
థాయ్‌లాండ్ గుహ గాథను హాలీవుడ్‌లో సినిమాగా తీయబోతున్నారనే వార్త చదివిన అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందానికి మనసు మనసులో లేదు.‘ఇది యూనివర్స్ సబ్జెక్ట్. దీన్ని తెలుగులో తీస్తే అదిరిపోతుంది’ అనుకొని నిర్మాత వేటలో పడ్డాడు. ఆ వేటలో అతనికి బక్ర భానుమూర్తి అనే నిర్మాత దొరికాడు.హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దందా చేసి కోట్లు సంపాదించాడు ఈ బక్ర. సినిమా తీయాలనేది తన చిరకాల వాంఛ. మంచి కథ కోసం వెదుకుతున్న సమయంలో బక్రకు తగులుకున్నాడు గోవిందం.‘సార్....ఎంత కాలమని తొక్కలో లవ్‌స్టోరీలు, ఫ్యాక్షన్ కథలు తీస్తాం. ఒక్క సినిమా తీసినా అది చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి. ఇది అలాంటి సబ్జెక్టే సార్. మీకు తెలుసుకదా...థాయ్‌లాండ్ గుహలో పిల్లల నరకయాతన గురించి. దీని మీద ఇప్పటికే హాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలు తయారవుతున్నాయి. మన తెలుగులో కూడా తీస్తే బాగుంటుందని పకడ్భందీగా స్క్రిప్ట్ తయారుచేసుకున్నాను’’ కళ్లలో స్టార్‌లు మెరుస్తుండగా అన్నాడు గోవిందం.
‘‘అక్కడెక్కడో జరిగినదానికి మనోళ్లు ఎలా కనెక్టవుతారోయ్?’’ సందేహం వ్యక్తం చేశాడు బక్ర.‘‘సెంటిమెంట్, భారీ ఎమోషన్, ట్రాజెడి కథలకు అక్కడ ఇక్కడ అనే తేడా ఉండదు సార్. అందరం ఒకేరకంగా కనెక్టవుతాం. పిల్లలు గుహలో చిక్కుకుపోయిన క్షణం నుంచి బయటికి తీసుకొచ్చే వరకు...దేశాలు,ప్రాంతాలు అనే తేడా లేకుండా అందరూ న్యూస్ ఫాలో అయ్యారు. అక్కడెక్కడో జరిగింది కదా అని చదవకుండా ఊరుకోలేదు కదా సార్’’ పాయింట్ లేవదీశాడు గోవిందం.‘‘పిల్లల మీద సినిమా తీయడమే ఒక రిస్క్....అందులోనూ ట్రాజెడి వర్కవుట్ అవుతుందంటావా?’’ సందేహించాడు బక్ర.‘‘హండ్రెడ్ పర్సంట్ వర్కవుట్ అవుతుంది సార్. ఉదాహరణకు 1972లో వచ్చిన పాపం పసివాడు సినిమానే తీసుకుందాం. ‘లాస్ట్ ఇన్ ది డిజర్ట్’ అనే ఆఫ్రికన్ సినిమా ఆధారంగా తీసిన ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మీకు తెలియని విషయం కాదు. కేవలం ఒక్క పిల్లాడి కష్టాలకే ఆ సినిమా అంత విజయం సాధిస్తే.... ఏకంగా పన్నెండు మంది పిల్లల కష్టాలకు మన సినిమా ఎంత హిట్ అవుతుందో ఊహించుకోండి’’ ఊరించాడు గోవిందం.
‘నిజమే’ అనిపించింది బక్రకు.‘‘అది సరే...బడ్జెట్ సంగతి? హాలీవుడ్డోళ్లతో మనమెక్కడ పోటీ పడతామయ్యా?’’ అడిగాడు బక్ర.‘‘ కేవలం యాభై లక్షల్లో మీకు సినిమా తీసి పెడతాను సార్. సినిమా విడుదలకు ముందే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. లాభాలు కండ్ల చూడవచ్చు’’ మరింతగా ఊరించాడు గోవిందం.‘‘యాభై లక్షల్లో సినిమా ఫినిష్ చేస్తావా!! అదెలా?’’ ఆశ్చర్యంగా అడిగాడు బక్ర.‘‘పన్నెండు మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లను తీసుకుందాం...వాళ్లకు రెమ్యునరేషన్‌లు అంటూ పెద్దగా ఏమీ ఉండవు. ఒక పెద్ద గుహ సెట్ వేస్తాం. సినిమా అంతా ఈ సెట్‌లోనే లాగించేస్తాం. కాబట్టి మన బడ్జెట్‌లోసినిమా ఈజీగా పూర్తవుతుంది’’ వివరించాడు గోవిందం.‘ఓకే...రేపు ఒక్కసారి వచ్చి కలువు. ప్రాజెక్ట్ ఫైనల్ చేద్దాం’’ అన్నాడు బక్ర. ఆనందంతో తబ్బిబ్బైపోయాడు గోవిందం.
‘‘ఇదిగో గోవిందం.... ఈడు నా బామ్మర్ది బాలరాజు. నేను ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఈడ్ని సలహా అడుగుతా. ఈడు ఓకే అంటే నాకు కూడా ఓకే...ఒక్కసారి మావోడికి సీన్లు చెప్పు...’’ అడిగాడు బక్ర.
మూడుగంటలు నాన్‌స్టాప్‌గా చెప్పాడు గోవిందం.‘‘పోరగాళ్ల కష్టాలు తప్పా....కథలో మసాల ఎక్కడుందయ్యా...ఐటం సాంగు, ఫైట్లు లేంది ఎవరు చూస్తారు?’’ పెదవి విరిచాడు బామ్మర్ది బాలరాజు.‘‘ఇప్పుడేం చేయమంటారు?’’ ఆందోళనగా అడిగాడు గోవిందం.‘‘కథకు మసాల దట్టించి మళ్లీ వినిపించు...అప్పుడు ఆలోచిస్తా’’ ఆర్డర్ వేశాడు బాలరాజు.‘కుదరదు’ అంటే రాకరాక వచ్చిన చాన్స్ మిస్సవుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి పదిసంవత్సరాలవుతుంది. ఈ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయితే ఊళ్లోకి వెళ్లి బర్రెలు కాసుకోవడం తప్ప...వేరే గత్యంతరం లేదని ఆలోచించిన గోవిందం ‘అలాగే సార్... మీరు చెప్పినట్లే స్క్రిప్ట్ తయారుచేసి మళ్లీ కలుస్తాను’ అంటూ వెళ్లాడు.వారం తరువాత బామ్మర్ది బాలరాజును కలిశాడు గోవిందం. తాను తయారుచేసుకున్న స్టోరీ ఆర్డర్, ఇతర విషయాల గురించి ఇలా చెప్పాడు.
1. పన్నెండుమంది పిల్లలు, ఫుట్‌బాల్ కోచ్ ఒక పెద్ద గుహలో చిక్కుకుపోతారు.
2. కోచ్‌గా కాస్త పేరున్న హీరోను సెలెక్ట్ చేసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తాం. ఎలా అంటే...గుహలో ఆల్రెడీ ఒక స్మగ్లింగ్ గ్రూప్ చిక్కుకుపోయి ఉంటుంది. వాళ్లకీ మన హీరోకి మధ్య రోమాలు నిక్కబొడిచే ఫైట్‌లు పెడతాం. దీంతో మాస్ ప్రేక్షకుల నుంచి విజిల్సే విజిల్స్.
3. స్మగ్లర్ల దాడిలో హీరో స్పృహ కోల్పోయి ఆ తరువాత ఏకంగా కోమాలోకి వెళ్లిపోతాడు. ఇది చూసి తట్టుకోలేని చిన్నారులు చిరుతలై స్మగ్మర్ల పని పడతారు. ఈ దెబ్బలకు వాళ్లు స్పృహ కోల్పోయి ఆ తరువాత కోమాలోకి వెళ్లిపోతారు. కోమాలోకి వెళ్లిన తమ ఫుట్‌బాల్ కోచ్‌కు స్పృహ తెప్పించడానికి ‘జై చిరంజీవా జగదేక వీరా.... అసహాయ శూరా.... అంజనీ కుమారా’ అనే పాట అందుకుంటారు పిల్లలు. మళ్లీ విజిల్సే విజిల్స్.
4. ఆకలిదప్పులతో పిల్లలు అల్లాడుతుంటారు. ఈ విషాదంలో బ్యాక్‌గ్రౌండ్ నుంచి పాట వినిపిస్తుంది: ‘అయ్యో! పసివాడా....గాడ్ ఉన్నాడా?.... మీపై ద్వేషం పూనాడా...అభమూ శుభమూ తెలియని మిమ్మల్ని అనాథలను చేశాడా...పగబట్టిన విధి మిమ్మల్ని.... పసిగట్టి కాటేసిందా’
ఈ పాట వింటూ ఏడ్వని ప్రేక్షకుడు ఉండడు.
5. క్లైమాక్స్:పద్దెనిమిదో రోజు హీరో స్పృహలోకి వస్తాడు. లేవడం లేవడంతోనే ‘ఉన్నావా అసలున్నావా? ఉంటే కళ్లు మూసుకున్నావా?’ అని దేవుడిని నిలదీస్తూ పాట అందుకుంటాడు. ఏమవుతుందో ఏమో అని ప్రేక్షకుల్లో ఒకటే టెన్షన్. కొద్దిసేపటి తరువాత ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం. గుహలో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుంటుంది. ఆ తరువాత పెద్ద శబ్దంతో గుహ ముక్కలు చెక్కలవుతుంది. వర్షం ఆగుతుంది. ఆకాశంలో నుంచి ఒక పూలరథం కిందికి వచ్చి పిల్లలను, కోచ్‌ని తీసుకొనిపైకి లేస్తుంది. ఆతరువాత అది థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ల్యాండవుతుంది. శుభం కార్డు పడుతుంది.
సంతోషంతో ప్రేక్షకులు చప్పట్లే చప్పట్లు...ఈలలే ఈలలు! రిపీట్ ఆడియెన్స్...రికార్డులు బద్దలు’...చెప్పడం ముగించాడు గోవిందం.‘వెర్రీగుడ్. అద్భుతంగా ఉందయ్యా. తెలుగు సినిమాకు అవసరమైన అన్ని ఎలిమెంట్స్ కవరయ్యాయి. మన సినిమా ఆ హాలీవుడ్ సినిమాలను మించి ఆడుతుంది’’ అంటూ ఆనందంగా సిగరెట్ వెలిగించాడు బామ్మర్ది బాలరాజు.
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment