
అనంతరం: లాలూ దంపతుల ఆశాదీపం
తల్లిదండ్రుల బాటలో సాగడానికి అయిష్టత లేకపోయినా, తనకిష్టమైన దారిలో వెళ్లాలని ఆశపడ్డాడు తేజస్వి. కానీ అనుకున్న ఫలితాలను పొందలేక దారి మార్చుకున్నాడు. తల్లి ఆశను, తండ్రి ఆశయాన్ని నిలబెట్టేందుకు సిద్ధ మయ్యాడు. ఇంతకీ తేజస్వి ఎవరో తెలుసా... లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల ముద్దుల తనయుడు!
పదేళ్ల క్రితం... పాట్నాలోని ఓ స్టేడియంలో రెండు స్కూళ్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. పిల్లల తల్లిదండ్రులు, ఇతరత్రా ఆడియెన్స్‌తో స్టేడియం కిక్కిరిసి ఉంది. ఓ పిల్లాడు పరుగుల మీద పరుగులు సాధిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక సిక్స్ కొట్టాడు. బంతి అంతెత్తున లేచి, వీఐపీ లాంజ్‌లో ఉన్న ఓ రాజకీయ నాయకుడి దగ్గర పడింది. ఆయన బంతిని చేతిలోకి తీసుకున్నారు. ‘‘చూశారా... నా కొడుకు నన్నే కొట్టేస్తున్నాడు’’ అంటూ నవ్వారు. తనయుడి ప్రతిభని చూసి గర్వంతో విచ్చుకున్న ఆ పెదవులు... లాలూ ప్రసాద్ యాదవ్‌వి. ఆయనకంత గర్వాన్ని కలిగించిన ఆ కొడుకు... తేజస్వి!
లాలూ దంపతులకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరిలో రెండోవాడు తేజస్వి. మహా చురుకైనవాడు. చిన్నప్పట్నుంచీ బ్యాట్ పట్టుకుని తిరుగుతుంటే... ఏదో సరదాగా క్రికెట్ ఆడుతున్నాడు అనుకున్నారు లాలూ. కానీ అతడు ఆట పట్ల ఎంత సీరియస్‌గా ఉన్నాడో తర్వాత తెలిసిందాయనకి. రాజకీయాల్లోకి వచ్చి తన వారసత్వాన్ని కొనసాగిస్తాడనుకున్న కొడుకు పార్టీ జెండాని కాదని క్రికెట్ బ్యాట్ పట్టుకుంటానంటే ఏ తండ్రి అయినా నిరుత్సాహపడతాడు. కానీ లాలూ అలా చేయలేదు. నచ్చింది చేయమని ప్రోత్సహించారు. అందుకే తేజస్వి తేలికగానే తన దారిలో పయనించగలిగాడు.
తేజస్వి మంచి బ్యాట్స్‌మెన్. ఢిల్లీ అండర్ 19 జట్టులో చోటు సంపాదించాడు. జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ, ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. కానీ అనుకున్నంతగా కెరీర్‌లో ముందుకు వెళ్లలేకపోయాడు. కారణాలు ఏవైతేనేం... క్రికెట్‌యానం అంత సాఫీగా జరగలేదు. దాంతో తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు. 2010 బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ తరఫున ప్రచారం చేశాడు.
తొమ్మిదిమంది పిల్లలున్నా... తేజస్వియే తమకు తగిన రాజకీయ వారసుడని లాలూ దంప తుల విశ్వాసం. దాంతో వారి ఆశయాలకు ఊపిరి పోయాల్సిన బాధ్యత అతడి మీద పడింది. అయితే అతడింకా చిన్నవాడు (24 యేళ్లు) కావడంతో, రాజకీయాల్లోకి అప్పుడే రావడం మంచిది కాదంటున్నారు సన్నిహితులు. తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన అతడు రావాలా అని ప్రశ్నించేవాళ్లు కూడా ఉన్నారు. దానికి రబ్రీదేవి సమాధానం ఘాటుగా ఉంటుంది. ‘డాక్టర్ కొడుకు డాక్టర్, వ్యాపారస్తుడి కొడుకు వ్యాపారస్తుడు కావొచ్చు కానీ రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయాల్లోకి రాకూడదా’ అంటారామె. ‘అందరి పిల్లలూ వస్తున్నారుగా, నా కొడుకూ వస్తాడు’ అంటారు లాలూ దృఢంగా. తండ్రిలోని స్పష్టత, తల్లిలోని ఆ ముక్కుసూటిదనం తేజస్విలోనూ ఉన్నాయా? అతడు బలమైన నాయకుడవుతాడా? రాజకీయాల్లో చక్రం తిప్పుతాడా? వేచి చూడాల్సిందే!