగ్గి తొక్కేరోజు సాయంత్రం అయిదింటికంతా బయలుదేరి ద్రౌపదమ్మ గుడి కాడికి చేరినారు. అగ్గి తొక్కేటోళ్లు సిద్దంగా వున్నారు. ఒకరి వెనకాల ఒకరు నిలబడి వున్నారు. ఎనబైమంది దాకా వున్నారు. వారిముందు తిరుత్తణి మేళం జట్టు  డప్పులు వాయిస్తోంది.  పసుపు నీళ్లల్లో అద్దిన పంచె, బన్నియను వేసివున్నారు అగ్గితొక్కేటోళ్లు. వేప మండలు చేత పట్టుకొని, ముఖానికి కాళ్లకి గరువాయూరు గంధం, కంచి కుంకుమలు పూసి వున్నారు. ఎడమచేతికి గుండు మల్లెలు చుట్టినారు. కుడి చేతికి అగ్గి కంకణం కట్టినారు. మెడలో తురక చామంతుల మాలవేసినారు. భక్తిగా గోవిందలు పలుకుతున్నారు. పిల్లా జల్లా అగ్గి తొక్కేటోళ్ల వారి కాళ్లపైన పడి దండాలు పెట్టినారు. బిడ్డలు లేని మొగుడూ పెళ్లాలని వీధుల్లో పనబెట్టి అగ్గితొక్కేటోళ్ల చేత దాటించినారు. పలకలోళ్లు పలకలు వాయిస్తున్నారు. గెరిగెలు ఎత్తుకొని ఊరేగుతున్నారు. మీసాలొస్తున్న పిలకాయలు, మీసాలొచ్చిన పిలకాయలు, ఈలలు, ఊలలు వేస్తున్నారు.  పెద్ద పూజారి పసుపు జండా ఊపినాడు. దబదబమని పరుగులు తీసినారు అగ్గితొక్కేటోళ్లు. ఊరంతా తిరిగి ఊరి బయటవున్న అనంతరాజు బావి, మిషను బావి, రామన్న బావి, జయన్న బావి, సూర్యనారాయణ బావి, కోమటోళ్ల బావి, నడిపక్క బావి....ఈ మాదిరి పదహారు బావుల్లో దూకిదూకి ఒళ్లంతా తడిచేసుకొని చివరిగా అగ్గితొక్కుతారు. అగ్గితొక్కినాక పాల్లో కాళ్లు పెట్టాలి. దీంతో అగ్గితొక్కడం అయిపోయినట్లే. 

‘‘మావా!  టిఫిన్‌ చేసిపోదాం. ఈరోజు ఉభయం నాది, నిన్న నాకు బంగారం లాంటి ఇడ్లీలు తినిపిస్తివి. నేను మాత్రం తక్కవా?  నీకు ఈరోజు మసాలా దోశెలు తినిపిస్తా మావా’’ అని చెప్పినాడు పాండురంగడు. మావకి నోట్లో చక్కెర పోసినంత సంబరమయినాది. తన మేనల్లుడు తన ట్రైనింగుతో స్టెప్పు బై స్టెప్పు ఎదగతా వుండాడని మురిసిపోయినాడు. వాడిని అక్కడే ఎత్తుకొని గిరగిరా తిప్పదామనిపించింది ‘కానీ మోకాళ్లనొప్పులొకటి వచ్చినాయి కదా ప్రాణానికి’ అని ఊరుకున్నాడు. నిన్న తుంబూరా హోటల్లో తినినాం కదా. ఈసారి కొత్తగా మండీవీధిలో తిరపతా హోటల్లో తిందామని బయలుదేరినారు. చక్కగా చేతుల్ని మెడిమిక్సు సోపుతో రుద్దిరుద్ది కడిగినారు. అడిగి ఫ్యాను వేయించుకొని ఫ్యానుకింద కుర్చీలో కూర్చున్నారు. సర్వర్‌ని పిలిచి మసాలా దోశె ఒకటి తెమ్మని ఆర్డరిచ్చినాడు పాండురంగడు. ‘నీకు స్పెషల్‌ మసాలా దోశెలు తినిపిస్తా కాసేపు వుండు మావా’ అన్నట్లుగా వున్నాయి వాడి చూపులు. మేనల్లుడి తెలివితేటలకి  ముచ్చటపడినాడు సుందరం మావ. ముద్దు మీద ముద్దు పెట్టాలనిపించింది. వాడికున్న నోరుపుండు గుర్తొచ్చి గమ్మున వుండినాడు. మసాలా దోశె వచ్చింది. తినడం ప్రారంభించినాడు పాండురంగడు. కుర్మాలోని ఉల్లిపాయ, పచ్చిమిరప, అల్లం, జీడిపప్పులను ఏరిఏరి కసాకసా తింటా వుండాడు. పొద్దుపోక సుందరం మావ హోటలోళ్ల తెలుగు పేపరుని కూడికూడి చదవతా వుండినాడు.  సినిమా బొమ్మల్ని కసితీరా చూసినాడు. సగందోశె తినినాక పాండురంగడు చిన్నచిన్నగా తన చొక్కా జేబులో పెట్టకచ్చిన పొట్లం బయటికి తీసినాడు. రామక్కవ్వ పొడగాటి తెల్లనల్ల వెంట్రుకని తీసినాడు. చిన్నగా కుర్మా మధ్యలో దోపినాడు. నాటకం ప్రారంభించినాడు. ‘‘ బుద్ధి వుందా లేదా మీకు!  వంటల్లో వెంట్రుకలు వచ్చేది చూసుకోరా? ఎట్టంటే అట్ట పెట్టేస్తారా?  మేము ప్రాణాలతో వుండాల్నా? లేక పైకి పోవాల్నా? అంటూ  పూనకం వచ్చినోడి లెక్కన వీరావేశంతో అరిచినాడు. హోటల్‌కి తినను వచ్చినోళ్లు, సర్వర్లు ఏం జరుగుతోందోనని ఎగాదిగా చూస్తా వుండారు.  సుందరం మావ సస్పెన్స్‌ సినిమా చూసేవాడిలాగా కనుగుడ్లు  పెద్దవిగాచేసి చూస్తా వుండాడు.  సుందరం మావ భుజంపైన తువ్వాలును తీసి తలకు బిగించి కట్టినాడు. 

ఇంతలో మెరుపులాగా దూసుకొచ్చినాడు గల్లాపెట్టెకాడి గణేశం దబీదబీమని కొట్టినాడు పాండురంగడిని. అడ్డుపడదామని సుందరం మావ లేచినాడు. పటపటమని సుందరం మావనీ కొట్టినాడు గల్లాపెట్టె గణేశం. బెదిరిపోయిన మావ ‘ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకవచ్చు’ అని పంచె ఎగ్గట్టుకొని తలపైన తువ్వాలు పెరికేసి పరుగులెత్తినాడు. పరిగెత్తి పరిగెత్తి ఈశ్వరుని గుడికాడి కానగ సెట్టుకింద కూలబడినాడు. పాండురంగడిని సర్వర్లు తన్నుకుంటూ వంటగదికి తీసుకెళ్లినారు. వంటగాళ్లంతా గుండ్రంగా నిలబడినారు. తలా ఒక ఏటు ... ధర్మ ఏట్లు.... దండిగా పడినాయి. కట్టెల పొయ్యిలోని కట్టెతో వాతలు పెడతారేమోనని భయపడినాడు పాండురంగడు. వేడివేడి గంజి ముఖంపైన పోస్తారేమోనని బిత్తరపోయినాడు. సలసలకాగే నూనె తీసి నోట్లో పోస్తారేమోనని బిగసకపోయినాడు. కూరగాయల కత్తితో గొంతు కోసేస్తారేమోనని బెంబేలు ఎత్తినాడు. అలాంటిది  ఏమీ జరుగలేదు కానీ కాఫీ మాస్టరు కన్నడ తిట్లు, తమిళ వంటవాడు తమిళ తిట్లు, దోశెల మాస్టారు మళయాళ తిట్లు, కోస్తా కుర్రాడి  మసాలా తిట్లు పడ్డాయి. అందరికీ దండాలు పెట్టి కళ్ల నీళ్లు పెట్టుకొని జారుతున్న పంచెని ఎగ్గట్టుకొని బయటపడినాడు. 

రోడ్డుమీదకొచ్చి అట్టాయిట్టా చూసినాడు. దూరంగా కానగ సెట్టుకింద బిత్తర బిత్తరగా చూస్తూ దాక్కొని వున్న మావ కనబడినాడు. చిన్నచిన్నగా అడుగులేసుకుంటూ  మావని చేరినాడు.  ‘ఏమయ్యిందిరా మేనల్లుడా’ అని వాటేసుకున్నాడు మావ. ‘‘మావా!  తిరపతామె హోటల్‌లో కెమెరాలు వుండాయి మావా. గల్లా పెట్టెకాడి కెమెరాలో అంతా కనబడతాది మావా. గల్లాపెట్టె గణేష్‌గాడు వెండితెరపైన బొమ్మ చూపిస్తా నన్ను జాంజాంమని కొట్టినాడు మావా. అడిగినోళ్లకంతా నా పొట్లం కథ ‘‘ఝూం’’ చేసి చూపిస్తా వుండాడు మావా’’. అంతే!  అక్కడే నిలబడి వుంటే మళ్లీమళ్లీ పిలిచి కొడతారేమోనని మావా అల్లుళ్లిద్దరూ పరుగులు తీసినారు. పరిగెత్తి పరిగెత్తి అగ్గితొక్కేటోళ్ల  గ్రూపులో చేరినారు. నిప్పుల్లో నడిచినారు. పాలల్లో కాళ్లు పెట్టినారు. గోవిందులు పలికినారు. వారికి ఎక్కడో పలకలు మోగుతున్నట్లుగా వినిపించింది. అంబికాపురం అంకడు ఈలలు వేయడం లీలగా కనిపించింది.
- ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement