విహారం: లక్షద్వీప్.. జలచరాలతో విహారం | Lakshadweep.. Water float ride | Sakshi
Sakshi News home page

విహారం: లక్షద్వీప్.. జలచరాలతో విహారం

Published Sun, Aug 18 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

విహారం: లక్షద్వీప్.. జలచరాలతో విహారం

విహారం: లక్షద్వీప్.. జలచరాలతో విహారం

లక్షద్వీప్... పేరులో లక్షణంగా లక్ష ఉంది. గూగుల్ సెర్చ్ ఏరియల్ వ్యూలో చూస్తే లెక్కపెట్టలేనన్ని ద్వీపాలు కనిపిస్తాయి. కానీ అన్ని దీవులు ఉండే అవకాశం లేదు. పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగులో సముద్రం, వెండి వెన్నెల లేకపోయినా సరే... తెల్లగా మెరుస్తామంటూన్న తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. నిజానికి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఏర్పడిన ముక్కలు ఈ దీవులు... అని అధ్యయనకారుల అంచనా.
 
 అరేబియా సముద్రంలో ఆఫ్రికా - ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే. వీటి పేరు లక్షదీవులు... అనే కానీ మనదేశంలోని యూనియన్ టెరిటరీల్లో చిన్నది ఇదే. భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లకు మించదు. ఒక మోస్తరు పెద్ద దీవులు 36 ఉన్నప్పటికీ పది దీవులే జనావాసాలు. పది సబ్ డివిజన్లతో ఒకే ఒక జిల్లా ఇది. జనాభా పది దీవుల్లో కలిసి 65 వేలకు మించదు. స్థానికుల్లో ఎక్కువ శాతం మలయాళీలే. అధికార భాష కూడా మలయాళమే, మినికోయ్ దీవిలో నివసించే వాళ్లు మాత్రం మహిల్ భాష మాట్లాడుతారు. ఇది మాల్దీవుల్లో మాట్లాడే భాష. ఈ దీవి మిగిలిన దీవుల సమూహానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. ఇక్కడి ప్రజల జీవనశైలి మిగిలిన దీవులకు భిన్నంగా ఉండదు, కానీ భాష వేరు.
 
 లక్షద్వీప్ దీవుల్లో మనుష్య సంచారం లేని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడాల వేటగాళ్లు మాత్రమే అడుగుపెడుతుంటారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని కరావట్టి దీవి. లక్షద్వీప్ దీవుల్లోని స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల సాగు, కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు. అత్యంత ఖరీదైన ‘ట్యూనా ఫిష్’ ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో ఎగుమతి అవుతుంది. ఇప్పుడు పర్యాటకం పెద్ద పరిశ్రమ అయింది. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు. ఇలాంటి దీవుల్లో నివసించేవాళ్లంతా పర్యాటకశాఖ ఉద్యోగులే.
 
 వలయాకారంగా ఉండే పగడపు దీవుల్లోకి విహారానికి వెళ్లడం అనే ఆలోచన జానపద సినిమాను తలపిస్తుంటే, సముద్రపు నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్‌ను తలుచుకుంటేనే కళ్లు మెరుస్తాయి. సముద్రజీవరాశులను దగ్గరగా చూడడానికి పెద్దవాళ్లు ట్యూబ్‌లో వెళ్లి సంతోషపడుతుంటే... యూత్ మాత్రం అంతరిక్ష చోదకుల్లాగ ఒళ్లంతా కప్పేసే వాటర్‌ప్రూఫ్ దుస్తులు ధరించి, ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకుని జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తుంటారు. అగట్టి, బంగారం దీవుల్లో స్కూబా డైవింగ్ స్కూళ్లున్నాయి.
 
  ఒక్కో దీవిలో పర్యటిస్తూ ఇక ఈ దీవిని చూసింది చాలనిపించి ఫెర్రీ ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్‌కి సిద్ధమవుతుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడాన్ని టెలివిజన్ ప్రోగ్రామ్‌లో చూసి ఆనందించడమే తప్ప స్వీయానుభవం లేని వాళ్లకు అలలతో ఆడుకోవాలనే సరదాతోపాటు కొంచెం భయం కూడా వేస్తుంది. కానీ ఇక్కడి ట్రైనర్లు ‘సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి...’ వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసుకొస్తారు.
 
 తమాషా ఏమిటంటే... ఒకసారి పట్టుతప్పి నీటిలో పడిపోయిన వాళ్లు బయటకు వచ్చి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుని ఒడ్డున కూర్చోరు. కొంచెం తేరుకోగానే మళ్లీ నీటిలోకి పరుగులు తీస్తారు. ఆశ్చర్యకరంగా రెండోసారికి ఒడుపు తెలిసిపోయి అలలతో గెంతులేస్తుంటారు. మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ కొంతమంది పర్యాటకులు కేయాకింగ్(తెడ్డు పడవ) తో గాలికంటే వేగంగా నీటి మీద సాగిపోతుంటారు. ఇంతమంది ఇన్ని సాహసోపేతమైన ఆటలు ఆడుకుంటూ సముద్రాన్ని తలకిందులు చేస్తున్నప్పటికీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అగట్టి, అమిని, అండ్రాట్, బిట్రా, చెట్లాట్, కాడ్‌మాట్, కాల్పెనీ, కరావట్టి, కిల్టాన్, మినికోయ్... ఈ దీవులన్నింటినీ ఒక రోజులో చుట్టేయవచ్చు.
 సముద్రంలో ఎన్ని రకాల జీవరాశులుంటాయో కదా! అని చూస్తే చేపలు రకరకాల ఆకారాల్లో కనిపిస్తాయి. చేపల్లో ఇన్ని రకాలుంటాయా అని ఆశ్చర్యపోవడం మన వంతైతే సెప్టెంబరు నుంచి డిసెంబర్ మధ్యలో వచ్చిన పర్యాటకులకు షార్క్ చేపలు కూడా హలో చెప్తాయి.
 
 అరేబియా సముద్రంలో దుర్భిణీ వేసి వెతికితే తప్ప కనిపించని ఈ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని జాతక కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది... అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి. ఈ కథలన్నీ పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం ‘పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ’ కూడా దీనినే నిర్ధారించింది. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు. కాలానుగుణంగా బ్రిటిష్ పాలనను రుచి చూసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మన జాతీయ జెండా ఎగురవేయడంతో ఇండియాలో భాగమేనని ఖరారయ్యాయి ఈ దీవులు. స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దానికి కేంద్రపాలిత ప్రాంతంగా స్థిరపడింది ఈ దీవుల సమూహం.
 
 ఎక్కడ ఉన్నాయి?
 కేరళ తీరానికి సుమారు 250 మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి.
 
 ఎప్పుడు వెళ్లాలి?
 ఇక్కడి వాతావరణం అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య ఆహ్లాదంగా ఉంటుంది.
 
 ఎలా వెళ్లాలి?
 విమానంలో... లక్షద్వీప్‌కు దగ్గరగా ఉన్న తీరం కేరళలోని కొచ్చి నగరం. కొచ్చి నుంచి అగట్టి దీవికి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అగట్టి ద్వీపంలో దిగిన తర్వాత ఇతర దీవులకు వెళ్లడానికి హెలికాప్టర్, ఫెర్రీ, షిప్, మిషన్‌బోట్ సౌకర్యం ఉంటుంది. దీవిలోపల తిరగడానికి ఆటోరిక్షాలు, క్యాబ్‌లు ఉంటాయి.రైలు మార్గం... కొచ్చి వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి విమానం లేదా షిప్‌లో లక్షద్వీప్ చేరాల్సి ఉంటుంది.
 
 షిప్ ప్రయాణం... లక్షద్వీప్ పర్యాటక శాఖ కొచ్చి నుంచి అగట్టి దీవికి షిప్ క్రూయిజ్ నడుపుతోంది. ‘ఎం.వి. టిప్పు సుల్తాన్, ఎం.వి. భరత్‌సీమ, ఎం.వి. ఆమినిదీవి, ఎం.వి. మినికోయ్’ అనే నాలుగు క్రూయిజ్‌లున్నాయి. వీటిలో ప్రయాణానికి లక్షద్వీప్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎయిర్‌కండిషన్ క్రూయిజ్‌లే.
 
 ఎక్కడ ఉండాలి?
 సీషెల్స్ బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హోమ్, లక్షద్వీప్ హోమ్‌స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్‌మట్ బీచ్ రిసార్టు వంటివి చాలా ఉన్నాయి.  ఒక రోజుకు ఐదు వందల రూపాయలు వసూలు చేసే గెస్ట్ హౌస్‌ల నుంచి ఐదు వేలు చార్జ్ చేసే రిసార్టుల వరకు ఉన్నాయి.
 
 భోజనం ఎలా?
 ఈ ప్రదేశం కేరళకు దగ్గరగా ఉండడంతో ఆ ప్రభావం ఆహారం మీద కూడా ఉంటుంది. కొబ్బరి వాడకం ఎక్కువ. వంటల్లో సుగంధద్రవ్యాల వినియోగమూ ఎక్కువే. రెస్టారెంట్లలో ప్రధానమైన మెనూలో సీఫుడ్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. శాకాహారం కూడా దొరుకుతుంది. కేరళ నుంచి టిన్డ్ ఫుడ్ వస్తుంది.
 
 ఇక్కడ ఏమేమి చూడాలి?
 హజ్రత్ ఉబాయిదుల్లా సమాధి, కరావట్టి మసీదు, కరావట్టి అక్వేరియం, బుద్ధిస్ట్ ఆర్కియోలాజికల్ మ్యూజియం, ట్యూనా క్యానింగ్ ఫ్యాక్టరీ ప్రధానమైనవి.
 
 ఏయే సాహసాలు చేయవచ్చు?
 కామత్ ఐలాండ్‌లో కానోయింగ్, యాచింగ్, కాయాకింగ్, స్నోర్‌కెలింగ్, విండ్ సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్, స్కూబా డైవింగ్ వంటి చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement