![నమ్మకం: అరిష్టమా? అదృష్టమా?](/styles/webp/s3/article_images/2017/09/1/61377964112_625x300.jpg.webp?itok=wkdqu0OH)
నమ్మకం: అరిష్టమా? అదృష్టమా?
మంచి నమ్మకం బలమవుతుంది. చెడు నమ్మకం ముదిరితే బలహీనతగా మారుతుంది. కానీ మనం నమ్మేది మంచిదో కాదో తెలుసుకోవడమే పెద్ద చిక్కు. ఎందుకంటే ప్రతి మనిషికీ తాను నమ్మేదే నిజమనిపిస్తూ ఉంటుంది కాబట్టి. అయితే అన్ని నమ్మకాలూ నిజాలు కావు. అలాంటి నిజం కాని నమ్మకమొకటి ఎన్నో యేళ్లుగా నల్లపిల్లి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. నల్లపిల్లి ఎదురొస్తే కీడు జరుగుతుందని, నల్లపిల్లి ఇంట్లో ప్రవేశిస్తే దుష్టశక్తి ఇంట్లోకి వచ్చిందని అనుకోవడం వెనుక ఎంత నిజముంది?
నల్లపిల్లి పేరు చెబితే వణికిపోయే దేశాలు చాలా ఉన్నాయి. అది కనుక ఎదురొస్తే మనమో లేదా మనవాళ్లెవరో మంచమెక్కుతారని, ప్రాణం కూడా పోవచ్చని వణికిపోతుంటారు పలు దేశాల వాళ్లు. కుక్క ఎదురు పడితే పోని ప్రాణం, పిల్లి ఎదురొస్తే పోవడమేమిటి అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పరు. ఎందుకంటే, దానికి సమాధానం ఎవరి దగ్గరా లేదు కాబట్టి!
మొదట్లో నల్లపిల్లి కూడా అన్ని జంతువుల్లాంటిదే. కానీ మధ్య యుగంలో ఎలా మొదలైందో తెలీదు కానీ, నల్లపిల్లికి చెడుకాలం మొదలైంది. దుష్టశక్తుల్ని పారద్రోలడానికి, మేలును పొందడానికి నల్లపిల్లిని బలిచ్చే సంప్రదాయం మొదలైంది. అది కాస్తా తర్వాత అసలు నల్లపిల్లి అంటేనే దుష్టతకు నిలయమని, దుష్టశక్తులు దాని చుట్టూ తిరుగుతుంటాయని, అందువల్లే అది అపశకునమని, అపవిత్రమని నమ్మడం మొదలైంది. అయితే ఇలా ఎందుకు అనుకోవాల్సి వచ్చిందనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే.
యూరోప్ దేశాల్లో నల్లపిల్లి భయం ఇప్పటికీ ఎక్కువగా ఉందని పరిశోధకులు అంటున్నారు. అమెరికాలో నల్లపిల్లి అంటే దురదృష్టమని, దుష్టశక్తి అని భావిస్తున్నారు. భారతదేశంలో కూడా నల్లపిల్ల వచ్చిందంటే ఇంట్లోకి దెయ్యం వచ్చినట్టేనని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. ఐర్లాండ్ వారికయితే నల్లపిల్లి అంటే అస్సలు గిట్టదు. వారు దాన్ని చూడ్డానికి కూడా ఇష్టపడరు. చూశారా, ఏదో అరిష్టం జరుగుతుందని కంగారు పడిపోతారు. పొరపాటున తమ చేతుల్లో గానీ, తమ పెరట్లో కానీ నల్లపిల్లి చచ్చిపోతే, పదిహేడేళ్ల పాటు శని వెంటాడుతుందని భావిస్తారు వారు.
అయితే నల్లపిల్లిని అదృష్ట దేవతగా కొలిచేవారు కూడా ఉన్నారు. వారిలో ఈజిప్షియన్లు ప్రథములు. వారు పూజించే ‘బస్త్’ అనే దేవత మనిషి శరీరంతో, నల్లపిల్లి తలతో ఉంటుంది. అందుకే వారికి నల్లపిల్లి ఎంతో పవిత్రమైనది. ఆ దేశంలో నల్లపిల్లిని చంపితే మరణశిక్షను విధించాలనే చట్టం కూడా మొదట్లో ఉండేది. ఆధునిక చట్టాలు వచ్చాక దాన్ని పాటించడం మానేశారు. అంతేకాదు, సూర్యకిరణాలు నల్లపిల్లి కళ్లలో నిక్షిప్తమై ఉంటాయని, అందుకే అవి మెరుస్తుంటాయని భావిస్తారు వారు. యూకేలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నల్లపిల్లి ఎదురొస్తే శుభం చేకూరుతుందని విశ్వ సిస్తారు. బ్రిటన్ చక్రవర్తి చార్లెస్ 1 దగ్గర ఓ నల్ల పిల్లి ఉండేదట. అది చనిపోతే, తన అదృష్టమంతా పోయిందని బాధపడ్డాడాయన. ఆ తర్వాత రోజే రాజ్యాన్ని కోల్పోవడమే కాక, జైలు పాలయ్యాడు కూడా. అప్పట్నుంచే బ్రిటన్లో ఈ నమ్మక పెరిగిందని అంటారు. స్కాట్లాండ్ వారికి కూడా నల్లపిల్లి శుభసూచకం. తెల్లవారు జామున దాన్ని చూస్తే మరీ మంచిదని అనుకుంటారు వారు.
బహుశా ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాతే నల్లపిల్లి అదృష్టం తెచ్చిపెడుతుందని అంతా నమ్మి ఉంటారు. మరి ఏం చూసి అది అరిష్టం తెచ్చిపెడుతుందని యూరోపియన్ దేశాల్లో నమ్ముతున్నారు? అలా నమ్మడానికి బలమైన కారణాలేమైనా ఉన్నాయా? అయినా ఒకే విషయం ఒకరికి అదృష్టాన్ని, ఒకరికి దురదృష్టాన్ని ఎలా తెచ్చిపెడుతోంది? వీటన్నిటికీ సమాధానం దొరికిన రోజు గానీ ఇది నమ్మకమో మూఢనమ్మకమో అర్థం కాదు!