‘పుర్రె’కో బుద్ధి!
చూస్తుంటే ఫ్రాన్స్ విచిత్రమైన వినోదాలకు నెలవులా ఉంది! అందుకే, ఈసారి ‘వర్ణం’లోని మూడు అంశాలూ అక్కడివే! చిత్రంలోని ఇద్దరమ్మాయిలు ఉల్లాసంగా ఫొటోలు తీసుకుంటున్నది ఒకప్పటి శవాల నేలమాళిగలో! 18వ శతాబ్దం చివర్లో పారిస్ నగరంలో శ్మశనాలు చాలకపోవడంతో ఇక్కడ పూడ్చేవారు. సుమారు 60 లక్షల మందిని ఇక్కడ ఖననం చేసినట్టుగా చెబుతారు. ఆ సంఖ్యను నిర్ధారించేది పేర్చిపెట్టిన పుర్రెలూ, ఎముకలూ! ఈజిప్ట్, ఇటలీలాంటి ఇంకా ఎన్నో దేశాల్లోనూ ఇలాంటి నేలమాళిగలు ఉన్నప్పటికీ చాలావరకు అవి మతంతో ముడిపడిన క్రతువులు నిర్వహించడానికి ఉద్దేశించినవి. ‘క్యాటకాంబ్స్ ఆఫ్ పారిస్’ మాత్రం కేవలం ‘మృతుల రద్దీ’ని తట్టుకోవడానికి తవ్వింది! చిత్రంగా, ఇప్పుడది పర్యాటక స్థలంగా వర్ధిల్లుతోంది. ఒక సమయం తర్వాత మరణం కూడా తీపిగుర్తేనన్నమాట!