
ప్రేమిస్తే...
హృదయం
ప్రేమిస్తే ఏం చేయాలి? కలిసి బతకాలి లేదా కలిసి చావాలి అంటారు కొంతమంది!
కలిసి బతకలేనప్పుడు విడిపోయి, ఎవరి జీవితాలు వారు చూసుకోవడం మేలంటారు ఇంకొంతమంది! కానీ వాళ్లిద్దరూ కలిసి బతకలేదు. కలిసి చావలేదు. ఎవరి జీవితాలు వాళ్లు చూసుకోలేదు. ఒకరి జ్ఞాపకాల్లో ఇంకొకరు గడిపేశారు.
కానీ విధి వారికి ఈ ఆనందం కూడా మిగల్చలేదు.
అతణ్ని ఆమెకు శాశ్వతంగా దూరం చేసింది. ఆ సమయంలో ఆమె ఏం చేసింది?
కేరళ రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తి, ఇప్పుడు వెండితెరకెక్కుతున్న ఆ నిజ జీవితగాథ మీకోసం.
కాంచన, మొయిదీన్... ఈ పేర్లను తలుచుకుంటే కేరళలో చాలామంది కళ్లు వర్షిస్తాయ్. గుండెలు బరువెక్కుతాయ్. వీరి కథేంటో తెలుసుకోవాలంటే అర శతాబ్దం వెనక్కి వెళ్లాలి. ఉత్తర కేరళలోని కోజికోడ్‌కు సమీపంలో ఉండే ముక్కమ్‌లో 1960 ప్రాంతంలో మొదలైందీ కథ. ఆ గ్రామంలో ఓ పెద్ద హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయి కాంచన. ఓ పెద్ద ముస్లిం కుటుంబానికి చెందిన అబ్బాయి మొయిదీన్. వీరి తండ్రులు మంచి మిత్రులు.
వారి నుంచి స్నేహ వారసత్వాన్ని కాంచన, మొయిదీన్ అందుకున్నారు. ఇద్దరూ కలిసి తమ ఊరి నుంచి పడవలో పక్క ఊరికి స్కూలుకెళ్లేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. కొన్నాళ్లకే విషయం పెద్దవాళ్లకు తెలిసిపోయింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమన్నారు. కానీ వారి పెళ్లికి ఇరు కుటుంబాలవారు ఒప్పుకోలేదు. ఊరిలో పెద్ద గొడవే అయింది. స్నేహితులు శత్రువులయ్యారు. ఇరు కుటుంబాలు దూరమయ్యాయి. కాంచన, మొయిదీన్ కూడా ఒకరికొకరు దూరమయ్యారు. మొయిదీన్‌కు బంధువుల అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేయాలని చూశారు. అతనొప్పుకోలేదు.
ఇంటి నుంచి బయటికి పంపేశారు. మరోవైపు కాంచన చదువు ఆపేసిన పెద్దవాళ్లు... ఆమెను ఇంటి నుంచి బయటకు పంపడమే ఆపేశారు. ఇద్దరూ ఒకరికి ఒకరు దూరమై నరకం చూశారు. వేరే పెళ్లి చేయడానికి వారి వారి ఇంట్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అంగీకరించలేదు. ఇలాగే కాలం గడిచిపోయింది.
మొయిదీన్ కథలు రాయడం మొదలుపెట్టాడు. సేవా కార్యక్రమాల్లో మునిగిపోయాడు. కాంచన ఇంటికే అంకితమైపోయింది. ఇలా ఒకటి రెండేళ్లు కాదు... రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. తమ మధ్య జరిగిన సంఘటన జ్ఞాపకాలతో గడిపేసిన వీళ్లిద్దరూ అన్నేళ్లలో రెండు మూడుసార్లు మాత్రమే ఒకరినొకరు నేరుగా చూసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత పెద్దలు వీళ్లను పట్టించుకోవడం మానేసినా, పెళ్లి చేసుకోవడానికి మార్గం కనిపించలేదు. తాను తొందరపడితే చెల్లెలికి పెళ్లి కాదని కాంచన, తండ్రి చనిపోయాక కుటుంబ బాధ్యతలు మీదపడటం వల్ల మొయిదీన్... తమ జీవితం గురించి పట్టించుకోవడం మానేశారు.
కాంచనకు 31 ఏళ్లొచ్చాయి. మొయిదీన్‌కు 34 ఏళ్లు. వారి జీవితాలిలా సాగుతుండగా, 1982లో ముక్కమ్ గ్రామాన్ని ఆనుకుని ఉండే నదికి వరదలొచ్చాయి. ఆ వరదల్లో పడవ బోల్తా పడి, మొయిదీన్ చనిపోయాడన్న వార్త కాంచన చెవిన పడింది. అంతే, కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లనిపించింది. కలిసి బతకకున్నా, తన ప్రాణం అతనే అని ఆమెకు అప్పుడే అర్థమైంది. ఇక తను బతకకూడదనుకుంది. ఆత్మహత్యాయత్నం చేసింది. ఒకసారి రెండుసార్లు కాదు... ఏకంగా ఆరుసార్లు. కానీ చావలేదు. కొన్ని నెలల పాటు ఆస్పత్రిలోనే ఉంది. అక్కడ కూడా చనిపోవాలని చూసింది. కుదరలేదు. అయితే మొయిదీన్ చనిపోయిన కొన్ని రోజుల్లోనే అతని తల్లి ఆస్పత్రికి వచ్చి కాంచనను కలిసింది. ‘‘నువ్వు చనిపోకు. నా కొడుకు ఆశయాల్ని నెరవేర్చు. నువ్వే నా కోడలివి’’ అని చెప్పి వెళ్లిపోయింది.
ఆ మాటలు కాంచన ఆలోచనల్ని మార్చేశాయి. మొయిదీన్‌ను భర్తగా భావించి... అతని ఇంట్లో అడుగుపెట్టింది. మొయిదీన్ మధ్యలో వదిలేసిన పనులన్నీ పూర్తిచేయడం మొదలుపెట్టింది. ఆ గ్రామంలో మహిళల సాధికారత కోసం అతను ఏర్పాటు చేయాలనుకున్న సంస్థను ఆరంభించింది. అతను నిర్వహిస్తున్న లైబ్రరీని చేతుల్లోకి తీసుకుంది. పేదల కోసం సహాయ కార్యక్రమాల్ని కూడా కొనసాగించింది. ఇదంతా చూసి ముక్కమ్ గ్రామం కదిలిపోయింది. కాంచనను, మొయిదీన్‌ను వేరుచేసిన పాపానికి తలవంచుకుంది. ఇప్పుడా గ్రామం మొత్తం ఆమె వెంట నడుస్తోంది. కాంచన, మొయిదీన్‌ల ప్రేమకథ పుణ్యమా అని ఆ గ్రామానికి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ముక్కమ్ ఓ ఆదర్శ గ్రామంగా తయారైంది.
ప్రస్తుతం కాంచన వయసు 67 ఏళ్లు. ముక్కమ్ గ్రామంలో బీపీ మొయిదీన్ సేవా మందిర్ పేరుతో సేవాసంస్థను నడుపుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు కాంచన. వీరి ప్రేమకథ పుస్తకంగా కూడా వచ్చింది. ఇది చదివిన అందరూ కదిలిపోయారు. అందులో దర్శకుడు విమల్ కూడా ఒకరు. అతను ఈ కథను సినిమాగా తీయాలని సంకల్పించాడు. పృథ్వీరాజ్, పార్వతి హీరోహీరోయిన్లుగా ‘ఎన్ను నింటే మొయిదీన్’ పేరుతో సినిమా మొదలుపెట్టి పూర్తిచేశాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ ప్రేమకథ మొయిదీన్‌కు నివాళిగా, కాంచనకు కానుకగా మిగులుతుందని ఆశిద్దాం.