సక్సెస్‌కి నిజమైన సింబల్ | iqbal movie | Sakshi
Sakshi News home page

సక్సెస్‌కి నిజమైన సింబల్

Published Sun, Sep 13 2015 12:50 AM | Last Updated on Tue, Oct 2 2018 3:16 PM

సక్సెస్‌కి నిజమైన సింబల్ - Sakshi

సక్సెస్‌కి నిజమైన సింబల్

దేడ్ కహానీ - ఇక్బాల్
* లక్ష్యం విలువను చెప్పే చిత్రం
* లక్ష్య సాధనను నేర్పే చిత్రం
* విజయానికి అర్థం చెప్పే చిత్రం
1967, మార్చి 30న హైదరాబాద్‌లో కె.ఎస్.నాయుడు, కుసుమా సుదర్శన్ అనే దంపతులకి కుకునూరు నగేష్‌నాయుడు కొడుకుగా పుట్టాడు. మామూలుగా అందరిలో ఒకడిగా పెరిగాడు. పెరుగు తూనే ఇంటి దగ్గరే ఉన్న నారాయణగూడ థియేటర్లలో తెలుగు, హిందీ, ఇంగ్లిషు సినిమాలు చూస్తుండేవాడు.

హైస్కూలు అయ్యాక ఇంజినీరింగ్ చేశాడు. అమెరికా లోని అట్లాంటాలో మాస్టర్స్ చేశాడు. అక్కడే ఫిల్మ్ స్కూల్‌లో యాక్టింగ్, డెరైక్షన్ కోర్సులు చదివాడు. చదువుకుంటున్న రోజుల్లో అమెరికాలో మాస్టర్స్ చదివే చాలామంది విద్యార్థుల్లాగే చిన్నా చితకా పనులు చేస్తూ, ఆ వచ్చిన సంపాదనలో మిగిల్చిన డబ్బు (డాలర్లు) తీసుకుని హైదరాబాద్ వచ్చేశాడు. ఇక్కడిదాకా మామూలు కథే. ఇక్కడే ఉంది కీలకం.
 
అతని దగ్గర నలభై వేల డాలర్లు ఉన్నాయి... 2000వ సంవత్సరంలో. అప్పుడు భారతదేశంలో రూపాయల్లో కొలిస్తే సుమారు పదిహేడు లక్షల రూపాయలు. ఒక సినిమా తీయాలి అని కసిగా అనుకున్నాడు. కథ రాసుకున్నాడు. పుట్టిన గడ్డమీద మమకారంతో, అక్కడి జీవన విధానం మీద ఉన్న అవగాహనతో ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా నిర్మించి, రచించి, దర్శకత్వం వహించి, తనే హీరోగా నటించేశాడు. మొదటిసారి హైదరాబాదీ ఉర్దూని తెలుగు, ఇంగ్లిషు మిక్సీ చేసిన టింగ్లిషు సినిమాలో రుచి చూపించాడు.

ఒక ఎన్నారై చాలాకాలం తర్వాత హైదరాబాద్ వస్తే, తనే తన సొంత ఊళ్లో ఫారిన్ వచ్చినట్టు ఫీలౌతాడు. సహజత్వంతో గుబాళించిన ఆ చిత్రం ఆ టైమ్‌లో హైదరాబాద్, బెంగళూర్, ముంబై లాంటి మహా నగరాలలో ఆరేసి నెలలు ఆడేసింది. దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది అంతర్జాతీయ దర్శకునిగా ఎదిగిన కుకునూరు నగేష్ నాయుడు అలియాస్ నగేష్ కుకునూర్ ఘనత.

ప్రతి తెలుగువాడూ గర్వించదగ్గ తెలంగాణ ముద్దుబిడ్డ నగేష్. తన మొదటి చిత్రంతోనే ఇంటర్నేషనల్ అవార్డులు, జాతీయ అవార్డులు అందుకున్న దర్శకుడు, చిన్న మొత్తంతో పెద్ద లాభం వచ్చే సినిమా తీయడం ఎలాగో తెలిస్తే ఇక ఆగుతాడా? దూసుకుపోయాడు. కమర్షియల్ సినిమాకి, ప్యారలల్ సినిమాకి మధ్యస్థంగా కమర్షియల్ ప్యారలల్ సినిమాలని రూపొందించడం నేర్చుకున్నాడు. దర్శకుడి గురించిన కథే ఇంత ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ఇక అతను, ఒక సామాన్య నిరుపేద యువకుడు భారతీయ క్రికెట్ టీమ్‌లో ఫాస్ట్ బౌలర్ అవ్వాలని కలగని, అవి నెరవేర్చుకున్న కథని సినిమాగా తీస్తే ఇంకెంత ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది?
 
నిజంగానే ఇన్‌స్పైర్ చేసింది. అదే, ‘‘ఇక్బాల్’’ చిత్రం. శ్రేయాస్ తల్పాడే అనే నూతన నటుడు ఇక్బాల్‌గా జీవించిన చిత్రం. ఈనాటి కథానాయిక  శ్వేతాబసు ప్రసాద్ ఇక్బాల్ చెల్లెలిగా అందరినీ ఎంతగానో అలరించిన చిత్రం. నసీరుద్దీన్ షా, గిరీష్ కర్నాడ్ లాంటి మహామహు లంతా అలవోకగా, అద్భుతంగా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన చిత్రం.
 
మన దేశంలో అనధికారిక మతమైన క్రికెట్ నేపథ్యంగా నడిచే కథ అది. ఎన్నేళ్ల తర్వాత చూసినా, ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ స్ఫూర్తిని నింపే కథ. అలాగని చాలా సీరియస్‌గానో, ఏడిపించే లాగానో ఉంటుందనుకుంటే పొరపాటు. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే మనసుల్ని కదిలిస్తుంది. చెవులు వినపడని, నాలుక మాట్లాడని కుర్రాడు ఇక్బాల్. అతని సైగల్ని చెల్లెలు అందరికీ అర్థమయ్యేలా ట్రాన్స్‌లేట్ చేస్తుంటుంది. అలాంటివాడు క్రికెట్‌లో ఎదగాలని కలగనడం, దానికోసం కష్టపడడం - ఈ ఆలోచన ఎంత అసహజంగా, ఇల్లాజికల్‌గా, కల్పనగా, తోస్తుందో అంత సహజంగా, లాజికల్‌గా, కథగా మలిచాడు దర్శకుడు.
 
1983లో కపిల్‌దేవ్ మ్యాచ్ ఆడు తుంటే, ఒక మారుమూల కుగ్రామంలో చెట్టుకి ట్రాన్సిస్టర్ కట్టేసుకుని ఊరి ప్రజలంతా ఆసక్తిగా హిందీలో కామెంటరీ వినడంతో ఇక్బాల్ చిత్రం మొదలౌతుంది. ఆ మ్యాచ్‌ని అమితాసక్తిగా వింటున్న ఓ నిండు గర్భిణి, భారత్ గెలిచిందన్న వార్తతో ఊరివాళ్లతో బాణసంచాల మధ్య డ్యాన్స్ చేస్తూ చేస్తూ గర్భం దాల్చుతుంది. ఆ ఆనందోత్సాహాల ఫలితమే కడుపులో ఉన్న శిశువుకి చెవుడు, మూగతనం రావడం.

ఆ తల్లి అమితాసక్తికి ఫలితమే ఆ శిశువుకి క్రికెట్ ఆటే ప్రాణప్రదంగా, జీవితంగా, ఊపిరిగా తోచడం. ఇక్బాల్ తండ్రి సన్నకారు రైతు. ఇక్బాల్ తనకి పొలం పనుల్లో సాయం చేసి రోజూ రొట్టె తింటూ, అందరి మధ్య గౌరవంగా బతకాలని భావిస్తాడు తండ్రి. క్రికెట్ ఆటతో జీవితాన్ని పాడుచేసుకోవద్దని హితవు చెప్తూ కొడుకు ఇక్బాల్‌కి, భార్యకి, కూతురికి, ఇక్బాల్ గురువు మోహిత్ (నసిరుద్దీన్‌షా)కి విలనౌతాడు.
 
తండ్రి నిరుత్సాహ పరచినా వెనకడుగు వేయని మొండివాడు ఇక్బాల్. అనేకానేక మలుపుల తర్వాత స్వచ్ఛమైన ప్రదర్శన ఆధారంగా, జాతీయ సెలెక్టర్‌గా అతిథి పాత్ర పోషించిన కపిల్‌దేవ్ మూలంగా రంజీ టీమ్‌లో చోటు దక్కించుకుంటాడు. చివరికి భారత జట్టుకి ఎంపికవడం, తండ్రి పొలం బ్యాంకువారు జప్తు చేస్తుంటే తనే డబ్బివ్వగలిగే స్థాయికి రావడంతో చిత్రం ముగుస్తుంది.
 తల్లికి క్రికెట్ అంటే ప్రేమ. కొడుకు ఇక్బాల్ అంటే ప్రేమ. ఇక్బాల్ క్రికెట్ ఆడుతుంటే చూడాలని కోరిక. పల్లెటూరి ప్రజల మనస్తత్వాలు, భావోద్వేగాలు, ఆటగాడిగా జీవితంలో ఓడిపోయి ఆ ఫ్రస్ట్రేషన్‌లో తాగుబోతుగా మారిన మోహిత్ (నసీరుద్దీన్ షా) ఇక్బాల్ పట్టుదల వలన మంచి గురువుగా ఎదగడం అంతర్లీనంగా ఇంకో కథ.
 
అడ్డదారిలో ఇండియన్ టీమ్‌లో ఓ వెలుగు వెలిగి ఆ పరిచయాలతో అకాడమీ నెలకొల్పి డబ్బుకి అమ్ముడుపోయి, తన శిష్యుడు కమల్‌కి (ఆదర్శ్ బాలకృష్ణ) భారత జట్టులో చోటు దక్కించే ప్రయత్నంలో ఇక్బాల్ చేతిలో ఓడిపోయిన గురువుగా గిరీష్ కర్నాడ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఒక ఆటలో ఒకరి ఉత్థానం, ఇంకొకరి పతనం ఒకే కథలో పెనవేసుకుపోవడం వలన ఈ కథని బలంగా అల్లినట్టు అనిపిస్తుంది.

ఈ చిత్రం తర్వాత కథకుడు విపుల్.కె.రావల్‌కి, దర్శకుడు నగేష్ కుకునూర్‌కి బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వచ్చాయి. చిత్రం ఏమిటంటే, వ్యక్తిగత కారణాల వల్ల నగేష్‌తో కలిసి పనిచేయనని విపుల్.కె.రావల్ ప్రకటించడం! కథ కన్నా ఆ కథని మలచిన దర్శకుడికే ఎక్కువ మార్కులు రావడం కొన్ని సినిమాలకి జరుగుతుంటుంది. అప్పుడు రచయితలు ఆ దర్శకులతో మళ్లీ జత కట్టడానికి ఆసక్తి చూపరు. ఇలాంటి కినుకులు ఈ పరిశ్రమలో సాధారణం.
 సలీమ్ - సులేమాన్, హిమేష్ రేషమియా కలిసి రూపొందించిన ఈ చిత్రం ఆడియో కూడా బాగానే ఉంటుంది.
 
సాధారణంగా ఏ సినిమాలో అయినా సన్నివేశాలుంటాయి. కానీ చాలా తక్కువ సినిమాల్లో సన్నివేశాలు ఉండవు. మూమెంట్స్ ఉంటాయి. ఆ అనుభూతులు మనకు గొప్ప అనుభూతిని మిగులుస్తాయి. ఇక్బాల్ అదే చేస్తుంది. ఈ చిత్రంలో చాలా సందర్భాల్లో మాటలు, హావభావాలు నేరుగా మనసుకి తగిలేస్తూ ఉంటాయి.
 
అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ఈ చిత్రాన్ని సుభాష్ ఘాయ్ స్వయంగా తన ‘ముక్తా సెర్చ్‌లైట్ ఫిల్మ్స్’ పతాకంపై నిర్మించడం. భారతదేశం గర్వించదగ్గ మోడరన్ షో మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ సినిమాగా సుభాష్‌కి పేరు. అలాంటి ఆయన ఇలాంటి చిత్రం తీయడం నిజంగా విశేషమే! ఏ గొప్పవాడి ప్రమేయమూ దర్శకుడి పనితనాన్ని, ప్రతిభని దాటిపోకపోవడం ఈ చిత్రం ప్రత్యేకత. అందుకే ‘ఇక్బాల్’ పెట్టిన డబ్బుకి ఆరు రెట్లు ఎక్కువ వసూలు చేసింది. కమర్షియల్ ప్యారలల్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగాను, మనదేశ వ్యాప్తంగానూ పలు అవార్డులు అందుకొంది.
 
కొసమెరుపు:
నగేష్ కుకునూర్ మాస్టర్‌‌స చదివిన అట్లాంటాలో... మా బంధువులైన శ్రీ శివ గడ్డమణుగు గారింట్లో కూర్చుని... నేను ఈ సినిమాని మళ్లీ చూడడం, ఈ వ్యాసం రాయడం యాదృచ్ఛికం. కానీ నాకో గొప్ప అనుభవం. అంత మంచి సినిమాను మళ్లీ చూడటం, అనుభూతి చెందడం, ఆ సినిమా విశేషాలను మీతో పంచుకోవడం నిజంగా విశేషం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement