అన్వేషణం: సాగర గర్భాన సుందర నిర్మాణం | Hydropolis Underwater Hotel in Dubai | Sakshi
Sakshi News home page

అన్వేషణం: సాగర గర్భాన సుందర నిర్మాణం

Published Sun, Dec 8 2013 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

అన్వేషణం: సాగర గర్భాన సుందర నిర్మాణం

అన్వేషణం: సాగర గర్భాన సుందర నిర్మాణం

సబ్ మెరైన్ (జలాంతర్గామి)ని కనిపెట్టినప్పుడు అందరూ చాలా వింతగా చూశారు. ఇది సముద్రం అడుగుకు వెళ్తుందా, అలల మధ్య విహరిస్తుందా, సాగర గర్భాన ఉన్న వింతల్ని చూసే అవకాశం కల్పిస్తుందా అంటూ ఆశ్చర్యపోయారంతా. కానీ అంతకు మించిన వింత, అంతకంటే అద్భుతమైన వింత ఒకటి దుబాయ్‌లో ఉంది. అదే... హైడ్రోపోలిస్. సముద్రపు అడుగున అందంగా కట్టిన స్టార్ హోటల్ ఇది.
 దాదాపు 550 మిలియన్ డాలర్లను ఖర్చు చేసి కట్టిన హైడ్రోపోలిస్ హోటల్ గురించి మాటల్లో వినాలనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే... దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే  వినడం కంటే చూడటమే కరెక్ట్. నీటి అడుగున జెల్లీఫిష్ ఆకారంలో కట్టారు దీన్ని. ఈ హోటల్ పైకప్పు మాత్రమే నీటిపైన కనిపిస్తుంది. మిగతా హోటలంతా నీటి అడుగునే ఉంటుంది.


 ఈ లగ్జరీ హోటల్లో మొత్తం 220 సూట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ బుడగల ఆకారంలో నిర్మించారు. జోషిమ్ హాసర్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన ఈ హోటల్‌లో... ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండే అన్ని సదుపాయాలూ ఉంటాయి. ప్రపంచంలోని అన్ని రుచులనూ అందించే రెస్టారెంట్, స్పా, థియేటర్, బాల్‌రూమ్, బార్ తదితర ఏర్పాట్లన్నీ ఉన్నాయి. మొత్తం అద్దాలతో నిర్మించడం వల్ల చుట్టూ ఉన్న సముద్రం నీలిరంగులో కనిపించి మురిపిస్తూ ఉంటుంది. అలల మధ్యన జరజర సాగిపోయే చేపలు, బుడుంగున మునిగే పీతలు, పలురకాల సముద్ర జీవులు, వింత వింత మొక్కలను చూస్తూ గడపడం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది.


 ఇంతకీ నీటి అడుగున ఉంటే, ఈ హోటల్‌లోకి ఎలా వెళ్తాం అనే సందేహం వచ్చిందా? కచ్చితంగా వస్తుంది. ఈ హోటల్‌లోకి వెళ్లడం కోసం ఎంతో  ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. సముద్రపు ఒడ్డునుంచి హోటల్ వరకూ ఓ రైలు మార్గాన్ని వేయడం జరిగింది. శబ్దం చేయని ఓ అందమైన రైలు సందర్శకులను, టూరిస్టులను అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది. ఏమాత్రం శబ్దం చేయని విధంగా ఈ రైలును ప్రత్యేకంగా తయారు చేయడం విశేషం.


 ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే వెంటనే వెళ్లి అక్కడ బసచేసి, ఆ అందాలను ఆస్వాదించాలని, ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలని ఎవరికైనా అనిపించక మానదు. అయితే అక్కడ బస కాస్త కాస్ట్‌లీనే. ఒక్క రాత్రి ఉండటానికి 5,500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో... మూడు లక్షల ముప్ఫై వేలన్న మాట!
 
 ఇది పూయాలంటే... శతాబ్దం ముగియాలి!
 ఏ మొక్క అయినా ఎప్పుడు పూస్తుంది? ఒకటి వేసవిలో పూస్తుంది. ఇంకోటి వసంతమాసంలో పూస్తుంది. ఒక్కో రకం ఏడాదికోసారి పూస్తుంది. ఇంకో రకం సంవత్సరానికి రెండు మూడు సార్లు పూస్తుంది. కానీ ‘క్వీన్ ఆఫ్ ఆండిస్’ అనే మొక్క ఎన్నేళ్లకోసారి పూస్తుందో తెలుసా? సుమారు వందేళ్లకోసారి!


 క్వీన్ ఆఫ్ ఆండిస్ మొక్కలు పెరూ, బొలీవియా దేశాల్లోని ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో మాత్రమే మొలుస్తాయి. వీటికి కొమ్మలు, ఆకులు అంటూ ఉండవు. మొత్తం కాండంలాగా పొడవుగా... 33 అడుగుల ఎత్తు వరకూ ఎదుగుతాయి. ఈ మొక్కలకు పైనుంచి కింద దాకా ముళ్లుంటాయి. ఈ ముళ్ల మధ్యలోకి పొరపాటున చెయ్యిగానీ పెట్టామా... ముక్కలుగా తెగిపోవాల్సిందే తప్ప బయటకు తీసుకోలేం. చాలాసార్లు పక్షులు వీటిలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోతాయి. అయితే ఈ ముళ్లకు చివర్ల అందమైన పూలు పూస్తాయి. ఒకేసారి మూడు నాలుగు వేల పూలు విచ్చుకుని ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ ఇవి ఎనభై నుంచి వంద సంవత్సరాలకొకసారి మాత్రమే పూస్తాయి. అదే విశేషం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement