దెయ్యాల రెస్టారెంట్ | Ghost Restaurant | Sakshi
Sakshi News home page

దెయ్యాల రెస్టారెంట్

Published Sat, Nov 29 2014 11:21 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

దెయ్యాల రెస్టారెంట్ - Sakshi

దెయ్యాల రెస్టారెంట్

నిజాలు దేవుడికెరుక
 
 మిన్నెసొటా (అమెరికా)లోని ఫోర్‌పాస్ రెస్టారెంట్...
 ‘‘నువ్వేమైనా అనుకో. నేను మాత్రం ఇక్కడ భోం చేయను’’... చుట్టూ చూస్తూ అంది స్టెల్లా.
 ‘‘ఓహ్... కమాన్ డియర్. ప్రతిదానికీ బెట్టు చేస్తావ్. ఇక్కడ ఏం తక్కువయ్యింది చెప్పు?’’... కాస్త బతిమాలుతున్నట్టుగా, కాస్త విసుక్కుంటున్నట్టుగా అన్నాడు మార్క్.
 బుంగమూతి పెట్టింది స్టెల్లా. అతని వైపు చూడటమే ఇష్టం లేదన్నట్టుగా ఎటో చూస్తూ కూచుంది. కాస్త చల్లబడుతుందేమో నని కాసేపు చూశాడు మార్క్. కానీ అలాంటి సూచనలేవీ లేకపోవడంతో సర్ది చెప్పడానికి ఉపక్రమించాడు.
 ‘‘చూడు డియర్... మనం కళ్లతో చూస్తేగానీ దేన్నీ నమ్మకూడదు. వాళ్లూ వీళ్లూ చెప్పింది నమ్మేయడం పిచ్చితనం’’ అన్నాడు నచ్చజెప్పే ధోరణిలో. స్టెల్లా మెత్తబడలేదు సరికదా రయ్యిన లేచింది.
 ‘‘అవును. నేను పిచ్చిదాన్నే. ఎప్పుడూ నీ మాటే నెగ్గించుకోవాలని చూసే నువ్వు నా మాట వింటావేమో అనుకోవడం పిచ్చి తనమే కదా’’... దుఃఖం పొంగుకొచ్చి గొంతు బొంగురుపోయింది. ఏం చేయాలో తోచలేదు మార్క్‌కి. అనవసరంగా తనే విషయాన్ని పెద్దది చేస్తున్నాడేమో అని పించింది. తనకిష్టం లేని చోటికి తీసుకు రావడం తన తప్పేనని తోచింది. అందుకే ఆమె ఇష్టప్రకారమే అక్కడ్నుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు.
 ‘‘సరేలే. ఫీలవకు. వెళ్లిపోదాం పద’’ అంటూ లేచి ఆమె చేయి పట్టుకున్నాడు. కదలబోతుండగా... ‘‘వెళ్లిపోతున్నారేంటి సర్’’ అన్న మాట వినిపించి ఇద్దరూ ఆగి పోయారు. చూస్తే వెయిట్రస్ నవ్వుతూ నిలబడి ఉంది. ఆమె చేతిలో ట్రే, ట్రేలో బౌల్స్, బౌల్స్‌లో వేడి వేడి ఆహారం...
 ‘‘సారీ... మేం వెళ్లాలి. మాకు పనుంది’’ అన్నాడు మార్క్ సంజాయిషీ ఇస్తున్నట్టుగా.
 ‘‘భలేవారు సర్. ఆర్డర్  ఇచ్చాక వెళ్లిపోతానంటారేంటి? మీరు తినక పోయినా బిల్లు కటాల్సి వస్తుంది మరి’’ అందామె నవ్వుతూ. ‘‘కడతానులెండి’’ అన్నాడు మార్క్. జేబులోంచి డబ్బులు తీసి ఇవ్వబోతుండగా స్టెల్లా అడ్డుపడింది. ‘‘వద్దు మార్క్. కాస్ట్‌లీ భోజనం ఆర్డర్ చేశావ్. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు? నేనే కాసేపు ఓపిక పడతాలే. రా భోంచేద్దాం అంది’’ కూర్చుంటూ. నవ్వాడు మార్క్. క్షణంలో కోపం... క్షణంలో ప్రేమ... పిచ్చి పిల్ల అనుకున్నాడు మనసులో.
 వెయిట్రస్ వడ్డన ప్రారంభించింది. ప్లేట్లలో భోజనం పెట్టి, గ్లాసుల్లో ఆరెంజ్ జ్యూస్ వేసి వెళ్లిపోయింది. ఇద్దరూ తినడం ప్రారంభించారు.
 ‘‘నువ్వు అలిగినప్పుడు కాస్త కోపమొస్తుందన్నది నిజమే కానీ... అప్పుడు నీ ముఖం చూస్తే మాత్రం భలే ముద్దొ స్తోంది తెలుసా’’ అన్నాడు మార్క్, ప్రేయసి ముఖంలోకి చిలిపిగా చూస్తూ. ఆ చిలిపి చూపులు సోకి సిగ్గుల మొగ్గయ్యిందామె. ‘‘చాల్లే ఆపు. బతిమాలడం పోయి అరుస్తావ్. ఆనక ఇలా కబుర్లు చెబుతావ్. కంత్రీవి నువ్వు. ఈసారి నామీద అరిచావో, అయిపోతావ్’’ అంటూ చేతిలోని ఫోర్క్‌ని పొడుస్తా అన్నట్టు చూపించింది. ఆ ప్రయత్నంలో చేయి జారి ఫోర్క్ కింద పడిపోయింది. వంగి తీసుకోబోతుంటే వారించాడు.
 ‘‘ఆగు స్టెల్లా... నువ్వు తీస్తావెందుకు? వెయిట్రస్‌ను పిలుస్తానుండు’’ అని చెప్పి, ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ’’ అంటూ గట్టిగా అరిచాడు మార్క్. క్షణంలో ఓ వ్యక్తి పరుగు పరుగున వచ్చాడు. ‘‘ఏం కావాలి సర్’’ అన్నాడు వినయంగా.
 ‘‘నువ్వొచ్చావేంటి? ఇందాక వచ్చిన వెయిట్రస్ ఏమైంది?’’
 మార్క్ ప్రశ్నకి ముఖం చిట్లించాడతను. ‘‘వెయిట్రసా?’’ అన్నాడు అయోమయంగా.
 ‘‘అంత ఆశ్చర్యపోతావెందుకు? వెయిట్రసే. తన సంగతి నాకెందుకు గానీ, మేడమ్ ఫోర్క్ కిందపడిపోయింది. వెళ్లి మరోటి తీసుకురా’’ అన్నాడు కాస్త విసుగ్గా.
 వెయిటర్ మాట్లాడలేదు. అక్కడి నుంచి కదలలేదు. బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు. అతడి ధోరణి అర్థం కాలేదు మార్క్‌కి. ‘‘ఓయ్... ఏంటయ్యా నీ సమస్య? మ్యూజియంలో విగ్రహంలాగా అలా నిలబడ్డావేంటి? వెళ్లి తీసుకురా’’... అరిచినట్టే అన్నాడు.
 ‘‘తప్పకుండా తీసుకొస్తాను సర్. కానీ... మీకో విషయం చెప్పాలి. మా రెస్టా రెంట్లో ఆడవాళ్లెవరూ పని చేయడం లేదు.’’
 ఉలిక్కిపడ్డారిద్దరూ. ‘‘పని చేయక పోవడం ఏంటి? ఆమేగా మాకీ ఫుడ్ సర్వ్ చేసింది?’’ అంది స్టెల్లా అయోమయంగా.
 ‘‘మీకు ఎవరు సర్వ్ చేశారో తెలియదు కానీ, మా రెస్టారెంటులో మాత్రం ఏ అమ్మాయీ పని చేయడం లేదు. కావాలంటే మేనేజర్‌ని అడగండి’’ అనేసి బుర్ర గోక్కుంటూ వెళ్లిపోయాడతను.
 కొయ్యబారిపోయారిద్దరూ. ఎలా రియాక్టవ్వాలో అర్థం కాక ముఖాలు చూసుకుంటూ ఉండిపోయారు.
 ‘‘చెప్పానా? ఈ రెస్టారెంటు వద్దని. భోజనం బాగుంటుందంటూ పట్టుబట్టి తీసుకొచ్చావ్. అందరూ ఊరికే అంటారా ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని? తను... తను కచ్చితంగా దెయ్యమే. పద వెళ్దాం’’ అనేసి మార్క్ సమాధానం కోసం చూడకుండానే విసవిసా బయటకు వెళ్లిపోయింది స్టెల్లా. మార్క్ మాత్రం బిక్కచచ్చిపోయి అలానే కూర్చుండిపోయాడు చాలాసేపు.
 
దెయ్యమా? అంత అందమైన అమ్మాయి... నవ్వుతూ పలకరించింది... చక్కటి ఆతిథ్యం అందించింది... ఆప్యాయంగా వడ్డించి వెళ్లింది... తను దెయ్యమా? ఇది నిజమా? బుర్ర తిరిగిపోయింది మార్క్‌కి. నిజానికి అతడికే కాదు, ఆ రెస్టా రెంట్లో చాలామందికి ఇలాంటి షాక్‌లు తగిలాయి. తమకి కనిపించి తమతో మాట్లాడిన అందమైన అమ్మాయి మనిషి కాదు దెయ్యమని తెలిసి అవాక్కయినవాళ్లు, జడుసు కుని హాస్పిటల్ పాలైనవాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లందరినీ అంతగా కలవరపెట్టిన ఆ అమ్మాయి ఎవరు? తను అమ్మాయా లేక నిజంగా దెయ్యమేనా?! అందరూ చెప్పేదాన్ని బట్టి ఆమె దెయ్యమే. కానీ అక్కడెందుకుంది? అసలామె దెయ్యమెందుకయ్యింది?
   
 1840 - 1930 మధ్య కాలంలో చాలామంది ఐరిష్ అమ్మాయిలు పనులు వెతుక్కుంటూ అమెరికాకు వలస వచ్చేవారు. మోలీ కూడా అలానే వచ్చింది. పొట్ట చేత  పట్టుకుని అమెరికాలో అడుగు పెట్టింది. తనని, తన కుటుంబాన్ని పోషించుకునే మార్గం కోసం వెతుకులాడింది. మిన్నెసొటాలోని ఓ వ్యాపారి ఇంట్లో పని చేయడానికి మనిషి కావాలని తెలిసి అక్కడికి వెళ్లింది. వాళ్ల మనసులను గెలుచుకుంది. ఆ ఇంట్లో పని మనిషిగా చేరింది.
 
మోలీ చాలా అందమైనది. చురుకైనది. చలాకీగా తిరుగుతూ పనులన్నీ చక్క బెట్టేసేది. అతి తక్కువ సమయంలోనే యజమానురాలికి తలలో నాలుకలా మారిపోయింది. అది మాత్రమే అయితే ఏ గొడవా ఉండేది కాదు. కానీ యజమాని జోసెఫ్ ఫోర్‌పా మనసులో కూడా స్థానం సంపాదించింది. అదే ఆమె జీవితాన్ని ఘోరమైన మలుపు తిప్పింది.
 

మోలీ కంటే జోసెఫ్ చాలా పెద్దవాడు. కానీ వయోభేదం వారిని ఆపలేకపోయింది. మోలీ మీద మనసు పడ్డాడు జోసెఫ్. అతడిని అమితంగా ఆరాధించింది మోలీ. మనసులు కలిశాయి. హద్దులు చెరిగాయి. ప్రేమికులైనా భార్యాభర్తల మాదిరిగా జీవించడం మొదలు పెట్టారు. నిష్కల్మషమైన మనసులతో, నిష్కపటమైన ప్రేమతో ఒకరికి ఒకరుగా జీవించసాగారు. అయితే వారి బంధం ఎంతోకాలం కొనసాగలేదు. వాళ్లిద్దరి అనుబంధం గురించి జోసెఫ్ భార్యకు తెలిసిపోయింది. మోలీని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. భర్త చుట్టూ చెప్పలేనన్ని ఆంక్షలు విధించింది.
   
 ‘‘ఏమంటున్నారు మీరు? ఇది మీకు న్యాయమేనా’’... పొంగుకొస్తున్న దుఃఖాన్ని పెదవి మాటున అణచిపెడుతూ అంది మోలీ. జోసెఫ్ మాట్లాడలేకపోయాడు. ఆమె కళ్లలోకి చూసే ధైర్యం కూడా చేయలేక పోయాడు.
 ‘‘సారీ మోలీ. నీకు దూరమై నేను కూడా బతకలేను. కానీ తప్పదు. నా భార్య సంగతి తెలుసు కదా... తన మాట వినకపోతే రాద్ధాంతం చేస్తుంది. నా పరువు మర్యాదల్ని మంటగలిపేస్తుంది. నేను సర్దుకుపోగలిగినా నా పిల్లలు తట్టుకోలేరు. వాళ్లు నలుగురిలో తలెత్తుకుని తిరగలేరు. నావల్ల నా పిల్లలకు అలాంటి గతి పట్టకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ విషయం చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను.’’
 ‘‘కానీ జోసెఫ్... నేను...’’
 ‘‘ప్లీజ్ మోలీ. ఇంకేమీ మాట్లాడకు. ఇక్కడున్న ఒక్కో క్షణం నాకు నరకంలా ఉంటుంది. నీ మీద నాకున్న ప్రేమ నా మనసును మార్చే ప్రయత్నం చేస్తుంది. నన్ను క్షమించు. మనం కలుసుకోవడం ఇదే ఆఖరుసారి. వెళ్తాను’’... అనేసి జోసెఫ్ వెళ్లిపోతుంటే భోరుమంది మోలీ. ‘‘జోసెఫ్... నన్ను విడిచి వెళ్లకు, నన్ను ఒంటరిదాన్ని చేయకు’’ అంటూ పిచ్చి పట్టినట్టుగా అరిచింది. కానీ జోసెఫ్ వినిపించుకోలేదు. కనీసం వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం కూడా చేయలేదు. వెళ్లిపోయాడు. ఆమెను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయాడు. తట్టుకోలేకపోయింది మోలీ. ఓ పక్క మనసును రంపపుకోత పెట్టే ప్రేమ... మరోపక్క తన కడుపులో అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటోన్న జోసెఫ్ ప్రతిరూపం... ఏం చేయాలో తెలియలేదు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. మనసంతా చీకటి కమ్ముకుంది. భవిష్యత్తు శూన్యంలా తోచింది. వంచన మిగిల్చిన బాధతో జీవించలేక ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది. భారంగా బతుకీడ్చలేక తన జీవితాన్నే అంతం చేసుకుంది.
    
ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలేసి కుటుంబంతో సహా వేరేచోటికి వెళ్లిపోయాడు జోసెఫ్ ఫోర్‌పా. అక్కడ కొన్నాళ్లు జీవించాడు. కానీ మనసు నిలవలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ తన పాత ఊరికి తిరిగొచ్చాడు. మోలీతో తాను గడిపిన ఇల్లు ఎప్పటికీ నిలిచిపోవాలనే ఉద్దేశంతో దాన్ని రెస్టారెంటుగా మార్చేశాడు. అయితే  మోలీ జ్ఞాపకాలు అతడిని ప్రశాంతంగా బతకనివ్వలేదు. నాటి ఆ ప్రేమ మనసును మెలిపెట్టసాగింది. ఆమెకు ద్రోహం చేశానన్న అపరాధభావం భూతమై పీడించసాగింది. ఓరోజు మార్నింగ్ వాక్‌కు వెళ్తూ ఓ పొద దగ్గర ఆగాడు. తనతో తెచ్చుకున్న తుపాకీతో కణతల మీద కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
జోసెఫ్, మోలీల ప్రేమకథ అలా దుఃఖాంతమైంది. వారి ప్రేమమందిరమైన ఫోర్‌పా రెస్టారెంటు మాత్రం నేటికీ అతి థులను అలరిస్తూ నిలిచే ఉంది. అయితే ఆ రెస్టారెంటులో దెయ్యాలు ఉన్నాయన్న విషయం మాత్రం చాలామందిని భయ పెడుతోంది. మోలీ ఆత్మ చాలామందికి కనిపించింది. కానీ ఎవరికీ ఏ కీడూ చేయ లేదు. జోసెఫ్‌ని కూడా కొందరు చూశామని చెప్పారు. బహుశా తమ ప్రేమ వికసించిన ఆ భవంతి మీద ప్రేమ చావకే వాళ్లు అక్కడ తిరుగుతున్నారేమో అన్నారు కొందరు. ఎంత గొప్ప ప్రేమికులు అయినా నేడు దెయ్యాలు కదా అంటూ వణికిపోయారు మరికొందరు. అసలిది నిజమే కాదు భ్రమన్నారు ఇంకొందరు. వీటిలో ఏది కరెక్టో ఎవరికీ తెలీదు. నిజాలు కేవలం... దేవుడికెరుక!
 
- సమీర నేలపూడి

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement