
అనంతరం : జాక్సన్ పిల్లలు బయటికి రారు
అమెరికాలో... ఆరు నెలల కిత్రం ఓ రోజు... ఓ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఇంట్లోవాళ్లు సరైన సమయంలో చూడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. మీడియా ఆమె వెంట పడింది. తర్వాత ఒక కుర్రవాడు ఓ ఖరీదైన రెస్టారెంటు నుంచి బయటకు వచ్చాడు. అతడితో పాటు అతడి గాళ్‌ఫ్రెండ్ కూడా ఉంది. తమను గమనించి, వెంటపడిన మీడియా నుంచి తప్పించుకోవడానికి ఆ జంట పరుగులు తీసింది. కొద్ది రోజుల క్రితం ఓ పదకొండేళ్ల చిన్నారి కరాటేలో బ్లూ బెల్ట్ గెలుచుకున్నాడు. చుట్టూ గుమిగూడిన మీడియాను చూసి భయపడ్డాడు. నాయనమ్మ మాటున దాగేందుకు ప్రయత్నించాడు.
ఈ ముగ్గురికీ మీడియా కొత్త కాదు. తమ తండ్రి వెంట కెమెరాలు, మైకులు పట్టుకుని మీడియా అంతా వెంటపడటం కళ్లారా చూశారు. కానీ తండ్రి మరణించాక వారు మీడియాకి దూరంగా పారిపోయారు. ఎక్కడో ఉంటున్నారు. తామేం చేసినా ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. వాళ్లెవరో కాదు. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ పిల్లలు... ప్రిన్స్ (16), ప్యారిస్ (14), బ్లాంకెట్ (11).
అన్నీ ఉన్నా... ఏదో వెలితి!
డబ్బుకు లోటు లేదు. ప్రపంచమే పిచ్చిగా ఆరాధించే గాయకుడి బిడ్డలుగా గుర్తింపుకూ లోటు లేదు. కానీ లోటు, కొదవ, వెలితి లాంటి మాటలు తండ్రి మరణించాక వారికి తెలిసొచ్చాయి. ప్రిన్స్, ప్యారిస్‌లు మైఖేల్‌కి రెండో భార్య డెబ్బీ రోవె ద్వారా కలిగిన పిల్లలు. ఇద్దరూ విడిపోవాల్సి వచ్చినప్పుడు... వారిని మైఖేల్‌కి అప్పగించింది డెబ్బీ. కోట్లకు పగడలెత్తాడు కాబట్టి బాగా పెంచుతాడనుకుందో లేక తన దగ్గర అంత సంపద లేదు కాబట్టి లోటు జరుగుతుందనుకుందో తెలీదు కానీ... పిల్లలిద్దరి బాధ్యతనూ తండ్రికే అప్పగించింది. బహుశా అందుకేనేమో... ఇప్పటికీ ప్రిన్స్ తన తల్లికి చేరువ కావడానికి ఇష్టపడటం లేదు. చెల్లి ప్యారిస్‌లాగా ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం లేదు.
ఇక బ్లాంకెట్ సంగతి వేరు. అతడి తల్లి ఎవరో ఎవరికీ తెలియదు. ఓ సరొగేట్ మదర్ ద్వారా బ్లాంకెట్‌కి తండ్రి అయ్యాడు జాక్సన్. ముగ్గురు పిల్లలనూ పిచ్చిగా ప్రేమించాడు. ఆ విషయాన్ని పిల్లలే చెబుతారు. ‘‘నాన్నతో గడిపిన రోజులు మా జీవితాల్లో ఎంతో గొప్ప జ్ఞాపకాలు. ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన మరణాన్ని నేనిప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నా’’ అంటుంది ప్యారిస్. నిజమే. ఆమె తండ్రి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అదే కారణమో, మరేదైనా సమస్య ఉందో తెలీదు కానీ... తన ప్రాణాలను తనే తీసుకోవాలని ప్రయత్నించింది. అదృష్టంకొద్దీ బతికింది. కానీ మామూలు మనిషి కాలేకపోయింది.
అన్నీ తండ్రితోనే పోయాయి!
జాక్సన్ చనిపోయిన తరువాత అతడి ఆస్తిలో వాటాలైతే దక్కాయేమో గానీ... అతడు పంచిన ప్రేమ, అనురాగం, ఆనందం కొరవడ్డాయి. అయినా ప్రిన్స్ ధైర్యంగా నిలబడ్డాడు. నాన్న తరఫువారి సంరక్షణలో ఉన్నా, వారిమీద ఆధారపడలేదు. తనంత తానుగా తనకిష్టమైన కళారంగం వైపు అడుగులు వేశాడు. యాంకర్‌గా, నటుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బహుశా అన్నీ సక్రమంగా జరిగివుంటే ప్యారిస్ కూడా ఏదో ఒకటి సాధించి ఉండేది. కానీ ఆవేదనను నియంత్రించుకోలేక నిస్సహాయంగా నిలబడింది. ఆ సమయంలో చెల్లెలికి అండగా నిలబడ్డాడు ప్రిన్స్. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. తమ్ముడు బ్లాంకెట్‌ని కూడా వెనకుండి ప్రోత్సహిస్తున్నాడు.
ఈ ముగ్గురూ సాధారణంగా బయటకు రారు. తండ్రి పేరుని వాడుకునే ప్రయత్నం చేయరు. మా జీవితాలు మావి అన్నట్టుంటారు. మమ్మల్నిలా బతకనివ్వండి అన్న భావాన్ని చూపుల నిండా నింపుకుని ఉంటారు. ఒకరకంగా అదే మంచిదేమో. డబ్బు, పేరు ఒంటరిగా రావు. ఒడిదుడుకులను వెంటబెట్టుకు వస్తాయి. వాటిని తట్టుకోవడం ఎవరికోగానీ సాధ్యం కాదు. ఆ విషయం తండ్రి జీవితం వాళ్లకు తెలిపే ఉంటుంది. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అన్న పాఠం నేర్పే ఉంటుంది. మరి ఆ పాఠం వీళ్ల జీవితాలను ఏ తీరానికి చేరుస్తుందో!
- సమీర నేలపూడి