
ఇంటివారు వేలు చూపితే బయటి వారు కాలుచూపుతారు
నివృత్తం: ఇది ప్రవర్తనకు సంబంధించిన సామెత. సాధారణంగా ఏ మనిషైనా ఏవో కొన్ని తప్పులు చేయడం, సరిదిద్దుకోవడం సాధారణమైన విషయమే. గాని తప్పులు చేయడమే పనిగా పెట్టుకోకూడదు. కనుక ఈ విషయం తెలుసుకుని మసలుకోవాలి. మనపై మనంటి వారికి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. మన కోసం కష్టపడి, ఏమైనా చేయగలిగిన వారే అయినా చిన్నచిన్న పొరపాట్లు తప్పులను వదిలేస్తారు గాని మన తప్పులు హద్దులు మీరుతుంటే ఎత్తిచూపుతారు. ప్రశ్నిస్తారు. సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇంట్లో వారు వేలెత్తి చూపేలా నీ తప్పులున్నాయంటే ఈ వేషాలు బయటి వాళ్ల ముందు వేస్తే, ఇలాగే తప్పులు చేస్తే తన్ని పంపుతారు. అంటే ఇంట్లో వారు హెచ్చరించిన వెంటనే నీ తప్పులు సరిదిద్దుకో లేకపోతే కష్టాలు పడతావు అని అర్థం.
దేవుడి వద్ద దీపం ఎందుకు పెడతారు?
ఆలయం అయినా, పూజ గది అయినా నిరంతరం ప్రసన్నంగా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండాలి. ఇందుకోసం పాటిస్తున్న సంప్రదాయాల్లో దీపం పెట్టడం ఒకటి. సాధారణంగా దైవ పూజలు ఇప్పట్లా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కచ్చితంగా, శాస్త్రోక్తంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత పూజలు చేసేవాళ్లు. పూర్వం విద్యుత్తు వంటివి ఉండేవి కాదు కదా... అందుకే దీపం పెట్టి దేవుడ్ని ఆరాధించేవారు. పూజాధికాల తదనంతరం ఇతర భక్తులు ఎవరైనా దేవుడ్ని దర్శించుకోవాలన్నా దీపం వెలుగులో ఆ మూర్తి రూపం కనిపిస్తుంది. దర్శనానికి అనువుగా ఉంటుంది. లేకపోతే చీకటిలో ఇబ్బంది పడతారు కదా. అంతేగాకుండా ఏ ఆలయంలోనూ గర్భగుడిలో కిటికీలు ఉండవు. కాబట్టి దీపం వల్ల ఆలయంలో వెలుగు వస్తుంది. అందుకే ఇది ఒక సంప్రదాయంగా వచ్చింది.