నా వయస్సు 29. నాకు ఈమధ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ప్రతిచిన్నదానికి బాగా నీరసంగా అనిపిస్తుంది. దేనిపైనా ఆసక్తి కలగడం లేదు. దాంతో డాక్టర్‌ని కలిశాను. పరీక్షలు చేసి ‘టెస్టోస్టెరాన్ హార్మోన్ తగిన స్థాయిలో లేదు’ అన్నారు. మందులు కూడా రాసిచ్చారు. అసలు టెస్టోస్టెరాన్ అంటే ఏంటి? దాని వివరాలను తెలియజేయగలరు. – పి.రమ్య, మందమర్రి
మన శరీరంలోని అన్ని ప్రక్రియలు సరిగా పని చెయ్యటానికి అనేక హార్మోన్లు దోహదపడతాయి. వాటిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఒకటి. ఇది మగవారిలో 28-0-&-1-1-00ng/dl విడుదల అవుతుంది. ఆడవారిలో 15-&-70ng/dl ∙విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మగవారికి చాలా అవసరం. అలాగే ఆడవారికి కూడా కొంచెం మోతాదులో అవసరం. ఇది కండరాలు పెరగడానికి, బలానికి, శక్తికి, ఎముకల ఎదుగుదలకి, శరీరం – మనసు ఉత్తేజంగా ఉండటానికి కొద్దిగా లైంగిక కోరికలకు ఉపయోగపడుతుంది. ఇది అండాశయాల నుంచి మరియు అడ్రినల్ గ్రంథి నుంచి విడుదల అవుతుంది. వీటిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, టెస్టోస్టెరాన్ తక్కువగా విడుదల అవ్వడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి అలాగే పీరియడ్స్ ఆగిపోయినప్పుడు అంటే మెనోపాజ్ దశలో కూడా తగ్గుతుంది. ఇది చాలా తక్కువగా విడుదల అవ్వడం వల్ల.. శక్తి లేకపోవడం, నీరసంగా అనిపించడం, ఉత్సాహంగా లేకపోవటం, ఒళ్లునొప్పులు, జాయింట్ నొప్పులు, కండరాల నొప్పులు, సెక్స్‌పై ఆసక్తి లేకపోవడం వంటి అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అవసరమైన మరిన్ని పరీక్షలు చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవటం మంచిది.
నా వయసు 27. నేను ప్రెగ్నెంట్‌ని. గర్భిణీలకు సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అవసరం అని చెబుతుంటారు. అయితే ఏ సమయంలో ఎండలో కూర్చోవాలి అనేదాని మీద నాకు స్పష్టత లేదు. ‘గర్భిణులు ఎండలో కూర్చోవడం అసలు మంచిది కాదని’ మా అత్తయ్య చెబుతున్నారు. సూర్యరశ్మి వల్ల కలిగే మంచి చెడుల గురించి వివరంగా తెలియజేయగలరు. – కె. స్పప్న, సికింద్రాబాద్
సూర్యకాంతి నుంచి వచ్చే అల్ట్రావైలెట్–బి కిరణాలు చర్మంపైన పడినప్పుడు చర్మంలో విటమిన్–డి తయారవుతుంది. ఇది రక్తం నుంచి కాల్షియాన్ని అధికంగా శరీరంలోకి, ఎముకలలోకి చేరుస్తుంది. దీని వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. ఇంకా విటమిన్–డి ఆహారపదార్థాలైన పాల ఉత్పత్తుల్లో.. పండ్లలో.. చేపల్లో.. మాంసాహారంలో లభిస్తాయి. గర్భిణీ సమయంలో 9 నెలల పాటు బిడ్డ ఎదుగుదలకు, తల్లిలో జరిగే మార్పులకు విటమిన్–డి ఎంతో అవసరం. సాధారణంగా అయితే ఉదయం 11 గంటల నుంచి 1 గంట సమయంలో ఉండే సూర్యకాంతిలో అల్ట్రావైలెట్–బి కిరణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ గర్భవతుల చర్మం, హార్మోన్‌లలో మార్పుల వల్ల చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. కాబట్టి గర్భవతులు ఉదయం 10 గంటలలోపే 10–15 నిమిషాల పాటు వారానికి మూడు రోజులు సూర్యకాంతిలో లేతరంగు దుస్తులతో గడపవచ్చు. గర్భవతులు ఎక్కువసేపు సూర్యకాంతిలో గడపడం వల్ల బాగా చెమట పట్టడం, అలిసిపోవడం, డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే చర్మంపై పిగ్మెంటేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మొదటి మూడు నెలల్లో బిడ్డ వెన్నుపూస వంటి అవయవాలు తయారు అవుతాయి. ఈ సమయంలో ఫోలిక్‌యాసిడ్ చాలా అవసరం. అయితే గర్భిణులు ఎక్కువ సేపు ఎండలో ఉంటే సూర్యకాంతిలోని కిరణాలు శరీరంలో ఉండే ఫోలిక్‌యాసిడ్‌ను ధ్వంసం చేస్తాయి. దానివల్ల బిడ్డకు వెన్నుపూసకు సంబంధించిన లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎంత చేసినా విటమిన్–డి తక్కువగా ఉన్నప్పుడు కాల్షియం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గర్భిణులు విటమిన్–డి సరిగా ఉండేటట్లు మితమైన సూర్యకాంతితో పాటు, పౌష్టికాహారం అలాగే అవసరమైతే డాక్టర్ సలహామేరకు విటమిన్–డి మాత్రలు వేసుకోవడం మంచిది.
మా సోదరి వయసు 23. తను ప్రెగ్నెంట్. గర్భిణులు తప్పనిసరిగా తీసుకోవల్సిన వాక్సిన్‌లు, వాటి ఉపయోగాల గురించి తెలియజేయగలరు. ఈ వాక్సినేషన్ వల్ల బేబి ఎదుగుదల మీద ప్రతికూల ప్రభావం ఉంటుందని విన్నాను. ఇది ఎంత వరకు నిజమో దయచేసి తెలియజేయగలరు. – జి. వనిత, నెల్లూరు
సాధారణంగా గర్భిణులలో, టీ.టీ (Tetanus Toxoid) ఇన్‌జెక్షన్ ఒక నెల గ్యాప్‌తో రెండు డోసులు ఇస్తారు. గర్భం వచ్చిన తర్వాత నాలుగు నెలల నుంచి ఏడు నెల లోపల తీసుకోవడం మంచిది. ఇది కాన్పు సమయంలో ధనుర్వాతం నుంచి తల్లిని, బిడ్డని కాపాడుతుంది. ఇది తప్పనిసరిగా గర్భిణీకి ఇస్తారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇస్తారు. దీని వల్ల బిడ్డకి, తల్లికి ఎటువంటి హాని జరగదు. ఇంక కొన్ని వ్యాక్సిన్స్ అవసరాన్ని బట్టి, సీజన్ బట్టి, వారివారి రిస్క్‌లను బట్టి ఇస్తారు. ఇవి కచ్చితంగా అందరూ తీసుకోవాలని ఏమీ లేదు. ఇవి తీసుకోవడం వల్ల హాని కంటే మంచి ఎక్కువ జరుగుతుంది అని అనుకున్నప్పుడు తీసుకోవలసి ఉంటుంది. Tdap injection 28–32 వారాల సమయంలో ఇస్తారు. ఇది తల్లిలో బిడ్డలో ధనుర్వాతం, డిఫ్తీరియా, కోరింత దగ్గు వంటి అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఫ్లూ ఎక్కువ వ్యాపిస్తున్న కాలంలో అంటే నవంబర్ నుంచి మార్చి వరకు కొంతమందికి ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చు అని సలహా ఇస్తారు. హెపటైటిస్–బి సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉన్నవారికి మూడు నెలలు దాటిన తర్వాత తీసుకోమని సలహా ఇస్తారు. సాధారణంగా పైన చెప్పిన వ్యాక్సిన్స్ వల్ల దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వీటి వల్ల బిడ్డ ఎదుగుదలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. డాక్టర్ సలహా మేరకు గర్భవతి ఆరోగ్య పరిస్థితిని బట్టి కొన్ని వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో హైదర్‌నగర్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment