టీవీక్షణం: ఆ గంట... ఊపిరాడని ఉత్కంఠ! | Man Versus Wild programme very scared in TV programme | Sakshi
Sakshi News home page

టీవీక్షణం: ఆ గంట... ఊపిరాడని ఉత్కంఠ!

Published Sun, Apr 6 2014 2:15 AM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM

టీవీక్షణం: ఆ గంట... ఊపిరాడని ఉత్కంఠ! - Sakshi

టీవీక్షణం: ఆ గంట... ఊపిరాడని ఉత్కంఠ!

ఏదైనా పనిమీద పక్క ఊరికి వెళ్లి, దారి తప్పిపోతేనే కంగారు పడిపోతాం. అలాంటిది కారడవిలో దారి తప్పితే? ఎముకలు కొరికే మంచు కొండల్లో మనం ఒక్కరమే మిగిలిపోతే? ఎవరూ కానరాని ఎడారిలో ఒంటరిగా ఉండాల్సి వస్తే? తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! మనకి ఇలాంటి పరిస్థితులు పెద్దగా ఎదురుకావుగానీ... సైనికులకు, యాత్రికులకు, పరిశోధకులకు అప్పుడప్పుడూ ఈ దారుణ అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో, ఎలా తప్పించుకుని బయటపడాలో చెప్పేందుకు రూపొందించిందే... మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమం!
 
 ఏ ప్రోగ్రామ్ అయినా వినోదాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందుతుంది. అయితే దానికి అదనంగా ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేశారు డిస్కవరీ చానెల్‌వారు. యూకేకి చెందిన బేర్ గ్రిల్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రిల్స్‌ని ఏదైనా భయంకరమైన నిర్జన ప్రదేశంలో వదిలేస్తారు. తనంత తానుగా దారి వెతుక్కుంటూ అక్క డ్నుంచి బయటపడాలి. దొరికింది తినాలి. ప్రమాదాలను ఎదుర్కోవాలి. కఠిన ప్రయా ణాన్ని కొనసాగిస్తూనే ఎన్నో విలువైన విషయాలను వివరిస్తూంటాడు గ్రిల్స్. స్వతహాగా సైనికుడు కావడంతో తన తెగువ, ధైర్యం, గుండె నిబ్బరంతో షోని రక్తి కట్టిస్తున్నాడు. అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం మనకు లేకపోయినా... పలు రకాల మొక్కలు, జంతువులు, ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది!
 
 ఇది ఓ పాఠం... గుణపాఠం!
 కోటీశ్వరుడి భార్య శారద. ఉత్తమ ఇల్లాలు, సౌమ్యురాలు. అత్తగారికి పరిచర్య చేస్తుంది. భర్తకు అనురాగం పంచుతుంది. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అందరూ ఆనందంగా ఉండేలా చూస్తుంది. కానీ ఆమెకు మాత్రం ఆనందమంటే ఏంటో తెలీదు. సంతకం పెట్టడం కూడా రాని శారదను భర్త అడగడుగునా అవమానిస్తుంటాడు. కూతురు చిన్నచూపు చూస్తుంది. కొడుకు నిర్లక్ష్యం చేస్తాడు. దాంతో తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది. ఆ బాధ నుంచి ఆమెను గట్టెక్కించాలనుకుంటుంది కోడలు సాక్షి. అత్తగారికి చదువు చెప్పడం మొదలుపెడుతుంది. కోచింగ్ క్లాసులకు పంపిస్తుంది.
 
 ఆమె కూడా ఓ మనిషేనని అందరూ గుర్తించేలా చేయాలని ఆరాటపడుతుంది. కోడలి సహకారంతో తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకోవడం కోసం పోరాటం చేస్తోంది శారద... ‘ఎక్ నయీ పెహ్‌చాన్’ సీరియల్‌లో. శారద పాత్రలో పూనమ్ థిల్లాన్ నటన గుండెల్ని పిండేస్తుంది! భార్య కూడా మనసున్న మనిషేనని గుర్తించని మగాళ్లకు సోనీ చానెల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్ ఓ పెద్ద పాఠం. తల్లిని గౌరవించడం చేతకాని పిల్లలకు చక్కని గుణపాఠం!
 
 షోనే కాదు... కామెడీ కూడా కాపీనే!

 మనుషుల జీవితాల్లో ఒత్తిడి రాను రాను పెరిగిపోతుండటంతో... వాళ్లకు రిలీఫ్ ఇవ్వడానికి టీవీ కార్యక్రమాల్లో కామెడీ డోసు కూడా పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వారానికో కొత్త కామెడీ షో ఏదో ఒక చానెల్లో పుట్టుకొస్తోంది. ఆ కోవలో వచ్చిందే ‘మ్యాడ్ ఇన్ ఇండియా’. స్టార్ ప్లస్ చానెల్లో ప్రారంభమైన ఈ నవ్వుల షో... నవ్వు పుట్టించ డంలో కాస్త వెనకబడిందనే చెప్పాలి. ప్రముఖ హిందీ యాంకర్ మనీష్ పాల్‌తో కలిసి హాస్య నటుడు సునీల్ గ్రోవర్ ఈ షోని నిర్వహిస్తున్నాడు. ఇద్దరూ మంచి నటులే. అయితే ‘కాపీ’ అన్న ఒక్కమాట ఈ షోని దెబ్బ తీస్తోంది. సునీల్ గ్రోవర్ ఇంతకుముందు కామెడీ కింగ్ కపిల్‌తో పాటు ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’లో పని చేశాడు. అక్కడ అతడికి చాలా మంచి పేరు వచ్చింది.
 
 దాంతో తనే సొంతగా ‘మ్యాడ్ ఇన్ ఇండియా’ స్టార్ట్ చేశాడు. కానీ కపిల్ షోలో తాను వేసిన గెటప్పులే వేస్తున్నాడు. అక్కడ చేసిన తరహా కామెడీనే చేస్తున్నాడు. కపిల్ మాదిరిగానే సెలెబ్రిటీలను పిలిచి సందడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ సక్సెస్ కాలేకపోతున్నాడు. ఎందుకంటే... ఇప్పటికే కపిల్ కామెడీ షో అత్యధిక టీఆర్పీ సాధించి రికార్డు నెలకొల్పింది. మరి అచ్చు అలాంటి షోనే ఎవరు చూస్తారు? ఇప్పటికైనా సునీల్ ఈ విషయాన్ని గుర్తించి తన షో తీరు మారిస్తే బెటర్. లేదంటే కొన్ని వందల షోలలో తనదీ ఒకటిగా మిగిలిపోతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement