
గీత... ద ఘోస్ట్!
రాత్రి, అర్ధరాత్రి, దెయ్యాల వేట, భయం భయం... హారర్ సీరియల్ అనగానే ఇలాంటి పేర్లే కనిపిస్తుంటాయి మనకి. హిందీలో అయితే ఆహట్, భూత్ ఆయా, ఫియర్ ఫైల్స్ అంటూ దెయ్యాల్ని మన మీదికి వదులుతున్నారు కొన్ని చానెళ్లవారు. అయితే వీటిని చూసి చూసి బోర్ కొట్టేసింది. అందుకేనేమో... ఓ కొత్త టైటిల్‌తో, కొత్త కాన్సెప్ట్‌తో, సరికొత్త కథనంతో ఓ సీరియల్ తీశారు. అదే... ‘గీతాంజలి’.
* ఇద్దరు అక్కాచెల్లెళ్లు. చెల్లెలు మహా నెమ్మదస్తురాలు. అక్క పరమ భయంకరురాలు. అన్నీ తాను అను కున్నట్టే జరగాలంటుంది. అన్నింట్లో కల్పించుకుని చెల్లెలికి సంతోషమన్నదే లేకుండా చేస్తుంది. చివరికి ఊహించని పరిస్థితుల్లో చనిపోతుంది. మామూలుగానే కుదురుండనిది, దెయ్యమయ్యాక ఊరుకుంటుందా? నానా రభసా చేస్తోంది. ఆ రభస చూస్తే గుండెల్లో గుబులు పుడుతోంది. అందుకే గీతాంజలి సక్సెస్‌ఫుల్ సీరియళ్ల లిస్టులో చేరిపోయింది.
* అయితే ఈ సీరియల్ సక్సెస్‌లో ముఖ్యభాగం హీరోయిన్ రూపకే చెందుతుంది. ‘చిన్న కోడలు’ సీరియల్‌తో సుపరిచితమైన ఈ అమ్మాయి... అంజలిలా అమాయకంగా ఆకట్టుకుంటూనే, దెయ్యంగా హడలెత్తిస్తోంది. ఆమె పర్‌ఫార్మెన్సే ఈ సీరియల్‌కి ప్రాణం పోసిందని ఒప్పుకుని తీరాలి!