వివరం: ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం | Library is the main door to entrance of knowledge | Sakshi
Sakshi News home page

వివరం: ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం

Published Sun, Aug 11 2013 2:04 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

వివరం: ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం

వివరం: ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం

పూర్వకాలం రుషులు తపస్సు కోసం అరణ్యాలకో, హిమాలయాలకో వెళ్లేవారంటారు. సమాజానికి దూరంగా ఎవరూ లేని ఏకాంతంలో, వారు తమలోకి తాము చూసుకుంటూ చేసిన జ్ఞానసముపార్జనతో ప్రపంచాన్ని అర్థం చేసుకునేవారు; సరైన దిశానిర్దేశాన్ని చేసేవారు. అయితే, అరణ్యాల్లో ముక్కు మూసుకోనక్కర్లేకుండా, హిమాలయాల్లో చలికి వణికిపోనవసరం లేకుండా, సమూహంలో ఉంటూనే ఏకాంతాన్ని అనుభవించగలిగే అతిసుందర ప్రదేశం గ్రంథాలయం. ఇక్కడ, తవ్వుకోగలిగినన్ని జ్ఞానగనులు! కూర్చునే ప్రపంచాన్ని చుట్టిరాగలిగినన్ని వాహనాలు!! ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
 
 ఇది చదువుకోవడం గురించిన ఊసు కాదు; చదవడానికి వీలు కల్పించేదాని సంగతి. ఎవరైనా తాను ఎక్కడా చదవలేని పుస్తకాల్ని ‘స్టేట్ లైబ్రరీ’లో సంపాదించానని కళ్లు మెరుస్తుండగా చెప్పొచ్చు. మరెవరైనా తనకు ఎక్కడా దొరకని పుస్తకం ‘గౌతమీ గ్రంథాలయం’లో కనబడిందని అక్షరాలు కురుస్తుండగా రాయొచ్చు. చాలామంది చాలా పుస్తకాలు చదవడానికి కారణం వారి వారి శాఖా గ్రంథాలయాలు కావొచ్చు. లైబ్రరీకి వెళ్లేవారంటే కొంత పద్ధతైన మనుషులు అనుకోవడంలో అబద్ధం ఏమీ లేకపోవచ్చు. అంతేగా! లైబ్రరీ అంటేనే పుస్తకాల కూర్పు, ఒక పద్ధతైన పేర్పు, ఎన్నో ఉద్యమాలకు చేర్పు.
 
 క్రీస్తుకు పూర్వమే గ్రంథాలయాలు
 సంపదను దాచుకోగలడేమోగానీ, మనిషి జ్ఞానాన్ని దాచిపెట్టలేడు. తాను కనుక్కున్నదీ, అనుభవించిందీ, ఆలోచించిందీ ఎదుటివారితో పంచుకోవాలనే తపనే భాష, లిపి పుట్టుకలకు కారణం. రాసిన అన్నింటినీ నిర్దేశిత స్థలంలో అందరికీ అందుబాటులో ఉంచాలనే ప్రాథమికభావనే గ్రంథాలయాలకు మూలం. క్రీస్తుపూర్వం 2600ల్లోనే గ్రంథాలయాలు ఉండేవనడానికి ఆధారాలను పురాతత్వ పరిశోధకులు సంపాదించారు. కాగితం పుట్టకముందే, మట్టి పలకల రాతల్ని సుమేర్(ఆధునిక ఇరాక్ ప్రాంతం)లో కనుక్కున్నారు.
 
 కాగితం కనుక్కున్న తర్వాత ‘ప్రపంచ రాతే’ మారిపోయింది. ఎందరో సామ్రాజ్యాధిపతులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న దర్శనాలను, ఆవిష్కరణలను తమ భాషలో తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. దీనికిగానూ అరబిక్, రోమన్, పర్షియన్, గ్రీక్, సంస్కృతం లాంటి భాషలు తెలిసిన పండితులను అనువాదకులుగా నియమించుకునేవారు. దీనిద్వారా యావత్ప్రపంచం సామూహికంగా ముందుకు అడుగు వేయడం సాధ్యమవుతూ వచ్చింది. కళలు, నిర్మాణం, సాహిత్యం, మతసంబంధ విషయాల్లో ఒకరినొకరు ప్రభావితం చేసుకునే వీలుకలిగింది.
 
 అయితే, గ్రంథాలయ భావన ఉన్నప్పటికీ, పండితుల వ్యక్తిగత లైబ్రరీలే ఎక్కువ. వాళ్లు దేశ సంచారం కోసం వెళ్లినప్పుడు, వస్తుసామగ్రితో పాటు, పుస్తకాలను కూడా తమ పెంపుడు జంతువుల మీద మోసుకెళ్లేవారు. మరి ఎన్ని నెలల ప్రయాణమో! ఏరోజు ఏం చదవాలనిపిస్తుందో!! అలాగే, పుస్తకాలను వర్గీకరించుకునే సూత్రాల్ని కూడా క్రీస్తుపూర్వమే రూపొందించుకున్నారు చదువరి పెద్దలు. అంతేగా! లేకపోతే ఏ ఒంటెమీద ఏం పెట్టామో వెంటనే చెప్పలేకపోతే ఎన్నని వెతుకుతాం!
 
 ప్రాచీన గ్రంథాలయాలు
 ఐదవ శతాబ్దంలో కాన్‌స్టంట్‌నోపుల్‌లోని ఇంపీరియల్ లైబ్రరీ 1,20,000 పుస్తకాలతో ఐరోపాలోనే పెద్ద గ్రంథాలయంగా వినుతికెక్కింది. అయితే, 477వ సంవత్సరంలో అది పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది. తిరిగి నిర్మించినప్పటికీ 726లో ఒకసారి, మళ్లీ 1204 లో మరోసారి, చివరకు 1453లో పూర్తిగా నాశనమైపోయింది. ఇప్పటికీ ఉన్న అత్యంత పురాతన గ్రంథాలయంగా చైనాలోని ‘తియాన్ యి జె’ ప్రసిద్ధి. దీన్ని మింగ్ వంశస్థుల కాలంలో 1561లో ఫాన్ క్విన్ స్థాపించాడు. దీని ఉచ్ఛ దశలో 70,000 ప్రాచీన పుస్తకాలుండేవి. దీని నమూనాలోనే దేశంలోని ప్రశస్త జాతీయ లైబ్రరీలను చైనా నిర్మించుకుంది. బ్రిటన్‌తో జరిగిన యుద్ధం అప్పుడూ, స్థానిక దొంగతనాల వల్లా ఇది చాలా పుస్తకాల్ని కోల్పోయింది. అయినప్పటికీ జాతీయ వారసత్వ సంపదగా అక్కడ గౌరవం పొందుతోంది.
 
 ప్రపంచంలో రెండు అతి పెద్ద గ్రంథాలయాలు
 అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డి.సి.లోని ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’లో సుమారు 15 కోట్ల ఐటెమ్స్ ఉన్నాయి. ఇందులో పుస్తకాలు, డీవీడీలు, మ్యాపులు, ఫిలింలు, ప్రింట్లు, ఆడియోబుక్స్, ఇంకా ఇతరత్రా జ్ఞానపేటికలన్నీ లెక్కే! పుస్తకాలనే విడిగా గణిస్తే సుమారు 2.2 కోట్లు! 1800 సంవత్సరంలో నెలకొల్పిన దీన్ని అతి పురాతన సాంస్కృతిక నిలయంగా అమెరికన్లు పరిగణిస్తారు. ఏటా 17.5 లక్షల మంది సందర్శిస్తారు. సుమారు 3600 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తారు.
 అలాగే, బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉన్న ‘బ్రిటిష్ లైబ్రరీ’ కూడా 15 కోట్ల ఐటెమ్స్‌తో కళకళలాడుతుంటుంది. ఇందులో సుమారు 1.4 కోట్ల పుస్తకాలు! క్రీ.పూ.2000 నాటి మాన్యుస్క్రిప్టులు, చారిత్రక ఆధారాలు కూడా ఇక్కడ భద్రంగా ఉండటం దీని ఘనతను చాటుతుంది.
 
 మన జాతీయ గ్రంథాలయం ప్రత్యేకత
 మన ‘నేషనల్ లైబ్రరీ’ కోల్‌కతాలో ఉంది. ఇది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ లైబ్రరీ భారత్‌లో అతి పెద్దది. అన్ని భాషల్లోని 22 లక్షల పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి.
 
 కలకత్తా పబ్లిక్ లైబ్రరీగా ఇది 1836లో ద్వారకానాథ్ టాగూర్ లాంటి సంపన్నుల చందాలతో ప్రారంభమైంది. 300 రూపాయల భూరివిరాళాన్ని ప్రకటించి ఆయన గ్రంథాలయానికి తొలి ప్రొప్రయిటర్ అయ్యారు. దీనికి సమాంతరంగా 1891లో ఇదే కోల్‌కతాలో కొన్ని చిన్న చిన్న గ్రంథాలయాల మేళవింపుతో ఇంపీరియల్ లైబ్రరీ నెలకొల్పారు.
 
 అయితే, 1903లో అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఈ రెంటినీ కలిపేసి పుస్తకాలను ఏకం చేశారు. పేరు మాత్రం ఇంపీరియల్ లైబ్రరీగా కొనసాగింది. స్వాతంత్య్రానంతరం పేరు మార్చుకుని నేషనల్ లైబ్రరీ అయింది. ఇందులో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, మరాఠీ, మలయాళం, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, ఉర్దూ లాంటి భాషలు; సహా పాళీ, ప్రాకృత భాషల్లోని పుస్తకాలు కూడా ఉన్నాయి. ఏ భాషా విభాగం దానికే. 1963లో ఇందులో తెలుగు విభాగం ప్రారంభమైంది. భారత ముద్రణా వారసత్వ సంపదను భవిష్యత్ తరాల కోసం కాపాడటం దీని ప్రాథమిక లక్ష్యం. ఇక, మన ‘స్టేట్ లైబ్రరీ’లో సుమారు ఐదు లక్షల పుస్తకాలు జ్ఞాన ద్వారాలను తెరుస్తూవుంటాయి. ఇందులో తెలుగుతో పాటు ఉర్దూ, అరబిక్, పర్శియన్, సంస్కృతం లాంటివి కూడా ఉన్నాయి.
 
 జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఆగస్టు 12నే ఎందుకు?
 ఇది డాక్టర్ ఎస్.ఆర్ రంగనాథన్(1892-1972) జయంతి. ఈ లెక్కల ప్రొఫెసర్ 1923లో అనుకోకుండా మద్రాసు యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా చేరారు. తొలిరోజుల్లో బోరింగ్ ఉద్యోగమని విరమించాలనుకున్నా, యూనివర్సిటీ అందులోనే  కొనసాగమని కోరింది. దాంతో గ్రంథాలయ వ్యవస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్త ధోరణులను పరిశీలించి, విశేష అనుభవం గడించి, గ్రంథాలయ కేటలాగుల్ని తయారు చేయడానికి ఒక కొత్త కోడ్‌ను 1933లో రూపొందించారు. కోలన్ క్లాసిఫికేషన్ అని పిలిచే ఈ వర్గీకరణ సూత్రాన్ని దేశంలోని చాలా గ్రంథాలయాలు అనుసరిస్తున్నాయి.
 
 ఏమిటీ కోలన్ క్లాసిఫికేషన్?
 పుస్తకం వ్యక్తిత్వం, విషయం, శక్తి, నిడివి, సమయం అనే ఐదు ప్రాథమిక సూత్రాల ఆధారంగా కోలన్ క్లాసిఫికేషన్ రూపకల్పన జరిగింది. నానారకాల పుస్తకాలను ఎలా అమర్చాలి? దీనికోసం వాటికి సంకేతాలు ఇచ్చారు రంగనాథన్. ఉదాహరణకు సాహిత్య పుస్తకాలను ‘ఒ’తో సూచించారు; ధార్మిక పుస్తకాలను ‘క్యూ’తో; వైద్యానికి సంబంధించినవి ‘ఎల్’తో; అగ్రికల్చర్ ‘జె’; ఇందులో మళ్లీ హార్టికల్చర్ ‘జె1’; ఇలా గ్రూప్సు, సబ్ గ్రూప్సు విభజనతో పుస్తకాన్ని ఎక్కడున్నా గాలించి పట్టుకునే కోడ్ సృష్టించారు. దీన్ని వివరించేందుకు ఈ ఉదాహరణను ఎక్కువగా ఉటంకిస్తారు.
 
 ‘1950లో భారత్‌లో జరిగిన ఊపిరితిత్తులకు సోకే ట్యూబర్‌క్యులోసిస్‌ను ఎక్స్ కిరణాలతో నివారించే పరిశోధన’కు సంబంధించిన పుస్తకం ఏదో కావాలి మనకు. ఈ పుస్తకం ముందుగా వైద్యవిభాగంలోకి వస్తుంది(ఎల్); అదీ ఊపిరితిత్తులకు సోకిన జబ్బు(45); అందునా ట్యూబర్‌క్యులోసిస్(421); దాని నివారణ గురించి కావాలి(6); ఆ నివారణ కోసం పరిశోధన జరిగింది(253); అది ఎక్స్ కిరణాలతో చేసిన పరిశోధన(ఎఫ్); ఆ పరిశోధన జరిగిన భౌగోళిక ప్రదేశం భారత్(44); జరిగిన కాలం 1950(ఎన్5) ముందుగా వర్గీకరించి ఉన్న కోడ్స్‌ను ఒక క్రమంలో రాస్తే మనకు కావాల్సిన పుస్తకం చిరునామా ఇలావుంటుంది:
 
 [L,45;421:6;253:f.44'N5]
 పాఠకుడికి ఇదంతా గందరగోళంగా ఉండొచ్చేమోగానీ, లైబ్రేరియన్ దీన్ని ఇట్టే పట్టేస్తాడు; పుస్తకాన్ని మీ చేతుల్లో పెట్టేస్తాడు.
 
 లైబ్రేరియన్‌కు ధన్యవాదాలు
 ఏ ఊళ్లో అయినా చిన్నదో, పెద్దదో ఒక శాఖా గ్రంథాలయం ఉంటుంది, అందులో కొన్ని పుస్తకాలుంటాయి, వాటన్నింటిలో కావాల్సింది వెతుక్కోవడంలోనే సమయం కరిగిపోకుండా, పాఠకుడికి ‘కొంగు పుస్తకం’గా ఉండేవాళ్లు లైబ్రేరియన్లు. ఉప్పు పక్కన కారం, చక్కెర పక్కన టీపొడి; మళ్లీ ఆ రెండూ ఏ షెల్ఫులో పెట్టాలి; అని గృహిణి ఇంటిని పనికి అనుకూలం చేసుకున్నట్టుగా వీళ్లు చదవడానికి పుస్తకాలను అనుకూలం చేస్తుంటారు. ఏ పుస్తకమైనా మీకు నచ్చి రచయిత మీద మీ అభిమానాన్ని పెంచుకునేప్పుడు, దానికి కారణమైన లైబ్రేరియన్‌కు ధన్యవాదాలు చెప్పడం మరిచిపోవద్దు.
 
 మనదే పురాతనమైనది!
 ‘ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్’ 1914లో ప్రారంభమైంది. విజయవాడ కేంద్రంగా ఉన్న ఈ సంఘం భారతదేశంలోనే పురాతనమైనది! 1915 నుంచి గ్రంథాలయ సర్వస్వము పేరిట ఒక మాసపత్రికను కూడా తెస్తోంది.
 
 గ్రంథాలయ పంచశీల
 తమిళనాడుకు చెందిన ప్రొఫెసర్ రంగనాథన్ లైబ్రరీ సైన్సులో చేసిన సేవలకుగానూ పద్మశ్రీ పొందారు. 1931లో ఆయన గ్రంథాలయ పంచ సూత్రాలు వెలువరించారు:
     పుస్తకం ఉన్నది అవసరం నిమిత్తం.
     {పతి పాఠకుడికీ పుస్తకం ఉంటుంది.
     {పతి పుస్తకానికీ పాఠకుడుంటాడు.
     పాఠకుడి సమయం ఆదాచేయాలి.
     {గంథాలయం పెరిగే వ్యవస్థ.
 సరళమైన విషయాలే. కానీ గ్రంథాలయం అనేది ఏమిటో, అది దేనికి ఉందో లైబ్రరీ ఉద్యోగులకు దిశానిర్దేశం చేయగలిగే సూత్రాలివి!
 
 పాతికశాతమే చదువుతున్నారు!
 2012లో ‘నేషనల్ బుక్ ట్రస్ట్’ జరిపిన ఒక దేశవ్యాప్త సర్వే ప్రకారం: యువతరంలో మూడొంతుల మంది పాఠ్యాంశాలు తప్ప మరో పుస్తకం చదవడం లేదు. క్లాసిక్స్, బెస్ట్ సెల్లర్స్ ఏవీ ముట్టడం లేదు. 13-35 ఏళ్ల మధ్య ఉన్న మొత్తం 33.27 కోట్ల మంది యువతీ యువకుల్లో 26 శాతం మందికే చదివే అలవాటు ఉంది. ఈ చదివే అలవాటు ఉన్నవాళ్లలో 41.7 శాతం కాల్పనిక సాహిత్యం, 23.8 శాతం నాన్ ఫిక్షన్, 34.5 శాతం రెండూ చదువుతున్నారు.
 
 ఓప్రాస్ బుక్ క్లబ్
 సుప్రసిద్ధ సిండికేటెడ్ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే తన టీవీ షోలో భాగంగా ప్రతీ వారం ఒక పుస్తకాన్ని పరిచయం చేయడం, చర్చించడం మొదలుపెట్టారు. దానివల్ల కొన్ని లక్షల కాపీల అమ్మకాల్ని ఆమె ప్రభావితం చేశారు. ఎ లెస్సన్ బిఫోర్ డైయింగ్ (ఎర్నెస్ట్ జె.గెయిన్స్), శూల (టోనీ మారిసన్), వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (గాబ్రియెల్ గార్సియా మార్క్వెజ్), అన్నా కరేనినా (లియో టాల్‌స్టాయ్), ద గుడ్ ఎర్త్ (పర్ల్ ఎస్ బక్), ఎ టేల్ ఆఫ్ టు సిటీస్ (చార్లెస్ డికెన్స్) లాంటివి ఆమె షోలో చర్చకు వచ్చిన కొన్ని మంచి పుస్తకాలు.క్రీ.శ. 983లో పర్షియా రాజు అదుద్ అల్ దౌలా చిన్న నీటి సరస్సులు, ఉద్యానవనాలతో కూడిన 360 గదుల రెండంతస్థుల గ్రంథాలయాన్ని నిర్మించాడు. పుస్తకాల వర్గీకరణ సూత్రం ‘కోలన్ క్లాసిఫికేషన్’ రూపొందించిన ఎస్.ఆర్.రంగనాథన్
 జయంతినే నేషనల్ లైబ్రరీ డేగా గౌరవిస్తున్నాం. ఓప్రా విన్‌ఫ్రే తన టీవీ షో ద్వారా లక్షల కాపీల అమ్మకాల్ని ఓప్రా ప్రభావితం చేశారు.
 
 ఒంటెల గ్రంథాలయం
 కెన్యాలోని ఈశాన్య గ్రామీణ ప్రాంతాల్లో ఒంటెలే గ్రంథాలయాల్ని వీపున మోసుకెళ్తుంటాయి. సరైన రహదారులు లేని గ్రామాల్లోని బడిపిల్లలు, యువ పాఠకుల కోసం ఇవి వాళ్ల దగ్గరికే వెళ్తుంటాయి. 1996లో ఈ క్యామెల్ మొబైల్ లైబ్రరీ సర్వీస్ ప్రారంభమైంది. ఒంటెల మీదే టెంటు, కుర్చీలు, టేబుళ్లు, పుస్తకాలు వేసుకెళ్తారు సిబ్బంది. అక్కడక్కడా కొంతకాలం క్యాంపు వేసుకుంటూ సాగిపోతుంటారు.
 
 లోపలికి వెళ్లాలంటే బెరుకు
 గ్రంథాలయం అనేది పుస్తకాల ఆలయమే కావొచ్చు; కానీ అందులోకి వెళ్లడం కూడా ఆందోళన కలిగించే విషయమేనని 1986లో పరిశోధించి తేల్చారు అమెరికా లైబ్రరీ సైన్స్ ప్రొఫెసర్ కాన్‌స్టన్స్ మెలన్. లైబ్రరీ యాంగ్జయిటీ ఉన్నవాళ్లు ముందుగా గ్రంథాలయ పరిమాణం చూడగానే భీతిల్లుతారు, ఒకవేళ వెళ్లినా తనకు కావాల్సిన పుస్తకాన్ని ఎలా వెతుక్కోవాలో తెలియక తికమకపడతారు, తెలియకపోవడాన్ని న్యూనతగా భావించి గ్రంథాలయ సిబ్బంది సహకారాన్ని తీసుకోవడానికి చొరవ చూపరు. ఈ లక్షణాలున్నవాళ్లు ముందు ఇలాంటి ఒక ఇబ్బంది ఉంటుందని గుర్తించండి, కొంచెం అనుభవంతో దాన్ని పోగొట్టుకోవచ్చు అంటారామె.
 
 ఆన్‌లైన్ లైబ్రరీలు
 ఇంటర్నెట్ సౌకర్యం విస్తరించాక, వేలాది పుస్తకాలు ఇప్పుడు వెబ్‌సైట్లలో లభ్యమవుతున్నాయి.  www.gutenberg.org, www.arvindguptatoys.com  లాంటి సైట్లలో ఎన్నో అమూల్యమైన పుస్తకాలను ఉచితంగా చదువుకోవచ్చు. ఉత్తి టెక్స్టుగానే కాకుండా, బొమ్మలు సహా పుస్తకాన్ని యధాతథ అనుభూతితో చదువుకోగలిగే ఈ-రీడర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. చదువుకోవాలన్న ఆసక్తి, దానికి తగిన ఓపిక  ఉండాలేగానీ బ్రిటిష్ లైబ్రరీ, నేషనల్ లైబ్రరీ, ఇంపీరియల్ లైబ్రరీ అన్నీ మీ కంప్యూటర్ తెరమీదే ఉంటాయి.
 
 గ్రీన్ లైబ్రరీలు
 పర్యావరణ స్పృహ పెరిగిన నేటి కాలంలో గ్రంథాలయాలు కూడా కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సహజమైన సూర్యకాంతి వెలుతురులో చదువుకునే వీలు కల్పిస్తూ విద్యుత్‌ను ఆదా చేయడం, నిర్మాణంలో వాడిన ప్రతిదాన్నీ రీసైకిల్ చేసుకోగలగడం, డాబా మీద పడిన వర్షపు నీటిని గార్డెన్లకు మళ్లించగలగడం వంటి పర్యావరణ హిత గ్రీన్ లైబ్రరీలకు సియాటిల్ సెంట్రల్ లైబ్రరీ, సింగపూర్ నేషనల్ లైబ్రరీ మంచి ఉదాహరణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement