నింద - నిజం | Malladi Venkata Krishna Crime Stories - 34 | Sakshi
Sakshi News home page

నింద - నిజం

Published Sat, Feb 20 2016 10:14 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

నింద - నిజం

నింద - నిజం

మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  34

ఆఫీస్ సిబ్బంది అంతా దారిలో మంచు తుఫానులో చిక్కుకోకూడదని వెళ్లిపోయారు. హెరాల్డ్ మాత్రం పని ఒత్తిడి వల్ల వెళ్లలేదు.
 
మంచు... కవులకి, ప్రేమ, పవిత్రత, ఆశలకి ప్రతీక. నిరాశావాదులకి మంచు, మరణం, విచారం, ట్రాజెడీలకి ప్రతీక. క్రీడాకారులకు అది ఆనందం. దాని మీద జారచ్చు. బద్ధకస్థులకి కూడా అది ఆనందమే. ఇంట్లో నిప్పు ముందు కాళ్లనిండా దుప్పటి కప్పుకుని వెచ్చగా కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రేమికులకీ ఆనందమే. మైథునానికి మంచు చక్కటి ప్రేరణని ఇస్తుంది.
 
మంచు తుఫాను అకస్మాత్తుగా మధ్యాహ్నం మూడు నించి చెలరేగింది. న్యూయార్క్‌లోని పీటర్ కంపెనీలో పనిచేసే హెరాల్డ్ కిటికీలోంచి బయటికి చూశాడు. మూడు అంగుళాల మేర మంచు కురిసిందని రేడియోలో విన్నాడు. ఆ తర్వాత మరికొన్ని అంగుళాల మంచు కురిసి ఉండచ్చని భావించాడు. దాని గురించి తెలియగానే ఆఫీస్ సిబ్బంది అంతా దారిలో మంచు తుఫానులో చిక్కుకోకూడదని వెళ్లిపోయారు. హెరాల్డ్ మాత్రం పని ఒత్తిడి వల్ల వెళ్లలేదు. తను ఎక్కి వెళ్లాల్సిన లోకల్ ట్రైన్స్ రద్దవచ్చని తెలిసినా చాలా ముఖ్యమైన మూడు ఫైళ్లని అతను పరిశీలిస్తున్నాడు. తన భార్య క్లైడ్‌కి ఫోన్ చేసి తను ఆ రాత్రి ఇంటికి రాలేకపోవచ్చని చెప్పాడు.
 
‘‘ఈ మంచు తుఫాను నా మంచికే వచ్చినట్లుంది. మా ఆఫీసులో చాలా డబ్బు కొట్టేశారు. ఎవరో తెలుసుకోవాలి. దానికి సంబంధించిన ఫైళ్లని చదువు తున్నాను. రాత్రి ఆఫీస్‌లోనే ఉండి ఇది ఎవరి పనో రేపు ఉదయానికల్లా తెలుసుకుంటాను. మా కంపెనీ ఆడిటింగ్ ఫర్మ్‌కి వివరాలు ఇస్తాను. ఇక్కడ ఎవర్నీ నమ్మలేను. ఈ ఫైళ్లు చదువుతున్న కొద్దీ అందరూ దొంగలే అనిపిస్తోంది.’’
 క్లైడ్ అణకువ గల భార్య. భర్త ఏ చర్యనీ ప్రశ్నించదు. తన భర్త చేసేదంతా సరైనదే అనే నిశ్చితాభిప్రాయంతో జీవించే అతి తక్కువ మంది భార్యల్లో ఆమె ఒకరు.
 ‘‘జాగ్రత్తండీ. తినడానికి ఆఫీస్‌లో ఏమైనా ఉందా?’’ అడిగింది.
 
‘‘లేదు. ఇందాకే ఫోన్ చేసి కనుక్కున్నాను. మా పక్క ఆఫీస్ బిల్డింగ్‌లోని కార్నర్ షాప్ రాత్రంతా తెరిచే ఉంచుతానని చెప్పాడు. అతను కూడా నాలాగే మంచు తుఫాను వల్ల షాపు మూసి ఇంటికి వెళ్లలేకపోతున్నాడు. చీజ్, తాజా బ్రెడ్, జింజర్ ఏల్, పళ్లు, బిస్కెట్ లాంటివి అక్కడ ఉంటాయి. వేడి కాఫీ కూడా దొరుకుతుంది.’’
 ‘‘ఇంకేం? కానీ మంచులో నడిచేప్పుడు జాగ్రత్తండీ.’’
 ‘‘తాజా మంచు ఇబ్బంది పెట్టదు. మంచు గడ్డ కట్టాకే జారే సమస్య.’’
 
మరి కాసేపు మాట్లాడాక రిసీవర్ పెట్టేసి హెరాల్డ్ దీక్షగా ఆ ఫైల్స్‌ని చదువుతూ ఓ ప్యాడ్‌లో పాయింట్స్‌ని రాసుకోసాగాడు. ఆఫీసులో డిస్టర్బ్ చేసేవారు ఎవరూ లేకపోవడంతో అతని పని సాఫీగా సాగింది. ఫైల్స్‌లోని బిల్స్, ఇన్‌వాయిస్‌లని తనిఖీ చేసి, బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌ని పరిశీలించి తేడాల జాబితా రాసి కూడాడు. మూడు నెలల్లో డెబ్భై ఆరు వేల రెండు వందల పదిహేడు డాలర్ల ముప్ఫై ఏడు సెంట్లు తేడా వచ్చింది. ఆ డబ్బుని కొట్టేశారని గ్రహించాడు. అది ఎవరి పనో కూడా జాబితా పూర్తయ్యేసరికి హెరాల్డ్‌కి అర్థమయ్యింది.

 అతని పని పూర్తయ్యేసరికి ఒంటి గంటా పది నిముషాలు పూర్తయింది. గట్టిగా ఆవులించి లేచి బద్ధకంగా ఒళ్లు విరుచుకుని, ఆఫీస్ తలుపు తాళం చెవి తీసుకుని ఓవర్ కోట్ తొడుక్కుని బయటికి నడిచాడు. గాలి లేకపోవడంతో చలి తెలీడం లేదు. నెమ్మదిగా నిర్మానుష్యంగా ఉన్న కార్నర్ స్టోర్ వైపు నడిచాడు. కార్నర్ స్టోర్ యజమాని హెరాల్డ్‌ని ఆనందంగా ఆహ్వానించాడు.
 
అతనితో పిచ్చాపాటి మాట్లాడుతూ కడుపు నిండా తిని, వేడి వేడి కాఫీ తాగి, డబ్బు చెల్లించి గుడ్ నైట్ చెప్పి బయటికి వచ్చాడు. కొద్దిసేపు నడవాలనిపించి నడవసాగాడు. అటు, ఇటు ఆగిన కార్ల మీద మంచు ఉంది. ఎక్కడ చూసినా తెల్లటి మంచు దూది పింజెల్లా కురుస్తోంది.
 కొద్ది దూరం వెళ్లి వెనక్కి తిరిగాడు. దారిలో ఓ చోట ఓ మంచు రాశి మీద కాలు వేయకుండా దాన్ని దూకాడు. అతని కాలు జారింది. కిందపడ్డాడు. తల ఓ ఇంటి మెట్టుని తాకడంతో స్పృహ తప్పింది. అరగంట తర్వాత రోడ్డు మీది మంచుని శుభ్రం చేసే వాహనం వచ్చింది. మీద మంచు కురిసిన హెరాల్డ్ అతనికి కనపడలేదు. హెరాల్డ్ మీదకి మూడు అడుగుల ఎత్తున మంచు కుమ్మరించబడింది.
   
మర్నాడు సీటన్ కంపెనీ ఆఫీస్ తెరిచారు. మధ్యాహ్నానికి కాని హెరాల్డ్ భార్య ఆఫీస్‌కి ఫోన్ చేయలేదు. తన భర్త ఆఫీస్‌కి రాలేదని తెలిశాక, ఇంటికి కూడా రాకపోడంతో కంగారుపడి పోలీసులకి ఫిర్యాదు చేసింది.
 మరణించిన హెరాల్డ్ రెండు రోజుల తర్వాత మంచుని తొలగించే సిబ్బంది కంటపడ్డాడు.

 మరో రెండు రోజుల తర్వాత సీటన్ కంపెనీ వార్తల్లోకి ఎక్కింది. స్వర్గీయ హెరాల్డ్ సీటన్ కంపెనీ డబ్బుని దొంగిలించాడని పోలీసులకి ఆ కంపెనీ యజమాని ఫిర్యాదు చేశాడు.
 ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో అమ్మకాలు తగ్గడానికి కారణం హెరాల్డ్ జోక్యమే అని సేల్స్ మేనేజర్ ఆరోపించాడు.
 నాసి రకం ముడిసరుకుని కొనడానికి బాధ్యత హెరాల్డ్‌దే అని ఫ్యాక్టరీ మేనేజర్ చెప్పాడు.
 ఆఫీస్‌లో కొత్తగా పరిచిన కార్పెట్ నాసి రకంది. హెరాల్డ్ దాన్నే కొనమని తనని ఆజ్ఞాపించాడని పర్చేజ్ ఆఫీసర్ మెమోకి జవాబుగా రాశాడు.
 హెరాల్డ్ చాలా తప్పులకి బాధ్యుడయ్యాడు. ఆఖరికి పేపర్ జెమ్ క్లిప్స్ పని చేయకపోవడానికి కూడా హెరాల్డే బాధ్యుడయ్యాడు.
 
హెరాల్డ్ భార్య కనెక్టికట్‌లోని తమ ఇంటిని అమ్మేసి, భర్త ఇన్సూరెన్స్ సొమ్ము తీసుకుని కాలిఫోర్నియాకి వెళ్లిపోయింది. హెరాల్డ్ పుట్టి పెరిగిన ఊళ్లోని అతని మిత్రులు హెరాల్డ్ పచ్చి దొంగ అని తెలిసి ఆశ్చర్యపోయారు.
 ఐతే హెరాల్డ్ నిజాయితీపరుడు అని తెలిసింది ఒక్కరికే. అతని భార్యకి. తన భర్త నిజాయితీని అందరికీ చెప్పి ఒప్పించగల సమర్థత తనలో లేదని గుర్తించి ఆమె ఎప్పటికీ మంచు పడని కాలిఫోర్నియాకి వెళ్లిపోయింది.
 (ఎర్ల్ ఫుల్‌డ్జ్ కథకి స్వేచ్ఛానువాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement