గొంగళిపురుగు | Funday story world | Sakshi
Sakshi News home page

గొంగళిపురుగు

Published Sun, Aug 5 2018 2:07 AM | Last Updated on Sun, Aug 5 2018 2:07 AM

Funday story world - Sakshi

తిమోతి వేసుకున్న లాంగ్‌ కోటు నేల ఊడుస్తున్నట్టు విచిత్రమైన ధ్వని చేస్తోంది. ఆయన పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, కోపంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆయన ముఖం ఎర్రబడింది. మూతి వంకర్లు తిరుగుతోంది. చేతివేళ్లు అసహనంగా లాంగ్‌ కోటు గుండీల్ని తిప్పుతున్నాయి. ఆయనను ఆ స్థితిలో చూసిన వాళ్లకు ఆయన కోపంతో రగిలిపోతున్నాడని సులభంగా అర్థమవుతుంది. తన కోపాన్ని తగ్గించుకోవడానికో, లేదా ఏదైనా నిర్దుష్టమైన నిర్ణయం తీసుకోవడానికో తెలియదు.. మధ్య మధ్యలో తనలో తాను గొణుక్కుంటూ జాలి చూపులు పరుస్తున్నాడు. అవి గది తలుపులోంచి ఆకులు రాలి ఉన్న వరండాలోకి సాగుతున్నాయి. అతని ఆలోచనలకు ఒక ఆకారం, ఒక క్రమం ఉన్నట్టు లేవు.  అతని కోపానికి మూల కారణం కాస్సిడి! కాస్సిడి, తమ పాఠశాల విద్యార్థి. కాస్సిడి పేరు గుర్తుకురాగానే తిమోతి వళ్లు మండుతోంది. రక్తం తలకెక్కుతోంది. ఎందుకోగాని, ఆయన ఆ బాలుణ్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. వాడు పసివాడే! కాని, వాడి నిశ్శబ్దం తిమోతిని కుదిపేస్తోంది. అంతకంటే ప్రమాదం వాడి మాటలు. వాడు చెప్పేవి ఒకటి రెండు మాటలే కాని, అవే కాల్చిన ఇనుప చువ్వల్లా గుచ్చుకుంటున్నాయి.

ఉన్న ఫళాన అతను గుమ్మం దగ్గర ఆగి, వరండాలోకి నిశితంగా చూశాడు. అక్కడ చీకటి దట్టమవుతూ ఉంది. ఏదో శబ్దం వినిపించినట్లయింది. ఆ పసివాడు బహుశా అక్కడే పడుకుని నిద్రపోయాడా? అయినా ఇంకా వాడు అక్కడ ఉండి ఉంటాడా? ఎప్పుడో వెళ్లిపోయి ఉంటాడు. తిమోతికి ఒకలాంటి నవ్వు వచ్చింది. ఏదో చెప్పుకోవడానికి వాడు ఇంకా అక్కడ ఉండి ఉంటాడన్న ఆలోచనే చిత్రంగా ఉంది. తన ఆజ్ఞకు, వాడి విధేయతకు మధ్య రేఖలా ఆ పరిస్థితి ఊగిసలాడుతోంది. ఆ నిశ్శబ్దమే, ఆ నిశ్చలత్వమే ఒక విధమైన విభేదానికి దారితీస్తూ ఉంది. అది అమాయకత్వం కాదు. కాదని అతని చర్యలే తెలియజేస్తున్నాయి. నిశ్శబ్దం అమాయకత్వం లాగా ఒక పెద్ద గోడ అయితే, కాస్సిడి విషయంలో విభేదించడానికి సాధ్యం కాని ఒక బలమైన ఉక్కు గోడ! మరి దానికి పరిష్కారమేమిటీ? ఆలోచించాల్సిన విషయమే. 

ఆయన పెద్ద పెద్ద అంగలతో అటూ, ఇటూ ఒక ఐదు నిమిషాలు తిరిగాడు. తిరిగి, గుమ్మం ముందు నిలబడి ‘‘కాస్సిడీ!’’ అని పిలిచాడు. ‘‘కాస్సిడీ! ఉన్నావా అక్కడ?’’ అని అడిగాడు. ఆ చీకట్లోంచి ఏ సమాధానమూ రాలేదు. తిమోతి నుండే ఏదో గొణుగుడు వినిపించింది. పిల్లవాడు తన గదికి వెళ్లి నిద్రపోతూ ఉంటాడని ఆయన నిర్ధారించుకున్నాడు. అయినా నిద్రపోకూడదు కదా? గ్రిల్‌ డోర్‌ తెరుచుకుని తిమోతి వరండాలోకి వెళ్లాడు. అక్కడ ఎవరూ కనిపించకపోయే సరికి సరాసరి కాస్సిడి గదివైపు వెళ్లాడు. గది తలుపు తెరిచేసరికి కాస్సిడి తన మంచం మీద కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు. తిమోతిని చూశాడు. కాని, ఎందుకో చూపు నిలవలేక వెంటనే వాల్చేసుకున్నాడు. ‘‘హ్మ్‌.. ఏం కాస్సిడీ? ఎలా ఉంది నీ పరిస్థితి? ఈ లోకం లోకొచ్చావా?’’ అని అన్నప్పుడు తిమోతి ఒంట్లో రక్తం సుళ్లు తిరిగింది. కాస్సిడిలోని నిబ్బరం, నిశ్చలత్వం, నిశ్శబ్దం అన్నీ కలిసి తిమోతిని మళ్లీ చుట్టుముట్టాయి. ‘‘జవాబు చెప్పు. అడుగుతున్నది నిన్నే..’’ అని అరిచాడు.  కాని, ఆ మాటలేవీ పిల్లవాడి ముందు పని చేయలేదు. 

తిమోతి దోషిని తీక్షణంగా చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఓ కుర్చీ లాక్కుని, కాస్సిడికి ఎదురుగా కూర్చున్నాడు. ‘‘మళ్లీ చెబుతున్నాను విను. జరిగిన పొరపాటుకు నువ్వు ఇంతవరకు సంజాయిషీ ఇచ్చుకోలేదు. ఇటు చూడు.. నా వైపు. హ్మ్‌ – నిన్న నువ్వు ప్రేయర్‌కి హాజరు కాలేదు. నీతో పాటు ఆ వెధవ బైర్నే కూడా తప్పించుకున్నాడు. మీరిద్దరూ కలిసి ఎటు వెళ్లినట్టూ? పర్మిషన్‌ తీసుకోకుండా అలా వెళ్లడం తప్పు కదా? తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవడం మర్యాద. ఇంత క్రమశిక్షణ గల పాఠశాలలో చదువుతూ, ఇంత మొండిగా ప్రవర్తించడం కేవలం నీకే చెల్లింది. ఇతర పిల్లల్లాగా మీరెందుకు ప్రవర్తించడం లేదూ? ఏదడిగినా నిశ్శబ్దమే! సమాధానమా? భయమా? తలతిక్కా? పొగరా? ఏమిటీ? నీకేమైనా దయ్యం పట్టిందా? దవడలేమైనా బిగుసుకుపోయాయా? కావాలంటే చెప్పు. ఒక దెబ్బతో దయ్యం వదిలిస్తా. చివరిసారిగా అడుగుతున్నాను. చెప్పు – నిన్న ప్రేయర్‌కి రాకుండా ఎక్కడికెళ్లావ్‌?’’. కాస్సిడి పన్నెండేళ్ల పసివాడు. భయం భయంగా వింటూ తలపైకెత్తి, తిమోతి వైపు చూశాడు. పెదాలు కదిలించాడు. కానీ, మాట ఏదీ బయటకు రాలేదు. తిమోతి చేయి భుజమ్మీద పడటంతో గాబరా పడ్డాడు. అతి కష్టమ్మీద ‘‘సార్‌! నేను నిన్ననే చెప్పాను కదా?’’ అంటూ గొణిగాడు.తిమోతి కాస్సిడిని మరింత అసహ్యంగా చూశాడు – ‘‘అయితే నీ నిర్ణయం మారదన్నమాట! నీ ఇష్టం వచ్చింది చెబితే నమ్మడానికి నా చెవిలో పువ్వులు పెడితే పట్టించుకోవడానికి నేనిక్కడ లేను’’ అంటూ కుర్రవాడి చొక్కా కాలర్‌ పట్టుకొని లాగాడు. గొంతు మరింత పెంచి – ‘‘మాట్లాడకుండా ఉండే హక్కు నీకు లేదు. అర్థమయ్యిందా? సరైన కారణం చెప్పి, నిజం ఒప్పుకుని పశ్చాత్తాపం చెందే దాకా నీకిదే శిక్ష. నువ్వు నీ గదిలో బంధీవి. ఒంటరిగా ఉంచితే నీలో ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశపడ్డాను. అబ్బో జగమొండివి! ఛీ.. ఛీ.. నిజం చెప్పు. తప్పు ఒప్పుకునే దాకా నీకిదే శిక్ష!’’ – అంటూ తిమోతి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గదిలోంచి కోపంగా వెళ్లిపోయాడు. 
కాస్సిడి తనలో తాను నవ్వుకున్నాడు. తలుపు ధబేలున పడింది. ఆటోమేటిక్‌ లాక్‌ తిరిగింది. బట్టలు మార్చుకుని కాస్సిడి పరుపు మీద వాలాడు. మరునాడు ఉదయం లేవగానే ప్రశాంతమైన గాలి కాస్సిడిలో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. ఆరోజు వాడికి గదిలోంచి విముక్తి లభిస్తుందని అనిపించింది. రెండు రోజులుగా కదలకుండా తన గదిలో గడిపిన కాస్సిడికి ఈరోజు ఇక బయట తిరగక తప్పదని అనిపించింది. 

కాస్సిడికి తెలుసు. తను చేసిన తప్పు ఏదీ లేదని. ప్రేయర్‌ బెల్‌ వినిపించుకోకుండా పొదల వెంట తిరగడం తప్పే! కాని వెంటనే ఆ విషయం తిమోతి ముందు ఒప్పుకున్నాడు కూడా. కానీ, తిమోతీయే నమ్మలేదు. తను అబద్ధాలు చెబుతున్నాననుకుని, రెండు రోజులు గదిలో ఖైదు చేశాడు. తను పశ్చాత్తాపం చెందాడు. అలాంటి తప్పు మరోసారి చేయనని ప్రమాణం కూడా చేశాడు. అయినా తిమోతి ఒప్పుకోకుండా శిక్ష విధిస్తే తను ఏం చేయగలడు? ఎదిరించి ఏం మాట్లాడగలడు? ఆయనేమో చెప్పేది నమ్మడు. భయంతో నోరు మూసుకుంటే, ‘‘దయ్యం పట్టిందా? వీపు చీరేస్తా’’ అంటాడు. ఇక ఏం చెయ్యాలి? కాస్సిడి చిన్నారి మనసు పరిపరి విధాల పోయింది.  జేబులోంచి చిన్న అగ్గిపెట్టె బయటకు తీశాడు. రెండు వైపులా గాలికోసం రంధ్రాలు చేసి పెట్టిన పెట్టె అది. పెట్టె మెల్లిగా తెరిచాడు. అందులో నుండి ఆకుపచ్చని రంగులో మెరుస్తూ, కొద్దికొద్దిగా కదులుతూ ఒక గొంగళి పురుగు బయటికి వచ్చింది. కాస్సిడి చేతి వేలు మీదుగా పాకింది. అందంగా, లయబద్ధంగా పాకడాన్ని వాడు ఆనందించాడు. చెయ్యి కళ్ల దగ్గరికి తీసుకుని, దాన్ని నిశితంగా పరిశీలించాడు. ఆకుపచ్చ రంగులోని ఆ లావణ్యాన్ని, లాలిత్యాన్ని మెచ్చుకుంటున్నట్లుగా ఉత్సాహంగా, ఉత్సుకతతో చూశాడు. ‘ఒకనాటికి ఇది మనోహరమైన సీతాకోక చిలుక అవుతుంది కదా?’ అని అనుకున్నాడు. ‘ఎంత అద్భుతం!’ అని ఆశ్చర్యపోయాడు. మరో చేతివేలితో దాన్ని అతి సున్నితంగా తాకాడు. సూర్యుడు అప్పుడే ఉదయించాడు. కిరణాలు కిటికీలోంచి గదంతా వ్యాపించాయి. గొంగళి పురుగు సూర్య కిరణాలతో స్నానం చేసి, మరింతగా ప్రకాశించింది. 

‘‘నిన్నేమని పిలవనూ? క్లేవియర్‌ అని పిలుస్తా!’’ అంటూ గొంగళి పురుగుతో సంభాషించాడు కాస్సిడి. చిరునవ్వు నవ్వుతూ అగ్గిపెట్టెను చూసుకున్నాడు. గొంగళి పురుగు తనతో పాటు ఆ గదిలో రెండు రోజుల నుండి ఉంటున్నందుకు వాడికి గర్వంగా ఉంది. సంతృప్తిగా ఉంది. దాన్ని చూస్తూ ఉంటే వాడికి తిమోతి గుర్తుకురాలేదు. అసలు చాలా విషయాలు గుర్తుకురాలేదు. ఎందుకో గాని ఆ గొంగళి పురుగు దగ్గరుంచుకున్నప్పటి నుండి వాడికి ఎంతో సంతోషంగా ఉంది. వాడి మీద వాడికి ఎంతో నమ్మకంగా ఉంది. గొంగళి పురుగు వాణ్ని చూడలేదు. వాడితో మాట్లాడలేదు గానీ, మాట్లాడితే గనక, కాస్సిడి దానికి ఎన్నో విషయాలు చెప్పేవాడు. ముఖ్యంగా తిమోతి తనను గదిలో ఎందుకు నిర్భందించాడన్నది పూస గుచ్చినట్టు చెప్పేవాడు. అలా ప్రకృతిలోని ఔన్నత్యాన్ని గుర్తించి, ఆరాధించి గొంగళి పురుగు కదలికల్ని ఆనందిస్తున్న సమయంలో వరండాలో ఎవరివో అడుగు చప్పుడు వినిపించింది. గొంగళి పురుగు కోసం తయారుచేసిన అగ్గిపెట్టె కిందపడిపోయింది. అప్పుడే తిమోతి తలుపు తెరుచుకుని గదిలోకి వచ్చాడు. 
‘‘ఏమోయ్‌ కాస్సిడి! ఎలా ఉంది నీ పరిస్థితి? ఈ లోకంలోకి వచ్చావా?’’ అని అడిగాడు. కాని, కాస్సిడి అతని మాట వినిపించుకున్నట్టే లేదు. గొంగళి పురుగును జాగ్రత్తగా అగ్గిపెట్టెలోకి పంపించే ప్రయత్నంలో ఉన్నాడు. కిటికీలోంచి వచ్చే వెలుగు కిరణాలు పెట్టె మీద పడటం వాడికి నచ్చింది. 

‘‘కాస్సిడీ! ఏమిటది చేతిలో?’’ తిమోతి కోపంగా కర్కషంగా అరిచాడు. ‘‘ఏం లేదు. ఊరికే!’’ అంటూ పెట్టెను తన వెనక పెట్టుకుని దాచేసే ప్రయత్నం చేశాడు కాస్సిడి. ‘‘ఇదన్నమాట నువ్వు చేసే నిర్వాకం‘ ఖాళీ సమయాన్ని ఇంత పాప పూరితంగా గడుపుతున్నావన్నమాట!’’ అంటూ హుంకరించాడు తిమోతి. ‘‘పాపమా? పాపమేమీ చేయడం లేదు. చిన్న గొంగళి పురుగు. అ.. అంతే..!’’ అన్నాడు వాడు అమాయకంగా. వాడి నిశ్శబ్దాన్ని భరించలేకపోయిన తిమోతి, వాడి సమాధానాన్ని అసలే భరించలేకపోయాడు. అందులో అతనికి ధిక్కార స్వరం వినిపించింది. స్వచ్ఛమైన నిజాయితీలోంచి వచ్చిన మాటలు అతడికి అహంకార పూరితమైన అబద్ధాలుగా తోచాయి. కోపంతో పిల్లవాడి చెవి మెలితిప్పాడు.‘‘ఇదేనా నువ్వు చేసేది? ఇదేనా పెద్దలతో మాట్లాడే తీరూ? మూర్ఖుడా! ఏదీ అది ఇటివ్వూ’’ మరింత కఠినంగా అరిచాడు తిమోతి. ‘‘ఏమీ లేదు సార్‌! ఉట్టి గొంగళి పురుగే. కొద్దిరోజుల్లో ఇది అద్భుతమైన సీతాకోక చిలుక అయిపోతుంది. మెత్తగా ఆకుపచ్చగా ఉంది. నేను దానికి తెలిసినట్టే, నా చేతిమీద హాయిగా స్వతంత్రంగా తిరుగుతుంది. ప్లీజ్‌! నాకు ఇది ఉండనివ్వండి!! ఇదుంటే నాకు ఎందుకో గాని, చాలా సంతోషంగా ఉంటుంది.’’ ‘‘హూ! వేలెడు లేవు, పెద్ద పెద్ద కబుర్లు చెబుతావు’’ అంటూ తిమోతి హుంకరించాడు. కాస్సిడి చేతిలోని అగ్గిపెట్టె లాక్కుని తెరచి బోర్లించాడు. ఆకుపచ్చని గొంగళి పురుగు కిమ్ద నేలమీద పడింది. ఒక్క క్షణం తర్వాత మెల్లగా పాకడం ప్రారంభించింది.‘‘ప్రేయర్‌ మానేసే హక్కు నీకు లేదు. ప్రేయర్‌ మానేశావు గనుక, వేరే వాటిని చూసి ఆనందించే హక్కు కూడా నీకు లేదు. వింటున్నావా?’’ అని చెబుతూ అనూహ్యంగా తిమోతి తన బూటుకాలు గొంగళి పురుగు మీద ఉంచాడు. కసి కొద్దీ తొక్కి పెట్టి, పాదం అటూ ఇటూ తిప్పాడు.గొంగళి పురుగు సీతాకోక చిలుక కాకుండానే అర్ధాంతరంగా అసువులు కోల్పోయింది.కాస్సిడి తిమోతి వైపు తలెత్తి ఒక్క చూపు చూశాడు. కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. చెప్పరాని బాధతో తెరలు తెరలుగా భోరున ఏడ్చాడు. 
ఆంగ్లమూలం : జేమ్స్‌ హాన్లీ 
అనువాదం: డాక్టర్‌ దేవరాజు మహారాజు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement