తన ఆశ్రమంలో ధ్యానంలో లీనమై ఉన్న మారీచుడి ముందు వచ్చి నిలిచాడు రావణుడు. తమ రాజుని చూసిన మారీచుడు అతిథి సత్కారాలు చేశాడు. కుశలప్రశ్నలు వేశాడు. అంతటి మహా బలశాలి, పరాక్రమవంతుడు అయిన రావణుడు తన వద్దకు ఎందుకు వచ్చాడో తెలియలేదు. అదే విషయం వినయంగా అడిగాడు. సమాధానంగా రావణుడు ‘‘నాయనా! నేనిప్పుడు మహా కోపంతో ఉన్నాను. వాడెవడో రాముడట. దశరథ మహారాజు కొడుకట. తండ్రి అడవులకు వెళ్లమని ఆజ్ఞాపిస్తే, ఇక్కడకు వచ్చాడు. అతనొక్కడే నా బలగంలోని పద్నాలుగువేల మంది రాక్షసుల్ని, మా సైన్యాధ్యక్షుడైన త్రిశిరుణ్ణి, నా తమ్ముళ్లు ఖరదూషణాదుల్నీ చంపేసి, నన్ను దెబ్బతీశాడు. అతని అందచందాలకు ముగ్ధురాలై, చెంత చేరబోయిన నా చెల్లెలు శూర్పణఖ ముక్కూచెవులూ కోసి, కురూపిని చేసి, తీవ్రంగా పరాభవించాడు. నా చెల్లెలు దీనంగా నా వద్దకొచ్చి నిలుచుంటే, నా గుండె ద్రవించిపోయింది. ఆ రాముడి భార్య సీత మహా సౌందర్యవతి అట. ఆమె అంటే రాముడికి వల్లమాలిన ప్రేమట. ఆ సీతను అపహరించుకునిపోయి, రాముణ్ణి మానసికంగా దెబ్బతీయాలి. అప్పుడు కానీ, నా గుండె మంట చల్లారదు.
నువ్వు నాకు మిత్రుడివి, మాయలు తెలిసిన వాడివి కాబట్టి సీతాపహరణకు నాకు సాయం చేయాలి’’ అన్నాడు. మారీచుడు రావణుడితో ‘‘మహారాజా! నీకు రాముడి సంగతి తెలియదు. అతడు మహా బలపరాక్రమ వంతుడు. ధర్మస్వరూపుడు. సీత ఆయన ప్రాణసఖి. ఆమెను ఆయన నుంచి వేరు చేసిన వారెవరయినా సరే, బతికి బట్టకట్టడం అసాధ్యం. ఇప్పటివరకు ఎంతో సుఖంగా, సంతోషంగా ఉన్నావు. కోరికోరి వైరం పెట్టుకుని, ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎందుకు?’’ అని హితవు చెప్పబోయాడు. ఆ మాటలను రావణుడు ఏమాత్రం చెవిన వేసుకోకపోగా, నీవన్నీ సోమరిపోతు మాటలు. పనికిమాలిన ప్రబోధాలు. రాజు వచ్చి అడిగితే బంటు కాదని అనడం ఎక్కడైనా ఉందా? దిక్పాలకులే నా మాట మీరరే, నీవెంత? నీ సాయమడిగానని మిడిసిపడుతున్నావా? మర్యాదగా నీకు చెప్పిన పని చేయి. లేదంటే నిన్ను ఇక్కడికిక్కడే హతమారుస్తాను’’అని బెదిరించాడు. దుష్టుడైన రావణుడి చేతిలో చచ్చేకంటే, పురుషోత్తముడైన రాముడి చేతిలో మరణించడం మేలనుకున్నాడు మారీచుడు. వెంటనే వెండిచుక్కలున్న బంగారులేడిలా మారిపోయి, పంచవటి వైపు పయనించాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, శత్రువైనా సరే, అతడిలోని మంచిగుణాలను మెచ్చుకోవలసిందే! అదేవిధంగా, పోగాలం దాపురించిన వాడికి ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా, తలకెక్కవు అని.
– డి.వి.ఆర్. భాస్కర్
అదిగదిగో బంగరు లేడి
Published Sun, Mar 25 2018 12:46 AM | Last Updated on Sun, Mar 25 2018 12:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment