ప్రాణభయం... పోయేదెలా?!
జీవన గమనం
నేనో కాలేజీ ప్రొఫెసర్‌ని. మొదట్లో చాలా భక్తిగా ఉండేవాణ్ని. కానీ భక్తి పేరుతో కొందరు పాటించే విధానాలు, వాటి కోసం డబ్బు వేస్ట్ చేయడం చూశాక నా ఆలోచనలు మారిపోయాయి. కళ్లముందు కనిపించే మనిషికి సాయం చేయకుండా కనిపించని దేవుడి కోసం తపన పడటం నచ్చలేదు నాకు. దాంతో నాస్తికుడిగా మారిపోయాను. నేను ఇతరులకు చేస్తోన్న సాయమే నన్ను కాపాడుతుందని నమ్ముతున్నాను. కానీ మా ఇంట్లోవాళ్లతో సహా ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను తప్పు చేస్తున్నానని, పాపం చుట్టుకుంటుందని అంటున్నారు. నిజమా? నేను తప్పు చేస్తున్నానా? - బి.శ్రీనివాసరావు, కనిగిరి
నాస్తికత్వం వేరు, విగ్రహారాధన వేరు. అందర్నీ వినాలి. మనకు నచ్చింది పాటించాలి. అనుభవం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం మనిషిని జ్వలింప జేస్తుంది. మీరు నమ్మిన జ్ఞానం మీకు సంతోషాన్ని ఇస్తున్నదైతే, దానివల్ల ఇతరులకి నష్టం లేకపోతే నిర్భయంగా, నిస్సంకోచంగా దాన్ని అనుసరించండి. మీకో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతాను. నాపై ప్రభావం చూపించిన ఓ వేదాంతి ఉన్నారు... పేరు ఎపిక్యురస్. ‘తిను తాగు సంతోషంగా ఉండు’ అన్న సామెతను ప్రాచుర్యంలోకి తెచ్చింది అతడేనని చాలామంది అతడి గురించి తప్పుగా మాట్లాడతారు. కానీ ‘ప్యాషన్‌తో జీవించు, ఆనందించడానికి పని చెయ్యి, పంచుకోవడానికి సంపాదించు, ఇవ్వడాన్ని ఆనందించు, దాచుకోవడాన్ని విసర్జించు’ అని అతడు కొత్త థియరీ చెప్తాడు. అతని గురించి ఓషో చాలా బాగా చెప్పాడు. బుద్ధుడు, మహావీర్ లాంటివారు సాధారణ జీవనాన్ని గడిపేటందుకు ఆస్తులను, అంతస్తులను వదిలేశారు. జీవితాన్ని ఒక గాడిలో పెట్టుకున్నారు. కాని ఎక్కడైనా క్రమశిక్షణ ఉంటే అక్కడ సంక్లిష్టత ఉంటుంది అంటాడు ఎపిక్యురస్. అతడో చిన్న తోటలో తన స్నేహితులతో కలిసి చాలా సాధారణ జీవితాన్ని గడిపాడు. భోగపూరితమైన, విలాసవంతమైన జీవితాన్ని గడుపు తున్నాడని భావించి ఆ దేశపు రాజు ‘వారి విలాసానికి అడ్డుకట్ట వేస్తాను, పన్ను కట్టకపోతే శిక్షిస్తాను’ అంటూ వెళ్తాడు.
కానీ చెట్లకు నీళ్లు పోస్తూ గడుపుతోన్న వాళ్ల సాధారణ జీవనాన్ని చూసి ఆశ్చర్య పోతాడు. బతకడానికి సరిపడా వస్తువులు మాత్రమే వాళ్ల దగ్గర ఉంటాయి. రొట్టెకి రాసుకోడానికి వెన్న కూడా ఉండదు. దాంతో ఆశ్చర్యపోయి ‘తిను, తాగు ఆనందించు’ అనడంలో అర్థమేమిటి అని అడుగుతాడు. అప్పుడు ఎపిక్యురస్... ‘‘రాజా.. మేం దేవుణ్ని ఏమీ కోరుకోవడం లేదు కనుక ఇక్కడ ఆనందగా సుఖంగా జీవిస్తున్నాం. దేవుడే ఈ కష్టాలు సృష్టించాడని మీరు మనస్ఫూర్తిగా విశ్వసిస్తే, వాటి నుంచి విముక్తి కోసం తిరిగి అతడినే ప్రార్థించడంలో ఏమైనా అర్థం ఉందా? ప్రజలంతా తనను ప్రార్థించడం మర్చిపోతారేమోనన్న ఉద్దేశంతో భగవంతుడు ఈ కష్టాలను సృష్టించి ఉంటే అతడికన్నా స్వార్థపరుడు ఇంకెవరైనా ఉంటారా? పాపులకు, భయస్తులకు మాత్రమే భగవంతుడి అవసరం ఉంది. చేతులు జోడించి ఆకాశం వైపు చూసి ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు అన్నిచోట్లా వ్యాపించి వున్నాడు. ప్రార్థన ఒక వైఖరి’ అని వివరిస్తాడు. ‘విజ్ఞులు మూర్ఖులు కారు, భగవంతుడు అన్ని చోట్లా ఉంటే ప్రత్యేకంగా గుడులూ చర్చిలూ ఎందుకు కట్టడం’ అని ప్రశ్నిస్తాడు రాజు. ‘అన్ని చోట్లా గాలి ఉన్నా పంఖాలు ఎందుకు? పంఖా సౌకర్యం కావలసినవారికే భగవంతుడు. ప్రకృతిసుఖం కావలసిన వారికి అవసరం లేదు’ అని చెప్పాడు ఎపిక్యురస్. కాబట్టి మిత్రమా! తెల్లవారుజాము నుంచి సాయంసంధ్య వరకూ మనస్ఫూర్తిగా చేసే ప్రతి పనీ ప్రార్థనే. మీరు నమ్మిన సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణా నిర్భయంగా ఆచరించండి.
నా వయసు ఇరవై. నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్లతో ఆమధ్య డబ్బుల విషయమై గొడవపడ్డాను. అప్పట్నుంచీ నాకు చాలా భయమేస్తోంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కనిపించినా నా కోసమే మాటు వేశారని అనిపిస్తోంది. భయంతో గుండె దడదడ లాడుతోంది. ఇంట్లో చెబితే తిడతారని చెప్పలేదు. కానీ ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలియడం లేదు. సలహా ఇవ్వండి. - కేఎస్, చిత్తూరు
స్నేహితులు విడిపోరు. విడిపోయే వారు స్నేహితులు కారు. ఆ విషయం పక్కన పెడదాం. మాటు వేయడం, దొంగచాటుగా దెబ్బతీయడం మీరనుకున్నంత సులభం కాదు. మీకు తెలిసిన పెద్దవాళ్లని మీ మాజీ స్నేహితుల దగ్గరకు తీసుకు వెళ్లండి. విషయాన్ని స్పష్టంగా చర్చించండి. వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. మాటల సందర్భంలో మీరు మీ ప్రాణభయం గురించి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసివుంచాను అని ఓ మాట చూచాయగా చెప్పండి. దాంతో పరిస్థితులు చక్కబడవచ్చు. దీనివల్ల వాళ్లు మీమీద ఏ చర్యా తీసుకోకపోయినా... మీ భయం మాత్రం తప్పనిసరిగా తగ్గిపోతుంది.