అమ్మ రాగాలపట్టి | girls follows their mother behaviour | Sakshi
Sakshi News home page

అమ్మ రాగాలపట్టి

Published Sat, Jan 25 2014 11:15 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమ్మ రాగాలపట్టి - Sakshi

అమ్మ రాగాలపట్టి

ఆడపిల్లలు తల్లిని అనుకరిస్తారని అంటారు. అది నిజమే అనిపిస్తుంది ఈ అమ్మాయిని చూస్తే. తల్లిలాగే అందంగా ఉంటుంది. తన తల్లి స్టయిల్‌ని ఫాలో అవుతుంది.

అనంతరం
 ఆడపిల్లలు తల్లిని అనుకరిస్తారని అంటారు. అది నిజమే అనిపిస్తుంది ఈ అమ్మాయిని చూస్తే. తల్లిలాగే అందంగా ఉంటుంది. తన తల్లి స్టయిల్‌ని ఫాలో అవుతుంది. తల్లిలాగే నడుస్తుంది. తల్లిలాగే నవ్వుతుంది. అన్నింట్లోనూ తల్లిని ప్రతిబింబిస్తుంది. అమ్మ నోట్లోనుంచి ఊడిపడిందా అన్నట్టుండే ఆ పదిహేడేళ్ల పడుచుపిల్ల... లార్డెస్ మారియా. పాప్ సంచలనం మడొన్నా ముద్దుల కూతురు!
 
 
 డిసెంబర్, 2013, అమెరికా. మన్‌హట్టన్‌లోని ఆర్ట్స్ స్కూల్లో ఒక ఫంక్షన్ జరుగుతోంది. సడెన్‌గా స్టేజిమీద ఓ పదిహేడేళ్ల అమ్మాయి ప్రత్యక్షమయ్యింది. ఎర్రటి చుక్కలున్న నల్లటి గౌనులో అప్సరసలా మెరిసిపోతోంది. కొన్ని క్షణాల తరువాత ఆమె గళం విప్పింది. చిన్న అలలా మొదలైన ఆ గాన ప్రవాహం సునామీలా ఆడియెన్స్‌ని చుట్టేసింది. అందరూ ‘లోలా... లోలా’ అంటూ ఒకటే అరుపులు. పాట ఆగింది. ఆమె ఆడియెన్స్‌లో ఉన్న తన తల్లిని చూసి చిన్నగా నవ్వింది.  ఆ తల్లి కళ్లలో నుంచి ఆనందబాష్పాలు రాలిపడ్డాయి. వాటిని తుడుచుకుంటూ మనసులోనే అనుకుంది, ‘‘అయామ్ ప్రౌడాఫ్ యూ  డియర్’’!


 మరుసటి రోజు అన్ని పేపర్లనిండా ఆ అమ్మాయి ఫొటోనే. అందరి నోటా ఆమె గురించిన మాటలే. ఆమాత్రం హడావుడి ఉండదా... ఆమె మడొన్నా కూతురైనప్పుడు! కొన్ని దశాబ్దాలుగా తన గానామృతంతో కోట్లాదిమందిని ఓలలా డిస్తోన్న ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని మడొన్నా... తన కూతుర్ని జూనియర్ మడొన్నా అని అంతా అంటుంటే  మురిసిపోయింది. అమె అంటుంది... ‘‘నేను నా పిల్లల కోసమే బతుకుతున్నాను. వాళ్లు నన్ను మించిపోయారు అంటే నా జీవితానికి ఓ అర్థం చేకూరినట్టే’’ అని. ఆ భారమైన మాట వెనుక ఒంటరిగా నలుగురు పిల్లల్ని పెంచిన కష్టం ఉంది.
 
  అందరూ మడొన్నాను ఫ్రీగా ఉంటుంది అంటారు. ఆ మాటకు అర్థం, ఆమె బాంధవ్యాలను త్వరగా తెంచేసుకుంటుంది అని. అయినా ఆమె లెక్క చేయదు. తన జీవితంలోకి వచ్చి వెళ్లిపోయిన మగాళ్ల గురించి ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని ఆమె అనుకుంటుంది. అదృష్టంకొద్దీ... ఆ సంజాయిషీని ఆమె పిల్లలు కూడా కోరరు.
 
 రెండు సార్లు పెళ్లి చేసుకుంది మడొన్నా. ఆ రెండు పెళ్లిళ్లకి మధ్యలో కార్లోస్ లియోన్ అనే ఫిట్‌నెస్ ట్రెయినర్‌తో ప్రేమలో పడి, లార్డెస్‌కి జన్మనిచ్చింది. తర్వాత మరొకరిని పెళ్లాడి ‘రాకో’కి తల్లయ్యింది. అయితే, పిల్లలకు ఊహ తెలిసేనాటికి వారి తండ్రులు మడొన్నా జీవితంలో లేదు. ఆ వాస్తవాన్ని వారు గ్రహించేసరికి వారి చుట్టూ తన ప్రేమబంధాన్ని అల్లేసిందామె. ఎంతమంది బిడ్డలున్నా ప్రేమను పంచగల విశాలమైన అమ్మ మనసు ఉంది మడొన్నాకి. అందుకే మెర్సీ జేమ్స్‌ని, డేవిడ్ బాండాని దత్తత చేసుకుంది. తన సొంత పిల్లలతో సమానంగా పెంచింది. ఆమె ఎంత గొప్ప అమ్మ అంటే... ఓ దశలో పిల్లలను జాగ్రత్తగా పెంచడం కోసం తన కెరీర్‌ని పక్కన పెడదామా అని కూడా ఆలోచించింది. తల్లి వ్యక్తిత్వం ఏంటో తెలిసిన ఆ పిల్లలను ఏ లోటు బాధిస్తుంది? ఏ వెలితి వేదనకు గురిచేస్తుంది?
 
 అందుకే లోలా (లార్డెస్ ముద్దు పేరు) అంటుంది... ‘‘నాకు అమ్మ వ్యక్తిత్వమంటే ఇష్టం. తన మార్గంలో నడవడం ఇష్టం. నా దృష్టిలో ఆమె ప్రపంచంలోనే బెస్ట్ మదర్’’ అని. తల్లిలా తనూ పాప్ సింగర్ కావాలనుకుంటోంది లార్డెస్. ఇప్పటికే స్వరాలతో చెలిమి చేస్తోంది. రాగాల వెంట పరుగులు తీస్తోంది. బహుశా ఆమె పయనం ఇలాగే కొనసాగితే... త్వరోలోనే మరో మడొన్నా ప్రపంచానికి దొరుకుతుంది!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement